సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వయో సమ్మాన్ రాష్ట్రీయ అభియాన్‌లో ‘వయో సాథీ వాలంటీర్లు’గా నమోదు చేసుకోవాల్సిందిగా పౌరులకు పిలుపు

18 ఏళ్లు, అంతకు పైబడిన పౌరులకు
ఎస్‌సీడబ్ల్యూ సమావేశ్ పోర్టల్, జీవన్ యాప్‌లలో మొదలైన రిజిస్ట్రేషన్

భిన్న తరాల మధ్య సంబంధాలను పటిష్టపరచడం,
సీనియర్ సిటిజన్ల సంరక్షణతో పాటు సద్భావనను, సామాజిక సమ్మిళితత్వాన్ని పెంపొందించడం
ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమ లక్ష్యం

నాడు పోస్టు చేయడమైనది: 10 NOV 2026 8:27PM by PIB Hyderabad

పద్దెనిమిది ఏళ్ల వయస్సు వారు, అంతకు మించిన వయోజనులను వయో సాథీ (Vayo SAATHI) కార్యక్రమంలో భాగంగా స్వయంసేవకులుగా నమోదు చేసుకోవాల్సిందిగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కోరింది. ఈ కార్యక్రమం.. ఇటీవల మొదలుపెట్టిన ‘వయో సమ్మాన్ రాష్ట్రీయ అభియాన్’లో ఓ ముఖ్య భాగం. ఇది ‘అటల్ వయో అభ్యుదయ్ యోజన’ (ఏవీవైఏవై)లో భాగంగా చేపట్టిన కార్యక్రమం. భిన్న తరాలకు చెందిన వారి మధ్య సహృదయ సంబంధాల్ని పటిష్టపరచడం ఈ కార్యక్రమ లక్ష్యం.
సీనియర్ సిటిజన్ల సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణతో పాటు వారిని సమాజ స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు పౌరులు, విద్యార్థులు, యువ వృత్తినిపుణులు, సమాజంలోని స్వచ్ఛంద సేవకులు తమ తోడ్పాటును అందించేందుకు ఒక అవకాశాన్ని ఈ కార్యక్రమం అందిస్తోంది.

image.png

సహకారం (సపోర్ట్), చైతన్యం (అవేర్‌నెస్), సహాయం (అసిస్టెన్స్), శిక్షణ (ట్రయినింగ్), ఆరోగ్యం (హెల్త్), సమ్మిళితత్వం (ఇంక్లూజన్)లకు మారుపేరుగా ‘వయో సాథీ’ (Vayo SAATHI) కార్యక్రమం నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో నమోదైన స్వచ్ఛంద సేవకులు.. సీనియర్ సిటిజన్లకు స్నేహితులుగా, మార్గదర్శకులుగా, వారథులుగా పనిచేస్తారు. దీంతో సీనియర్ సిటిజన్ల సామాజిక సమ్మిళితత్వానికి, సమగ్ర సంక్షేమానికి ఈ వాలంటీర్లు సహాయపడినట్లవుతుంది. స్వచ్ఛంద సేవకుల భాగస్వామ్యానికి గుర్తింపుగా వారికి వయో సాథీ ధ్రువపత్రాలను కూడా ఇస్తారు.
వయో సాథీ స్వచ్ఛంద సేవకులుగా నమోదు చేసుకొని ప్రతి సీనియర్ సిటిజన్‌కు ప్రాధాన్యం, గౌరవం, సహాయం లభించే ఓ  సమ్మిళిత సమాజాన్ని నిర్మించడానికి కాలాన్ని వెచ్చించడం, నైపుణ్యాలను అందించడంతో పాటు ఇతరత్రా ప్రయత్నాలతో ముందుకు రావాలంటూ మంత్రిత్వ శాఖ అర్హులైన పౌరులందరిని ప్రోత్సహిస్తోంది.
ఈ కార్యక్రమంలో చేరేందుకు ఆసక్తిని చూపే వారు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ (ఎస్‌సీడబ్ల్యూ) సింగిల్ యాక్సెస్ మెకానిజం ఫర్ ఆలల వర్టికల్స్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ అండ్ సోషల్ హార్మని (SAMAVESH) పోర్టల్‌లోని  https://seniorcitizen.dosje.gov.in/vayo-sathi  ద్వారా నమోదులు చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. వారు తరాల మధ్య సంబంధాలను పటిష్టపరచడంతో పాటు సమాజంలో సీనియర్ సిటిజన్ల చురుకైన భాగస్వామ్యాన్ని పెంపొందింప చేయాలన్న దేశవ్యాప్త కృషిలో భాగస్తులయ్యే అవకాశాన్ని అందుకొంటారని ఆయన వివరించారు.
ఆసక్తి ఉన్న పౌరులు వయో సాథీ వాలంటీర్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని గాని, లేదా జీవన్ (జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్‌మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెన్స్ నెట్‌వర్క్.. JEEVAN) మొబైల్ యాప్‌ను గాని ఉపయోగించి, ఈ కార్యక్రమంలో నమోదు చేసుకొని దీనిలో పాల్గొనవచ్చని ఆయన అన్నారు.

