సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దిల్లీ హాట్‌లో ‘2026 శిల్ప్ సమాగమ్ మేళా’.. రూ.55.46 లక్షలను మించిన విక్రయాలు

చేతివృత్తి కళాకారుల పనితనం పట్ల ప్రజల్లో ఉత్సాహపూర్వక స్పందన..

పెరుగుతున్న మార్కెట్ అవకాశాలకు ఇది ఒక సంకేతం

భారతీయ సాంప్రదాయిక హస్తకళలకు, సాంస్కృతిక వైవిధ్యానికి, సమ్మిళిత ఔత్సాహిక పారిశ్రామికత్వాలకు అద్దం పట్టిన మేళా

7 ఇతివృత్త ప్రధాన రంగాలలో 130 కన్న ఎక్కువ స్టాళ్లు..

కొలువుదీరిన హస్తకళలు, చేనేత ఉత్పాదనలు, సాంప్రదాయిక వస్త్రాలు, స్వదేశీ కళారూపాలు

మేళాను సందర్శించిన కేంద్ర మంత్రులు, సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి..

చేతివృత్తుల కళాకారులతో మాటామంతీ

నాడు పోస్టు చేయడమైనది: 09 NOV 2026 8:51PM by PIB Hyderabad

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ‘2026 శిల్ప్ సమాగమ్ మేళా’ దేశ రాజధానిలోని ఐఎన్ఏ బజారుకు ఎదురుగా ఉన్న దిల్లీ హాట్‌లో కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని 15 రోజుల పాటు నిర్వహిస్తారు. భారతదేశ సుసంపన్న సాంప్రదాయిక హస్తకళలనూ, సాంస్కృతిక వారసత్వాన్నీ, ఔత్సాహిక పారిశ్రామికత్వ స్ఫూర్తినీ ప్రతిబింబించే చైతన్యవంత వేదికే ఈ మేళా.

 

ఇది ఈ నెల 15 వరకు అందుబాటులో ఉంటుంది. షెడ్యూల్డు కులాలు, ఇతర వెనుకబడిన వర్గాలు, పారిశుధ్య కార్మికులు, దివ్యాంగ చేతివృత్తి కళాకారులు, లబ్ధిదారులు రూపొందించిన వస్తువులను, కళారూపాలను అనేక మంది ఎదుట ప్రదర్శించి, విక్రయించేందుకు ఈ మేళా ఒక అవకాశాన్ని అందిస్తోంది.

శిల్ప సమాగమ్ మేళాను మంత్రిత్వశాఖ 2022వ సంవత్సరం నుంచి నిర్వహిస్తోంది. ఈ మేళాలతో, 1,000 మందికి పైగా కళాకారులకు తమ ఉత్పాదనలను ప్రదర్శించడంతో పాటు వాటిని విక్రయించడానికి వేదికలు అందుబాటులోకి వచ్చాయి. ఆ కళాకారుల్లో షెడ్యూల్డు కులాలు, ఇతర వెనుకబడిన వర్గాలు, పారిశుధ్య కార్మికులతో పాటు దివ్యాంగ కళాకారులు కూడా ఉన్నారు.

 

స్వతంత్రోపాధికల్పనను ప్రోత్సహించడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు దన్నుగా నిలవడం, లబ్ధిదారు సమాజాలకు సామాజికంగా, ఆర్థికంగా సాధికారతను కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యాలు.

 

రెండు వారాల పాటు సాగే ఈ మేళాను ‘ప్రకాశ్ అవుర్ పరంపరా - జ్యోతి సే జ్యోతి జలాయేః’’ (వెలుగు మరియు సంప్రదాయం - ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగిద్దాం) ఇతివృత్తం ప్రధానంగా ఏర్పాటు చేశారు. ఏడు విశిష్ట అంశాల ద్వారా భారతదేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్నీ, సంప్రదాయ హస్తకళల్నీ ఒకే వేదికలో ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడు విశిష్ట అంశాలు ఇవీ.. ‘కళా ఆంగన్’, ‘ప్రకాశ్ చౌక్’, ‘పూజా పాఠ్’  ‘సజావట్ బాజార్’, ‘ఘరానా’, ‘స్వాద్ చౌక్‌’లతో పాటు ‘మంచ్’. సందర్శకులకు భారతదేశ కళాత్మక, సాంస్కృతిక, వంటలకు సంబంధించిన వివిధత్వాన్ని తెలుసుకొనే అవకాశాన్ని ఇవి అందిస్తున్నాయి.

మేళాను మొదలుపెట్టినప్పటి నుంచి అమ్మకాలు ఉత్సాహజనకంగా ఉన్నాయని మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది సందర్శకుల్లో వ్యక్తమవుతున్న ఉత్సాహపూర్వక స్పందనను, లబ్ధిదారు సమాజాలు తయారుచేసిన వస్తువుల పట్ల ప్రశంసలు రోజురోజుకు పెరుగుతున్న తీరును తెలియజేస్తోంది.

 

ఈ మేళాలో నాలుగు కార్పొరేషన్లు కూడా పాలుపంచుకుంటున్నాయి. అవి.. నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్‌స్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్‌డీసీ), నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ), నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ), నేషనల్ దివ్యాంగ్‌జన్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌డీఎఫ్‌డీసీ). ఈ కార్పొరేషన్లు ఈ నెల 1 నుంచి 8వ తేదీల మధ్య సుమారు రూ.55.46 లక్షల అమ్మకాలు సాధించాయి.

