కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
11 NOV 2026 7:05PM by PIB Hyderabad
దోహాలో జరిగిన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) ప్లీనిపొటెన్షియరీ కాన్ఫరెన్స్ (పీపీ–26)లో కేంద్ర సమాచార, గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని డిజిటల్ అనుసంధానం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, సైబర్ భద్రతకు సంబంధించి భారత్ అనుసరిస్తున్న విధానాలను వివరించారు.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై జరిగిన ఉన్నతస్థాయి చర్చలో ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, సరసమైన ధరల్లో లభించేలా చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 220 కోట్ల మంది ఇంటర్నెట్ సదుపాయానికి దూరంగా ఉన్నారని పేర్కొన్న ఆయన.. గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానాన్ని విస్తరించేందుకు భారత్‌నెట్ ప్రాజెక్టుపై భారత్ సుమారు 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు.
డబ్ల్యూఎస్‌ఐఎస్ పురస్కారం పొందిన ‘సమృద్ధి గ్రామ కేంద్రాల’ గురించి కూడా కేంద్రమంత్రి ప్రస్తావించారు. ఈ కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రజలు ఆరోగ్య సేవలు, వ్యవసాయ సలహాలు, బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ ధ్రువపత్రాలను పొందవచ్చని వివరించారు. అందుబాటు ధరల్లో ఏఐ కంప్యూటింగ్ సదుపాయాలు, స్వదేశీ భాషల్లో కృత్రిమ మేధ నమూనాలు, క్వాంటం పరిశోధనలు, 100 5జీ వినియోగ నమూనా ప్రయోగశాలల ఏర్పాటులో భారత్ సాధిస్తున్న పురోగతిని కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రపంచ సాంకేతిక ప్రమాణాలు, స్పెక్ట్రమ్ విధానాల రూపకల్పనలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాధాన్యం కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మలేషియా, ఇరాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల ప్రతినిధి బృందాలతో డాక్టర్ పెమ్మసాని సమావేశమయ్యారు. సరిహద్దులు దాటి జరుగుతున్న సైబర్ మోసాలు, డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రత, క్వాంటం సాంకేతికతలో పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించారు.
డిజిటల్ మోసాలను అరికట్టడంలో భారత్ అనుభవాన్ని పంచుకుంటూ.. బ్యాంకులకు పంపిన హెచ్చరికల వల్ల రూ. 5,000 కోట్లకు పైగా విలువైన అనుమానాస్పద ఆర్థిక నష్టాలను నివారించగలిగామని ఆయన తెలిపారు.
‘‘సైబర్ ముప్పులకు సరిహద్దులు లేవు. అదేవిధంగా వాటిని ఎదుర్కొనే మన సహకారానికీ సరిహద్దులు ఉండకూడదు. పరస్పరం ఉత్తమ విధానాలను నేర్చుకోవడం వల్ల మనందరం మరింత బలోపేతం అవుతాం’’ అని ఆయన పేర్కొన్నారు.
****