రాజ్యసభ సచివాలయం
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రాంగణంలో భగవాన్ బిర్సా ముండాకు పుష్పాంజలి ఘటించిన భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోకసభ స్పీకర్

నాడు పోస్టు చేయడమైనది: 15 NOV 2026 11:22AM by PIB Hyderabad

ఈ రోజు భగవాన్ బిర్సా ముండా జయంతి, జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణాస్థల్‌లో ఉన్న ఆయన విగ్రహానికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘ధైర్యానికి, పోరాటానికి చిహ్నమైన ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన సమాజాన్ని నడిపించారు. వారి హక్కులు, ఆత్మగౌరవం, గుర్తింపు కోసం పోరాటం చేశారు. ఆయనిచ్చిన ఉల్గులాన్ పిలుపు... స్వేచ్ఛ, న్యాయం కోసం చేసిన పోరాటానికి శక్తిమంతమయిన గొంతుకగా మారింది. జన జాతీయ గౌరవ దినోత్సవం సందర్భంగా చిరస్మరణీయమైన ఆయన వారసత్వాన్నీ, భారత స్వాతంత్ర్య సంగ్రామానికి, జాతి నిర్మాణానికి గిరిజన సమాజాలు అందించిన అమూల్యమైన సేవలనూ మనం గౌరవించుకుంటున్నాం. ఆయన వారసత్వాన్నీ, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో, దేశ నిర్మాణంలో గిరిజన సమాజాలు చేసిన అమూల్యమైన కృషినీ చాటుతూ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు స్ఫూర్తినిచ్చాయి’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.

గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ 2021 నుంచి ప్రతి ఏటా నవంబర్ 15న జనజాతీయ గౌరవ్ దివస్ నిర్వహిస్తున్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అనేక విప్లవాత్మక ఉద్యమాల ద్వారా గిరిజన సమాజాలు కీలక పాత్ర పోషించాయి. భారత స్వాతంత్ర్యం, పురోగతిలో వారు చేసిన విశేష కృషికి గుర్తిస్తూ  దేశవ్యాప్తంగా ఐక్యత, గర్వభావాన్ని పెంపొందించే కార్యక్రమాలు ఈ రోజు నిర్వహిస్తారు. వారి సుసంపన్నమైన చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ఘనంగా జరుపుకొంటారు.

వేడుకల్లో భాగంగా, విశిష్ట అతిథులకు స్వాగతం పలుకుతూ వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు గిరిజన జానపద కళాబృందాలు పార్లమెంటు ఆవరణలోని ప్రేరణాస్థల్‌లో తమ ప్రతిభను ప్రదర్శించాయి.

***


(రిలీజ్ ఐడి: 2336529) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Kannada