వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘సీఐఐ 31వ భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సు-2026’.. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతి,

పెట్టుబడి అవకాశాలను కళ్లకు కట్టిన ఎన్ఐసీడీసీ

ఆంధ్రప్రదేశ్2లో మూడు పారిశ్రామిక నోడ్స్ పురోగతిని ప్రముఖులకు వివరించిన ఎన్ఐసీడీసీ సీఈఓ & ఎమ్‌డీ

అంతర్జాతీయ భాగస్వామ్యాల పటిష్టీకరణ, పెట్టుబడుల ఆకర్షణ, భారత్‌ను ప్రపంచ తయారీ కూడలిగా నిలపడంపై దృష్టిని కేంద్రీకరించిన శిఖరాగ్ర సదస్సు

ఆంధ్ర‌ప్రదేశ్‌లో పారిశ్రామిక పురోగతి, పెట్టుబడి అవకాశాలు, గ్రీన్‌ఫీల్డ్ పారిశ్రామిక స్మార్ట్ నగరాలపై ఎన్ఐసీడీసీ మండపంలో ప్రదర్శన

నాడు పోస్టు చేయడమైనది: 16 NOV 2026 11:33AM by PIB Hyderabad

భారతీయ పారిశ్రామిక రంగ సమాఖ్య (సీఐఐ) 2026 నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలో ‘సీఐఐ 31వ భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సు-2026’ను నిర్వహించింది. దీనిని ‘‘నావిగేటింగ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్: ట్రేడ్ | టెక్నాలజీ | ట్రస్ట్ | థాట్ లీడర్‌షిప్’’ ఇతివృత్తంతో నిర్వహించారు. ఈ శిఖరాగ్ర సదస్సును కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖలో భాగమైన పరిశ్రమ, అంతర్జాతీయ వ్యాపార ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. ఈ శిఖరాగ్ర సదస్సులో విధాన రూపకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, ప్రపంచ వ్యాపార రంగ ప్రముఖులు, ఇన్వెస్టర్లు సమావేశమయ్యారు. వారు వ్యాపారం, సాంకేతిక విజ్ఞానం, ఆర్థిక సహకారం రంగాల్లో కొత్తగా అందుబాటులోకి వస్తున్న అవకాశాలపై చర్చించారు.

 

ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ది, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆర్‌టీజీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక ప్రసంగాన్నిచ్చారు.

 

ప్రారంభ కార్యక్రమంలో అనేక మంది సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, విదేశీ వాణిజ్య మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విధాన రూపకర్తలు, దేశ విదేశాలకు చెందిన పరిశ్రమ రంగాల్లోని ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, పారిశ్రామిక సహకారంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం పట్ల అనేక వర్గాలు ఆసక్తితో ఉన్నాయని చాటింది.

 

ఈ శిఖరాగ్ర సదస్సు.. అంతర్జాతీయ వాణిజ్యం, ప్రపంచవ్యాప్త వేల్యూ చైన్లు, ప్రతికూలతలకు తట్టుకొని నిలవగలిగిన సరఫరా వ్యవస్థలు, ఉన్నత స్థాయి తయారీ, రక్షణ రంగ సంబంధిత సాంకేతికత, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధ, క్వాంటమ్ సాంకేతికతలు, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, పర్యావరణానికి హాని చేయని ఇంధన వనరులు, రాబోయే కాలంలో ప్రజారవాణాతో పాటు సరికొత్తగా తెర మీదకు వస్తున్న సాంకేతికతలపై చర్చించడానికి ఒక వేదికను సమకూర్చింది. అంతర్జాతీయ భాగస్వామ్యాలను పటిష్టపరుచుకోవడం, పెట్టుబడులను ఆకర్షించడం, భారత్‌ను అంతర్జాతీయ తయారీ, నూతన ఆవిష్కరణల విషయాల్లో పోటీపడే దేశంగా రూపొందించడం అన్న అంశాలపై చర్చల్లో దృష్టి కేంద్రీకరించారు.

 

శిఖరాగ్ర సదస్సుకు విచ్చేసిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి సంస్థ (ఎన్ఐసీడీసీ) మండపాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తిలలో ఎన్ఐసీడీసీ ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు సంబంధించిన పనులు ఎలా పురోగమిస్తోందీ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రజత్ కుమార్ సైనీ ప్రముఖులకు వివరించారు.

