ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్షయ వ్యాధి మరణాల తగ్గింపులో భారత్‌ సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రస్తావించిన కేంద్ర వైద్యశాఖ మంత్రి

· టీబీ ముక్త్ భారత్‌ సాధనపై దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేసిన శ్రీ జేపీ నడ్డా

· ప్రాంతీయ వ్యాప్తంగా క్షయ మరణాల తగ్గింపులో భారత్‌ చేసిన గణనీయమైన కృషిని గుర్తించిన డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా ప్రాంతం

· 2015 నుంచి భారత్‌లో క్షయ మరణాలు 38 శాతం తగ్గుదల.. ప్రపంచ సగటు తగ్గుదల 35 శాతం: డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ క్షయ నివేదిక 2026

· మెరుగైన వ్యాధి నిర్ధారణ, సకాలంలో చికిత్స, సమగ్ర రోగి సంరక్షణతో భారత్‌లో 94 శాతం క్షయ చికిత్స విజయ రేటు

· ప్రధాని శ్రీ మోదీ నాయకత్వంలో సాంకేతికత, ప్రజల భాగస్వామ్యం, రోగి కేంద్రీకృత సంరక్షణతో దేశవ్యాప్త జన ఉద్యమంగా క్షయ వ్యతిరేక పోరాటం: శ్రీ జేపీ నడ్డా

· 25 కోట్ల మందికి పైగా ప్రజలకు చేరిన క్షయ ముక్త్‌ భారత్‌ అభియాన్‌.. 11 కోట్లకు పైగా ఛాతీ ఎక్స్‌రేలు, 3 కోట్ల మాలిక్యులర్‌ పరీక్షలు

· ముమ్మర స్క్రీనింగ్‌ ద్వారా లక్షణాలు కనిపించని దాదాపు 15 లక్షల క్షయ కేసుల గుర్తింపు.. ముందస్తు రోగ నిర్ధారణ, సకాలంలో చికిత్సకు అవకాశం

నాడు పోస్టు చేయడమైనది: 13 NOV 2026 2:04PM by PIB Hyderabad

క్షయవ్యాధి (టీబీ) నిర్మూలన దిశగా భారత్‌ సాధించిన గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి శ్రీ జగత్‌ ప్రకాశ్‌ నడ్డా పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రపంచ క్షయ నివేదిక 2026 విడుదల చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2015 నుంచి భారత్‌లో క్షయ మరణాలు 38 శాతం తగ్గాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా నమోదైన 35 శాతం తగ్గుదల కంటే ఎక్కువని డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించినట్లు తెలిపారు. ఔషధాలకు స్పందించే క్షయవ్యాధి రోగుల్లో చికిత్స విజయ రేటు 94 శాతంగా నమోదైందని కూడా నివేదిక తెలిపినట్లు చెప్పారు.

ఈ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్న కేంద్ర మంత్రి.. క్షయవ్యాధి బారినపడిన ఏ ఒక్క రోగి కూడా సహాయం అందకుండా మిగిలిపోకూడదనే ప్రభుత్వ నిబద్ధతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. టీబీ ముక్త్ భారత్‌ లక్ష్య సాధన దిశగా పురోగతిని వేగవంతం చేయడంలో సాంకేతికత, ప్రజల భాగస్వామ్యం, రోగులకు సమగ్ర సంరక్షణ అందించడం ఎంతో ముఖ్యమని శ్రీ జేపీ నడ్డా పేర్కొన్నారు.

భారత్‌ సాధించిన విజయాలకు గుర్తింపుగా డబ్ల్యూహెచ్‌ఓ  ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయం (డబ్ల్యూహెచ్‌ఓ సియారో) కూడా ప్రాంతవ్యాప్తంగా క్షయ మరణాల తగ్గింపులో భారత్‌ అందిస్తున్న సహకారాన్ని గుర్తించింది. సామాజిక మాధ్యమ వేదికగా చేసిన ఒక పోస్టులో “డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా ప్రాంతంలో క్షయ మరణాల తగ్గింపులో భారత్‌ గణనీయమైన సహకారం అందిస్తోంది” అని డబ్ల్యూహెచ్‌ఓ సియారో పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ క్షయ నివేదిక 2026లో ప్రస్తావించిన భారత్‌ విజయాలకు సంబంధించి కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనను కూడా ఆ సంస్థ పంచుకుంది.