image.png

డిజిటల్ సేవలు, సంక్షేమ సంబంధిత సమాచారం, సాముదాయిక సహాయాన్ని అందుకోవడంలో సీనియర్ సిటిజన్లకు సాయపడేటట్లుగా స్వచ్ఛంద సేవకుల్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ఉద్దేశమని అధికారి అన్నారు. డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించడం, సైబర్ మోసాలు, ఆరోగ్యం, వెల్‌నెస్ అంశాలపై వృద్ధులలో చైతన్యాన్ని పెంచడం, వారి సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కూడా ఈ కార్యక్రమ లక్ష్యాలని ఆయన తెలిపారు.
కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఇటీవల జాతీయ రాజధానిలో జాతీయ స్థాయి వయో సమ్మాన్ రాష్ట్రీయ అభియాన్‌ను ప్రారంభించారని అధికారి వెల్లడించారు. యువతరం శక్తిని, ప్రతిభను సీనియర్ సిటిజన్ల అనుభవం, వివేకం, జ్ఞానాన్ని జోడించి భిన్న తరాలకు చెందిన వారి మధ్య సంఘీభావాన్ని బలోపేతం చేయడం ఈ ప్రచార కార్యక్రమం ఉద్దేశమని ఆయన అన్నారు.

image.png

‘5సీ’ (5C) నమూనాపై ఈ కార్యక్రమం ఆధారపడిందని ఆయన అన్నారు. అయిదు ‘సీ’లలో.. కనెక్ట్ (Connect), కన్వర్స్ (Converse), కో-క్రియేట్‌ (Co-create)తో పాటు కంటిన్యూ (Continue) భాగంగా ఉన్నాయన్నారు. వేరు వేరు తరాలకు చెందిన వారి మధ్య నిరంతర అనుబంధాన్ని నెలకొల్పడం దీని ధ్యేయమని ఆయన తెలిపారు.
ఇది యువ, వృద్ధ తరాలను సాముదాయిక వేదికలు, విద్యాసంస్థల సాయం తీసుకొని అనుభవాన్ని, కథలను పంచుకొనేందుకు, కలిసికట్టుగా కార్యకలాపాలు చేపట్టేందుకు, జ్ఞానాన్ని, నైపుణ్యాలను ఒకరికి మరొకరు ఇచ్చి పుచ్చుకొనేందుకు ప్రోత్సహిస్తుందని, సాముదాయిక నాయకత్వంలో భాగంగా ఒక నియమిత  ప్రక్రియగా ఈ విధమైన అనుబంధాన్ని కొనసాగించేటట్లు చేస్తుందని  అధికారి అన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో 12 ఇతివృత్తాలు ప్రధానంగా ఉంటాయని ఆయన తెలిపారు. వాటిలో ‘అరగంట సేపు కలిసికట్టుగా ఉండటం’, ‘నాకు నేర్పించండి- నేను మీకు నేర్పిస్తాను’ నా కథ, నా భారత్’, ‘డిజిటల్ దాదా-దాదీ / డిజిటల్ సాథీ’, ‘ఒక తరం వారి ఆరోగ్యం, సంక్షేమం’, ‘సిల్వర్ స్కిల్స్- మార్గదర్శకులుగా సీనియర్లు’ వంటివి కలిసి ఉన్నాయన్నారు.

