రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కాన్పూర్ సెంట్రల్-ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడిచే కొత్త కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, కాన్పూర్ ఎంపీ శ్రీ రమేష్ అవస్తి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పారిశ్రామిక, లెదర్, విద్యా కేంద్రమైన కాన్పూర్‌ను... ఢిల్లీలోని ప్రధాన బహుళ-రవాణా కేంద్రంతో నేరుగా అనుసంధానించనున్న కాన్పూర్ ఎక్స్‌ప్రెస్

కాన్పూర్‌లో రైల్వే క్రాసింగ్‌ల వద్ద దశాబ్దాలుగా నెలకొన్న ట్రాఫిక్ రద్దీ సమస్యకు 16 కిలోమీటర్ల ఎలివేటెడ్ రైల్వే ట్రాక్ ద్వారా శాశ్వత విముక్తి: శ్రీ అశ్వినీ వైష్ణవ్

నాడు పోస్టు చేయడమైనది: 16 NOV 2026 5:43PM by PIB Hyderabad

కేంద్ర రైల్వే, సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, ఎంపీ శ్రీ రమేష్ అవస్తి ఈ రోజు నూతన కాన్పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. కాన్పూర్ సెంట్రల్ - ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య ఇరువైపులా రాకపోకల కోసం కనెక్టివిటీని అందిస్తూ ఈ రైలు సేవలందించనుంది.

కాన్పూర్ మేయర్ శ్రీమతి ప్రమీలా పాండే, అక్బర్‌పూర్ ఎంపీ శ్రీ దేవేంద్ర సింగ్ భోలే సహా పలువురు ప్రముఖులు, సీనియర్ రైల్వే అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ నూతన రోజువారీ రైలు సర్వీసుతో ఉత్తరప్రదేశ్ - జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) మధ్య రైలు కనెక్టివిటీ మరింత బలపడనుంది. తద్వారా కాన్పూర్, ఢిల్లీ మధ్య ప్రయాణించే వారికి అదనపు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రానుంది.

 

నూతన రైలు సర్వీసుతో ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలకు కనెక్టివిటీ మరింత బలోపేతం

మొత్తం 428 కిలోమీటర్ల మేర నడిచే ఈ రైలు 22 ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు గలది. ఇది తన ప్రయాణ మార్గంలోని పలు ముఖ్య పట్టణాలు, ఆర్థిక కేంద్రాలను అనుసంధానించనుంది.

ఎన్‌టీపీసీ ఔరాయ్యా, గెయిల్ పాటా సహా ఔరాయ్యా పారిశ్రామిక ప్రాంతాలకు సేవలందించే ఫాఫుండ్ ప్రయాణికులకు... ప్రధాన వ్యవసాయ కేంద్రమైన ఇటావా, గాజు పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ఫిరోజాబాద్ ప్రాంతానికి కనెక్టివిటీని కల్పించే తుండ్లా ప్రయాణికులకు ఈ రైలు సర్వీసుతో ఎంతో లబ్ధి చేకూరనుంది.

ఇంగువ ప్రాసెసింగ్, ఇత్తడి వస్తువులు, వ్యవసాయాధారిత పరిశ్రమలకు పేరుగాంచిన హత్రాస్ నగరాన్ని... తాళాల పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి నిలయంగా ఉన్న అలీగఢ్ నగరాన్ని ఈ రైలు మరింతగా అనుసంధానిస్తుంది. పింగాణీ, మట్టి పాత్రల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ఖుర్జా ప్రాంతానికీ ఇది రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది.

ఈ రైలు సర్వీస్ ఢిల్లీలోని ప్రధాన బహుళ-రవాణా కేంద్రమైన ఆనంద్ విహార్ టెర్మినల్‌కు చేరుకునే ముందు, ముఖ్యమైన లాజిస్టిక్స్, పారిశ్రామిక కేంద్రమైన దాద్రిని... జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) లోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటైన ఘజియాబాద్‌తో కలుపుతుంది

ప్రాంతీయ వికాసానికి, ప్రయాణికుల సౌకర్యానికి మరింత ఊతం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పారిశ్రామిక, లెదర్, విద్యా కేంద్రాల్లో ఒకటైన కాన్పూర్‌... జాతీయ రాజధాని ప్రాంతంలోని వివిధ ప్రాంతాల ప్రయాణికులను కలిపే ఢిల్లీలోని ప్రధాన బహుళ-రవాణా కేంద్రమైన ఆనంద్ విహార్ టెర్మినల్‌ మధ్య ఈ కొత్త రైలు సర్వీస్ నేరుగా రైలు అనుసంధానాన్ని అందిస్తుంది. ఈ కనెక్టివిటీ వల్ల ఈ రెండు ముఖ్యమైన నగరాల మధ్య ప్రయాణించే వ్యాపారవేత్తలు, విద్యార్థులు, కార్మికులు, ఇతర ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం లభిస్తుంది.

