యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశంలో సుస్థిరమైన క్రీడా లీగ్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 18 NOV 2026 12:48PM by PIB Hyderabad

ఖేలో భారత్ నీతి, వికసిత్ భారత్–2047 దార్శనికతకు అనుగుణంగా భారతదేశంలో విస్తృతమైన, వృత్తిపరంగా నిర్వహించే, ఆర్థికంగా స్థిరమైన క్రీడా లీగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సమగ్ర కార్యాచరణను రూపొందించేందుకు14 మంది సభ్యులతో కూడిన కమిటీని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, క్రీడల విభాగం ఏర్పాటు చేశాయి. ప్రతిభను గుర్తించడం, క్రీడాకారుల అభివృద్ధికి నిరంతరం నాణ్యమైన పోటీ వేదికలను అందించడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, క్రీడా నిర్వహణ, ప్రసారాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఈవెంట్లు, అనుబంధ సేవా రంగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ లీగ్ వ్యవస్థ ముఖ్యోద్దేశం.

దేశంలోని పలు క్రీడా లీగ్‌లు వివిధ స్థాయుల్లో విజయాలు సాధించినప్పటికీ, బలమైన క్రీడా, సామాజిక సామర్థ్యం ఉన్న అనేక క్రీడా విభాగాలు ప్రారంభ దశల్లో వాణిజ్యపరంగా లాభాలను ఆర్జించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అందుకే ప్రస్తుత క్రీడా లీగ్ వ్యవస్థను ఈ కమిటీ అంచనా వేస్తుంది. లీగ్‌ల ఏర్పాటుకు, వాటి దీర్ఘకాలిక మనుగడకు ఆటంకం కలిగిస్తున్న ప్రధాన సమస్యలను, అడ్డంకులను గుర్తిస్తుంది. ముఖ్యంగా ఒలింపిక్ క్రీడలు, మహిళా క్రీడలు, యువజన క్రీడలు, దేశీయ క్రీడలు, వర్ధమాన క్రీడలకు ప్రాధాన్యతనిస్తుంది. వాటి క్రీడా, వాణిజ్య సామర్థ్యాలకు తగినట్లుగా అనువైన నిర్వహణ నమూనాలను సిఫార్సు చేస్తుంది. ఈ అంతరాన్ని పూడ్చడానికి ప్రైవేట్ రంగం, క్రీడా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, సమాజం చురుకైన భాగస్వామ్యంతో పాటు వ్యవస్థీకృత ప్రభుత్వ సహకార యంత్రాంగాలను కమిటీ పరిశీలిస్తుంది. ఇందులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్), ప్రత్యక్ష, పరోక్ష ఆర్థిక సహాయం, ప్రభుత్వ క్రీడా మౌలిక సదుపాయాలను రాయితీపై వినియోగించుకునే అవకాశం లాంటి లక్షిత చర్యలను మదింపు చేస్తుంది.

ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవస్థలో పరిమితులను కమిటీ అంచనా వేస్తుంది. ప్రాధాన్య క్రీడలను గుర్తించి వాటికి తగిన కార్యాచరణ నమూనాలను సిద్ధం చేస్తుంది. కార్పొరేట్ మూలధనం, ఫ్రాంచైజీ యాజమాన్యం, స్పాన్సర్‌షిప్‌లు, ప్రసార. డిజిటల్ హక్కులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ఫైనాన్సింగ్‌ను ఆకర్షించడానికి చర్యలను సిఫార్సు చేస్తుంది. అలాగే క్షేత్ర స్థాయిలో యువత, మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక క్లబ్బులతో లీగ్‌లను అనుసంధానించే వ్యూహాలను కమిటీ ప్రతిపాదిస్తుంది. అలాగే, ఆర్థిక పారదర్శకత, అథ్లెట్ల సంక్షేమం, నైతిక విలువలతో కూడిన సంస్థాగత పాలనా విధానాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఉత్తమ ప్రమాణాల ఆధారంగా దశలవారీ అమలు ప్రణాళికను కూడా రూపొందిస్తుంది.

కమిటీలో సభ్యుల వివరాలు:

క్రమసంఖ్య

పేరు

హోదా

1.

శ్రీ కునాల్, సంయుక్త కార్యదర్శి (పరిపాలన)

కన్వీనర్

2.

శ్రీ వినీల్ కృష్ణ, సంయుక్త కార్యదర్శి (ఖేలో ఇండియా)

సభ్యులు

3.

శ్రీ రఘురామ్ అయ్యర్, ఏఐవో సీఈవో

సభ్యులు

4.

శ్రీ బీ శ్రీనివాసన్ ఆర్ఐఎల్

సభ్యులు

5.

శ్రీ హేమంగ్ అమిన్, ఐపీఎల్, బీసీసీఐ సీవోవో

సభ్యులు

6.

శ్రీ పీకేఎస్‌వీ సాగర్, జీఎంఆర్ స్పోర్ట్స్

సభ్యులు

7.

శ్రీ సంజయ్ అడెసారా, అదానీ స్పోర్ట్స్‌లైన్

సభ్యులు

8.

శ్రీ దివ్యాన్షు సింగ్, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్

సభ్యులు

9.

శ్రీ ఇషాన్ ఛటర్జీ, జియో హాట్‌స్టార్

సభ్యులు

10.

శ్రీ రాజేష్ కౌల్, సోనీ పిక్చర్స్

సభ్యులు

11.

శ్రీ అనుపమ్ స్వరూప్, డీడీ స్పోర్ట్స్

సభ్యులు

12.

శ్రీ పరాగ్ దరాడే, జీ ఎంటర్‌టైన్మెంట్

సభ్యులు

13.

శ్రీ అభిజిన్ భట్టాచార్య, బీవీఎల్

సభ్యులు

14.

అడ్వకేట్ నందన్ కామత్

సభ్యులు

 

జాతీయ క్రీడా సమాఖ్యలు, ప్రస్తుత లీగ్ అధికారులు, పెట్టుబడిదారులు, స్పోర్ట్స్ టెక్నాలజీ సంస్థలను సంప్రదించే అధికారం ఈ కమిటీకి ఉంది. భౌతిక, ఆన్‌లైన్ లేదా హైబ్రిడ్ పద్ధతుల్లో చర్చలను నిర్వహించి, ఎనిమిది వారాల్లోగా తన తుది సిఫార్సులను మంత్రిత్వ శాఖకు కమిటీ సమర్పిస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2337974) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , Gujarati , Tamil