నాడు పోస్టు చేయడమైనది:
09 NOV 2026 11:51AM by PIB Hyderabad
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే 137 మందులకు గరిష్ఠ చిల్లర విక్రయ ధర (ఎమ్ఆర్పీ)లో ట్రేడ్ మార్జిన్‌పై పరిమితిని విధించారు. రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ఔషధ నిర్మాణ విభాగం ఆధీనంలో పనిచేసే జాతీయ ఔషధాల ధరల ఖరారు ప్రాధికార సంస్థ (ఎన్పీపీఏ) ఈ మేరకు నిర్ణయించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల ఆధారంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయా మందులకు సవరించిన ఎమ్ఆర్పీలు ఈ రోజు, అంటే 2026 నవంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చాయి.
2026 నవంబర్ 8 నాటికి 85 మందుల కంపెనీలు 121 ఔషధాలు సహా 1,364 క్యాన్సర్ చికిత్స ఉత్పాదనలకు సవరించిన ధరలను ప్రకటించాయి. వాటిలో 679 బ్రాండుల ధరలలో 50 శాతం కన్నా ఎక్కువ తగ్గింపు చోటు చేసుకుంది. అన్నింటి కన్నా ఎక్కువ తగ్గింపు 96.45 శాతంగా ఉంది. ధరలలో ఈ కోత ఫలితంగా, వినియోగదారులకు సంవత్సరానికి దాదాపు రూ.3,540.38 కోట్లు ఆదా అవుతాయని భావిస్తున్నారు.
మందుల ప్యాకెట్ పైన ముద్రించే గరిష్ఠ చిల్లర విక్రయ ధర (ఎమ్ఆర్పీ)ని వినియోగదారులు చూడవచ్చును. ‘ఫార్మా సహీ దామ్’ ( Pharma Sahi Daam ) మొబైల్ యాప్ లో గాని, లేదా ఎన్పీపీఏ వెబ్సైట్ ( nppa.gov.in ) ద్వారా గాని మందుల ధరలను సరిచూసుకోవచ్చును. సవరించిన ఎమ్ఆర్పీ కన్నా ఎక్కువ ధరను కెమిస్టు గాని, లేదా ఆస్పత్రి ఫార్మసీ గాని వసూలు చేయడానికి వీలు లేదు. ఒకవేళ వినియోగదారుల వద్ద నుంచి నిర్ధారిత ధర కన్నా ఎక్కువ ధరను తీసుకున్న పక్షంలో, అప్పుడు వారు ‘ఫార్మా జన్ సమాధాన్’ వెబ్సైట్ ద్వారా తమ ఫిర్యాదును దాఖలు చేయవచ్చును. లేదంటే ఎన్పీపీఏ హెల్ప్‌లైన్ 1800-111-255ను అయినా సంప్రదించవచ్చును.
***