నూతన రైలు సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా కాన్పూర్ ప్రజలకు శ్రీ వైష్ణవ్ అభినందనలు తెలిపారు. ఈ కొత్త రైలు సేవల కోసం సీఎం శ్రీ యోగి ఆదిత్యనాథ్ సైతం కాన్పూర్ వాసులకు శుభాకాంక్షలు తెలిపినట్లు ఆయన వెల్లడించారు.

రాబోయే ప్రధాన రైల్వే ప్రాజెక్టులు

నగరంలో రాబోయే రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కేంద్ర రైల్వే శాఖ మంత్రి వివరించారు. అన్వర్‌గంజ్ - మంధనా మధ్య 16 కిలోమీటర్ల ఎలివేటెడ్ రైల్వే ట్రాక్ నిర్మాణంతో... కాన్పూర్‌లో రైల్వే క్రాసింగ్‌ల వద్ద దశాబ్దాలుగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పూర్తయిందనీ, అవసరమైన అన్ని అనుమతులూ లభించాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 

ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై రైల్వే మంత్రి మాట్లాడుతూ... 'బుల్లెట్ రైలు నార్త్ కారిడార్' కాన్పూర్ అభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదిత కారిడార్ ఢిల్లీ, ఆగ్రా, కాన్పూర్, వారణాసి, లక్నో, అయోధ్య నగరాలను కలుపుతూ... అక్కడి నుంచి పాట్నా, సిలిగురి మీదుగా గౌహతి వరకు విస్తరించనుంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే... ఢిల్లీ-కాన్పూర్ మధ్య ప్రయాణ సమయం సుమారు 1 గంట 45 నిమిషాలకు తగ్గుతుంది. లక్నో-కాన్పూర్ మధ్య ప్రయాణానికి సుమారు 27 నిమిషాలు, కాన్పూర్-ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రయాణానికి సుమారు 1 గంట 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.

హై-స్పీడ్ రైలు కనెక్టివిటీ వల్ల ప్రధాన నగరాలతో కాన్పూర్ అనుసంధానం మరింత బలోపేతమవుతుందనీ... తద్వారా ప్రాంతీయ, ఆర్థిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల గురించి కేంద్ర మంత్రి శ్రీ వైష్ణవ్ మాట్లాడుతూ... ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను వివరిస్తూ... రాబోయే రోజుల్లో కాన్పూర్‌లో మరిన్ని రైల్వే మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులనూ చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సభనుద్దేశించి ఎంపీ శ్రీ అవస్తి మాట్లాడుతూ... కాన్పూర్ కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకొచ్చే సంకల్పం ఇప్పుడు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చడం ప్రారంభమైందని పేర్కొన్నారు. కాన్పూర్‌లో బుల్లెట్ రైలు హాల్ట్ ప్రకటన నగర ప్రజలకు ఎనలేని ఆనందాన్ని కలిగించిందని ఆయన అన్నారు. అన్వర్‌గంజ్-మంధనా రైల్వే సెక్షన్‌లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం కాన్పూర్ వాసులు 2017-18 నుంచి చేస్తున్న దీర్ఘకాలిక డిమాండ్‌కు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని శ్రీ అవస్తి వెల్లడించారు. కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులతో పాటు, కాన్పూర్ పేరుతో కొత్త రైలు సర్వీసునూ ప్రారంభించడం హర్షణీయమని శ్రీ అవస్తి వ్యాఖ్యానించారు.

ప్రయాణికుల కనెక్టివిటీని బలోపేతం చేయడంతో పాటుగా... ఆధునికమైన, సౌకర్యవంతమైన, నమ్మకమైన రైలు ప్రయాణ సదుపాయాలను అందించడంలో భారతీయ రైల్వేల నిరంతర నిబద్ధతకు ఈ నూతన రైలు సర్వీసు ప్రారంభం నిదర్శనంగా నిలుస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2337169) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada