ఈ పవిత్రమైన దీపావళి పండుగ సందర్భంగా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే, ఛఠీ మైయా కార్యక్రమం కూడా సమీపిస్తున్నందున, దానికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.
ఇండియా టుడే గ్రూపు ఛైర్మన్, ఎడిటర్–ఇన్–ఛీఫ్ శ్రీ అరుణ్ పూరీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, కర్షక మిత్రులు, విశిష్ట అతిథులకు, ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి విచ్చేసిన సోదరీసోదరులందరికీ,
ముందుగా, ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇండియా టుడే గ్రూపును హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దేశంలో స్వచ్ఛతా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు, ఆ కార్యక్రమంలో ఇండియాటుడే ఉత్సాహంగా పాల్గొంది. ఇప్పుడు మీరు కిసాన్ మేళాను నిర్వహిస్తున్నారు. దీనికోసం రెండు రోజులను కేటాయించారు. ఇది చాలా సానుకూలమైన ప్రారంభం. అరుణ్ గారు చాలా బాగా హిందీ మాట్లాడారు. దానికి రెట్టింపు అభినందనలు.
మిత్రులారా,
దేశంలో పండగ వాతావరణం నెలకొన్న సమయంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. రెండు, మూడు రోజుల క్రితమే మనం దీపావళి జరుపుకొన్నాం. ఇప్పుడు ఛఠ్ మహాపర్వ స్ఫూర్తి మన చుట్టూ నెలకొంది. వ్యవసాయ జీవనంతో ఛఠ్ పర్వదినం అనుసంధానమైంది. చాలా పండగలు సాగు, వ్యవసాయంతోనే ముడిపడి ఉన్నాయి. బిహు, పొంగల్, ఓనం, బైశాఖి, సర్హుల్, పోలా లాంటి అనేక పండగలు వ్యవసాయంతోనే ముడిపడి ఉన్నాయి. మరో మాటలో చెప్పాలంటే వ్యవసాయమే మన సంస్కృతి, మన సంప్రదాయం, మన సామాజిక జీవనానికి పునాది.
మిత్రులారా,
వికసిత్ భారత్ సాధనకు అవసరమైన ఏడు ప్రధాన బలాల గురించి నేను ఎర్రకోట నుంచి మాట్లాడాను. వాటిలో అతి ముఖ్యమైనది వ్యవసాయం. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయకుండా, సాగు పద్ధతులను స్మార్ట్‌గా మార్చకుండా, రైతులకు సాధికారత కల్పించకుండా వికసిత్ భారత్‌ను నిర్మించడం అసాధ్యం. అందుకే ఇలాంటి రైతు సదస్సులకు ప్రాధాన్యం పెరుగుతోంది.
మిత్రులారా
వ్యవసాయం, దేశ ప్రగతి మధ్య ఉన్న సంబంధాన్ని రెండు ముఖ్యమైన వాస్తవాల ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే పేదరికంపై ప్రపంచ బ్యాంకు అధ్యయనం విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారతదేశంలో 50 కోట్ల మంది ప్రజలు కేవలం 12–13 ఏళ్లలోనే పేదరికాన్ని జయించారని ఆ అధ్యయనం చెబుతోంది. అలాగే గ్రామాల్లో సైతం పేదరికం వేగంగా తగ్గిందని కూడా పేర్కొంది. అంటే పెద్ద సంఖ్యలో చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు పేదరికాన్ని అధిగమించారు. ఇప్పుడు ఈ కాకతాళీయ సందర్భాన్ని పరిశీలించండి. గడచిన దశాబ్దంలో భారతదేశ వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతానికి పైగా కొనసాగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో సరాసరి వృద్ధి రేటు 4 శాతానికి పైగా నమోదైన మొదటి దశాబ్దం ఇది. అదే సమయంలో గ్రామాల్లోని అనేక మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారు. దురదృష్టవశాత్తూ... వార్తలకు సంబంధించిన భిన్నమైన కోణాలు, అజెండాల్లో చిక్కుకుపోయిన ప్రజలు దేశం సాధించిన ఈ విజయాన్ని గుర్తించలేకపోతున్నారు.
మిత్రులారా,
వ్యవసాయ విధానాలు, పద్ధతుల్లో నిరంతర మార్పు ఎంత అవసరమో సాగులో నిమగ్నమైన వారికి, వ్యవసాయ నిపుణులకు తెలుసు. దేశాన్ని దశాబ్దాల తరబడి పాలించిన వారు రైతులు పండించిన పంటతో ధాన్యాగారాలను నింపడంతోనే సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత రైతులకు ఏం దక్కింది? కేవలం ధాన్యాగారాలను నింపడం మాత్రమే సరిపోదు. కాలంతో పాటే ప్రపంచం మారుతుంది. మార్కెట్లు మారతాయి. ప్రజల అవసరాలు మారతాయి. ఆహారపు అలవాట్లు మారతాయి. వాతావరణం మారుతుంది. సాంకేతిక పరిజ్ఞానం మారుతుంది. ఈ మార్పులన్నింటితో పాటు మన రైతులకు కూడా సరికొత్త మార్గంలో సాధికారత అందించాలి. గతంలో ఈ అంశంపై దృష్టి సారించలేదు.