image.png

ఈ ఇతివృత్తాలు సౌహార్దతను పెంచడం, మౌఖిక గాథలను సంరక్షించడం, డిజిటల్ వినియోగాన్ని ప్రోత్సహించడం, సైబర్ మోసాల పట్ల జాగరూకతను పెంపొందింప చేయడం, ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని ప్రోత్సహించడంతో పాటు సీనియర్ సిటిజన్లను మార్గదర్శకులుగాను, సమాజానికి విలువైన సేవలను అందించే వారుగా గుర్తింపును ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన వివరించారు.
సరళమైనవే అయినప్పటికీ ఎక్కువ ప్రభావాన్ని కనబరిచే కార్యకలాపాల ద్వారా సీనియర్ సిటిజన్ల శ్రేయస్సు కోసం పాటుపడటానికి పౌరులకు ఒక సార్థక వేదికను వయో సాథీ కార్యక్రమం అందిస్తుందని అధికారి అన్నారు. ఆయా కార్యకలాపాల్లో.. సీనియర్ సిటిజన్లతో కలసి కాలక్షేపం చేయడం, డిజిటల్ సేవలను వినియోగించుకొనేటట్లు వారికి సాయపడటం, జ్ఞానాన్ని, నైపుణ్యాలను ఒకరికి మరొకరు తెలియజెప్పుకోవడం, సాముదాయిక కార్యకలపాలలో సీనియర్ సిటిజన్లు పాలుపంచుకోవడానికి మార్గాన్ని సుగమం చేయడం వంటి విధానాలను అవలంబించనున్నారు.
పంచాయతులు, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థల ద్వారా ప్రతి గ్రామం చెంతకు, ప్రతి వీధి దగ్గరకు చేరుకోవడం ఈ ప్రచార కార్యక్రమ ధ్యేయం. ఈ ప్రక్రియలో చురుకుగా పాలుపంచుకోవాల్సిందిగా, స్వచ్ఛంద సేవకులను కూడగట్టాల్సిందిగా కుటుంబాలను, యువజన సంస్థలను, విశ్వవిద్యాలయాలను, ప్రభుత్వేతర సంస్థలను (ఎన్‌జీఓస్), నివాసితుల సంక్షేమ సంఘాలను (ఆర్‌డబ్ల్యూఏస్), కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో పాల్గొనే వారిని ఈ కార్యక్రమంలో ప్రోత్సహించనున్నారు.
వయో సమ్మాన్ రాష్ట్రీయ అభియాన్‌ను గురించి ఒక చిన్న పుస్తకాన్ని మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. ప్రచార ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే ఉద్దేశాలను, అమలు వ్యూహాన్ని, ఇతివృత్త ప్రధాన కార్యకలాపాల్ని, రాష్ట్రాలు, జిల్లాలు, సామాజిక సంస్థలు పోషించవలసిన పాత్రను ఈ పుస్తకం వివరిస్తూ, ఒక విస్తృత మార్గదర్శక ఫ్రేంవర్కును అందిస్తుంది.
వివిధ తరాల మధ్య గౌరవం, సంరక్షణ, సహభాగస్వామ్యం, సంఘీభావాలతో కూడిన ఒక బలమైన సంస్కృతిని వయో సమ్మాన్ రాష్ట్రీయ అభియాన్ ద్వారా పెంచి పోషించాలని మంత్రిత్వ శాఖ కోరుకుంటోంది. ఈ కార్యక్రమం సీనియర్ సిటిజన్లను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా  గుర్తించడానికి బదులు జ్ఞానం, సంస్కృతి, సామాజిక అనుభవాల ఖజానాగా వారిని గౌరవిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2335066) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam