నాడు పోస్టు చేయడమైనది:
12 NOV 2026 6:03PM by PIB Hyderabad
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఓ అక్రమ రవాణా ముఠా మలేషియాకు ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిర్దిష్ట నిఘా సమాచారం అందడంతో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు రంగంలోకి దిగారు. 2026 నవంబర్ 9 నుంచి 11వ తేదీ మధ్య చెన్నై పోర్టులో, నౌకలోకి ఎక్కించడానికి ముందే ఎగుమతి కంటైనర్‌ను అడ్డుకున్నారు.
“పేపర్ లామినేట్ రోల్స్” ఉన్నట్లు ప్రకటించిన ఆ కంటైనర్‌ను 2026 నవంబర్ 9 - 10 తేదీల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో, ప్రకటించిన సరుకులోని కొద్ది పరిమాణంతో పాటు కంకర రాళ్ల మధ్య దాచి ఉంచిన 12.87 మెట్రిక్ టన్నుల నాణ్యమైన ఎర్రచందనం దుంగలను అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.7.72 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 1962 కస్టమ్స్ చట్టంలోని నిబంధనల మేరకు ఎర్రచందనం దుంగలతో పాటు వాటిని దాచి ఉంచేందుకు ఉపయోగించిన ఇతర సరుకును కూడా స్వాధీనం చేసుకున్నారు.
తయారీదారు - ఎగుమతిదారుకు అందుబాటులో ఉన్న సొంతంగా కంటైనర్‌కు సీల్ వేసే సెల్ఫ్ సీలింగ్) సదుపాయాన్ని ఈ ముఠా దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఎగుమతిదారు ద్వారా సరుకు రవాణాకు ఏర్పాట్లు చేసిన ముఠా ఆ కంటైనర్‌ను మార్గమధ్యంలో ఓ ప్రైవేటు గోదాముకు తరలించింది. అక్కడ ప్రకటించిన పేపర్ లామినేట్ రోల్స్‌ను తొలగించి, వాటి స్థానంలో ఎర్రచందనం దుంగలను నింపిన అనంతరం ఎగుమతికి పంపినట్లు దర్యాప్తులో తేలింది.
గోడౌన్‌లో అధికారులు నిర్వహించిన తదుపరి సోదాలలో ఎగుమతి సరుకుగా ప్రకటించిన పేపర్ లామినేట్ రోల్స్, ఒక పారిశ్రామిక తూకం యంత్రం, అక్కడ మిగిలిపోయిన ఎర్రచందనం ఆనవాళ్లు లభించాయి. ఈ ముఠా అక్రమ రవాణాకు పాల్పడిన విధానాన్ని నిరూపించడానికి తగిన బలమైన సాక్ష్యాధారాలు ఈ సోదాలలో లభించాయి.
ఈ అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించిన ముఠాకు చెందిన ముగ్గురిని 1962 కస్టమ్స్ చట్టం నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు.
ఎర్రచందనం (టెరోకార్పస్ శాంటాలినస్) అంతరించిపోతున్న వన్యప్రాణులు, వృక్షజాల అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందం (సీఐటీఈఎస్) అనుబంధం - 2, 1972 వన్యప్రాణి (రక్షణ) చట్టంలోని షెడ్యూల్ 4 4 పరిధిలో రక్షిత జాతిగా ఉంది. భారత విదేశీ వాణిజ్య విధానం కింద దీనిని దేశం నుంచి ఎగుమతి చేయడంపై పూర్తి నిషేధం ఉంది.
చట్టబద్ధమైన ఎగుమతి మార్గాలు, వాణిజ్య వెసులుబాట్లను అడ్డుపెట్టుకుని వ్యవస్థీకృత పద్ధతిలో వన్యప్రాణుల అక్రమ రవాణాకు ఎలా పాల్పడుతున్నారో ఈ ఆపరేషన్ వెలుగులోకి తెచ్చింది. పక్కా నిఘా సమాచారంతో కూడిన కఠిన చర్యల ద్వారా ఇటువంటి అక్రమ రవాణా ముఠాల ఆటకట్టించడానికి, దేశ జీవవైవిధ్యాన్ని కాపాడటానికి డీఆర్ఐ పూర్తి నిబద్ధతతో ఉంది.
****