మిత్రులారా,
ఈ వేగాన్ని అందుకోవడానికి గడచిన దశాబ్దంలో దేశం అనేక చర్యలు తీసుకుంది. దాని ఫలితాలు మన ముందున్నాయి. ఇప్పుడు ప్రతి ఏటా నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన వ్యవసాయ ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేస్తోంది. ఇది మన రైతుల ఆదాయాన్ని పెంచుతోంది. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో భారత్ కొనసాగుతోంది. పప్పుధాన్యాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. జనపనార ఉత్పత్తిలోనూ భారత్ మొదటిస్థానంలోనే ఉంది. వరి ఉత్పత్తిలోనూ తొలి స్థానానికి భారత్ చేరుకుంది. గోధుమ ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. పత్తి, పండ్లు, కూరగాయల ఉత్పత్తిలోనూ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. చేపల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉండగా, ప్రపంచంలో అత్యధికంగా చిరుధాన్యాలను ఉత్పత్తి చేసే దేశంగా భారత్ ఉంది. ఇవి కేవలం గణాంకాలు కాదు. మన రైతు సామర్థ్యం ఎలా పెరిగిందో అవి చూపిస్తాయి.
మిత్రులారా,
భారత రైతుల సంక్షేమానికి అవసరమైన అంశం మరొకటి ఉంది. కేవలం గోధుమ, వరి, చెరకు లాంటి సాంప్రదాయ పంటలపైనే రైతులు ఆధారపడకూడదు. నేను మళ్ళీ చెబుతున్నాను. రైతు సోదరులు గోధుమ, వరి, చెరకు పంటలపై మాత్రమే ఆధారపడి ఉండకూడదు. అందుకే ఇతర పంటలు, వ్యవసాయానికి సంబంధించిన ఇతర కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇండియా గ్రూపునకు సంబంధించిన ఓ విషయం గుర్తు చేయాలనుకొంటున్నాను. ‘విప్లవం’, ‘క్రాంతి’ అనే పదాలంటే ఇండియా టుడే గ్రూపునకు ప్రత్యేక ప్రేమ. అందుకే నేను కొన్ని విప్లవాల గురించి మాట్లాడదలుచుకున్నాను.
మిత్రులారా,
హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబన దిశగా దేశం చరిత్రాత్మక అడుగులు వేసిన సమయం ఒకటి ఉంది. ఆ తర్వాత చేపట్టిన శ్వేత విప్లవం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా దేశం ఎదిగింది. ఈ ప్రయాణం మరింత వేగంగా ఎలా ముందుకు వెళుతుందో చెప్పేందుకు కొన్ని గణాంకాలను మీకు ఈ రోజు అందిస్తాను. గడచిన దశాబ్దంలో భారతదేశ పాల ఉత్పత్తి 70 శాతం మేర పెరిగింది. 70 శాతం. గుడ్ల ఉత్పత్తి కూడా 90 శాతం పెరిగింది. 90 శాతం. నీలి విప్లవం గురించి మాట్లాడుకుంటే.. భారతదేశంలో చేపల ఉత్పత్తి దశాబ్దంలో రెట్టింపు పెరిగింది. మధుర విప్లవం ద్వారా తేనెటీగల పెంపకంలో కొత్త అవకాశాలు పుట్టుకొచ్చాయి. తేనె ఉత్పత్తి సుమారు 80 వేల టన్నుల నుంచి 150 వేల టన్నుల వరకు పెరిగింది. ఉద్యాన రంగంలో సైతం భారతదేశ దిగుబడులు 280 మిలియన్ టన్నుల నుంచి 350 మిలియన్ టన్నులకు పైగా పెరిగాయి.
మిత్రులారా,
విస్తృత కోణంలో ఈ విప్లవాలన్నింటినీ మనం అనుసంధానించినప్పుడు... దేశంలో రైతులకు బహుళ ఆదాయ వనరుల కల్పన జరుగుతుంది. వ్యవసాయ భవిష్యత్తుకు ఇది చాలా అవసరం. మీకు మరో ఉదాహరణ ఇస్తాను. సోలార్ విద్యుత్ విప్లవం కూడా అలాంటి విప్లవమే. ఇది ఆహార ప్రదాతను విద్యుత్ ప్రదాతగా మార్చింది. పీఎం–కుసుమ్ పథకం ద్వారా దాదాపు 12 లక్షల సోలార్ పంపులను పంపిణీ చేశాం. ఇది రైతుల విద్యుత్ బిల్లులను తగ్గించింది. తమ వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా కూడా రైతులు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. దిగుబడితో పాటుగా ఉత్పాదకత, రైతుల లాభాలపై కూడా మేం దృష్టి సారించాం.
