ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో భద్రతా దళాలతో జరిగిన సమావేశంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 08 NOV 2026 2:53PM by PIB Hyderabad

భారత్ మాతాకీ జై.

భారత్ మాతాకీ జై.

భారత్ మాతాకీ జై.

నా ప్రియమైన దేశవాసులారా,

ఈ రోజు, దేశవ్యాప్తంగా, ప్రపంచం నలుమూలలా కోట్లాది మంది భారతీయులు పవిత్ర దీపావళిని జరుపుకొంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇది కుటుంబ సభ్యులతో, ప్రియమైనవారితో జరుపుకొనే ఒక గొప్ప పండగ. దీపావళిని జరుపుకోవడానికి నేను కూడా మీ మధ్యకు వచ్చాను. సరిహద్దుల్లో ఉన్నా, దేశం లోపల ఉన్నా దేశాన్ని రక్షించే, దేశానికి కాపలాగా నిలిచే మీరందరూ, భరతమాత వీరపుత్రులు, పుత్రికలు. మీరంతా నా సొంతవారు. నా కుటుంబ సభ్యులు. హిమాలయాల ఒడిలోని కార్గిల్ నుంచి లెప్చా వరకు, సముద్ర తీరంలోని సిర్ క్రీక్ నుంచి సముద్ర జలాల్లోని ఐఎన్ఎస్ విక్రాంత్ వరకు, మన వీర సైనికులతో గడిపిన ప్రతి దీపావళి నాకు చిరస్మరణీయమే.

ధైర్యవంతులైన నా సైనికులారా,

ఈసారి మీ అందరి మధ్య, బస్తర్ అడవుల్లో దీపావళి జరుపుకోవడానికి వచ్చాను. ఒకప్పుడు నక్సలైట్ తీవ్రవాదం రాజ్యమేలిన ఈ నేల ఇది. మీ త్యాగం, అంకితభావం, పట్టుదల వల్ల ఇప్పుడు నక్సలైట్ బాధ నుంచి విముక్తి పొంది, అభివృద్ధి పథంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది.

మిత్రులారా,

ఈ 2026 దీపావళి నిజంగా చాలా ప్రత్యేకమైనది. నలభై, యాభై ఏళ్ల తర్వాత మీ అందరికీ ఇలాంటి దీపావళి వచ్చింది. నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదంపై దేశం దశాబ్దాలుగా సాగించిన పోరాటంలో విజయం సాధించిన అనంతరం వచ్చిన తొలి దీపావళి ఇదే. నక్సలిజం నుంచి దేశంలోని ప్రతి జిల్లా విముక్తి పొందిన అనంతరం వచ్చిన తొలి దీపావళి ఇది. కోట్లాది మంది పౌరులు నక్సలిజం భయాన్ని అధిగమించిన తర్వాత వచ్చిన మొదటి దీపావళి ఇది. ఇది ఒక అసాధారణ విజయం. ఈ ఘనతలో అధిక భాగం మీకే, మీలాంటి లక్షలాది మంది ధైర్యవంతులకు, మన సైనికులకు, కొడుకులకు, కూతుళ్లకు, భద్రతా సిబ్బందికి చెందుతుంది. అందుకే ఈ రోజు నేను మీతో కలిసి దీపావళి జరుపుకోవడానికి వచ్చాను. 140 కోట్ల మంది భారతీయుల తరపున, మీ త్యాగానికి, అంకితభావానికి, సేవా స్ఫూర్తికి కృతజ్ఞతలు తెలియజేయడానికి కూడా నేను వచ్చాను.

