ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వృత్తులు, దాని సహాయక వృత్తుల బలోపేతానికి కొత్త రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రతిపాదించిన ఎన్‌సీఏహెచ్‌పీ

ముసాయిదా నిబంధనలలో ..
తాత్కాలిక రిజిస్ట్రేషన్, నైపుణ్యాల అభివృద్ధి, నిర్దిష్ట ప్రమాణాల ద్వారా
పూర్తి స్థాయి రిజిస్ట్రేషనుకు మారేందుకు ఏర్పాట్లు

వృత్తిపరమైన అభివృద్ధి, కెరియర్ పురోగతి కోసం
అర్హత పరీక్షలు, బ్రిడ్జ్ కోర్సుల ప్రస్తావన

పారదర్శకతను, సామర్థ్యాన్ని, జవాబుదారుతనాన్ని పెంచనున్న
ఏకీకృత డిజిటల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ

ముసాయిదా నిబంధనలపై అభిప్రాయాలను 2026 డిసెంబర్ 4 కల్లా తెలియజేయాల్సిందిగా
ఆసక్తిదారు వర్గాలను కోరిన ఎన్‌సీఏహెచ్‌పీ

నాడు పోస్టు చేయడమైనది: 11 NOV 2026 9:56AM by PIB Hyderabad

దేశంలో ఆరోగ్య సంరక్షణ వృత్తులు, సహాయక వృత్తులలో నిమగ్నమైనవారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ (ఎన్‌సీఏహెచ్‌పీ) ముందడుగు వేసింది. అర్హత కల ఆరోగ్య సంరక్షణ నిపుణుల, సహాయక వృత్తి నిపుణుల తాత్కాలిక రిజిస్ట్రేషనుకు సమగ్ర నియంత్రణపూర్వక ఫ్రేంవర్క్ ఉండాలని ఎన్‌సీఏహెచ్‌పీ ప్రతిపాదించింది. దీనిలో నైపుణ్యాలకు మరిన్ని మెరుగులు దిద్దడం, సామర్థ్యాలను మదింపు చేయడంతో పాటు రెగ్యులర్ రిజిస్ట్రేషనుకు మారడానికి స్పష్టమైన పద్ధతులను కూడా ప్రస్తావించారు.

 

వృత్తి నిపుణుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరింత ఎక్కువ ఏకరూపతను, పారదర్శకత్వాన్ని, జవాబుదారుతనాన్ని ప్రవేశపెట్టడమే ప్రతిపాదిత ఫ్రేంవర్క్ ఉద్దేశం. అంతేకాదు, అర్హత కల ప్రాక్టీషనర్లకు నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం వారి వారి అర్హతలను, శక్తిసామర్థ్యాలను పెంపొందింప చేసే ఉద్దేశంతో నిర్ణీత అవకాశాలను కూడా కల్పిస్తారు.

ఈ ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణుల, సహాయక వృత్తి నిపుణుల ముసాయిదా తాత్కాలిక రిజిస్ట్రేషన్ నిబధనలు-2026 ముసాయిదాపై ప్రజలు, ఆసక్తిదారు వర్గాలు అభిప్రాయాలను తెలియజేయాలని, సూచనలు, సలహాలను ఇవ్వాలని ఎన్‌సీఏహెచ్‌పీ విజ్ఞప్తి చేస్తోంది. ముసాయిదా నిబంధనలను ‘నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ చట్టం -2021’ను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు.

 

వృత్తినిపుణుల రిజిస్ట్రేషన్, కెరియర్ అడ్వాన్స్‌మెంటుతో ముడిపడిన వ్యవస్థీకృత దృష్టికోణం

అర్హత కల ఆరోగ్య సంరక్షణ వృత్తినిపుణుల, సహాయక వృత్తి నిపుణుల తాత్కాలిక రిజిస్ట్రేషనుకు పారదర్శక, ప్రమాణీకృత యంత్రాంగాన్ని ఎన్‌సీఏహెచ్‌పీ చట్టం-2021 నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం ప్రతిపాదిత నిబంధనల ముఖ్యాంశాల్లో ఒకటి.