 

మేళాలో పెట్టిన వస్తువులకు సానుకూల స్పందననూ, దీనిలో పాల్గొంటున్న కళాకారులకు మార్కెట్ అవకాశాలు అంతకంతకు పెరుగుతున్న తీరునూ ఈ విక్రయాల గణాంకాలు తెలియజేస్తున్నాయి.

లబ్ధిదారులకు దుకాణాల్ని ఉచితంగా ఇచ్చీ, వారి ఉత్పాదనలను మేళా స్థలం వద్దకు చేరవేసుకోవడానికి తగిన సౌకర్యాల్నికల్పించీ, రవాణా ఖర్చును భరించీ, దిన భత్యాలను చెల్లించీ వారు మేళాలో పాల్గొనే ప్రక్రియను మంత్రిత్వశాఖ సుగమం చేసింది.

మేళాలో 130 కన్న ఎక్కువ స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటిలో హస్తకళలు, చేనేత ఉత్పాదనలు, సాంప్రదాయిక వస్త్రాలు, పండుగ వేళల్లో ఉపయోగించే అలంకరణ వస్తువులు, దీపాలు, ఇంటిని అలంకరించేందుకు ఉపయోగించే సామగ్రి, ఇవి కాక ఇతర స్వదేశీ ఉత్పాదనలను ప్రదర్శిస్తున్నారు.

 

చేతివృత్తుల కళాకారులకు, లబ్ధిదారులకు వినియోగదారులతో నేరుగా భేటీ అయ్యేందుకు, తమ మార్కెట్టు పరిధిని విస్తరింపచేసుకొనేందుకు, తమ ఔత్సాహిక పారిశ్రామికత్వ సామర్థ్యాల్ని బలోపేతం చేసుకొనేందుకు ఈ ప్రదర్శన ఒక సులభతర మార్కెటింగ్ వేదికను సమకూర్చింది.

అలాగే చేతివృత్తుల కళాకారులు  ‘భారత్ ట్యూలిప్’ వంటి కార్యక్రమాల ద్వారా తమ మార్కెట్ లభ్యతను విస్తరింపచేసుకొనేందుకు ఈ మేళా తగిన అవకాశాన్ని అందిస్తోంది. ఇది వారిని ఎలక్ట్రానిక్ కామర్స్ (ఈ-కామర్స్) వేదికలతో జతపరుస్తోంది. దీనికి అదనంగా, ‘పర్పుల్ ఫెస్ట్’ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇవి దివ్యాంగజనుల సృజనాత్మకతనూ, శక్తియుక్తులనూ వెలికితీసి వారు సమాన అవకాశాలను అందుకొనేందుకు మార్గాన్ని సుగమం చేస్తున్నాయి.

 

మేళాను కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్‌దాస్ అఠావలే, కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీమతి నిముబెన్ జయంతీభాయి బంభానియా, సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ సుధాంశ్ పంత్‌, తదితర సీనియర్ అధికారులు చూశారు.

 

ఉన్నతాధికారులు ప్రదర్శనలోని వివిధ స్టాల్స్‌ను సందర్శించి, సాంప్రదాయిక హస్తకళారూపాలను మెచ్చుకొన్నారు. ప్రదర్శనలో పాలుపంచుకున్న కళాకారులతో వారు మాట్లాడారు. సమ్మిళిత ఔత్సాహిక పారిశ్రామికత్వాన్నీ, ఆర్థిక సాధికారతనీ, ఇంతకాలం ఆదరణకు నోచుకోని వర్గాలకు దీర్ఘకాలిక ప్రాతిపదికన ఉపాధికల్పన అవకాశాల్నీ ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.

 

ప్రదర్శన స్థలం వద్ద ప్రతి రోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇవి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వేరువేరు రాష్ట్రాల కళాకారులు, బృందాలు చూడచక్కని జానపద నృత్యాలను, సాంప్రదాయిక సంగీతాన్ని, ప్రాంతీయ కళారూపాలను కళ్లకు కడుతున్నారు. చూపరులు భారతదేశలోని బహుళ విధ సాంస్కృతిక రూపాల తీరుతెన్నులను తెలుసుకొనేందుకు ఈ ప్రదర్శనలు వీలు కల్పిస్తున్నాయి. దీంతో ప్రదర్శనస్థలిలో ఉత్సవ వాతావరణం నెలకొంటోంది. ప్రాంతీయ సాంస్కృతిక మార్పిడికి ప్రోత్సాహం కూడా లభిస్తోంది.

 

పౌరులు, కుటుంబాలు, యువ సందర్శకులు ఉత్సాహంగా మేళాకు తరలివస్తున్నారు. దీంతో వారు వివిధ సాంప్రదాయిక ఉత్పాదనల గురించి అవగాహనను ఏర్పరుచుకోగలుగుతున్నారు. మేళాలో పాల్గొంటున్న చేతివృత్తి కళాకారుల నైపుణ్యాన్ని సందర్శకులు ప్రశంసిస్తూ, ఔత్సాహిక పారిశ్రామికత్వం, ఆర్థిక సాధికారత, స్వయంసమృద్ధి సాధన దిశగా వారు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతును తెలుపుతున్నారు.

మేళాకు వస్తున్న సామాన్యులు దీనిలోని వైవిధ్యాన్ని ఆస్వాదించడంతో పాటు, భారతదేశ ఘన సాంస్కృతిక వారసత్వాన్ని గురించి కూడా తెలుసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా సమ్మిళిత, స్వయంసమృద్ధ భారత్ లక్ష్య సాధనకు తోడ్పడుతున్న చేతివృత్తి కళాకారుల, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వెన్నంటి నిలుస్తున్నారు.

***


(రిలీజ్ ఐడి: 2334632) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Tamil