శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వదేశీ అంతరిక్ష ఆధారిత ఏఐ–ఈఎల్ఐఎన్‌టీ ఉపగ్రహ సముదాయ అభివృద్ధికి ఆస్ట్రోమ్‌తో టీడీబీ–డీఎస్‌టీ ఒప్పందం

రూ. 64.05 కోట్ల పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల (ఆర్‌డీఐ) నిధుల మద్దతు

స్వదేశీ ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్‌, కృత్రిమ మేధ ఆధారిత గ్రౌండ్‌ ప్రాసెసింగ్‌, ఉపగ్రహాల మధ్య కమ్యూనికేషన్ సాంకేతికతలను టీఆర్ఎల్–9 స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మాణం

నాడు పోస్టు చేయడమైనది: 12 NOV 2026 12:56PM by PIB Hyderabad

భారతీయ స్వదేశీ అంతరిక్ష ఆధారిత నిఘా, అధునాతన ఉపగ్రహ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగా పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల (ఆర్‌డీఐ) నిధి కింద రూ.64.05 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన మెస్సర్స్‌ ఆస్ట్రోమ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌తో కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ (డీఎస్‌టీ) పరిధిలోని సాంకేతిక అభివృద్ధి‌ బోర్డు (టీడీబీ) ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం రూ.128.11 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు జాతీయ భద్రతా అవసరాల కోసం స్వతంత్ర అంతరిక్ష ఆధారిత కృత్రిమ మేధతో కూడిన ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ-ఈఎల్ఐఎన్‌టీ) ఉపగ్రహ సముదాయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం. సాంకేతిక సంసిద్ధత స్థాయి (టీఆర్‌ఎల్‌)-4 నుంచి టీఆర్‌ఎల్‌-9 వరకు కీలక సాంకేతికతలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం. ఇందుకు ఆప్షనల్లీ కన్వర్టబుల్‌ డెట్‌ (ఓసీడీ) విధానంలో ఆర్థిక సహాయం అందించనున్నారు.

 

అంతరిక్ష ఆధారిత వ్యవస్థల వ్యూహాత్మక ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో.. నిఘా సమాచార సేకరణ, కమ్యూనికేషన్‌, డేటా ప్రాసెసింగ్‌ కోసం స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేసి, వినియోగంలోకి తీసుకురావడం మరింత కీలకంగా మారింది. అంతరిక్ష ఆధారిత ఉపగ్రహ సముదాయాలు విస్తృత భౌగోళిక ప్రాంతాలపై నిరంతర నిఘా అందించగలవు. అదే సమయంలో కృత్రిమ మేధలో వస్తున్న పురోగతి సంక్లిష్ట సమాచారాన్ని వేగంగా విశ్లేషించి, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతోంది. ఈ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అవసరాన్ని తీర్చేందుకు సమీకృత ఏఐ-ఈఎల్ఐఎన్‌టీ ఉపగ్రహ సముదాయాన్ని అభివృద్ధి చేయాలని ఆస్ట్రోమ్‌ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్‌ (ఈఎలింట్‌)పేలోడ్‌, ఏఐ ఆధారిత గ్రౌండ్‌ ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌, ఉపగ్రహాల మధ్య కమ్యూనికేషన్ లింకులు వంటి మూడు కీలక సాంకేతిక విభాగాలు ఉన్నాయి.

 

 

 

ఈ ప్రాజెక్టులో భాగంగా 50 కిలోల తరగతికి చెందిన ఏఐ-ఈఎల్ఐఎన్‌టీ సూక్ష్మ ఉపగ్రహాలను అభివృద్ధి చేసి, దశలవారీగా అంతరిక్షంలో ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. ఉపగ్రహ సముదాయ నిర్మాణంలో భాగంగా పనిచేసేలా వీటిని రూపొందించనున్నారు. ఈ వ్యవస్థ ద్వారా విస్తృత ప్రాంతాల్లో మెరుగైన పర్యవేక్షణతో పాటు పరిశీలనలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల గుర్తించిన ముఖ్యమైన ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచడానికి వీలవుతుంది. ప్రతిపాదిత వ్యవస్థలో ఈఎల్ఐఎన్‌టీ పేలోడ్‌ కీలక భాగంగా ఉంటుంది. విస్తృత ఫ్రీక్వెన్సీ పరిధిలోని సంకేతాలను గుర్తించి, విశ్లేషించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఉపగ్రహ హార్డ్‌వేర్‌కు అనుబంధంగా అభివృద్ధి చేసే కృత్రిమ మేధ ఆధారిత గ్రౌండ్‌ ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌.. ఉపగ్రహ సముదాయం నుంచి అందే సమాచారాన్ని సమర్థంగా ప్రాసెస్‌ చేసి, విశ్లేషించేందుకు దోహదపడుతుంది.