మిత్రులారా,

‘ఆభ్యంతరం, భయం రక్ష్యం, ఆసారం బాహ్యతో భయం’’ అని మన పూర్వీకులు చెప్పారు. ఒక దేశం అంతర్గత భద్రత బలంగా ఉన్నప్పుడు, వెలుపలి శత్రువులు పెద్దగా హాని చేయలేరు. కానీ అంతర్గత భద్రత బలహీనపడినప్పుడు, బాహ్య శత్రువులు కూడా సవాలు విసరడం ప్రారంభిస్తారు అని దీనర్థం. అందుకే సరిహద్దుల్లో మన సాయుధ దళాలు పోషించే పాత్ర, దేశంలో మీ భద్రతా సిబ్బంది పోషించే పాత్ర ఒకటే. దేశ ఐక్యత, సమగ్రత కోసం మీరు లెక్కలేనన్ని త్యాగాలు చేశారు. అపరిమితమైన అంకితభావాన్ని ప్రదర్శించారు. అంతర్గత భద్రతను పరిరక్షించడంలో నిమగ్నమైన భద్రతా దళాలు, మన సీఆర్‌పీఎఫ్, కోబ్రా, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ప్రతి జవాన్, ఎస్‌ఎస్‌బీ, ఐఆర్‌బీ, రాష్ట్రాల పోలీసు సిబ్బంది, బస్తర్ ఫైటర్స్ లాంటి ప్రత్యేక దళాల కమాండోలు, మన మహిళా యోధులు, మీ అందరి సేవకు ఈ దేశం రుణపడి ఉంది. కోట్లాది పౌరులు మిమ్మల్ని చూసి గర్విస్తున్నారు. ఈ కృతజ్ఞత, ఆప్యాయతా భావంతోనే మీరు ఎక్కడ పహారా కాస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో మోహరించిన మన సైనికులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

మావోయిస్టు తీవ్రవాదం, నక్సలిజంపై జరిపిన ఈ పోరాటం అంత సులభమైనది కాదు. ఒకానొక సమయంలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాల్లోని 230కి పైగా జిల్లాలు నక్సలిజం ప్రభావానికి గురయ్యాయి. సూర్యాస్తమయం తర్వాత ఈ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయేది. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడం అసాధ్యమయ్యేది. ఈ నక్సలైట్లు ప్రజల ఓటు హక్కును కూడా లాక్కున్నారు. బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, దేశంలోని చాలా భాగం వామపక్ష తీవ్రవాద ప్రభావానికి గురయింది. వేలాది గ్రామాలు, కోట్ల మంది ప్రజలు ఈ వలలో చిక్కుకుపోయారు. ఒక్క సంవత్సరంలోనే రెండు వేల నక్సలైట్ దాడులు జరిగాయి. ఓ సారి గుర్తు తెచ్చుకోండి. 2010లో సమీపంలోని దంతెవాడలో నక్సలైట్లతో జరిగిన ఎదురుకాల్పుల్లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అదే ఏడాది దంతెవాడలో జరిగిన మరో ఘటనలో 44 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేల మన వీర సైనికుల రక్తంతో తడిసి ముద్దయింది. అయినా రాజభవనాల్లో నివసిస్తున్న ఆ విశేషాధికారం కలిగిన నాయకులు ఎన్నడూ బాధపడలేదు. వారి కళ్ళ నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. ఇలాంటి దాడులు పదేపదే జరిగాయి. ఈ పరిస్థితి దశాబ్దాల పాటు కొనసాగింది. ఈ కాలంలో ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే వెయ్యికి పైగా భద్రతా సిబ్బంది తమ ప్రాణత్యాగం చేశారు. ఐఈడీ పేలుళ్లలో చాలా మంది సైనికులు తమ కాళ్లూచేతులు కోల్పోయారు. 2004 నుంచి 2013 వరకు గణాంకాలను పరిశీలిస్తే ప్రతి సంవత్సరం మరణించిన నక్సలైట్ల సంఖ్య కంటే ఎక్కువ మంది సైనికులు అమరులయ్యారు. నక్సలైట్ సంస్థల నాయకులు దీనిని తమ విజయంగా భావించి సంబరాలు చేసుకున్నారు. దురదృష్టవశాత్తూ ఆనాటి ప్రభుత్వాలు నక్సలిజాన్ని ఒక నయంకాని వ్యాధిగా అంగీకరించి దానిని పట్టించుకోకుండా వదిలేశాయి. నా గిరిజన కుటుంబాలు తమ విధి మీద ఆధారపడి జీవించాల్సి వచ్చేది. ఇదిలాగే నిరంతరం కొనసాగుతుందని, బుల్లెట్లు దూసుకుపోతూనే ఉంటాయని, జవాన్లు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారని, అమాయక పౌరులు నరకం అనుభవిస్తూనే ఉంటారని అందరూ నిశ్చితాభిప్రాయానికి వచ్చారు.

