నాడు పోస్టు చేయడమైనది:
18 NOV 2026 1:27PM by PIB Hyderabad
ఎగుమతిదారులకు మరింత మద్దతునిచ్చేందుకు, వారి భాగస్వామ్యాన్ని విస్తృతం చేసేందుకు వాణిజ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఎగుమతి ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం)లో నిర్యాత్ దిశ ఉప-పథకం ద్వారా నాలుగు సంస్కరణ చర్యలతో 2026 నవంబర్ 17న మార్గదర్శకాలను సవరించింది. ఆ నాలుగు సంస్కరణ చర్యలు: మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ (ఎంఏఎస్), ట్రేడ్ రెగ్యులేషన్స్, అక్రిడిటేషన్, కంప్లైయన్స్ ఎనేబుల్మెంట్ (ట్రేస్), లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఫ్రైట్, ట్రాన్స్పోర్ట్ (లిఫ్ట్).
దీనిలో భాగంగా కొనుగోలుదారు-విక్రేతల సమావేశాలు (బీఎస్ఎంలు), రివర్స్ బయ్యర్-సెల్లర్ మీట్స్ (ఆర్బీఎస్ఎంలు), వాణిజ్య ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, ఇతర మార్కెట్ యాక్సెస్ కార్యక్రమాల వంటి వాటికి తగిన మద్దతును అందించటం ద్వారా భారతదేశ ఎగుమతి మార్కెట్‌ను బలోపేతం చేయటమే ఎంఏఎస్ ఉద్దేశం.
సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఈ మార్పులను చేర్చారు:
-
కొనుగోలుదారు-విక్రేత సమావేశాలు, వాణిజ్య ప్రదర్శనలు, వాణిజ్య ప్రతినిధి బృందాల్లో పాల్గొనేందుకు విమాన ప్రయాణ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ను పొందేందుకు అర్హత గల గరిష్ఠ ఎగుమతి టర్నోవర్‌ను గతేడాది రూ. 75 లక్షల నుంచి రూ. 50 కోట్లకు పెంచారు.
-
సూక్ష్మ, చిన్న ఎగుమతిదారులకు విమాన ప్రయాణ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ను 95 శాతం వరకు, ఇతర అర్హత గల ఎగుమతిదారులకు 80 శాతం వరకు పెంచారు.
-
ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతో తప్పనిసరి సభ్యత్వ వ్యవధిని ఆరు నెలల నుంచి మూడు నెలలకు తగ్గించారు.
విదేశీ మార్కెట్లలో వర్తించే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నాణ్యత, భద్రతా, సాంకేతిక ప్రమాణాలను అందుకునేందుకు ఎంఎస్ఎంఈలకు ట్రేస్ మద్దతిస్తుంది. ఈ మద్దతులో నిబంధనలను పాటించటం, నాణ్యతా సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర తప్పనిసరి, స్వచ్ఛంద ప్రమాణాల నిర్ధారణ అవసరాలు కూడా ఉంటాయి.
సవరించిన మార్గదర్శకాల ప్రకారం... రీయింబర్స్‌మెంట్‌కు అర్హత గల సర్టిఫికెట్ల జాబితాను 462 నుంచి 600కి విస్తరించారు. దీనివల్ల ఎంఎస్ఎంఈలు అంతర్జాతీయ నాణ్యత, భద్రత, సాంకేతిక ప్రమాణాలను అందుకునేందుకు విస్తృత పరిధి, గొప్ప మద్దతు లభిస్తుంది.
తక్కువ ఎగుమతి తీవ్రత గల ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న భౌగోళిక ప్రతికూలతలు, లాజిస్టిక్స్ లోపాలను పరిష్కరించేందుకు లిఫ్ట్ ప్రయత్నిస్తుంది. ప్రాంతీయ సవాళ్ల కారణంగా ఏర్పడే సరకు రవాణా, రవాణా ఖర్చులను తగ్గించటంలో ఈ సంస్కరణ మద్దతిస్తుంది.
ఈ సవరించిన మార్గదర్శకాల ప్రకారం అమల్లోకి రానున్న మార్పులు:
-
తక్కువ ఎగుమతి తీవ్రత గల జిల్లాల పరిధిని 13 రాష్ట్రాలు, యూటీల నుంచి 34 రాష్ట్రాలు, యూటీలకు విస్తరించారు.
-
అర్హత గల పోర్టుల జాబితాలో ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు (ఎల్సీఎస్లు), ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను (ఐసీపీలు) కొత్తగా చేర్చారు.
-
ప్రస్తుతమున్న రోడ్డు, రైలు, వాయు మార్గాలతో పాటు జలమార్పులను కూడా రవాణా సాధనాలుగా అదనంగా చేర్చారు.
-
ఈశాన్య ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేసిన విమాన సరకు రవాణా మద్దతును ఇప్పుడు జమ్మూ, కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలకూ వర్తింపజేశారు.
-
రవాణా ప్రారంభ కేంద్రానికి, గమ్యస్థాన పోర్టుకు మధ్య ఉండాల్సిన కనీస దూర పరిమితిని 200 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు తగ్గించారు.
-
ఎగుమతికి వీలుగా ఉన్న అన్ని రకాల వస్తువులకు మద్దతును పొడిగించారు. ఎగుమతి నిషేధిత జాబితాలో పేర్కొన్న ఉత్పత్తులు, వర్గాలకు మాత్రం ఇది వర్తించదు.
మొత్తం రూ. 25,060 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేసేందుకు కేంద్ర కేబినెట్ నవంబర్ 12, 2025న ఈపీఎంకు ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎంఈలు, కొత్తగా ఎగుమతులు చేసేవారు, తగిన ప్రాతినిధ్యం లేని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించటం ద్వారా భారత్ ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించటమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం.
ఈ మిషన్ ప్రధానంగా నిర్యాత్ ప్రోత్సాహన్, నిర్యాత్ దిశ వంటి రెండు సమగ్ర ఉప-పథకాల ద్వారా పనిచేస్తుంది. నిర్యాత్ ప్రోత్సాహన్ ద్వారా వాణిజ్య ఆర్థిక సాయం సులభతరం కాగా, నిర్యాత్ దిశ ద్వారా మార్కెట్ సౌలభ్యం లభించటంతో పాటు ఎగుమతులకు ఎదురయ్యే ఆర్థికేతర అడ్డంకులను తొలగిస్తారు. ఇప్పటివరకు ఈ రెండు ఉప-పథకాల ద్వారా మొత్తం 11 జోక్యాలను అమల్లోకి తెచ్చారు.
అంతర్జాతీయ వాణిజ్య వేదికల్లో ఎగుమతిదారులు పాల్గొనేందుకు మద్దతును విస్తరించటం, ధ్రువీకరణలు-నిబంధనల అమల్లో సహాయాన్ని సులభతరం చేయటం, ముఖ్యంగా తక్కువ ఎగుమతి ప్రాంతాల్లో ఉన్న ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న రవాణా-లాజిస్టిక్స్ సవాళ్లను అధిగమించేలా చేయటం ద్వారా భారత ఎగుమతుల పోటీతత్వాన్ని మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ నిబద్ధతను ఈ సవరణలు ప్రతిబింబిస్తున్నాయి.
***