నాడు పోస్టు చేయడమైనది:
13 NOV 2026 6:13PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహిస్తున్న 31 వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సమావేశంలో ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు ప్రసంగించారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతిని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. 2024 జూన్ నుంచి రూ. 22 లక్షల కోట్లకు పైగా విలువైన 714 పెట్టుబడి ప్రాజెక్టులను రాష్ట్రం ఆకర్షించిందన్నారు. ఇది పెట్టుబడిదారుల బలమైన విశ్వాసాన్ని, ఆర్థిక ప్రగతి వేగాన్ని ప్రతిబింబిస్తోందన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వికసిత్ భారత్-2047 లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర-2047 దార్శనికత ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ, కృత్రిమ మేధ, సెమీ కండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, ఓడరేవులు, ఏరోస్పేస్, అధునాతన తయారీ రంగాల్లో పెట్టుబడులతో పారిశ్రామిక, పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిందని తెలియజేశారు.
ఈ ఏడాది సదస్సు ఇతివృత్తం '‘నూతన ప్రపంచ క్రమాన్ని నడిపించడం - వాణిజ్యం, సాంకేతికత, విశ్వాసం' గురించి ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సాంకేతికపరమైన అవాంతరాలు, వాతావరణ మార్పులు, రూపాంతరం చెందుతున్న సరఫరా వ్యవస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్నాయని తెలిపారు. ప్రతి అనిశ్చిత సమయం కొత్త అవకాశాలను కూడా అందిస్తుందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా మారే తత్వం, ఆవిష్కరణలు, నమ్మకమైన భాగస్వామ్యాలను ప్రదర్శించే దేశాలే భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ముందంజలో ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదుగుతుందని ఉపరాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఆర్థిక సామర్థ్యం, యువత, నైపుణ్యాలు కలిగిన శ్రామిక శక్తి, ఔత్సాహిక పారిశ్రామిక వ్యవస్థ, విస్తరిస్తున్న తయారీ, సేవా రంగాల గురించి ఆయన ప్రస్తావించారు. నూతన ప్రపంచ ఆర్థిక క్రమంలో భాగస్వామిగా మాత్రమే తన స్థానాన్ని పరిమితం చేసుకోకుండా, ఆ వ్యవస్థను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలని భారత్ ఆకాంక్షిస్తోందని ఆయన అన్నారు.
మార్పులు తీసుకురావడంలో కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, అధునాతన తయారీ, డిజిటల్ వేదికలకు ఉన్న సామర్థ్యం గురించి ఉపరాష్ట్రపతి తెలియజేశారు. ఆత్మనిర్భర భారత్ అంటే ఒంటరి పోకడను అనుసరించడం కాదని, దేశీయ సామర్థ్యాలను విస్తరించుకోవడం, పోటీతత్వాన్ని పెంపొందించుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లతో మరింత బలంగా అనుసంధానమవడం అని స్పష్టం చేశారు.
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం సమిష్టి జాతీయ కృషి జరగాలని శ్రీ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే బాధ్యత కేవలం ప్రభుత్వానిది మాత్రమే కాదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి ఇచ్చిన సబ్ కా ప్రయాస్ పిలుపునకు అనుగుణంగా పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువత, అంతర్జాతీయ భాగస్వాముల చురుకైన భాగస్వామ్యం ఈ లక్ష్యసాధనకు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
చర్చల దశ నుంచి కార్యాచరణ దిశగా, అవకాశాల నుంచి విజయాల దిశగా, భాగస్వామ్యం నుంచి అందరి సంక్షేమం దిశగా పరిశ్రమ వర్గాలు ముందడుగు వేయాలని సూచిస్తూ ఉపరాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సదస్సులో పాల్గొన్న దేశాలు, అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామిక నాయకులు, సంస్థల కృషిని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు, కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధనం, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు శ్రీ నారా లోకేష్, శ్రీ టీజీ భరత్, సీఐఐ డైరెక్టర్ జనరల్ శ్రీ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ ప్రెసిడెంట్ డెసిగ్నేట్ డాక్టర్ సుచిత్రా ఎల్లా, ఇతర విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***