మిత్రులారా,

‘‘పనులు ఇలాగే జరుగుతాయి’’ అనే ధోరణితో ఏ దేశమూ విజయం సాదించలేదు. ఒక దేశాన్ని ముందుకు నడిపించాలంటే... దాని శత్రువులను దృఢ సంకల్పం, ధైర్యం, స్పష్టమైన వ్యూహంతో అణచివేయాలి. ఈ విషయంలో దేశంలో కొరవడిన రాజకీయ సంకల్పాన్ని 2014లో పునరుద్ధరించాం. మాతృభూమికి సేవ చేసే అవకాశాన్ని ఈ ప్రధాన సేవకుడికి మీరు ఇచ్చారు. 2014 తర్వాత పరిస్థితుల్లో, గణాంకాల్లో మార్పులు రావడం మనం చూశాం. కొన్ని సంవత్సరాల పాటు సంవత్సరాలుగా, చనిపోయిన నక్సలైట్ల సంఖ్యతో పోలిస్తే అమరులైన భద్రతా సిబ్బంది సంఖ్యపై చర్చలు జరుగుతూ వచ్చాయి. కానీ 47 సంవత్సరాల తర్వాత తొలిసారిగా, గత ఏడాది కాలంలో విధి నిర్వహణలో ఒక్క సీఆర్పీఎఫ్ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోలేదు. ఇది దేశం అనుసరిస్తున్న సరైన విధానాలు, దృఢ సంకల్పం సాధించిన విజయం. ఇది మీ శౌర్యం, మీ ధైర్యం, మీ సంయమనం సాధించిన గెలుపు. మళ్ళీ చెబుతున్నాను, ఇది మీ శౌర్యం, మీ ధైర్యం, మీ సంయమనం సాధించిన విజయం.

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

వీరులైన సైనికులకు విజయం కలుగుగాక!

అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం మన పోలీసు సిబ్బంది దృఢంగా నిలబడ్డారు. విధి నిర్వహణ పట్ల వారికున్న అంకితభావం సాధించిన విజయమిది.

మిత్రులారా,
విజయాన్ని సాధించాలంటే సరైన ఉద్దేశాలు, సరైన విధానాలు అవసరం. జాతీయ భద్రత కోసం మేము ఒకదాని తర్వాత మరొకటి కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. ప్రజలకు ఇప్పటికే తెలియని అనేక చర్యలను కూడా చేపట్టాం. ఈ నిర్ణయాలు, ప్రయత్నాల ద్వారా నక్సలైట్లు, వేర్పాటువాదుల ఆర్థిక సహాయ వ్యవస్థలను గట్టి దెబ్బ తీశాం. నకిలీ కరెన్సీ చెలామణి వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశాం. దీనివల్ల వారి ఆర్థిక మూలాలు దెబ్బతినడమే కాకుండా, మొత్తం సరఫరా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. ఫలితంగా ఆయుధాల సరఫరా నిలిచిపోయింది. నక్సలైట్ల కదలికలు, నియామకాలపై ఆంక్షలు విధించగలిగాం.

మిత్రులారా,
గత ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పోరాడుతున్న భద్రతా బలగాల చేతులకు కూడా సంకెళ్లు వేశాయి. నక్సలైట్ల దాడులు కొనసాగుతున్నప్పటికీ, వాటికి దీటుగా ప్రతిస్పందించే స్వేచ్ఛ భద్రతా బలగాలకు ఉండేది కాదు. అవసరమైన ప్రతి నిర్ణయాన్ని తీసుకునే స్వేచ్ఛను మేము భద్రతా బలగాలకు కల్పించాం. అంతేగాక వామపక్ష తీవ్రవాదానికి ప్రభుత్వంలో, వ్యవస్థలోని కొందరి నుంచి గతంలో అందుతున్న మద్దతును నిలువరించేందుకు కూడా చర్యలు తీసుకున్నాం.