భారత్‌లో పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన రంగంలోనూ, పెట్టుబడి అవకాశాల్లోనూ చోటుచేసుకుంటున్న అనేక పరిణామాలను వివిధ కార్యక్రమాలు, డిజిటల్ వేదికల ద్వారా ఎన్ఐసీడీసీ మండపంలో ప్రదర్శించారు. ముఖ్య ఆకర్షణల్లో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్, బీహెచ్ఏవీవైఏ(‘భవ్య’.. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజనకు ఇది సంక్షిప్త రూపం), ఇండస్ట్రియల్ కారిడార్ ల్యాండ్ ప్లాట్‌ఫామ్ (ఐసీఎల్‌పీ), కోయ్‌లా శక్తి వంటివి ఉన్నాయి. వీటిలో ఐసీఎల్‌పీ ఇండియాలో అధికారిక గుర్తింపును కలిగి ఉన్న పారిశ్రామిక భూములను గురించి ఇన్వెస్టర్లకు తెలియజేస్తుంది. ఇక కోయ్‌లా శక్తి విషయానికి వస్తే ఇది ఒక స్మార్ట్ కోల్ ఎనలిటిక్స్ డ్యాష్‌బోర్డు. ఈ పెవిలియన్లో 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ (వీఆర్) పర్యటన సదుపాయాన్ని కూడా కల్పించారు. దీనిని సందర్శించిన వారికి, ఎన్ఐసీడీసీ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను గురించిన సమగ్ర అవగాహన ఏర్పడింది.

 

మూడు ఇండస్ట్రియల్ నోడ్స్‌లో అభివృద్ధి పనుల క్రమాన్ని శ్రీ రజత్ కుమార్ సైనీ ప్రముఖుల దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ప్రాజెక్టుల పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన తీరుతెన్నులను, రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో పెట్టుబడికి అనువైన ఏర్పాట్లు చేసే దిశగా ఎన్ఐసీడీసీ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా తెలియజేశారు.

 

ఈ మండపం ఆంధ్రప్రదేశ్‌కున్న పారిశ్రామిక సత్తాను తెలిపింది. మూడు నోడ్లలోనూ కలిపి 7,223 ఎకరాల స్థలం ప్రాజెక్టులకు అనువుగా రూపుదిద్దుకొందని, రూ.31,360 కోట్ల విలువైన పెట్టుబడి సామర్థ్యంతో పాటు 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం వీటికి ఉన్నాయని వివరించారు. ఈ మూడు నోడ్లను వేరువేరు ఇండస్ట్రియల్ కారిడార్లలో తీర్చిదిద్దుతున్నారు. వీటిలో ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలను, సంధానాన్ని జతపరిచి ఏకీకృత పారిశ్రామిక విస్తారిత అనుబంధ వ్యవస్థలను (ఇకోసిస్టమ్స్) ఆవిష్కరించనున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించుకోవడం, రాష్ట్రంలో తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడం, ఉద్యోగకల్పనతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందింపచేయడం లక్ష్యాలుగా ఈ నోడ్లను ముస్తాబు చేస్తున్నారు.

 

ఈ ప్రదర్శనలు, సమావేశాల ద్వారా తయారీ, వినూత్న రంగాల్లో పెట్టుబడికి ఉన్న అవకాశాలను గురించి ఎన్ఐసీడీసీ ప్రస్తావించింది.

 

ఆంధ్రప్రదేశ్.. దేశీయ పెట్టుబడిదారులకే కాకుండా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు కూడా ఒక ఆకర్షణీయ రాష్ట్రంగా మారిందని ఎన్ఐసీడీసీ పేర్కొంది.

 

జపాన్ కంట్రీ సెషన్‌లో భారతదేశానికి జపాన్ రాయబారి శ్రీ కీచీ ఒనో పాల్గొన్నారు. భారతదేశానికి, జపాన్‌కు మధ్య ఆర్థిక భాగస్వామ్యం నానాటికీ విస్తరిస్తోందని ఆయన అన్నారు. 31 జపాన్ కంపెనీలు ఆంధ్రప్రదే‌శ్‌లోని మూడు నగరాల్లో కార్యకలాపాలను సాగిస్తూ, స్థానికంగా 8,000కు మించిన ఉద్యోగాల్ని కల్పించాయని ఆయన తెలిపారు. ఉక్కు, ఔషధాల నిర్మాణం, స్వచ్ఛ ఇంధనం, సెమీకండర్ల రంగాలలో సహకారానికి అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన ప్రస్తావించారు.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమలు, ఆహార శుద్ధి శాఖ మంత్రి శ్రీ టి.జి. భరత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో గల పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మకంగా కీలకమైన ఓడరేవులు, రంగంవారీ అవకాశాలను వివరించారు. పెట్టుబడితో ముడిపడిన వాగ్దానాలను వాస్తవిక ప్రాజెక్టులుగా మార్చుకోవడంపై శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.  

శ్రీ రజత్ కుమార్ సైనీ ప్రారంభోపన్యాసాన్నిస్తూ, అయిదు కీలక రంగాల్లో ఇప్పటి కన్నా మరింత ఎక్కువ సహకారాన్ని ఆశిస్తున్నట్లు ప్రస్తావించారు. అవి తయారీ, పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, సవాళ్లు ఎదురైనా తట్టుకొని నిలవగలిగే సరఫరా వ్యవస్థలు, ఉన్నత సాంకేతికతలు, దీర్ఘకాలిక ప్రాతిపదికన పారిశ్రామికాభివృద్ధి సాధన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వాణిజ్య వ్యవస్థ (ఎమ్ఎస్ఎమ్ఈ) భాగస్వామ్యాలు, నైపుణ్యాభివృద్ధి రంగాలు అని ఆయన వివరించారు. పెట్టుబడికి ఉన్న అవకాశాలను ఆచరణీయ భాగస్వామ్యాలుగా మలచుకోవడం ముఖ్యమనీ, రాబోయే పది సంవత్సరాల్లో భారతదేశంలో పది లక్ష కోట్ల జపనీస్ యెన్ (10 ట్రిలియన్ జేపీవై) విలువ గల పెట్టుబడులు పెట్టాలన్న ఆసక్తిని జపాన్ కనబరిచిందనీ ఆయన అన్నారు.

