రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రతిపాదిత ‘రెంట్ ఏ క్యాబ్’ సంబంధిత సంస్కరణలతో వ్యాపారావకాశాల విస్తరణ.. ప్రయాణికులకు మరింత మెరుగ్గా సేవలు

నాడు పోస్టు చేయడమైనది: 12 NOV 2026 9:05PM by PIB Hyderabad

అద్దెకు వాహనాలను తిప్పే వ్యాపార సంస్థల్ని ఆరంభించడాన్ని/నిర్వహించడాన్ని సులభతరం చేయడానికి, కిరాయికి లభించే వాహనాల శ్రేణిని విస్తరించడానికి, ప్రయాణికులకు భద్రతను పటిష్టపరచడానికి రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ కొన్ని సంస్కరణలను ప్రతిపాదించింది. ప్రతిపాదిత ప్రాథమిక ప్రణాళిక (ఫ్రేంవర్క్) సరళతర ప్రక్రియను, వినియోగదారులకు ఉత్తమ సౌకర్యాలను అందించనుంది.
కీలక ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.
• వ్యాపారాన్ని మొదలుపెట్టడం సులభం, మరిన్ని ప్రత్యామ్నాయాల లభ్యత: డ్రైవరు ఉండే వాహనాలను, అలాగే డ్రైవర్లు ఉండని వాహనాలను కూడా అందించడానికి వాహన సేవా సంస్థల నిర్వహకులను (ఆపరేటర్స్) అనుమతిస్తారు. కనీస వాహన శ్రేణి సంఖ్య 50 నుంచి 5కు తగ్గుతుంది. వాటిలో ప్రతి ఒక్క నిర్వహణ స్థలంలోనూ తక్కువలో తక్కువగా 2 వాహనాలను అయినా తిప్పవలసి ఉంటుంది. అయిదు పర్యటక నగరాల (టూరిస్టు సిటీస్)లో శాఖలను ఏర్పాటు చేసి తీరాలనే నియమాన్ని తొలగించారు.
   • ఒకే ఎలక్ట్రానిక్ లైసెన్సు: ప్రధాన శాఖకు, బ్రాంచులకు వేరు వేరుగా  లైసెన్సులను తీసుకొనే పద్ధతికి బదులు ఒకే లైసెన్సును జారీ చేస్తారు. దీనికి రాష్ట్రం, లేదా కేంద్రపాలిత ప్రాంతంలో సమాన సుంకం పద్ధతిని అమల్లోకి తీసుకువస్తారు. మంజూరు చేసిన కార్యకలాపాల  స్థలాల్లో విమానాశ్రయాలను, రైల్వే స్టేషన్లను, బస్ స్టాండులను కూడా చేర్చొచ్చు.
• నిర్ధారిత కాలం లోపల అనుమతులు: లైసెన్సు జారీ చేయడానికి, లైసెన్సును నవీకరించడానికి 60 రోజుల గడువును కేటాయిస్తారు. వాహనాలను గాని, కార్యకలాపాల స్థలాలను గాని జోడించడానికి, లేదా తొలగించడానికి 30 రోజుల లోపల ఆమోదాన్ని అందుకోవలసి ఉంటుంది. ఆ గడువు లోపల ఆమోదం లభించలేదంటే ఆ ప్రతిపాదనను స్వీకరించలేదన్నమాటే.
• పత్రాల అవసరం తగ్గిపోతుంది: ఎలక్ట్రానిక్ పద్ధతిలో ‘వాహన్’ (VAHAN) రిజిస్టర్లను, ఆటోమేటిక్ విధానంలో సమాచార (డేటా) పునఃప్రాప్తి పద్ధతులను అనుసరిస్తారు కాబట్టి, నియమాలను పాటించడం సరళతరం అవుతుంది.
 • యాత్రలు సురక్షితం: క్యాబులలో లొకేషన్ ట్రాక్ చేయడం, పిల్లలకు ఉద్దేశించిన సురక్షాత్మక సీటు (ఐచ్ఛికం)తో పాటు, ప్రాథమిక చికిత్స కిట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. వాహన సేవల సరఫరాదారు సంస్థలు (ఆపరేటర్లు) ఒక వెబ్‌సైటును, 24 గంటలూ పనిచేస్తూ ఉండే ఫిర్యాదుల పరిష్కార సేవలను, అత్యవసర ప్రాతిపదికన మరమ్మతులు, టోయింగ్ (తాడుతో ఈడ్చే) సదుపాయాన్ని అందించవలసి ఉంటుంది.
 • డ్రైవరు సంక్షేమం, జవాబుదారుతనం: ఆపరేటర్లు సమకూర్చే డ్రైవర్ల వివరాలను పోలీసు విభాగం సరిచూసి ఆమోదం తెలపడం తప్పనిసరి. అంతేకాదు, డ్రైవర్లకు ‘కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ-2020’లో భాగంగా సంక్షేమానికి హామీ ఇస్తారు. ఆపరేటర్ సమకూర్చిన వాహనం గాని, డ్రైవరుపరంగా గాని కొన్ని నిర్దిష్ట తీవ్ర నేరాలకు పాల్పడితే ఆపరేటర్ లైసెన్సు చెల్లుబాటు గడువును కుదించివేస్తారు.
• పక్షపాతానికి తావు ఇవ్వకుండా నిబంధనల అమలు, అపీలు ప్రక్రియ సరళతరం: ఆపరేటర్లకు అనుమతిని నిలిపివేసే, లేదా రద్దు చేసే అంశాన్ని పరిశీలించే ముందు మామూలు ఉల్లంఘనలను సరిదిద్దుకోవడానికి తగినంత సమయాన్నిస్తారు. దీనికి అదనంగా, ఒక అపీలు యంత్రాంగాన్ని కూడా ప్రారంభిస్తారు. దానిలో భాగంగా విచారణలను ఎలక్ట్రానిక్ పద్ధతిలోనూ నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తారు.
ఆశిస్తున్న ఫలితాలు
జీవన సౌలభ్యం: వాహనాలను అద్దెకు తీసుకునే వారికి కిరాయి వాహనాలకు సంబంధించి విస్తృత ఎంపికలు, సురక్షతా సౌకర్యాలు, 24 గంటలూ ఫిర్యాదులను పరిష్కరించే వెసులుబాటు అందుబాటులోకి వస్తాయి.
వ్యాపార నిర్వహణలో సౌలభ్యం: వ్యాపారంలోకి ప్రవేశించడానికి చాలావరకు అడ్డంకులను తొలగించడం, లైసెన్సు జారీ విధానాన్ని సరళతరం చేయడంతో చిన్న వ్యాపార సంస్థలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు పెంపొందుతాయి.
ప్రభావం పడే ఆసక్తిదారు వర్గాలు
కిరాయిదారులు, ఆపరేటర్లు, డ్రైవర్లు, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రవాణా ప్రాధికార సంస్థలు.
కార్యాచరణతో ముడిపడిన అంశాలు
రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పర్యవేక్షణ, ఎలక్ట్రానిక్ పద్ధతిలో లైసెన్సుల జారీ, వాహన్ రికార్డులు ఈ సంస్కరణలను అమలుచేయడంలో తోడ్పడుతాయి.

***


(రిలీజ్ ఐడి: 2336395) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Tamil