మిత్రులారా,
మేం ఎంతో పెద్ద లక్ష్యంతో ముందుకు సాగాం. ఏ తల్లి ఒడి ఖాళీ కాకూడదని, ఏ కుటుంబమూ విధ్వంసకర పరిస్థితుల వలయంలో చిక్కుకోకూడదని, ఏ చిన్నారీ ఆయుధం పట్టుకుని హింసామార్గంలో నడవకూడదని, ఏ యువకుడి భవిష్యత్తూ నాశనం కాకూడదని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే ఆ లక్ష్యాన్ని సాధించే వరకు దృఢ సంకల్పంతో పనిచేశాం. ప్రచార ఆర్భాటాలకు, ప్రదర్శనలకు తావివ్వలేదు. సున్నితత్వంతో పనిచేస్తూ మావోయిస్టు ఉగ్రవాదం వెన్నెముకను విరిచాం. సేవాభావంతో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల జీవితాలను మార్చాం.  అందుకే నక్సలిజం వల్ల బాధలు అనుభవించిన ప్రజలు కూడా ప్రభుత్వం, భద్రతా బలగాలకు గట్టిగా అండగా నిలిచారు. ఈ మహా విజయానికి విశేషంగా కృషి చేసిన పౌరులు కొందరు నేడు ఇక్కడ ఉన్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,
‘దేశమే ప్రథమం’ అనే భావనతో పనిచేసినప్పుడు దేశంలో శాంతి, భద్రతలు నెలకొంటాయి. దేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. అభివృద్ధిలో పేదలు, అణగారిన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. అందుకే గత పన్నెండేళ్లలో దేశం నక్సలిజం, వేర్పాటువాదంపై పోరాటంలో విజయం సాధించడమే కాకుండా, పేదరికంపై కూడా కీలక పోరాటంలో గెలుపొందింది.

మిత్రులారా,
ఈ ఏడాది దీపావళికి కొద్ది రోజుల ముందు ఒక వార్త వెలువడింది. ప్రస్తుతం ఆ వార్త దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితం ప్రపంచ బ్యాంకు తన నివేదికలో భారత్‌లో గత పన్నెండేళ్లలో 50 కోట్ల మంది.. 50 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంది. పేదరిక నిర్మూలన పేరుతో దశాబ్దాలుగా చేసిన నినాదాలు సాధించలేనిది, దేశం కేవలం పన్నెండేళ్లలో సాధించింది. ఇది ఎంత గొప్ప విజయమో ఒక్కసారి ఊహించండి. ఇది ఎలా సాధ్యమైందో ఆలోచించండి.

మిత్రులారా,
దీపావళి సందర్భంగా మనం రంగవల్లులు వేస్తుంటాం. మొదట కొన్ని గీతలు మాత్రమే గీస్తాం. ఆరంభంలో ఆ నమూనాలు చిన్నవిగా, విడివిడిగా కనిపిస్తాయి. అయితే ఒక్కో చిన్న భాగాన్ని జోడించుకుంటూ పోతే చివరకు అందమైన సంపూర్ణ చిత్రం ఆవిష్కృతమవుతుంది. గత పన్నెండేళ్లలో భారత్‌లోనూ ఇలాంటిదే జరిగింది. పేదలకు నిరంతరం సాధికారత కల్పించే సంక్షేమ పథకాలతో మేము ఒక రంగవల్లిని రూపొందించాం. జన్‌ధన్‌ యోజన ద్వారా కోట్లాది మందిని బ్యాంకింగ్‌ వ్యవస్థతో అనుసంధానించాం. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా కోట్లాది కుటుంబాలకు శాశ్వత గృహాలను అందించాం. ముద్రా యోజన కింద పూచీకత్తు లేకుండా రుణాలు కల్పించాం. స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు కూడా అండగా నిలిచి, వారి వ్యాపారాలను విస్తరించుకునే అవకాశాలు కల్పించాం. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాం. కోట్లాది కుటుంబాలకు ప్రతి నెలా ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాం. పిల్లల విద్య కోసం విధానాలను రూపొందించాం. అంటే, ప్రతి పేద కుటుంబానికి ఉచిత మందులు, ఉచిత విద్య, ఉచితంగా వంట చేసుకునేందుకు అవసరమైన ఆహార సహాయాన్ని అందించాం. అంతేకాకుండా, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, హర్‌ ఘర్‌ జల్‌ వంటి పథకాల ద్వారా నిత్యజీవితంలో ఎదురయ్యే అనేక ప్రాథమిక సమస్యలను పరిష్కరించాం. ఫలితంగా నేడు కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఒకప్పుడు పేదరికాన్ని వారసత్వంగా పొందిన కుటుంబాలు ఇప్పుడు మెరుగైన భవిష్యత్తుకు పునాదులను వారసత్వంగా అందుకుంటున్నాయి. జీవితమంతా ఆందోళనలతో గడిపిన కుటుంబాల్లో ఇప్పుడు ప్రభుత్వంపై విశ్వాసం, తమపై తమకు నమ్మకం పెరగడంతో కొత్త భరోసా ఏర్పడింది.

