నాడు పోస్టు చేయడమైనది:
16 NOV 2026 5:06PM by PIB Hyderabad
‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత భారత్ అభియాన్’ కింద చేపట్టిన 100 వారాల ప్రచార కార్యక్రమంలో 9వ వారంలో భాగంగా.. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ తన ‘మేరా యువభారత్’ వేదిక ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్లాక్ స్థాయి వరుస క్రీడా పోటీలను, నైబర్‌హుడ్ యువజన పార్లమెంటులను నిర్వహించింది. ఆటల పోటీలు యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందిస్తుండగా.. మాదకద్రవ్యాల దుర్వినియోగం, వ్యసనాల నివారణ చర్యలపై యువతతో నిర్మాణాత్మక చర్చలకు నైబర్‌హుడ్ యువజన పార్లమెంట్లు వేదికయ్యాయి. 2026 నవంబరు 15 నాటి తాత్కాలిక నివేదిక ప్రకారం.. మాదకద్రవ్య రహిత భారత్ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యకలాపాల్లో మొత్తం 429 కార్యక్రమాలు, 1,039 కార్యకలాపాల్లో 81,622 మంది యువత, పౌరులు భాగస్వాములయ్యారు.
2026 నవంబరు 13 నుంచి 15 వరకు నిర్వహించిన ఈ బ్లాక్ స్థాయి పోటీలు.. పలు బ్లాకులు, గ్రామాలకు చెందిన యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చాయి. గ్రామీణ స్థాయి యువత క్రీడల్లో ప్రతిభను చాటుకోవడానికి ఈ కార్యక్రమం ఒక చక్కని వేదికను అందించడమే కాకుండా.. వారిలో శారీరక దృఢత్వం, సమష్టి కృషి, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించింది. మొత్తం 851 కార్యకలాపాలతో కూడిన 370 క్రీడా కార్యక్రమాలను నిర్వహించగా, వీటిలో 75,220 మంది యువత, పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

క్రీడా కార్యక్రమాలకు అనుబంధంగా 2026 నవంబరు 14న బ్లాక్ స్థాయిలో 59 నైబర్‌హుడ్ యూత్ పార్లమెంటు కార్యక్రమాలను నిర్వహించారు. 188 కార్యకలాపాలుగా సాగిన ఈ కార్యక్రమాల్లో 6,402 మంది యువత పాల్గొన్నారు. ఈ సదస్సులు ప్రచార కార్యక్రమ పరిధిని స్థానిక నివాస ప్రాంతాలు, క్షేత్రస్థాయి సమాజాలకు విస్తరించడమే కాకుండా.. మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి, నషా ముక్త్ భారత్ నిర్మాణంలో తాము ఏ విధంగా పాలుపంచుకోవచ్చో చర్చించడానికి యువతకు ఒక నిర్మాణాత్మక వేదికను అందించాయి.
ప్రతి నైబర్‌హుడ్ యూత్ పార్లమెంటు కార్యక్రమం నాలుగు నిర్మాణాత్మక సెషన్లుగా సాగింది. వాటిలో మై భారత్ పోర్టల్ పరిచయం, మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అర్థం చేసుకోవడం: భారత యువత ముందున్న సవాళ్లు, అవగాహన నుంచి కార్యాచరణ దిశగా: నషా ముక్త్ యువత కోసం మార్గాలు, మార్పు గాథలు: నషా ముక్త్ భారత్ దిశగా ప్రయాణం అంశంపై ఆడియో-విజువల్ ప్రదర్శన ఉన్నాయి. మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహనను పెంపొందించడంతోపాటు.. ఆ అవగాహనను ఆచరణలోకి తీసుకువచ్చేలా యువతను ప్రోత్సహించడంపై ఈ సెషన్లు ప్రధానంగా దృష్టి సారించాయి. తమిళనాడులోని ధర్మపురి జిల్లా నల్లంపల్లి బ్లాక్‌లో, అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ బ్లాక్‌లో జరిగిన కార్యక్రమాలు వీటిలో ప్రముఖమైనవి.
ఈ వారపు కార్యక్రమాలకు బ్రహ్మ కుమారీస్, హార్ట్‌ఫుల్‌నెస్, ప్రాజెక్ట్ పాయింట్, అసోచామ్, ఫిక్కీ వంటి భాగస్వామ్య సంస్థలు కూడా సహకారాన్ని అందించాయి. బెంగళూరు, మైసూరు, చెన్నైలలో నిర్వహించిన వాకథాన్‌లు సహా పలు ప్రచార కార్యక్రమాలకు ‘హార్ట్‌ఫుల్‌నెస్’ సంస్థ సహకారాన్ని అందించింది. ఒడిశాలోని ఖోర్ధా జిల్లా బెగునియా బ్లాక్‌లో జరిగిన కార్యకలాపాల్లో ‘ప్రాజెక్ట్ పాయింట్’ సంస్థ పాల్గొన్నది.
***