 

ఈ ఫ్రేంవర్కులో నిర్దేశిత అర్హత ప్రమాణాలు, అధికార పత్రాలను సరిచూడటం, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన స్పష్టమైన ప్రక్రియలను చేర్చారు. దీంతో వృత్తి నిపుణుల గుర్తింపును చట్టపరమైన అవసరాలు, పాత్రత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టేందుకు అవకాశం లభించనుంది.

మరీ ముఖ్యంగా అర్హులైన, తాత్కాలిక రిజిస్ట్రేషనును పూర్తి చేసిన వృత్తినిపుణులకు నిర్ధారిత బ్రిడ్జ్ కోర్సు, పర్యవేక్షణ పూర్వక క్లినికల్ ట్రయినింగులతో పాటు, అవసరమైతే కనీస అర్హత పరీక్షలలో పాల్గొనేందుకు అవకాశాన్ని ప్రతిపాదిత నిబంధనలు కల్పించనున్నాయి. దీంతో వారు రెగ్యులర్ రిజిస్ట్రేషన్ నిబంధనలను నెరవేర్చే విధంగా తమ సామర్థ్యాన్ని పెంపొందించుకొనేందుకు ఆస్కారం ఉంటుంది.

నిరంతర ప్రాతిపదికన వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవడం, కెరియర్లో పురోగతికి అవకాశాలను కల్పించడంతో పాటు సహాయక, ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను మెరుగుపరచడం ఈ యోగ్యతాధారిత విధానం లక్ష్యం.

వృత్తిపరమైన ప్రమాణాలను, ఆరోగ్య సంరక్షణ నాణ్యతను పటిష్టపరచడం

ప్రతిపాదిత ఫ్రేంవర్కులో నైపుణ్యాభివృద్ధి, వృత్తిపరమైన సామర్థ్యంతో పాటు నియంత్రణ పూర్వక జవాబుదారుతనానికి పెద్దపీట వేశారు.

రెగ్యులర్ రిజిస్ట్రేషన్ దిశగా పురోగమించడానన్ని నిర్దిష్ట విద్యార్హతలు, యోగ్యతతో ముడిపెట్టడం ద్వారా.. నాణ్యమైన సేవలను అందించడానికి అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాలను, క్లినికల్ సామర్థ్యాలను సహాయక, ఆరోగ్య సంరక్షణ వృత్తి నిపుణులు సమకూర్చుకొనేటట్లు వారిని ప్రోత్సహించే ధ్యేయంతో ఈ నిబంధనల్ని రూపొందించారు.

మరింత నైపుణ్యం కల, సంఘటిత, వృత్తిపరంగా బాధ్యత కల సిబ్బందిని తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమం తోడ్పడగలదని భావిస్తున్నారు. రోగి సురక్షను, ఆరోగ్యసేవల నాణ్యతను మరింత పటిష్టపరుస్తుందని కూడా ఆశిస్తున్నారు.

దక్షతతో పాటు పారదర్శకత్వాన్ని సూచించే డిజిటల్ రిజిస్ట్రేషన్

 

దరఖాస్తుల సమర్పణ, అర్హత పత్రాలను సరిచూసే ప్రక్రియ, అర్హతల మదింపు, తాత్కాలిక రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాల జారీని సువ్యవస్థితం చేయడానికి ఉద్దేశించిన ఒక ఏకీకృత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిబంధనల ముసాయిదా రూపకల్పనలో లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

తాత్కాలిక రిజిస్ట్రేషనును అందుకున్న అర్హులైన వృత్తి నిపుణులకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ విశిష్ట గుర్తింపు సంఖ్యను (పీఆర్ యూఐడీ) ఇస్తారు. ఇది వారు వ్యవస్థాగత గుర్తింపును పొందారని, నియంత్రణపూర్వక పర్యవేక్షణలో ఉన్నారని తెలియజేస్తుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియలను సరళతరం చేయడం, అందుబాటును మెరుగుపరచడం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య మరింత పారదర్శకతను, దక్షతను, ఏకరూపతను ప్రోత్సహించడం డిజిటల్ వ్యవస్థ లక్ష్యాలుగా ఉన్నాయి.

ప్రతిపాదించిన నిబంధనల్లోని ముఖ్యాంశాలు

ముసాయిదా నిబంధనలలో:

     • ప్రమాణీకరించిన అర్హత ప్రాతిపదికలు, తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియలు.

     • ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయడం, వివరాలను సరిచూడటం, విశిష్ట గుర్తింపు సంఖ్యలతో కూడిన రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలను జారీ చేయడం.

     • తాత్కాలిక రిజిస్ట్రేషనుకు సంబంధించిన చెల్లుబాటు గడువు, విస్తరణ, సమాప్తి, అపీలు చేసుకోవడానికి సంబంధించి స్పష్టమైన నిర్వచనాన్ని జతపరిచిన నిబంధనలు.

     • వర్తించే చోటల్లా, నైపుణ్యాభివృద్ధికి ఉద్దేశించిన బ్రిడ్జ్ కోర్సులు, యోగ్యతా మూల్యాంకనం, అర్హత పరీక్షల నిర్వహణకు అవకాశాలు.

     • వృత్తి నిపుణులలో నైపుణ్యాభివృద్ధికి గాన పర్యవేక్షణ సహిత క్లినికల్ ట్రయినింగ్, వ్యవస్థాగత అవసరాలను నెరవేర్చడం

     • ముందుగానే నిర్ధారించిన షరతులను నెరవేర్చడానికి లోబడి, తగిన కేంద్రీయ లేదా రాష్ట్ర వారీ రిజిస్టర్లో రెగ్యులర్ రిజిస్ట్రేషన్ దిశగా మార్పునకు ఆస్కారం.. వీటికి చోటు కల్పించారు.

పారదర్శక, యోగ్యత ఆధారిత పక్కా రిజిస్ట్రేషన్ వ్యవస్థకు రూపకల్పన చేయడం ఈ నిబంధనల ప్రధానోద్దేశం. అలా నెలకొల్పే వ్యవస్థ ఆరోగ్య సంరక్షణ రంగ ప్రమాణాలను పరిరక్షిస్తూ, వృత్తినైపుణ్యాభివృద్ధికి దోహదం చేస్తుందని ఆశిస్తున్నారు.

 

2026 డిసెంబర్ 4 కల్లా స్పందనను తెలపాల్సిందిగా ఆసక్తిదారు వర్గాలను కోరిన ఎన్‌సీఏహెచ్‌పీ

పారదర్శక, భాగస్వామ్యపూర్వక నిబంధనల రూపకల్పన విషయంలో ఎన్‌సీఏహెచ్‌పీ తన నిబద్ధతను చాటింది. దీనిలో భాగంగా, సహాయక, ఆరోగ్యసంరక్షణ రంగ వృత్తినిపుణులను, ప్రొఫెషనల్ అసోసియేషన్లను, విద్యాసంస్థలను, రాష్ట్ర సహాయక-ఆరోగ్యసంరక్షణ కౌన్సిళ్లను, ఆరోగ్యసంరక్షణ సంస్థలను, నిపుణులను, సాధారణ ప్రజలను అభిప్రాయాలు, సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలియజేయవలసిందిగా కోరారు.

ముసాయిదా నిబంధనలను ఎన్‌సీఏహెచ్‌పీ అధికారిక వెబ్‌సైట్ https://ncahp.abdm.gov.in/ లో అందుబాటులో ఉంచారు.

ఆసక్తిదారు వర్గాలు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను ncahp.regulations@ncahp.mohfw.gov.in కు 2026 డిసెంబర్ 4వ తేదీ లోపల సమర్పించవచ్చును.

అందిన సూచనల్ని నిబంధనలను ఖరారు చేసేటప్పుడు లెక్కలోకి తీసుకొంటారు.

ఈ కార్యక్రమం ఇప్పటి కన్నా ఎక్కువ పారదర్శకమైన, సమ్మిళితమైన, యోగ్యత ఆధారిత నియంత్రణ ప్రధానమైన విస్తారిత అనుబంధ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా వేసిన కీలక ముందంజ అని చెప్పాలి. దీంతో వృత్తినిపుణుల ఉన్నతికి ప్రోత్సాహం లభిస్తుంది. దేశంలో మార్పులకు లోనవుతున్న ఆరోగ్యసంరక్షణ రంగ అవసరాల్ని తీర్చడానికి సంబంధిత వృత్తినిపుణులను తగిన విధంగా తీర్చిదిద్ది, సన్నద్ధం చేయడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.

****


(రిలీజ్ ఐడి: 2335017) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , Gujarati , हिन्दी , Bengali , Assamese , Tamil , Kannada