నాడు పోస్టు చేయడమైనది:
21 NOV 2026 4:22PM by PIB Hyderabad
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
వేదికపై ఉన్న గౌరవనీయులైన ప్రముఖులందరికీ, ఇంత భారీ సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చిన బిహార్ నా ప్రియమైన సోదరసోదరీలకు నమస్కారాలు. మీ దగ్గరికి వచ్చి, మీ అందరినీ దర్శించుకుని, మీకు శిరస్సు వంచి నమస్కరించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి, ఎన్డీయే నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత భారీ జనసందోహాన్ని కెమెరాలు కూడా పూర్తిగా చిత్రీకరించలేవని నా అభిప్రాయం. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అభివృద్ధి పట్ల ప్రజల్లో కలిగిన చైతన్యానికి ఇది సజీవ నిదర్శనం.
విశ్వాసానికి ప్రతీక అయిన ఛఠ్ మహాపర్వం ఇప్పుడే ముగిసింది. మన తల్లులు, సోదరీమణులు కఠినమైన నిర్జల ఉపవాసం ఆచరించి, తమ కుటుంబాలు, సమాజం, ప్రపంచం శ్రేయస్సు కోసం ప్రార్థించారు. ఇప్పుడు ఛఠీ మాత ఆశీస్సులతో మనమంతా అభివృద్ధి పండుగను జరుపుకుంటున్నాం.
మిత్రులారా,
బిహార్ అభివృద్ధి ప్రస్థానంలో ‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్’ అనే మంత్రంతో ముందుకు సాగుతున్నాం. ప్రజాస్వామ్య శక్తిని ప్రజా సంక్షేమానికి సాధనంగా మలిచాం. అందుకే నేడు ఎన్డీయే ప్రభుత్వం ఈ పదవీకాలంలో ఒక ఏడాది పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లైన వైశాలిని ఎంచుకున్నాం. ఈ సందర్భంలో వైశాలి, బిహార్ పవిత్ర గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నింటికీ, లక్షలాది కార్యకర్తలకు, బిహార్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
దాదాపు మూడు దశాబ్దాల క్రితం బిహార్ ఆశలు, ఆత్మవిశ్వాసంతో కూడిన కొత్త మార్గాన్ని ఎంచుకుంది. దశాబ్దాలుగా నిర్లక్ష్యం, పతనాన్ని చవిచూసిన బిహార్‌కు గౌరవ నితీశ్ కుమార్ గారు నాయకత్వంలో సుపరిపాలనపై కొత్త భరోసా లభించింది. నితీశ్ గారు అనేక సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా బిహార్‌కు సేవలందించారు. ఇప్పుడు నితీశ్ ఆశీస్సులతో సామ్రాట్ చౌధరీ గారు, ఆయన బృందం ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ఇక్కడ వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా చేశాం. నా మిత్రుడు రామ్ విలాస్ గారు ఆత్మ ఎక్కడ ఉన్నా, ప్రస్తుతం మనపై పూలవర్షం కురిపిస్తూనే ఉంటుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే, ఆయన కలలను కూడా మనం సాకారం చేస్తున్నాం.
మిత్రులారా,
దర్గా, బిదుపూర్లను కలుపుతూ గంగా నదిపై నిర్మించిన ఆరు వరుసల కేబుల్ వంతెనను నేడు ప్రజలకు అంకితం చేశాం. గౌరవ నితీశ్ సేవలు, అంకితభావానికి గుర్తింపుగా ఈ ఆధునిక వంతెనకు ‘నితీశ్ సేతు’ అని పేరు పెట్టాం. ఆయన సేవలకు బిహార్ ప్రజలు చూపుతున్న గౌరవానికి ఇది ప్రతీక. ఈ వంతెనతో పాట్నా, వైశాలి మధ్య దూరం తగ్గడమే కాకుండా, ప్రయాణ కష్టాలు కూడా తొలగిపోయాయి. ఇకపై పంటలు, పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులను పెద్ద మార్కెట్లకు సులభంగా తరలించవచ్చు. విద్యను అభ్యసించే యువతకు, వైద్య సేవలు పొందే వృద్ధులకు కూడా ఈ వంతెన ఎంతో ఉపయోగపడుతుంది.