మిత్రులారా,
పేదరికంపై సాధించిన ఈ విజయానికి మరో ప్రధాన పునాది నక్సలిజం, వేర్పాటువాదంపై దేశం సాగించిన పోరాటంతో ముడిపడి ఉంది. బస్తర్‌ ప్రజలకు, మీ అందరికీ తెలుసు.. నక్సలైట్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధిని అడ్డుకోవడం, సామాన్య ప్రజల జీవితాలను దెబ్బతీయడమే వారి తొలి లక్ష్యంగా ఉండేది. పిల్లల కోసం పాఠశాలలు పనిచేయడానికి అనుమతించేవారు కాదు. వాటికి తరచూ నిప్పు పెట్టేవారు. అనారోగ్యంతో ఉన్నవారికి ఆసుపత్రులు నిర్మించనిచ్చేవారు కాదు. వైద్యులు ఆ ప్రాంతాలకు రాకుండా అడ్డుకునేవారు. ప్రాణాలను కాపాడే ఔషధ దుకాణాల వంటి సౌకర్యాలనూ అనుమతించేవారు కాదు. పిల్లలకు పోలియో టీకాలు వేయడాన్ని కూడా ఈ నక్సలైట్లు అడ్డుకున్నారు. మొబైల్‌ టవర్ల ఏర్పాటుకు అనుమతించలేదు. ఏళ్ల తరబడి రైల్వే పట్టాలను బాంబులతో పేల్చివేయడం, పరిశ్రమలు, వ్యాపారాలు పనిచేయకుండా అడ్డుకోవడం వంటివి మీరు చూశారు. దీని ఫలితంగా లక్షలాది మంది పేద, అమాయక పౌరులు, నా సోదరులు, సోదరీలు, యువతీ యువకులు అవకాశాలకు దూరమయ్యారు. వారి జీవితాలు పేదరిక చక్రం నుంచి బయటపడలేకపోయాయి. అందుకే నక్సలిజంపై పోరాటం ప్రారంభించినప్పుడే, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపట్టాం. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తి భద్రతా ఏర్పాట్లతో 15,000 కిలోమీటర్లకు పైగా రహదారులను నిర్మించాం. ఈ ప్రాంతాల్లో 9,500కు పైగా మొబైల్‌ టవర్లను ఏర్పాటు చేశాం. గిరిజన పిల్లల విద్య కోసం సుమారు 175 ఏకలవ్య పాఠశాలలను ప్రారంభించాం. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు దాదాపు 50 పారిశ్రామిక శిక్షణ సంస్థలను (ఐటీఐలు) ఏర్పాటు చేశాం. సుమారు 50 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నెలకొల్పాం. వేలాది పోస్టాఫీసులు, బ్యాంకు శాఖలు, ఏటీఎంలను ప్రారంభించాం. అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం పీఎం జన్‌మన్ యోజనను ప్రారంభించాం. ఈ పథకం ద్వారా వేలాది మారుమూల గ్రామాలకు తొలిసారిగా నీరు, విద్యుత్‌, రహదారుల వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, లొంగిపోయిన నక్సలైట్లకు కూడా ఒక అవకాశం కల్పించాం. వారి పునరావాసం కోసం ప్రత్యేక పథకాలను రూపొందించాం.

మిత్రులారా,
‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌’ అనే ఈ కార్యక్రమం పేదరికంపై దేశం సాగిస్తున్న పోరాటానికి కొత్త శక్తిని, నూతన ఆత్మవిశ్వాసాన్ని అందించింది. అందుకే ఒకవైపు 50 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికం నుంచి బయటపడగా, మరోవైపు దేశంలో నక్సలైట్‌ హింస కూడా అంతమైంది. బస్తర్‌నే ఉదాహరణగా తీసుకొండి. నేడు అక్కడ బస్తర్‌ ఒలింపిక్స్‌ జరుగుతున్నాయి. పిల్లలు ఇకపై తుపాకులు పట్టుకోవడం లేదు. క్రీడల్లో తమ ప్రతిభను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మిత్రులారా,
ఈ విజయాల మధ్య మనం మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. నక్సలైట్లను నిర్మూలించినప్పటికీ, ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. అడవుల్లో సాయుధ నక్సలైట్లు కనుమరుగయ్యారు. అయితే మేధోపరమైన నక్సలైట్లు అనేక సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నేటికీ వారు దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఈ మేధో నక్సలైట్లు పలు రాజకీయ పార్టీలు, వివిధ సంస్థల్లోకి కూడా చొరబడ్డారు. వారిని గుర్తించి, ఓడించి, దేశ భద్రతను కాపాడుకోవాలి.

