నాడు పోస్టు చేయడమైనది:
15 NOV 2026 3:03PM by PIB Hyderabad
భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు సగౌరవ నివాళి అర్పించారు. దీంతోపాటు గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం నేపథ్యంలో జాతికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
‘ధర్తీ ఆబా’గా ప్రజలు ఆత్మీయంగా పిలుచుకునే భగవాన్ బిర్సా ముండా అసమాన ధైర్యసాహసాలను, పోరాట పటిమను, త్యాగాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. గిరిజనుల ఆత్మగౌరవం, స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణ దిశగా ఆయన వారసత్వం ప్రతి తరానికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో పని చేస్తున్న తమ ప్రభుత్వం గిరిజన సోదరీసోదరుల గౌరవం, అవకాశాలు, శ్రేయస్సు దిశగా ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నదని చెప్పారు. దేశ ప్రగతిలో గిరిజన సమాజం అమూల్య సహకారానికి ప్రజలందరూ కృతజ్ఞతాభివందనం అర్పించాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా పంపిన సందేశంలో:
“భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా నా దేశ ప్రజలందరి తరపున ఆయనకు నా హృదయపూర్వక నివాళి. అలాగే ఈ పవిత్ర గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం నేపథ్యంలో మీకందరికీ అనేకానేక శుభాకాంక్షలు.
ధర్తీ అబా అకుంఠిత సాహసం, పోరాట పటిమ, త్యాగం వంటి అద్వితీయ లక్షణాలు జాతి ఆత్మగౌరవం, స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణ దిశగా దేశంలోని ప్రతి తరానికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
ఆయన స్ఫూర్తితోనే మన గిరిజన సోదరీసోదరుల ఆత్మగౌరవం, అవకాశాలు, సౌభాగ్యం దిశగా మా ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది.
దేశ పురోగమనంలో గిరిజన సమాజం అమూల్య కృషికి మనమంతా సమష్టిగా కృతజ్ఞతాభివందనాలు అర్పిద్దాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***