మిత్రులారా,
బిహార్‌లో ఆధునిక రహదారుల వ్యవస్థ కూడా వేగంగా విస్తరిస్తోంది. నేడు ఔరంగాబాద్-చోర్దాహా ఆరు వరుసల జాతీయ రహదారిని ప్రారంభించాం.
మిత్రులారా,
మీరు చూపిస్తున్న అపారమైన ఆప్యాయతకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాల్సి ఉంది. మీ ఆప్యాయతను నా తలపై ఆశీర్వాదంగా, నా హృదయంలో నింపుకుంటున్నాను. సమయం చాలా తక్కువగా ఉంది. అందుకే నేటి ప్రసంగాన్ని ఇక్కడితో ముగించాల్సి వస్తోంది. అయినప్పటికీ, మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేడు ఇక్కడికి వచ్చిన యువతను గమనించాను. వారిని చూసి నా హృదయం ఎంతో సంతోషంతో నిండిపోయింది. నా దేశ యువత, నా బిహార్ యువత అభివృద్ధి ప్రాధాన్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందుకే వారిలో ఇంతటి ఉత్సాహం, శక్తి కనిపిస్తున్నాయి.
మిత్రులారా,
నేడు అనేక జాతీయ రహదారి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు చేశాం. ఈ ప్రాజెక్టుల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాం.
మిత్రులారా,
రహదారుల వ్యవస్థతో పాటు, బిహార్‌లో ఇంధన, పట్టణాభివృద్ధి రంగాల రూపురేఖలు కూడా నేడు వేగంగా మారుతున్నాయి. ఈ దిశగా బక్సర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం, పిర్పైంతి థర్మల్ విద్యుత్ కేంద్రానికి అవసరమైన విద్యుత్ ప్రసార వ్యవస్థకు శంకుస్థాపన, ఫుల్వారియా డ్యామ్ వద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాలు చేపట్టాం. ఒకప్పుడు బిహార్‌లోని వేలాది గ్రామాలకు విద్యుత్ సౌకర్యం అందని పరిస్థితి ఉండేది. అలాంటి బిహార్ నేడు విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా క్రమంగా ఎదుగుతోంది.
సోదర సోదరీలారా,
పట్టణ ప్రాంతాల్లో రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు నేడు 100 ఆధునిక పీఎం ఈ-బస్సులను కూడా ప్రారంభించాం. దీంతోపాటు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వేలాది పేద కుటుంబాలకు శాశ్వత గృహాల తాళంచెవులను అందజేశాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ బిహార్ ప్రజలకు నా అభినందనలు.
మిత్రులారా,
మన బిహార్ నేడు ఉన్న స్థాయికి చేరుకోవడానికి సుదీర్ఘ ప్రస్థానం సాగించింది. ఎన్డీయే అధికారంలోకి రాకముందు పరిస్థితులు ఎలా ఉండేవో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అప్పట్లో కుంభకోణాల గురించే చర్చలు జరిగేవి. కానీ నేడు బిహార్‌కు వస్తున్న పెట్టుబడుల గణాంకాల గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో నేరాల గణాంకాల గురించి చర్చించేవారు. నేడు నేరస్థులపై తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎన్డీయే పాలనలో అభివృద్ధి విషయంలో పోటీ కనిపిస్తోంది. ఉత్తర బిహార్ అయినా, నలంద-గయ అయినా, షాహాబాద్-కైమూర్ ప్రాంతాలు అయినా, రాజధాని పాట్నా అయినా.. ప్రతి ప్రాంతం అభివృద్ధిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది.
