రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక ‘అమిని’ భారత నౌకాదళానికి అందజేత

నాడు పోస్టు చేయడమైనది: 06 NOV 2026 9:14AM by PIB Hyderabad

కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, నిర్మించిన జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ కార్యకలాపాల కోసం ఉద్దేశించిన షాలో వాటర్ క్రాఫ్ట్ (ఏఎస్‌డబ్ల్యూ ఎస్‌డబ్ల్యూసీ) నౌకల్లో ఒకటైన ‘అమిని’ ని 2026 నవంబర్ 5న భారత నౌకాదళానికి అందజేశారు. 

కోల్‌కతాలోని జీఆర్ఎస్ఈ సంస్థ నిర్మించిన ఈ యుద్ధనౌకలను ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్) వర్గీకరణ నిబంధనలకు అనుగుణంగా రూపొందించి, నిర్మించారు. 

వాటర్‌జెట్ ప్రొపల్షన్ వ్యవస్థతో నడిచే ఈ నౌకలు.. భారత నౌకాదళానికి చెందిన అతిపెద్ద యుద్ధనౌకల్లో ఒకటి. అత్యాధునిక తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, సోనార్లతో వీటిని రూపొందించారు. ఇవి సముద్రగర్భంలోని ముప్పులను సమర్థంగా గుర్తించి, ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ నౌక భారత నౌకాదళ జలాంతర్గామి వ్యతిరేక కార్యకలాపాలు, తీర ప్రాంత నిఘా, సముద్రంలో మందుపాతరలు అమర్చే సామర్థ్యాలను మరింత బలోపేతం చేయనుంది. 

‘అమిని’ అనే పేరు కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లోని అమిని ద్వీపం నుంచి తీసుకున్నారు. గతంలో 2002లో సేవల నుంచి విరమించిన పెట్యా-III తరగతికి చెందిన జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక ఐఎన్ఎస్ అమిని పేరును కొనసాగిస్తూ ఈ నౌకకు అదే పేరు పెట్టారు. తద్వారా భారత నౌకాదళంలో విశిష్టమైన పేర్ల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 

‘అమిని’ నౌక అందజేత స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణంలో భారత నౌకాదళం సాధిస్తున్న మరో కీలక మైలురాయి. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఈ నౌకను నిర్మించారు. ఇందులో 80 శాతానికి పైగా స్వదేశీ విడిభాగాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు. ఇది దేశీయ రక్షణ తయారీ రంగం పెరుగుతున్న సామర్థ్యానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా సాగుతున్న ప్రయత్నాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2333892) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , English , Urdu , हिन्दी , Assamese , Bengali , Gujarati , Tamil