ఈ ప్రాజెక్టులో ఉపగ్రహాల మధ్య సమాచార ప్రసార మార్గ అభివృద్ధి కూడా భాగంగా ఉంది. ఉపగ్రహ సముదాయంలోని ఉపగ్రహాలు పరస్పరం సమాచారాన్ని అందజేసుకుంటూ, సమీకృత వ్యవస్థగా పనిచేయడానికి ఈ సాంకేతిక సామర్థ్యం ఎంతో కీలకం. ప్రతిపాదిత ఉపగ్రహ సముదాయ నిర్మాణాన్ని భూమికి సమీప కక్ష్యలో పనిచేసే ఉపగ్రహాల ఆధారంగా రూపొందించనున్నారు. అదనపు ఉపగ్రహాలను దశలవారీగా ప్రవేశపెట్టే కొద్దీ పరిధినీ, ఒకే ప్రాంతాన్ని తిరిగి పరిశీలించే సామర్థ్యాన్ని పెంచడం దీని లక్ష్యం. ప్రధాన వ్యవస్థలను టీఆర్‌ఎల్‌-9 స్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన సాంకేతిక అభివృద్ధి, ఇంజినీరింగ్‌, సమీకరణ, పరీక్షలు, ధ్రువీకరణ కార్యకలాపాలను ఈ కార్యక్రమం చేపట్టనుంది.

 

 

 

ఈ ప్రాజెక్టు డీప్‌ టెక్నాలజీ రంగం పరిధిలోకి వస్తుంది. దీనిలో అంతరిక్ష సాంకేతికత ఉప విభాగంగా ఉంటుంది. ఉపగ్రహ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్‌, కృత్రిమ మేధ, సురక్షిత అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్లు వంటి పలు అత్యాధునిక సాంకేతికతల సమ్మేళనంగా ఇది రూపుదిద్దుకోనుంది.

 

 

 

సాంకేతిక అభివృద్ధి బోర్డు కార్యదర్శి శ్రీ రాజేశ్‌ కుమార్‌ పాఠక్‌ మాట్లాడుతూ.. ‘‘అంతరిక్ష సాంకేతికతలో భారత్‌ సాధిస్తున్న పురోగతి.. స్వదేశీ ఇంజినీరింగ్‌ను కృత్రిమ మేధ, తదుపరి తరం సమాచార ప్రసార సాంకేతికతలతో సమ్మిళితం చేసే అధునాతన వ్యవస్థల అభివృద్ధికి కొత్త అవకాశాలను కల్పిస్తోంది. ఇటువంటి సంక్లిష్ట సాంకేతిక వేదికలను అభివృద్ధి చేయాలంటే నిరంతర ఆవిష్కరణలు, కఠినమైన ధ్రువీకరణ ప్రక్రియ, దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరం. ఆర్‌డీఐ నిధి ద్వారా దేశ వ్యూహాత్మక సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయగల అత్యాధునిక సాంకేతికతలపై పనిచేస్తున్న భారతీయ సంస్థలకు టీడీబీ మద్దతు అందిస్తోంది. ఆస్ట్రోమ్‌తో చేపట్టిన ఈ ప్రాజెక్టు దేశంలో అభివృద్ధి చెందుతున్న డీప్‌టెక్‌ రంగానికి, జాతీయ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక అంతరిక్ష ఆధారిత పరిష్కారాలను రూపొందించే సామర్థ్యం ఉందని చాటుతోంది” అని అన్నారు.

 

 

 

ఆస్ట్రోమ్‌ టెక్నాలజీస్‌ ప్రతినిధి మాట్లాడుతూ.. “ఆర్‌డీఐ నిధి కింద టీడీబీ అందిస్తున్న మద్దతు మా కృత్రిమ మేధ ఆధారిత అంతరిక్ష నిఘా కార్యక్రమానికి అవసరమైన కీలక సాంకేతికతల అభివృద్ధి, సమీకరణను వేగవంతం చేసేందుకు దోహదపడుతుంది. స్వదేశీ ఈఎల్ఐఎన్‌టీ పేలోడ్‌లు, ఏఐ ఆధారిత డేటా ప్రాసెసింగ్‌, ఉపగ్రహాల మధ్య సమాచార సాంకేతికతలను సమన్వయం చేయడం ద్వారా అంతరిక్ష, జాతీయ భద్రతా రంగాల్లో తలెత్తుతున్న కొత్త అవసరాలను తీర్చగల సమీకృత ఉపగ్రహ సముదాయ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ భాగస్వామ్యం ద్వారా ఈ సాంకేతికతలను టీఆర్‌ఎల్‌-9 స్థాయికి తీసుకెళ్లే మా ప్రయత్నాలకు మద్దతు లభిస్తుంది’’ అని పేర్కొన్నారు.

***

 


(రిలీజ్ ఐడి: 2335625) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali-TR , Tamil