ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యూరప్ నుంచి పోస్టల్ పార్శిల్‌లో అక్రమంగా తరలిస్తున్న 10.8 కిలోల యాంఫెటమైన్ సీజ్... చట్టబద్ధమైన పోస్టల్ వాణిజ్య మార్గాలను దుర్వినియోగం చేయాలన్న సిండికేట్ ప్రయత్నం భగ్నం

నాడు పోస్టు చేయడమైనది: 14 NOV 2026 11:34AM by PIB Hyderabad

వివిధ వాణిజ్య మార్గాలపై నిరంతర నిఘాలో భాగంగా అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) విజయవంతంగా భగ్నం చేసింది. ఈ ఆపరేషన్‌లో 10.8 కిలోల యాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకుంది. భారతదేశంలోకి అక్రమ రవాణా చేసేందుకు చట్టబద్ధమైన పోస్టల్ మార్గాలను దుర్వినియోగం చేయాలన్న మాదకద్రవ్యాల సిండికేట్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

కచ్చితమైన సమాచారం ఆధారంగా రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్‌ఐ) అధికారులు న్యూఢిల్లీలోని ఫారిన్ పోస్టాఫీసులో అనుమానాస్పద పార్శిళ్లను అడ్డగించి తనిఖీ చేశారు. యూరప్ నుంచి వచ్చిన ఈ పార్శిళ్లలో "క్లెరెన్" (దుస్తులు) ఉన్నట్లు నిర్ధారించారు. షిప్పింగ్ కార్టన్‌ను పరిశీలించగా మొదటగా సాధారణ గృహ వినియోగ దుస్తులు కనిపించాయి. అయితే, ప్యాకింగ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా డ్రగ్స్‌ను దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. కార్టన్‌లోని ప్రతివైపు రెండు చొప్పున నాలుగు వైపులా మొత్తం ఎనిమిది ప్లాస్టిక్ ప్యాకెట్లను చాకచక్యంగా దాచిపెట్టారు.

మొత్తం ఎనిమిది ప్యాకెట్ల నుంచి గులాబీ రంగులో ఉన్న పొడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని పరీక్షించగా యాంఫెటమైన్‌గా నిర్ధారణ అయింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్‌) చట్టం-1985లోని సంబంధిత నిబంధనల ప్రకారం ఈ అక్రమ రవాణాకు సంబంధించిన ఎనిమిది ప్యాకెట్లను సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణా వెనుకున్న విస్తృత వ్యవస్థను చేధించేందుకు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

నిఘా ఆధారిత చర్యలు, సరిహద్దు రవాణాపై నిరంతరం పెంచుతున్న నిఘా ద్వారా చట్టబద్ధమైన వాణిజ్యం ముసుగులో సాగుతున్న అక్రమ రవాణా వ్యవస్థలను గుర్తించి, వాటిని అడ్డుకునేందుకు, నిర్మూలించేందుకు డీఆర్‌ఐ దృఢ సంకల్పంతో ఉంది. భారతదేశ ఆర్థిక సరిహద్దులను, జాతీయ భద్రతను పరిరక్షించటంలో డీఆర్‌ఐ నిబద్ధతతో పనిచేస్తోంది.


***


(రిలీజ్ ఐడి: 2336377) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Tamil