నాడు పోస్టు చేయడమైనది:
11 NOV 2026 7:52PM by PIB Hyderabad
విశాఖపట్నంలో భారత్-మయన్మార్ నావికాదళ విన్యాసాల (ఐఎంఎన్ఈఎక్స్-26) 8వ ఎడిషన్ నవంబర్ 10 నుంచి 14, 2026 వరకు జరుగుతుంది. ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు మయన్మార్ నావికాదళానికి చెందిన యూఎంఎస్ కింగ్ సిన్ ఫ్యూ షిన్ యుద్ధనౌక నవంబర్ 10న విశాఖపట్నానికి చేరుకుంది. ఇది భారత నావికాదళ నౌకలు ఐఎన్ఎస్ రాణా, ఐఎన్ఎస్ సుమేధాలతో కలిసి ఈ విన్యాసాల్లో పాల్గొంటోంది. ఈ విన్యాసాల ప్రారంభోత్సవం నవంబర్ 10న ఐఎన్ఎస్ రాణా నౌకలో ఘనంగా నిర్వహించారు.
సరిహద్దు దేశాలైన భారత్, మయన్మార్ల మధ్య సముద్రయాన సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఐఎన్ఎంఈఎక్స్ కీలక వేదికగా నిలుస్తుంది. వృత్తిపరమైన నైపుణ్యాలను పరస్పరం పంచుకునేందుకు, పరస్పర అవగాహనను పెంపొందించుకోవటానికి, మెరుగైన కార్యాచరణను సమన్వయం చేసుకునేందుకు ఈ విన్యాసాలు రెండు దేశాల నావికాదళాలకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
హార్బర్ దశలో వృత్తిపరమైన పరస్పర చర్యలు, విషయ నిపుణుల చర్చా వేదిక (ఎస్ఎంఈఈలు), నౌకల మధ్య పరస్పర సందర్శనలు, క్రీడా కార్యక్రమాలు, కార్యాచరణ అంశాలపై చర్చలు జరుగుతాయి. తదుపరి సముద్ర దశలో... పాల్గొనే నౌకల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన సముద్ర కార్యకలాపాలు, వ్యూహాత్మక విన్యాసాలు ఉంటాయి.
భారత్, మయన్మార్ల మధ్య చిరకాల స్నేహాన్ని, సముద్రయాన భాగస్వామ్యాన్ని ఐఎంఎన్ఈఎక్స్-26 చాటిచెబుతోంది. ఈ విన్యాసం భారతదేశ మహాసాగర్ (ప్రాంతాలవ్యాప్తంగా భద్రత, వృద్ధి కోసం పరస్పర, సమగ్ర పురోగతి) దార్శనికతకు అనుగుణంగా ఉంది. సముద్ర సహకారం పట్ల, సురక్షితమైన, స్థిరమైన ప్రాంతీయ వాతావరణం పట్ల ఉమ్మడి నావికాదళాల నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తోంది.
***