నాడు పోస్టు చేయడమైనది:
12 NOV 2026 7:59PM by PIB Hyderabad
“నావిగేటింగ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్: వాణిజ్యం | సాంకేతికత | నమ్మకం | ఆలోచనాత్మక నాయకత్వం” ఇతివృత్తంతో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 ఈ నెల 12–13 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా జరుగుతోంది. భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సహకారంతో... భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆతిథ్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. వాణిజ్యం, సాంకేతికత, ఆర్థిక సహకారంలో వర్ధమాన అవకాశాలపై చర్చించడానికి విధాన రూపకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, ప్రపంచ వ్యాపార దిగ్గజాలు, పెట్టుబడిదారులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకువచ్చింది.
ఈ సదస్సు ప్రారంభ సమావేశానికి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా... కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్... కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు... ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ ఈ సభలో ప్రసంగించారు.
కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టి.జి. భరత్‌లతో పాటు భారత ప్రభుత్వ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రముఖుల్లో ఉన్నారు. సాగర్ డిఫెన్స్ వ్యవస్థాపకులు, సీఈవో కెప్టెన్ నికుంజ్ పరాశర్... సీఐఐ అధ్యక్షులు, టాటా కెమికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శ్రీ ఆర్. ముకుందన్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలూ ఈ సదస్సులో పాల్గొన్నారు.
అంతర్జాతీయ వాణిజ్యం, గ్లోబల్ వాల్యూ చెయిన్స్, పటిష్ఠమైన సరుకు రవాణా వ్యవస్థలు, అధునాతన తయారీ, రక్షణ సాంకేతికత, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధ, క్వాంటం టెక్నాలజీలు, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, భవిష్యత్ రవాణా, వర్ధమాన సాంకేతికతలపై లోతైన చర్చలకు ఈ రెండు రోజుల సదస్సు వేదికగా నిలిచింది. అంతర్జాతీయ భాగస్వామ్యాల బలోపేతం, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రపంచస్థాయి తయారీ, ఆవిష్కరణలకు భారత్‌ను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి.
ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్‌ఐసీడీసీ పెవిలియన్‌ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తిలలో ఎన్‌ఐసీడీసీ అభివృద్ధి చేస్తున్న మూడు గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నోడ్‌ల పురోగతి, అభివృద్ధి గురించి ఎన్‌ఐసీడీసీ సీఈవో, ఎండీ శ్రీ రజత్ కుమార్ సైనీ వివరించారు.
దేశంలో అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పెట్టుబడి అవకాశాలను పలు కార్యక్రమాలు, డిజిటల్ వేదికల ద్వారా ఎన్‌ఐసీడీసీ పెవిలియన్ ప్రదర్శించింది. గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల అభివృద్ధి, భవ్య (భారత్ ఉద్యోగిక్ వికాస్ యోజన) పథకం, స్మార్ట్ కోల్ అనలిటిక్స్ డ్యాష్‌బోర్డ్ 'కోయ్లా శక్తి', దేశ వ్యాప్తంగా గల ధ్రువీకరించిన పారిశ్రామిక భూముల సంబంధిత అవకాశాలను పెట్టుబడిదారులు గుర్తించి, పోల్చి చూసుకోవడానికి వీలు కల్పించే ఇండస్ట్రియల్ కారిడార్ ల్యాండ్ ప్లాట్‌ఫారమ్ (ఐసీఎల్‌పీ) వంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఎన్‌ఐసీడీసీ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను సందర్శకులకు ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని కలిగించేలా 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ టూర్‌నూ ఈ పెవిలియన్‌లో ఏర్పాటు చేశారు.
శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ... 'భవ్య' పథకం ప్రాముఖ్యతను చర్చలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎదుగుతున్న ఏరోస్పేస్, డ్రోన్ తయారీ రంగాన్ని బలోపేతం చేసే సామర్థ్యం ఉన్న ఓర్వకల్లు డ్రోన్ సిటీపై శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు ప్రధానంగా దృష్టి సారించారు.
7,717 ఎకరాల్లో విస్తరించిన ఈ మూడు నోడ్‌ల మొత్తం ప్రాజెక్టు విస్తీర్ణం, రూ. 31,360 కోట్ల పెట్టుబడి సామర్థ్యం, 2 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశాలను ప్రధానంగా వివరిస్తూ... ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సామర్థ్యాన్ని ఈ పెవిలియన్ ప్రదర్శించింది. వివిధ పారిశ్రామిక కారిడార్ల కింద అభివృద్ధి చేస్తున్న ఈ మూడు నోడ్‌లను ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అనుసంధానంతో కూడిన సమగ్ర పారిశ్రామిక కేంద్రాలుగా రూపొందిస్తున్నారు. భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడం, తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడం వీటి అభివృద్ధి ప్రధాన లక్ష్యం.