మిత్రులారా,
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కింద బిహార్ అభివృద్ధి ఎంత వేగంగా సాగుతోందో గత ఏడాదిలో చేపట్టిన పనులను చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి గమనించండి. ఎన్డీయే ప్రభుత్వం ఆధ్వర్యంలో బిహార్‌లో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. గయాలో రూ.6,000 కోట్ల విలువైన ఉక్కు పరిశ్రమ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతున్నాయి. మోతీహారీ సహా మూతపడిన చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించేందుకు కొత్త చెరకు ప్రోత్సాహక విధానాన్ని తీసుకొచ్చాం. ప్రతి పొలానికి నీరు అందించేందుకు 11,000 కొత్త ట్యూబ్‌వెల్స్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాం. సాగునీటి అవసరాల కోసం రోజుకు 12 గంటల విద్యుత్ సరఫరా చేసేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. ఒక్క ఏడాదిలోనే 200కు పైగా కొత్త డిగ్రీ కళాశాలలను ప్రారంభించాం. మన కుమార్తెల కోసం మా సీత మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. బిహార్‌లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల జాబితా ఎంత పెద్దదంటే, ఒకే వేదికపై వాటన్నింటినీ వివరించడం సాధ్యం కాదు. బిహార్ అభివృద్ధిని నిజంగా అనుభవించాలంటే ఇక్కడికి వచ్చి చూడాల్సిందే.
మిత్రులారా,
నిజాయతీతో కూడిన సంకల్పంతో పనులు చేపట్టినప్పుడు వాటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి. దశాబ్దాల తరబడి పేదరికాన్ని నిర్మూలిస్తామని నినాదాలు చేస్తూ, పేదలను తప్పుదోవ పట్టించి, వారి ఓట్లను పొందిన కాంగ్రెస్ పాలించిన దేశంలోనే.. కేవలం 12 ఏళ్లలో మనం 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. ఇది ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలితం.
మిత్రులారా,
కోట్లాది మంది పేదల జీవితాలను సులభతరం చేయడం, వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించడంపై మనం ప్రాధాన్యమివ్వడం వల్లే పేదరికంపై ఈ పోరాటంలో దేశం విజయం సాధిస్తోంది. 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను అందించాం. కోట్లాది కుటుంబాలకు శాశ్వత గృహాలను కల్పించి, భద్రతాభావాన్ని కలిగించాం. ఉచిత వైద్య చికిత్సకు హామీ ఇవ్వడం ద్వారా ఖరీదైన వైద్య భారాన్ని తగ్గించాం. మరుగుదొడ్లు, విద్యుత్, నీటి కనెక్షన్లను కల్పించి కోట్లాది మంది పేదలు గౌరవప్రదమైన జీవితం గడిపేలా చేశాం. ఫలితంగా, వారిలో అత్యంత పేదవారు సైతం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని, పేదరికాన్ని అధిగమిస్తూ ముందుకు సాగారు.
మిత్రులారా,
పేదరికంపై సాగుతున్న ఈ పోరాటంలో బిహార్ కూడా కీలక పాత్ర పోషించింది. గత కొన్ని సంవత్సరాలుగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇక్కడ పూర్తి అంకితభావంతో పనిచేసింది. కేంద్ర ప్రభుత్వం పథకాలను రూపొందించగా, రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వాటిని అమలు చేసింది. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా చర్యలు తీసుకుంది. బిహార్‌నే చూడండి. 43 లక్షల కుటుంబాలకు శాశ్వత గృహాలు లభించాయి. ఆగస్టు నెలలోనే మరో 11 లక్షల ఇళ్లకు ఆమోదం లభించింది. పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి కింద వేల కోట్ల రూపాయలను బిహార్‌లోని దాదాపు 75 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో ఇక్కడి 50 లక్షల మంది గ్రామీణ మహిళలు ‘లఖ్పతి దీదీ’లుగా ఎదిగారు. ఇలాంటి ప్రయత్నాల ఫలితంగానే బిహార్‌లో కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. దేశం మొత్తం ఈ విజయాన్ని సాధించింది.
మిత్రులారా,
ఇకపై మనం ఆగకూడదు.. అలసిపోకూడదు. బలమైన, సంపన్నమైన, స్వావలంబన కలిగిన బిహార్ నిర్మాణం కోసం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తూనే ఉండాలి. ఈ సంకల్పంతో, అభివృద్ధి ప్రస్థానంలో మీ అందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
***