ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోటాలో కారులో దాచి ఉంచిన 16.43 కిలోల అక్రమ నల్లమందును స్వాధీనం చేసుకున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ రాజస్థాన్ విభాగం

ఇద్దరు వ్యక్తుల అరెస్టు

నాడు పోస్టు చేయడమైనది: 19 NOV 2026 5:06PM by PIB Hyderabad

రాజస్థాన్‌లోని కోటాలో హ్యాంగింగ్ బ్రిడ్జ్ టోల్ ప్లాజా వద్ద మారుతి సుజుకి బ్రెజ్జా కారులోని స్పేర్ వీల్‌లో దాచి ఉంచిన 16.43 కిలోల అక్రమ నల్లమందును సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) రాజస్థాన్ విభాగం స్వాధీనం చేసుకుంది. ఈ అక్రమ రవాణాకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు, రవాణాకు ఉపయోగించిన వాహనాన్నీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రాజస్థాన్‌లో రిజిస్టర్ అయిన బ్రెజ్జా కారులో ఝలావార్ నుంచి జైపూర్‌కు భారీ మొత్తంలో నల్లమందును తరలిస్తున్నారనే నిర్దిష్ట సమాచారంతో సీబీఎన్ రాజస్థాన్ విభాగం నిన్న ఉదయం త్వరితగతిన అధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం అనుమానిత మార్గంలో వ్యూహాత్మకంగా నిఘా ఉంచి, వాహనం కదలికలను నిశితంగా గమనించింది. అనుమానిత కారును గుర్తించిన అధికారులు... కోటా బైపాస్ సమీపంలోని జాతీయ రహదారి 27 వద్ద దానిని, అందులోని ఇద్దరు వ్యక్తులనూ విజయవంతంగా అడ్డగించారు.

వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా... కారులోని స్పేర్ వీల్‌లో చాలా తెలివిగా దాచి ఉంచిన 16.43 కిలోల అక్రమ నల్లమందు (ఓపియం) ఉన్న తొమ్మిది ప్యాకెట్లు లభ్యమయ్యాయి. చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేసిన అధికారులు... ఆ మాదకద్రవ్యాలను, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం-1985లోని సంబంధిత నిబంధనల ప్రకారం వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

స్వాధీనం చేసుకున్న నిషేధిత వస్తువుల మూలాన్ని నిర్ధారించడానికి... వాటి సేకరణ, రవాణా, పంపిణీలో పాలుపంచుకున్న వ్యక్తులను, వ్యవస్థీకృత నెట్‌వర్క్‌లను గుర్తించడానికి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్ విస్తృత సంబంధాలను గుర్తించేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముప్పును అరికట్టడంలో సీబీఎన్ అధికారుల నిరంతర కృషి, అప్రమత్తత, నిబద్ధతను ఈ ఆపరేషన్ విజయం ప్రతిబింబిస్తోంది. అక్రమ మాదకద్రవ్యాల పట్ల సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) తన 'జీరో-టాలరెన్స్' విధానానికి అనుగుణంగా... అక్రమ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడానికే కాకుండా, మాదకద్రవ్యాల వ్యాపారంలో పాలుపంచుకుంటున్న అక్రమ రవాణా నెట్‌వర్క్‌లు, కార్టెల్‌లను గుర్తించి, వాటిని పూర్తిగా నిర్మూలించడానికి కట్టుబడి ఉంది. మాదకద్రవ్య రహిత భారత్‌ను సాధించే ప్రయత్నంలో భాగంగా... ఇటువంటి నిఘా ఆధారిత తనిఖీలను కొనసాగించనున్నారు.

2026 క్యాలెండర్ సంవత్సరంలో... అక్టోబరు నెల వరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌కి చెందిన అన్ని విభాగాల ద్వారా 62 కేసుల్లో సుమారు 432 కిలోల నల్లమందును స్వాధీనం చేసుకుని, 74 మంది అనుమానితులను అరెస్టు చేశారు.

మాదకద్రవ్య రహిత భారత్ దిశగా జరుగుతున్న దేశవ్యాప్త కృషిలో భాగంగా... మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాలుపంచుకున్న వారిపై నిఘా ఆధారిత తనిఖీ కార్యకలాపాలను ముమ్మరం చేస్తూ, వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సీబీఎన్ పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతోంది.

***


(రిలీజ్ ఐడి: 2339158) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Tamil