తయారీ రంగం, కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లోని పెట్టుబడి అవకాశాలను ఈ ప్రదర్శనలు, చర్చల ద్వారా ఎన్‌ఐసీడీసీ ప్రధానంగా ప్రదర్శించింది. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్‌ను ఒక ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలబెట్టింది. "భారత్‌లో పెట్టుబడి పెట్టండి... ఆంధ్రప్రదేశ్‌ను మీ కొత్త చిరునామాగా మార్చుకోండి..." అనే స్పష్టమైన సందేశాన్ని పెట్టుబడిదారులకు అందించింది.
భారత్‌లో జపాన్ రాయబారి శ్రీ కీచి ఒనో మాట్లాడుతూ... నానాటికీ బలపడుతున్న భారత్-జపాన్ ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు నగరాల్లో గల 31 జపాన్ కంపెనీలు స్థానికంగా 8,000కు పైగా ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్నారు. ఉక్కు, ఫార్మాస్యూటికల్స్, పరిశుద్ధ ఇంధనం, సెమీకండక్టర్ల రంగాల్లో పరస్పర సహకారానికి గల విస్తృత అవకాశాలనూ ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టి.జి. భరత్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక ఓడరేవులు, వివిధ రంగాల్లో అందుబాటులో గల అవకాశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పెట్టుబడి ఒప్పందాలను క్షేత్రస్థాయి ప్రాజెక్టులుగా అమలు చేయడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని ఆయన తెలిపారు.
ఎన్‌ఐసీడీసీ సీఈవో, ఎండీ శ్రీ రజత్ కుమార్ సైనీ తన ప్రారంభోపన్యాసంలో... తయారీ-పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, పటిష్ఠమైన సరుకు రవాణా వ్యవస్థ, అధునాతన సాంకేతికతలు, సుస్థిర పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్ఎంఈ భాగస్వామ్యాలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో మరింత సహకారం అవసరమని పేర్కొన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో భారత్‌లో 10 ట్రిలియన్ జపనీస్ యెన్‌ల విలువైన పెట్టుబడులను ప్రోత్సహించేందుకు జపాన్ కట్టుబడి ఉందని పేర్కొంటూ... ఈ పెట్టుబడి అవకాశాలను ఆచరణాత్మక భాగస్వామ్యాలుగా మార్చాల్సిన అవసరాన్నీ ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
సదస్సుకు హాజరైన ప్రముఖులకు ఈ మూడు పారిశ్రామిక నోడ్‌ల అభివృద్ధి పురోగతిని శ్రీ సైనీ వివరించారు. కృష్ణపట్నం 50 శాతానికి పైగా, ఓర్వకల్లు సుమారు 30 శాతం, కొప్పర్తి దాదాపు 12 శాతం పనులను పూర్తి చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగాన్ని, రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న పారిశ్రామిక కేంద్రాలను రూపొందించడంలో ఎన్‌ఐసీడీసీ నిరంతర కృషిని ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
జెట్రో చెన్నై డైరెక్టర్ జనరల్ శ్రీ కియోటాకా దోహో మాట్లాడుతూ... భారత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల జపాన్ కంపెనీలకు పెరుగుతున్న ఆసక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 80 శాతానికి పైగా తమ కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్నాయని తెలిపారు. ఐసుజు మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ శ్రీ రాజేష్ మిట్టల్ మాట్లాడుతూ... జపాన్ తయారీ పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలు, నైపుణ్యాభివృద్ధి, స్థానిక సరుకు రవాణా వ్యవస్థల ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు.
ప్రొటెరియల్ ఇండియా, నిట్టన్ ఇండియా సంస్థలు ఇచ్చిన ప్రెజెంటేషన్లు పారిశ్రామిక సహకారానికి గల అపార అవకాశాలను స్పష్టం చేశాయి.
వివిధ పారిశ్రామిక కారిడార్ల వెంబడి గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయడం ద్వారా... భారత తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడానికి, పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న పారిశ్రామిక కేంద్రాలను నిర్మించడానికి ఎన్‌ఐసీడీసీ కృషి చేస్తోంది. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, భారతీయ పరిశ్రమలను అంతర్జాతీయ వాల్యూ చెయిన్‌లతో అనుసంధానించడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం.
31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026లో ఎన్‌ఐసీడీసీ భాగస్వామ్యం... తన పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టుల పురోగతిని ప్రదర్శించడానికి, అంతర్జాతీయ భాగస్వాములతో మమేకం కావడానికి, ఆంధ్రప్రదేశ్‌లోని పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి ఒక చక్కని అవకాశం కల్పించింది. ఈ ప్రయత్నాలు దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, 'వికసిత్ భారత్ @2047' లక్ష్యాన్ని సాధించాలనే భారత ప్రభుత్వ దార్శనికతకూ ఎంతగానో దోహదపడతాయి.
భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) పరిధిలోని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఐసీడీసీ) దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసే బాధ్యతను నిర్వహిస్తోంది. సమగ్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ కార్యక్రమాల ద్వారా తయారీ రంగ సామర్థ్యాన్ని పెంపొందించడం, పెట్టుబడులను ఆకర్షించడం, సుస్థిర ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం ఎన్‌ఐసీడీసీ ప్రధాన లక్ష్యం.
***