మిత్రులారా,
నేటి విజయాలు మనకు స్ఫూర్తినిస్తున్నాయి. అయితే ఇవి మన ప్రయాణానికి విరామం కాదు. మరోసారి చెబుతున్నాను.. ఇవి విరామం కాదు. ఈ విజయాలు, ఈ సాఫల్యాలు కొత్త ప్రయాణానికి పునాదులు. ఈ ప్రయాణం దేశ ఆశయాలను, శతాబ్దాలుగా మన ప్రజలు పెంచుకున్న కలలను సాకారం చేసే దిశగా సాగుతుంది. స్వాతంత్ర్యం కోసం లెక్కలేనన్ని త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధుల కలలు ఇవి. దేశ సరిహద్దుల్లో మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల కలలు ఇవి. నక్సలిజం, ఉగ్రవాదంపై పోరాటంలో ప్రాణత్యాగం చేసిన ధైర్యవంతులైన సిబ్బంది కలలు ఇవి. మీరు ప్రతిరోజూ ఈ స్ఫూర్తితో జీవిస్తున్నారు. ‘‘నీ వైభవం చిరస్థాయిగా నిలిచి ఉండాలి అమ్మా.. తల్లీ నీ వైభవం చిరస్థాయిగా నిలిచి ఉండాలి అమ్మా.. మేము మరికొన్ని రోజులు జీవించినా, జీవించకపోయినా.. నీ కీర్తి మాత్రం శాశ్వతంగా వెలుగొందుతూనే ఉండాలి అమ్మా.” ఇప్పుడు మీలోని ఈ స్ఫూర్తి కొత్త ఆత్మవిశ్వాసంగా మారాల్సిన సమయం ఆసన్నమైంది. దేశం కోసం జీవిస్తూ, దేశాన్ని అభివృద్ధిలో మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాల్సిన సమయం ఇది.

మిత్రులారా,
మన దేశం ఏ సంకల్పం చేసినా, దాన్ని నెరవేర్చగల సామర్థ్యం కూడా మనకు ఉంది. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తొలగిస్తామని హామీ ఇచ్చాం. ఆ హామీని నెరవేర్చాం. ప్రతి ఇంటిలో మరుగుదొడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చాం. దాన్ని కూడా నెరవేర్చాం. టీకా కార్యక్రమ పరిధిని విస్తరిస్తామని చెప్పాం. ఆ లక్ష్యాన్ని కూడా సాధించాం. అందుకే నేడు పేదరిక నిర్మూలన గురించి, మాదకద్రవ్యాల రహిత భారత్‌ గురించి, వికసిత్‌ భారత్‌ గురించి, ఆత్మనిర్భర్‌ భారత్‌ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఈ లక్ష్యాలను కూడా ఖచ్చితంగా సాధిస్తాం. ఈ కలలు సాకారమవడాన్ని మన కళ్లముందే చూడాలి. మీపై నాకు నమ్మకం ఉంది. నా దేశ యువశక్తిపై నాకు విశ్వాసం ఉంది. దేశ ప్రజలపై నాకు నమ్మకం ఉంది. దేశం తప్పకుండా ఈ లక్ష్యాలను చేరుకుంటుంది. మీ త్యాగం, మీ కృషి వికసిత్‌ భారత్‌ అనే మహత్తర నిర్మాణానికి బలమైన పునాదులుగా నిలుస్తాయి. ఈ విశ్వాసంతో దీపావళి పర్వదినం సందర్భంగా మీ అందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.

భారత్ మాతా కీ జై.

భారత్ మాతా కీ జై.

భారత్ మాతా కీ జై.

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

చాలా ధన్యవాదాలు.

***


(రిలీజ్ ఐడి: 2334513) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam