సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
13 NOV 2026 7:50PM by PIB Hyderabad
ఆన్లైన్లో నిర్వహిస్తున్న ‘నషా ముక్త యువ, వికసిత్ భారత్ క్విజ్’కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నవంబర్ 13, 2026 నాటికి ఈ క్విజ్‌లో మొత్తం 28,876 మంది పౌరులు పాల్గొని ఉత్సాహాన్ని కరపరిచారు. మాదకద్రవ్య రహిత భారత్‌ను నిర్మించే సమష్టి కృషి, ముఖ్యంగా యువత నుంచి పెరుగుతున్న ప్రజా భాగస్వామ్యానికి ఈ వృద్ధి నిదర్శనంగా నిలుస్తోంది.
నషా ముక్త భారత్ అభియాన్ (ఎన్ఎంబీఏ) ద్వారా ఈ క్విజ్‌ను అక్టోబర్ 26, 2026న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ప్రారంభించింది. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించటం, నషా ముక్త భారత్ ఆవిర్భావంలో పౌరులు, ముఖ్యంగా యువత క్రియాశీలకంగా భాగస్వాములయ్యేలా ప్రోత్సహించటం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
ఈ క్విజ్ పోటీలు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 25, 2026 వరకు జరుగుతాయని, దేశంలోని పౌరులందరికీ ఇందులో పాల్గొనేందుకు అవకాశముందని మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారి తెలిపారు.
ఈ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంపై ఆసక్తిగల పౌరులు 'మై భారత్' పోర్టల్ ద్వారా క్విజ్‌ను యాక్సెస్ చేసి పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఆసక్తి గల పౌరులు ఈ లింక్ ద్వారా https://mybharat.gov.in/quizzes/yuva/detail/Url9dlIwCinQVSf8lwPB9w/ పోటీల్లో పాల్గొనవచ్చని అధికారి తెలిపారు.
ఆగస్టు 15, 2020న ప్రారంభించిన 'నషా ముక్త భారత్ అభియాన్'... నివారణాత్మక విద్య, అవగాహన కల్పించటం, చికిత్స, పునరావాసం, సమాజ భాగస్వామ్యం ద్వారా మత్తు పదార్థాల డిమాండ్‌ను తగ్గించే ప్రయత్నాలను బలోపేతం చేసే లక్ష్యంతో పనిచేస్తోందని ఆయన తెలిపారు.
అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 272 జిల్లాల్లో దీన్ని ప్రారంభించగా, తర్వాత దీని పరిధిని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు విస్తరించినట్లు అధికారి వెల్లడించారు.
ఈ ప్రచారం ద్వారా 14.36 కోట్ల యువత, 11.34 కోట్ల మహిళలు సహా మొత్తం 35.89 కోట్లకు పైగా ప్రజలను చేరుకున్నట్లు అధికారి తెలిపారు. దీనివల్ల ఈ అవగాహన, విస్తరణ కార్యక్రమాల విస్తృతి దేశవ్యాప్తంగా పెద్దఎత్తున జరుగుతుందని స్పష్టమవుతుంది.
ఈ అభియాన్ ద్వారా విద్యాసంస్థల్లో 33.57 లక్షలకు పైగా కార్యక్రమాలు నిర్వహించగా, దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 755కి పైగా సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ (డీఓఎస్‌జేఈ) మద్దతుగల డీ-అడిక్షన్ కేంద్రాల వ్యవస్థ ద్వారా 39.91 లక్షల మందికి చికిత్స అందించి పునరావాసం కల్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
దేశంలో ఇప్పటివరకు తీసుకున్న నషా ముక్త ప్రతిజ్ఞల సంఖ్య 48.21 లక్షలు దాటిందని, 2 లక్షలకు పైగా నషా ముక్తి మిత్రులు నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు.
ఈ అభియాన్ ఏడో సంవత్సరంలోకి అడుగుపెట్టినట్లు అధికారి తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించటానికి, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించేందుకు, అవగాహన, నివారణకు సంబంధించిన క్రియాశీల రాయబారులుగా యువతను తీర్చిదిద్దేందుకు ఈ క్విజ్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు.
దేశాభివృద్ధిలో ఆరోగ్యకరమైన వ్యక్తులు, కుటుంబాలు, సమాజాల ప్రాముఖ్యతను గుర్తిస్తూ... 'నషా ముక్త భారత్', 'వికసిత్ భారత్' దృక్పథాన్ని ఈ కార్యక్రమం మరింత బలపరుస్తోందని ఆయన అన్నారు.
ఈ క్విజ్‌లో 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు (ఎంసీక్యూలు) ఉంటాయని, పాల్గొనేవారు 10 నిమిషాల్లోపు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని అధికారి వివరాలను వెల్లడించారు.
క్విజ్‌ను విజయవంతంగా సమర్పించిన ప్రతి ఒక్కరికీ భాగస్వామ్య ధ్రువీకరణ పత్రం అందజేస్తున్నట్లు తెలిపారు.
క్విజ్ పూర్తయిన తర్వాత పాల్గొన్నవారు సరైన సమాధానాలను తెలుసుకోవచ్చని, ఇది మాదకద్రవ్యాల నివారణపై అవగాహనను మరింత మెరుగుపరచుకునేందుకు సహాయపడుతుందని ఆయన తెలిపారు.
ఈ డిజిటల్ కార్యక్రమం ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ... మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించటం, పౌరులను, ముఖ్యంగా యువతను చైతన్యపరచటమే మంత్రిత్వశాఖ లక్ష్యమని అధికారి తెలిపారు.
డ్రగ్స్ రహిత భారత్ ఉమ్మడి లక్ష్యసాధనలో అందరూ క్రియాశీల భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. దేశంలోని పౌరులందరూ, ముఖ్యంగా యువత నవంబర్ 25, 2026లోపు 'నషా ముక్త యువ, వికసిత్ భారత్'లో విధిగా పాల్గొనాలని మంత్రిత్వశాఖ తరఫున కోరారు.
***