 

జేఈటీఆర్ఓ చెన్నయి డైరెక్టర్ జనరల్ శ్రీ కియోటకా దొహో మాట్లాడుతూ భారత్‌లోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ జపాన్ కంపెనీల ఆసక్తి అంతకంతకూ పెరుగుతోందన్నారు. సర్వే చేసిన కంపెనీల్లో 80 శాతం కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరించేందుకు పథక రచన చేస్తున్నాయని తేలిందని ఆయన తెలిపారు. ఇసుజు మోటర్స్ ఇండియా ప్రెసిడెంటు, మేనేజింగ్ డైరెక్టరు శ్రీ రాజేశ్ మిత్తల్ మాట్లాడుతూ, జపాన్లో తయారీ కంపెనీలు పాటించే పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలు, నైపుణ్యాభివృద్ధి, స్థానికంగా సరఫరాదారు వ్యవస్థ సేవలను వినియోగించుకొనేందుకు ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయన్నారు.

 

అనేక పారిశ్రామిక కారిడార్లలో కొత్త పారిశ్రామిక స్మార్ట్ నగరాలను ఎన్ఐసీడీసీ అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశ తయారీ విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్)ను బలోపేతం చేయడం, ఆధునిక రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్) సామర్థ్యాన్ని పెంపొందింప చేయడంతో పాటు పెట్టుబడులకు అనువైన పారిశ్రామిక క్షేత్రాలను సన్నద్ధం చేసే దిశగా కృషి చేస్తోంది. దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఉద్యోగకల్పనకు తోడ్పడాలని, భారతీయ పరిశ్రమలను గ్లోబల్ వేల్యూ చైన్లతో ఏకీకరించే ప్రక్రియకు మార్గాన్ని సుగమం చేయాలనే లక్ష్యాలను ఎన్ఐసీడీసీ నిర్దేశించుకొని అనేక కార్యక్రమాలను అమలుచేస్తోంది.

 

కార్యక్రమంలో పాలుపంచుకున్న ఇతర ప్రముఖులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమలు, ఆహార శుద్ధి శాఖ మంత్రి శ్రీ టి.జి. భరత్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి శ్రీ బి.సి. జనార్ధన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జి. సాయి ప్రసాద్, సీఐఐ అధ్యక్షుడు, టాటా కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టరు, సీఈఓ శ్రీ ఆర్. ముకుందన్‌తో పాటు సీఐఐ డైరెక్టర్ జనరల్ శ్రీ చంద్రజిత్ బెనర్జీ ఉన్నారు.

 

సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సు-2026లో ఎన్ఐసీడీసీ పాల్గొనడంతో ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టుల్లో సంస్థ సాధిస్తున్న పురోగతిని సందర్శకులకు వివరించే అవకాశాన్ని సంపాదించుకోవడం ఒక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడానికి గల అవకాశాలను అంతర్జాతీయ స్థాయి ఆసక్తిదారు వర్గాల దృష్టికి తీసుకువెళ్లేందుకు వీలు కలిగింది. ఈ ప్రయత్నాలు దేశంలో తయారీ రంగం శక్తిసామర్థ్యాలను పటిష్టపరిచి, 2047 కల్లా ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్‌) లక్ష్యాన్ని సాధించే దిశగా పయనించాలన్న కేంద్ర ప్రభుత్వ దార్శనికతను సాకారం చేయడంలో తోడ్పాటును అందించనున్నాయి.

 

దేశవ్యాప్తంగా ప్రపంచ శ్రేణి నూతన పారిశ్రామిక స్మార్ట్ సిటీస్‌ను తీర్చిదిద్దే పనిని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖలోని పరిశ్రమ, అంతర్జాతీయ వ్యాపార ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఆధీనంలో గల జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి సంస్థకు (ఎన్ఐసీడీసీ) అప్పజెప్పారు. ఏకీకృత పారిశ్రామిక మౌలిక సదుపాయాలకల్పన, డిజిటల్ కార్యక్రమాల ద్వారా ఎన్ఐసీడీసీ దేశ తయారీ రంగ స్పర్ధాత్మకతను పెంపొందింప చేస్తూ, పెట్టుబడులను ఆకట్టుకొంటూ, దీర్ఘకాల ప్రాతిపదికన ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

*****


(రిలీజ్ ఐడి: 2336836) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Assamese