ఈ సందర్భంగా శ్రీ జేపీ నడ్డా మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌లో క్షయవ్యాధిపై పోరాటం సాంకేతికత, సమాజ భాగస్వామ్యం, రోగి కేంద్రీక‌త సంరక్షణతో కూడిన దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, అధునాతన వ్యాధి నిర్ధారణ పరీక్షలు, పోషకాహార సహాయం, సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చేట్టిన నిరంతర చర్యలు దేశంలో క్షయ నిర్మూలన ప్రయత్నాలను మరింత బలోపేతం చేశాయని ఆయన వివరించారు. 

క్షయ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ పరిధిని వివరిస్తూ.. క్షయవ్యాధి స్క్రీనింగ్‌ కార్యక్రమం ద్వారా 25 కోట్ల మందికి పైగా ప్రజలకు పరీక్షలు నిర్వహించినట్లు  కేంద్ర వైద్యశాఖ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా ఛాతీ ఎక్స్‌రేలు, 3 కోట్ల మాలిక్యులర్‌ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ప్రయత్నాల ఫలితంగా దాదాపు 15 లక్షల లక్షణాలు కనిపించని కేసులతో సహా మొత్తం 48.64 లక్షల క్షయవ్యాధి కేసులను గుర్తించినట్లు పేర్కొన్నారు. దీనివల్ల వ్యాధిని ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స ప్రారంభించేందుకు వీలుకలిగిందని తెలిపారు.

టీబీ సంరక్షణను బలోపేతం చేయడంలో, రోగులకు మద్దతును మెరుగుపరచడంలో కృత్రిమ మేధ ఆధారిత రోగ నిర్ధారణ పరీక్షలు, ని-క్షయ్ పోషణ యోజన కింద పోషకాహార సహాయం, ని-క్షయ్ మిత్రుల అంకితభావంతో కూడిన కృషిని శ్రీ నడ్డా ప్రస్తావించారు. 

ఈ విజయాలు క్షయవ్యాధి బారినపడిన ఏ ఒక్క రోగి కూడా సహాయం అందకుండా మిగిలిపోకూడదనే లక్ష్య సాధనకు తమ సంకల్పాన్ని మరింత బలపరుస్తున్నాయని కేంద్ర వైద్యశాఖ మంత్రి తెలిపారు. టీబీ ముక్త్ భారత్‌ దిశగా దేశ ప్రయాణంలో నిరంతర ప్రజా భాగస్వామ్యం, సమష్టి కృషి కీలకంగా కొనసాగుతాయని ఆయన చెప్పారు.

డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ క్షయ నివేదిక 2026 ప్రకారం, అంచనా వేసిన క్షయ మరణాల తగ్గింపులో భారత్‌ ఇప్పటివరకు ఎన్నడూ లేనంత గణనీయమైన పురోగతిని నమోదు చేసింది. 2015లో ప్రతి లక్ష జనాభాకు 28గా ఉన్న క్షయ మరణాల రేటు, 2025 నాటికి ప్రతి లక్ష జనాభాకు 18కి తగ్గింది. ఔషధాలకు స్పందించే క్షయవ్యాధి రోగుల్లో 94 శాతం చికిత్స విజయ రేటు నమోదవడం, జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీ) కింద వ్యాధి నిర్ధారణ, చికిత్స అందజేత, రోగుల పర్యవేక్షణ, సమగ్ర సహాయంలో చోటుచేసుకున్న మెరుగుదలను ప్రతిబింబిస్తోంది.

క్షయవ్యాధి కేసులను ముందస్తుగా గుర్తించడం, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్క్రీనింగ్‌, రోగి కేంద్రీకృత సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన నిరంతర చర్యలు భారత్‌ పురోగతికి దోహదపడ్డాయి. 2024 డిసెంబరులో 100 రోజుల  కార్యక్రమంగా ప్రారంభించిన క్షయ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ను ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యాధి ముప్పు ఎక్కువగా ఉన్న, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు సేవలను మరింత చేరువ చేశారు. 2026 మార్చిలో ప్రారంభించిన మరో  కార్యక్రమం కూడా వ్యాధిని ముందుగానే గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడంపై దృష్టి సారించింది.

