నాడు పోస్టు చేయడమైనది:
16 NOV 2026 6:54PM by PIB Hyderabad
దేశంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐదు గ్రీన్‌ఫీల్డ్ తీరప్రాంత నౌకానిర్మాణ క్లస్టర్ల కోసం దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ తెలిపారు. దీని కోసం ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రపంచ నౌకానిర్మాణ సంస్థలు, షిప్పింగ్ లైన్లు, ఆర్థిక సంస్థలను ఆయన ఆహ్వానించారు. 2030 నాటికి ప్రపంచంలోని టాప్-10 నౌకానిర్మాణ దేశాల సరసన నిలవడం... 2047 నాటికి టాప్-5 దేశాల్లో ఒకటిగా నిలవడమే భారత్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన ‘భారత నౌకానిర్మాణ పెట్టుబడుల సదస్సు-2026’లో కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నౌకానిర్మాణం, నౌకల మరమ్మతు పరిశ్రమ కోసం రూపొందించిన ‘నౌకోష్’ డిజిటల్ పోర్టల్‌నూ ఆయన ప్రారంభించారు. భవిష్యత్తు నౌకానిర్మాణ ప్రాజెక్టుల విషయంలో పరస్పర సహకారం లక్ష్యంగా అంతర్జాతీయ సంస్థ డామెన్ షిప్‌యార్డ్స్, కొచ్చిన్ షిప్‌యార్డ్ మధ్య ఈ సదస్సులో కీలక అవగాహన ఒప్పందం కుదిరింది.
"ప్రపంచానికి అవసరమైన నౌకలను నిర్మించేందుకు భారత్ సిద్ధంగా ఉంది... ‘భారత్‌లో నిర్మించండి... భారత్ కోసం, ప్రపంచం కోసం…" అని కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆమోదించిన 8 బిలియన్ డాలర్ల నౌకానిర్మాణ ఆర్థిక ప్యాకేజీకి కొనసాగింపుగా ఈ సదస్సును నిర్వహించారు.
పెట్టుబడిదారులకు ఉన్న అనుకూలతలను వివరిస్తూ... దేశీయ, ఎగుమతి డిమాండ్‌ను కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రధానంగా ప్రస్తావించారు. గుర్తించిన దేశీయ డిమాండ్ ప్రకారం 400కు పైగా నౌకల అవసరం ఉందనీ, ఇది దాదాపు 24 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవకాశాన్ని సూచిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం 1.7 బిలియన్ డాలర్లకు పైగా విలువైన 150కి పైగా నౌకల నిర్మాణ ఆర్డర్లు చురుగ్గా కొనసాగుతున్నాయనీ, ఇందులో ఎగుమతి ఆర్డర్ల వాటాయే 80 శాతానికి పైగా ఉందని ఆయన వివరించారు.
నిర్మాణానికి పూర్తి సిద్ధంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్న ఐదు కొత్త గ్రీన్‌ఫీల్డ్ క్లస్టర్లు కేంద్రంగా ఈ పెట్టుబడుల ప్రచారం సాగింది. ఆంధ్రప్రదేశ్‌లోని దుగరాజపట్నం, గుజరాత్‌లోని కుచ్చాడి, మహారాష్ట్రలోని దిఘి, ఒడిశాలోని కేంద్రపారా, తమిళనాడులోని తూత్తుకుడి క్లస్టర్లు ఇందులో భాగంగా ఉన్నాయి. షిప్‌యార్డులు, విడిభాగాల తయారీదారులు, అనుబంధ సముద్రయాన వ్యాపారాల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న భూమి, సహాయక విధానాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి మద్దతు గురించి కేంద్ర, రాష్ట్ర అధికారుల బృందాలు పెట్టుబడిదారులకు వివరించాయి.
ఈ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా తయారీ రంగం, సాంకేతికత, ఉపాధి ఎగుమతుల్లో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో సహకార సమాఖ్య విధానం... 'మేక్ ఇన్ ఇండియా' తదుపరి అధ్యాయానికి ఊతమిస్తోంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలు ఈ లక్ష్యంలో ఆతిథ్య రాష్ట్రాలుగానే కాకుండా, కీలక భాగస్వాములుగానూ నిలిచాయి. పెట్టుబడిదారుల కోసం ఎలాంటి జాప్యం లేకుండా భూమి, అనుమతులు, విధానపరమైన మద్దతు లభించేలా మేమంతా 'టీమ్ ఇండియా'గా ముందుకు సాగుతున్నాం" అని శ్రీ సోనోవాల్ వివరించారు.
భారతీయ పారిశ్రామిక దిగ్గజాలతో పాటు 30 అంతర్జాతీయ షిప్‌యార్డుల ఉన్నతాధికారులు, షిప్పింగ్ కంపెనీలు, పరికరాల తయారీదారులు, బ్యాంకులు, పెట్టుబడిదారులు, దౌత్య మిషన్ల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. హెచ్డీ కేఎస్ఓఈ, శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్, హన్వా ఓషన్, ఫిన్కాంటియేరి, మేయర్ వెర్ఫ్ట్, డామెన్, రాయల్ ఐహెచ్సీ, ఎవర్లెన్స్, మిత్సుయి ఇంజిన్స్, వార్ట్సిలా, కాంగ్స్బర్గ్, డ్రైడాక్స్ వరల్డ్ దుబాయ్, మెర్స్క్, ఎంఎస్సీ, సీఎంఏ సీజీఎం, ఎంఓఎల్, డీపీ వరల్డ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు వీరిలో ఉన్నారు.
కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఇటీవలి దక్షిణ కొరియా పర్యటన నేపథ్యంలో... భారత్‌లోని కొరియా రాయబారి నాయకత్వంలో ఆ దేశ భారీ ప్రతినిధి బృందం ఈ సదస్సుకు హాజరయ్యారు. దక్షిణ కొరియాలోని మూడు అతిపెద్ద నౌకానిర్మాణ సంస్థలైన హెచ్డీ కేఎస్ఓఈ, శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్, హన్వా ఓషన్లతో పాటు ప్రముఖ షిప్పింగ్ కంపెనీ హెచ్ఎంఎం ఇందులో పాల్గొంది. కొరియా నౌకానిర్మాణ నైపుణ్యాన్ని భారత ‘మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047’తో అనుసంధానించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ 2026 ఏప్రిల్‌లో కుదుర్చుకున్న ‘వోయేజెస్’ (విజన్ ఫర్ ఆపరేషన్ ఆఫ్ యార్డ్ అసిస్టెడ్ గ్రోత్ విత్ ఎఫిషియెన్సీ అండ్ స్కేల్) భాగస్వామ్యానికి కొనసాగింపుగా ఈ బృందం పర్యటన సాగింది.
మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (డీజీఎంఏ) అభివృద్ధి చేసిన ‘నౌకోష్’ పోర్టల్... దీనికి సంబంధించిన విధానాలు, అనుమతులు, పెట్టుబడి అవకాశాలన్నింటినీ ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకువస్తుంది. దీనివల్ల పారదర్శకత పెరగడంతో పాటు సులభతర వాణిజ్యం మరింత మెరుగవుతుందని కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. నౌకానిర్మాణ కేంద్రాలు, మరమ్మతు కేంద్రాలు, పరికరాల తయారీదారులు, డిజైన్ ఏజెన్సీలు, వర్గీకరణ సంస్థలు, పరిశోధన-శిక్షణా సంస్థలు, ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీలు, నియంత్రణ సంస్థలకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడనుంది.
పరిశ్రమ డైరెక్టరీ, షిప్‌యార్డ్ సామర్థ్య డేటా, సహకార కేంద్రం, ఫైనాన్స్, బీమా సమాచారం, సాంకేతిక గ్రంథాలయం, ఆవిష్కరణల కేంద్రం, శిక్షణ-సర్టిఫికేషన్, నియంత్రణ మార్గదర్శకాలను ఈ పోర్టల్‌లోని విభాగాలు అందిస్తాయి. అందరికీ అందుబాటులో ఉండే దీని హోమ్‌పేజీ డ్యాష్‌బోర్డులో... షిప్‌యార్డ్‌లు, వాటి సామర్థ్య సూచికలు, ఇప్పటివరకు డెలివరీ చేసిన, ఆర్డర్లో ఉన్న నౌకల వివరాలు, ఈ రంగానికి సంబంధించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి.
‘గ్లోబల్ మారిటైమ్ లీడర్స్ ఓపెన్ హౌస్’ కార్యక్రమంలో భాగంగా... ప్రభుత్వ విధానాలు, దీర్ఘకాలిక ప్రణాళికలపై పరిశ్రమ ఉన్నతాధికారులు ప్రభుత్వ అధికారులకు తమ అభిప్రాయాలను నేరుగా తెలియజేశారు. అనంతరం, నిర్దిష్ట ఒప్పందాలను కుదుర్చుకునే దిశగా అంతర్జాతీయ ప్రతినిధి బృందాలు... రాష్ట్ర క్లస్టర్ బృందాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఆర్థిక సంస్థలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించాయి. ఆయా క్లస్టర్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వీలుగా 10 అంతర్జాతీయ ప్రతినిధి బృందాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు రేపు క్షేత్రస్థాయి పర్యటనలను ఏర్పాటు చేశాయి.
"ఒక నౌకానిర్మాణ గమ్యస్థానంగా భారత్‌పై పెరుగుతున్న విశ్వాసానికి ఈ రోజు జరిగిన సదస్సులో ప్రపంచ దిగ్గజాల భాగస్వామ్యమే నిదర్శనం" అని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. "స్థిరమైన డిమాండ్, విధానపరంగా బలమైన మద్దతు, ప్రత్యేక ఆర్థిక సహాయం, నిర్మాణానికి సిద్ధంగా ఉన్న ఐదు తీరప్రాంత క్లస్టర్లతో... దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ ఎంతో అనుకూలంగా ఉంది. నేటి చర్చలను క్షేత్రస్థాయిలో వాస్తవ ప్రాజెక్టులుగా మార్చడమే ఇప్పుడు మా ప్రధాన ప్రాధాన్యం" అని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రయత్నాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంతో అనుసంధానిస్తూ... 'ఆత్మనిర్భర్ భారత్', 'వికసిత్ భారత్' ప్రయాణంలో నౌకానిర్మాణ రంగం ఒక ప్రధాన స్తంభంగా మారిందని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. ఈ రంగంలో సాధించే వృద్ధి భారతీయ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, యువతకు విస్తృతమైన అవకాశాలను అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ చర్చలు "నిర్దిష్ట లక్ష్యంతో, ఆచరణాత్మకంగా" జరిగాయని కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. "ప్రతి పెట్టుబడిదారుకు ఇప్పుడు క్లస్టర్ స్పెషల్ పర్పస్ వెహికల్స్... రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రిత్వ శాఖ పరిధిలో సంప్రదింపుల కోసం ఒక స్పష్టమైన వేదిక అందుబాటులో ఉన్నాయి. రాబోయే వారాల్లో ప్రతి ఒప్పందం, సంప్రదింపుల పురోగతినీ మేం నిశితంగా పర్యవేక్షిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్‌తో పాటు మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధాన ఓడరేవులకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
***