మిత్రులారా,
ఇటీవలే ప్రభుత్వాధినేతగా నేను 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవసాయాన్ని ఆధునికీకరించడంపై నిరంతర కృషి చేశారు. ఆ సమయంలో నేను పెద్ద స్థాయిలో వ్యవసాయ ఉత్సవాలను ప్రారంభించాను. మే, జూన్ నెలల్లో 40–45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత్లోనూ వందలాది వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, అభ్యుదయ రైతులు వాటికి హాజరు కావడం నాకు గుర్తుంది. కిసాన్ రథాలు సిద్ధం చేసిన వాటిలో ప్రయాణించేవాళ్లం. గ్రామాలకు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లేవాళ్లం. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి నేరుగా రైతులతో మాట్లాడేవాళ్లం. ఆ ప్రాంతంలో ఎలాంటి నేల ఉంది, నీటి లభ్యత ఎలా ఉంది, అక్కడ ఏ పంటలు బాగా పండుతాయి, ఎలాంటి వ్యవసాయం అవసరం వంటి ప్రతి విషయాన్ని రైతులతో నేరుగా చర్చించేవాళ్లం. శాస్త్రవేత్తల ప్రయోగశాలల్లోని విజ్ఞానాన్ని నేరుగా రైతుల పొలాలకు చేర్చాలన్నదే మా ప్రయత్నం. మరో మాటలో చెప్పాలంటే మేము ‘ల్యాబ్ టు ల్యాండ్’ అనే భావనతో ముందుకు వెళ్లాం. దానివల్ల గుజరాత్ రైతులు ఎంతగానో లబ్ధి పొందారు.
మిత్రులారా,
కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, గుజరాత్‌లో పనిచేసిన అనుభవం నాకు ఎంతో ఉపయోగపడింది. 2014లో దేశంలో కేవలం కొన్ని వందల సంఖ్యలో మాత్రమే మట్టి నమూనా పరీక్షా కేంద్రాలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 8,400కు పైగా పెరిగింది. వైద్య శాస్త్రంలో పాథాలజీ ల్యాబొరేటరీలు ఎలా విస్తరిస్తున్నాయో అదే విధంగా మట్టి నమూనా పరీక్షా కేంద్రాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పుడు దేశంలో 750కి పైగా కృషి విజ్ఞాన కేంద్రాలున్నాయి. వ్యాధుల నుంచి జంతువులను రక్షించడానికి కూడా మేం ప్రాధాన్యమిస్తున్నాం. గాలికుంటు వ్యాధి నుంచి పశువులను రక్షించడం కోసం ఎనిమిది కోట్ల మంది రైతులకు చెందిన పశువులకు ఉచితంగా టీకాలు వేశాం. కొవిడ్ సమయంలోనూ ఉచితంగా వ్యాక్సీన్లను అందించాం. ఇది అందరికీ తెలుసు. కానీ ఈ మోదీ... జంతువులకు సైతం ఉచితంగా టీకాలు వేశారు.
మిత్రులారా,
పాత ఆలోచనాధోరణితో ఉన్నవారు మన గ్రామాల్లో విస్తృత స్థాయిలో టెక్నాలజీని వినియోగించడం సాధ్యం కాదని తరచూ అనుకొంటారు. కానీ ఆ ఆలోచన తప్పని నమో డ్రోన్ దీదీలు నిరూపించాయి. ఓ సారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డ్రోన్ దీదీలతో నేను మాట్లాడాను. బహుశా జార్ఖండ్‌లోని గ్రామానికి చెందిన అమ్మాయి నాతో ‘‘ఇప్పుడు నా స్థాయి మారింది’’ అని చెప్పింది. నేను ‘‘ఎలా?’’ అని అడిగాను. దానికి ‘‘నా గ్రామమంతా నన్ను పైలట్ అంటున్నారు. నా మరుదులు నన్ను పైలట్ వదిన అని పిలుస్తున్నారు’’ అని సమాధానమిచ్చింది. చూడండి ఆత్మగౌరవం ఎలా పెరిగిందో! ఎరువులు, పురుగుమందులు జల్లడానికి నమో డ్రోన్ దీదీలు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాటి వినియోగ పరిధిని మరింత విస్తృతమవుతోంది.
మిత్రులారా,