14.97 లక్షల మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా క్షయవ్యాధిని గుర్తించడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా వ్యాధి లక్షణాలు కనిపించని వ్యక్తుల్లోనూ ముందస్తు స్క్రీనింగ్‌ ద్వారా వ్యాధి సంక్రమణను గుర్తించగలుగుతున్నట్లు ఇది నిరూపిస్తోంది. ఇలా ముందుగానే వ్యాధిని గుర్తించడం వల్ల తక్షణ చికిత్స అందించేందుకు అవకాశం లభిస్తుంది. దీని ద్వారా వ్యాధి తీవ్రత పెరగడం, ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

కృత్రిమ మేధ ఆధారిత పోర్టబుల్‌ డిజిటల్‌ ఛాతీ ఎక్స్‌రేలు, వేగవంతమైన మాలిక్యులర్‌ వ్యాధి నిర్ధారణ సాంకేతికతలు, ని-క్షయ్‌ డిజిటల్‌ వేదిక వంటి సాంకేతిక ఆవిష్కరణలు క్షయవ్యాధి స్క్రీనింగ్‌, నిర్ధారణ, చికిత్స పర్యవేక్షణను మరింత బలోపేతం చేశాయి. వీటికి తోడు ని-క్షయ్‌ పోషణ్‌ యోజన కింద పోషకాహార సహాయం, ని-క్షయ్‌ మిత్ర కార్యక్రమం ద్వారా అందించే ప్రజా మద్దతు క్షయవ్యాధికి చికిత్స పొందుతున్న వారి విస్తృత అవసరాలను తీర్చేందుకు దోహదపడుతున్నాయి.

భారత్‌లో క్షయవ్యాధిపై పోరాటంలో ప్రజా భాగస్వామ్యం కీలక అంశంగా మారింది. 2025లో 67,933 గ్రామ పంచాయతీలను క్షయ రహిత పంచాయతీలుగా ప్రకటించారు. జాతీయ క్షయ నిర్మూలన ప్రయత్నాల్లో క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం. జోష్‌ టీమ్స్‌ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, మై భారత్‌ వాలంటీర్లను ఒకచోట చేర్చి.. స్థానిక స్థాయిలో అవగాహన కల్పించడం, ప్రజలకు చేరువ కావడం, వారిని భాగస్వాములను చేయడం వంటి కార్యక్రమాలను విస్తరిస్తున్నారు. 

క్షయ వ్యాధి నిర్మూలనకు అవసరమైన కార్యక్రమాల నిధుల్లో 96 శాతం దేశీయ వనరుల నుంచే సమకూరుతుండటం భారత్‌ నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. ఇది క్షయవ్యాధిపై పోరాటానికి దేశీయంగా నిరంతరంగా నిధులు సమకూర్చడం, జాతీయ స్థాయిలో బాధ్యతాయుతంగా ముందుకు సాగడాన్ని సూచిస్తోంది. 

డబ్ల్యూహెచ్‌ఓ సియారో గుర్తింపుతో పాటు, డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ క్షయ నివేదిక 2026లోని వివరాలు క్షయ మరణాల తగ్గింపులో, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో ఈ వ్యాధిపై జరుగుతున్న పోరాటంలో భారత్‌ అందిస్తున్న సహకారాన్ని స్పష్టం చేస్తున్నాయి. వైద్య సేవల అందుబాటును విస్తరించడం, శాస్త్రీయ ఆవిష్కరణలు, కార్యక్రమాల అమలును బలోపేతం చేయడం, ప్రజల చురుకైన భాగస్వామ్యం వంటి సమష్టి ప్రయత్నాల ఫలితమే ఈ పురోగతి. 

ఈ విజయాలను మరింత ముందుకు తీసుకెళ్తూ.. క్షయవ్యాధి నివారణ, ముందస్తు నిర్ధారణ, సకాలంలో సమర్థవంతమైన చికిత్స, పోషకాహార సహాయం, ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వైద్య నిపుణులు, అభివృద్ధి భాగస్వాములు, పౌరుల సమష్టి భాగస్వామ్యంతో క్షయ రహిత భారత్‌ లక్ష్యం దిశగా దేశం ముందుకు సాగుతోంది.

***

 


(రిలీజ్ ఐడి: 2336383) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Tamil