నాడు పోస్టు చేయడమైనది:
15 NOV 2026 9:55AM by PIB Hyderabad
అధికార పర్యటన నిమిత్తం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ 2026 నవంబర్ 14న ఈజిప్ట్‌లోని కైరోకు చేరుకున్నారు. భారత్-ఈజిప్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ద్వైపాక్షిక వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింతగా పెంపొందించడం, రెండు దేశాల మధ్య పారిశ్రామిక, వాణిజ్య సహకారానికి కొత్త అవకాశాలను అన్వేషించడమే ఈ పర్యటన లక్ష్యం.
చారిత్రక, నాగరిక, ప్రజాసంబంధాల్లో నాటుకున్న సుదీర్ఘ సంబంధాలు భారత్, ఈజిప్టు మధ్య ఉన్నాయి. కాలక్రమేణా ఈ సంబంధాలు రాజకీయ, ఆర్థిక, భద్రత, సాంస్కృతిక సహకారాన్ని కలిగి ఉన్న బహుముఖ భాగస్వామ్యంగా పరిణామం చెందాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్–ఈజిప్టు సంబంధాలు సరికొత్త వేగాన్ని సంతరించుకున్నాయి. ఆర్థిక రంగంతో సహా సహకారాన్ని విస్తరించుకోవాలనే ఉమ్మడి నిబద్ధతతో ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేర్చారు.
పర్యటనలో భాగంగా తొలుత కైరోలోని హీలియోపోలిస్ యుద్ధ శ్మశాన వాటికలో భారతీయ సైనికుల త్యాగాలను, సేవలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించారు. ఈ శ్మశానవాటికలో ఖననం చేసిన లేదా స్మారక చిహ్నాలు ఉన్న 4,000 మంది సైనికుల్లో 3,727 మంది భారతీయ సైనికులే ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సుమారుగా 2,000 మంది, రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు 1,700 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ఈజిప్టులోని 'ఇండియన్ కమ్యూనిటీ అసోసియేషన్' నిర్వహించిన ప్రవాస భారతీయుల కార్యక్రమంలో కూడా మంత్రి ప్రసంగించారు. ప్రవాస భారతీయులతో మమేకమయ్యేందుకు, ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, ప్రజా సంబంధాలను బలోపేతం చేయడంలో వారు పోషిస్తున్న పాత్రను అభినందించే అవకాశాన్ని ఈ సమావేశం అందించింది.
ఈ సందర్భంగా శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ భారత్-ఈజిప్ట్ సంబంధాల సామర్థ్యం గురించి వివరించారు. సుమారు 6.5 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం ఈ రెండు ప్రాచీన నాగరికతల మధ్య భాగస్వామ్యానికి ఆరంభం మాత్రమేనని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య స్నేహవారధిగా ప్రవాస భారతీయులు అభివర్ణించారు. ఈజిప్టులో పనిచేస్తున్న దాదాపు 70 భారతీయ కంపెనీల సహకారం గురించి తెలియజేశారు. ఈ కంపెనీలు 5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడంతో పాటు ఈజిప్టు ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు.
రెండు దేశాల మధ్య కీలకమైన వారధిగా ఈజిప్టులో ఉన్న భారతీయ సమాజం కొనసాగుతోంది. వాణిజ్య కార్యకలాపాలు, వృత్తిపరమైన సహకారంతో పాటు విస్తృతమైన భారత్-ఈజిప్ట్ సంబంధాలకు తోడ్పాటును అందిస్తోంది.
ఈ పర్యటనలో భాగంగా భారత్-ఈజిప్ట్ సంయుక్త వాణిజ్య కమిటీ (జేటీసీ) ఏడో సమావేశం, భారత్-ఈజిప్ట్ సంయుక్త వ్యాపార మండలి (జేబీసీ) భేటీ, భారత్-ఈజిప్ట్ బిజినెస్ ఫోరమ్ జరగనున్నాయి. 2026 నవంబర్ 15న కైరోలో జరిగే భారత్-ఈజిప్ట్ సంయుక్త వాణిజ్య కమిటీ ఏడో సమావేశానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఈజిప్ట్ పెట్టుబడులు, విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ మొహమ్మద్ ఫరీద్ సలేహ్ సంయుక్తంగా అధ్యక్షత వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈజిప్టు సీనియర్ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు, ప్రముఖ వ్యాపార ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తారు. వీటితో పాటు ఆఫ్రికన్ ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ (అఫ్రెక్సిమ్ బ్యాంక్), ఈజిప్షియన్ జూనియర్ బిజినెస్మెన్ అసోసియేషన్, ఈజిప్ట్-ఇండియా స్టార్టప్స్ ఫోరమ్ ప్రతినిధులతోనూ సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని సమీక్షించేందుకు, వాణిజ్య, పెట్టుబడి సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు, వ్యాపార భాగస్వామ్యాలకు కొత్త మార్గాలను గుర్తించేందుకు ఈ సమావేశాలు వేదికలుగా నిలుస్తాయని భావిస్తున్నారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, పారిశ్రామిక సహకారం, ఆవిష్కరణల అనుసంధానానికి ఇవి ఊతమిస్తాయి.
***