నాడు పోస్టు చేయడమైనది:
15 NOV 2026 3:47PM by PIB Hyderabad
తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22, 2026 వరకు జరిగే 8వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ) లోగో, మస్కట్‌ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
యువతను క్రీడలతో అనుసంధానించటం, దేశాభివృద్ధిలో క్రీడలను భాగం చేయటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు.
"ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా ఖేలో ఇండియా యూత్ గేమ్స్, బీచ్ గేమ్స్, వింటర్ గేమ్స్, ట్రైబల్ గేమ్స్ వంటి వివిధ పోటీలను నిర్వహిస్తున్నాం" అని డాక్టర్ మాండవీయ తెలిపారు.
తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు మార్గదర్శకత్వం వహిస్తూ సహకారం అందిస్తున్న ప్రధానమంత్రికి కేంద్ర క్రీడా మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
యువతను క్రీడల వైపు ఆకర్షితులుగా మలిచేందుకు, దేశంలో బలమైన క్రీడా సంస్కృతిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని డాక్టర్ మాండవీయ వెల్లడించారు.
దేశంలోని యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా ఇతర సామాజిక సవాళ్లను ఎదుర్కొనేలా ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వంటి వేడుకలు ఎంతగానో దోహదపడతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి దార్శనికత వికసిత్ భారత్ కోసం నషా ముక్త యువను సాకరం చేయటంలో ఈ క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
తెలంగాణలో జరగనున్న ఈ క్రీడల్లో దాదాపు 8,000 మంది క్రీడాకారులు, ప్రతినిధులు పాల్గొంటారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరిగే ఈ క్రీడలు… రాష్ట్రంలోని ఆరు నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, హన్మకొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్‌లో నిర్వహిస్తారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తెలంగాణ ఎడిషన్‌లో 27 పోటీ క్రీడలు, రెండు ప్రదర్శన క్రీడలతో సహా మొత్తం 29 క్రీడా విభాగాలు ఉన్నాయి.
పోటీ క్రీడల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, గట్కా, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, కలరిపయట్టు, ఖో-ఖో, మల్లఖంబ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, సాఫ్ట్‌బాల్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, తంగ్-టా, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, యోగాసన ఉన్నాయి.
సైలింగ్, కర్రసాము ప్రదర్శన క్రీడలుగా ఉంటాయి.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో సాఫ్ట్‌బాల్ తొలిసారిగా పోటీ క్రీడగా చోటు దక్కించుకుంది. సైలింగ్, కర్రసాము కూడా మొదటిసారిగా ప్రదర్శన క్రీడలుగా అరంగ్రేటం చేస్తున్నాయి.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు తెలంగాణ రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి, నీటిపారుదల, సీఏడీ శాఖ మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, క్రీడా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ ఎ.పి. జితేందర్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు తదితరులు హాజరయ్యారు.
భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఐ) డైరెక్టర్ జనరల్, కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శి శ్రీ హరి రంజన్ రావు, కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాల సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
లోగో, మస్కట్:
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోగో తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, క్రీడా ఆకాంక్షలను ఎనిమిది ప్రధానాంశాల ద్వారా ప్రతిబింబిస్తోంది.
కాషాయ, ఆకుపచ్చ రంగుల్లో పరుగెత్తుతున్న మనిషిని పోలి ఉన్న ఖేలో ఇండియా చిహ్నం... జాతీయ కార్యక్రమాన్ని, యువతను, ఉత్సాహాన్ని సూచిస్తుంది. బాపూఘాట్ వద్ద ప్రతిపాదిత గాంధీ సరోవర్‌లోని భాగమైన గాంధీ టవర్.. శాంతి, ఐక్యత, భవిష్యత్తుపై హైదరాబాద్ దృక్పథాన్ని తెలియజేస్తుంది. రాష్ట్ర ఘనమైన వారసత్వాన్ని, ఆతిథ్య భావను కాకతీయ కళా తోరణం చాటుతుంది.
హుస్సేన్ సాగర్‌పై ఉన్న బుద్ధ విగ్రహం సత్సంబంధాలు, క్రమశిక్షణ ప్రశాంతతకు ప్రతీకగా నిలవగా... తంగేడు పువ్వు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును, బతుకమ్మ స్ఫూర్తిని చాటుతోంది. చారిత్రక నగర దృశ్యానికి తోడుగా నీడల రూపంలో ఉన్న ఏడు క్రీడా ఆకారాలతో ఉన్న క్రీడా హంగులు సరికొత్త శోభను తెస్తున్నాయి. చుట్టూ అల్లుకున్న నీలం, ఆకుపచ్చ, పసుపు రంగుల రిబ్బన్... ఉత్సాహాన్ని, శక్తిని, సమ్మిళితత్వాన్ని సూచిస్తుంది.
"ఖేల్ కా జునూన్, తెలంగాణ కి జాన్ ఔర్ పెహచాన్" అనే నినాదం... క్రీడల పట్ల ఉన్న అభిరుచిని, తెలంగాణ అస్తిత్వంలో క్రీడలు భాగమనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
యువత ఉత్సాహానికి, క్రీడా స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తున్న నీలమణి మస్కట్… శక్తి, ఉత్సాహం, అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది మన సాంస్కృతిక మూలాలపై గర్వపడేలా చేస్తూ మరింత బలమైన, ఆరోగ్యకరమైన, ఐక్య భారతదేశాన్ని ఆవిష్కరించాలనే ఆకాంక్షను చాటుతోంది. దీని కిరీటం శక్తిని, ముందడుగు వేయటాన్ని సూచిస్తుంది. దీని కళ్లు ఏకాగ్రతను, మేధస్సును, చైతన్యాన్ని ప్రతిబింబిస్తాయి. దీని ముక్కు పట్టుదలను, నాయకత్వ లక్షణాలను చాటిచెప్పగా... నీలి, సముద్రపు నీలి ఆకుపచ్చ రంగు ఈకలు ఉత్సాహాన్ని, స్వేచ్ఛను, ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తాయి.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ విలువలను, ఆశయాలను ప్రతిబింబిస్తూ నీలమణిలో నాలుగు ప్రధాన గుణాలున్నాయి. అవి: ఉత్సాహం, ధైర్యం, వేగం, గర్వం.
*****