నాడు పోస్టు చేయడమైనది:
05 NOV 2026 7:52PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ క్రీడా సముదాయంలో ఆసియా పారా క్రీడలు 2026లో పాల్గొన్న భారత బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ... కొన్ని వారాల క్రితం ఆసియా క్రీడల బృందంతో సమావేశమైన అనంతరం, పారా ఆసియా క్రీడల అథ్లెట్లను కలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూశానని తెలిపారు. వారి అద్భుత ప్రదర్శన ప్రపంచ క్రీడారంగంలో భారత్ వేగంగా ఒక ప్రధాన శక్తిగా ఎదుగుతోందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున క్రీడాకారులకు అభినందనలు తెలిపిన ప్రధాని.. వారి విజయాల్లో కీలక పాత్ర పోషించిన కుటుంబ సభ్యులు, శిక్షకులు, కోచ్‌లను సత్కరించారు. క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై పతకాలు సాధించడమే కాకుండా.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నారని ప్రశంసించారు.
గతంలో భారత క్రీడారంగంలో పాల్గొనడాన్ని కేవలం ఒక లాంఛనంగా భావించేవారని, పారా క్రీడల్లోనూ దేశం వెనుకబడి ఉండేదని ప్రధాని గుర్తుచేశారు. 2010 పారా ఆసియా క్రీడల్లో భారత్ ఒక స్వర్ణంతో కలిపి కేవలం 14 పతకాలే సాధించిందని తెలిపారు. అయితే, ఈసారి భారత బృందం చారిత్రాత్మకంగా 114 పతకాలు సాధించడంతో పాటు అయిదు ప్రపంచ రికార్డులు, తొమ్మిది ఆసియా రికార్డులు నెలకొల్పిందని అన్నారు. ఈ పతకాల్లో 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్యాలు ఉన్నాయని వివరించారు. 56 మంది మహిళా క్రీడాకారుల్లో 34 మంది పతకాలు సాధించడం విశేషమని తెలిపారు. నాలుగు విభాగాల్లో భారత క్రీడాకారులు మూడు పతకాలనూ కైవసం చేసుకుని పోడియంపై అన్ని స్థానాలను దక్కించుకున్నారని, పోటీల చివరి రోజునే తొమ్మిది స్వర్ణ పతకాలు సాధించారని పేర్కొన్నారు. టోర్నమెంట్లో చివరి వరకు విజయాల కోసం క్రీడాకారులు చూపిన పట్టుదలను ప్రశంసించారు. ‘‘14 పతకాల నుంచి 114 పతకాల వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం వారి కఠోర శ్రమకు, అంకితభావానికి నిదర్శనం’’ అని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.
గతంలో భారత్ విజయం సాధించని పలు క్రీడా విభాగాల్లో తొలిసారిగా స్వర్ణ పతకాలు సాధించిన భారత అథ్లెట్ల ప్రతిభను ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. పారా షూటింగ్లో మోనా అగర్వాల్ ప్రపంచ రికార్డు నెలకొల్పగా, హేనీ తన గత ప్రపంచ రికార్డును తానే అధిగమించారని తెలిపారు. ‘‘శారీరక సవాళ్లను ఎలా అధిగమించవచ్చో తమ అద్భుత ప్రదర్శనతో హిమాంశు, రవి, జెహాన్ ప్రపంచానికి చాటిచెప్పారు’’ అని శ్రీ మోదీ ప్రశంసించారు.
ప్రపంచం వ్యక్తిగతంగా లేదా సమష్టిగా సాధించిన విజయాల గొప్పతనాన్ని చూస్తుందని, అయితే ఆ విజయాల వెనుక ఎన్నో ఏళ్ల కనిపించని శ్రమ, స్వేదం, పట్టుదల, తపస్సు ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆసియా పారా క్రీడలకు కేవలం రెండు నెలల ముందు తల్లిని కోల్పోయినప్పటికీ, అథ్లెట్ రింకు ధైర్యాన్ని కోల్పోలేదని గుర్తుచేశారు. స్వర్ణ పతకం సాధించిన అనంతరం తన తల్లి ఫొటోను పైకెత్తి ఆమెకు నివాళులర్పించారని తెలిపారు. ‘‘ఆ క్షణం మా అందరినీ భావోద్వేగానికి గురిచేసింది’’ అని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.
క్రీడాకారుల పోరాటం, విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. వారి వ్యక్తిగత ప్రయాణాలకు, దేశ అభివృద్ధి ప్రస్థానానికి మధ్య ఎంతో సారూప్యత ఉందని తెలిపారు. ‘‘నేడు క్రీడాకారుల కృషి, దేశ కృషి రెండూ కలిసి ఎదురులేని శక్తిగా మారుతున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.
క్రీడాకారులు కష్టాలకు తలవంచకుండా పోరాడినట్లుగానే, యువతలోని ప్రతిభ వృథా కాకుండా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని దేశం సంకల్పించిందని ప్రధాని తెలిపారు. యువ క్రీడాకారులకు దేశం అండగా నిలుస్తుందనే నమ్మకాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, జూడో, పవర్ లిఫ్టింగ్ తదితర క్రీడల్లో భారత్ తన ఆధిపత్యాన్ని పెంచుకుంటోందని వివరించారు. ఆసియా పారా క్రీడల్లో తొలిసారిగా పాల్గొన్న 61 మంది క్రీడాకారుల్లో 36 మంది పతకాలు సాధించారని, సందీప్ తన తొలి ప్రదర్శనలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పారని తెలిపారు. ‘‘యువత ఈ భాగస్వామ్యం నేటి భారత చిత్రమే కాకుండా.. భవిష్యత్తు భారతానికి చాటింపు’’ అని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.
క్రీడలను కేవలం జాతీయ, అంతర్జాతీయ పోటీలుగా మాత్రమే కాకుండా.. వ్యక్తిత్వ వికాసానికి, దేశ నిర్మాణానికి కీలకమైన మాధ్యమంగా ప్రభుత్వం భావిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. క్రీడలు యువతకు అవసరమైన జీవిత విలువలను నేర్పుతాయని తెలిపారు. ‘‘ఓటమి తర్వాత ఎలా గెలవాలో, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి ప్రాముఖ్యత ఏమిటో యువతకు క్రీడలే నేర్పుతాయి’’ అని శ్రీ మోదీ చెప్పారు.
పాఠశాల స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు వివిధ కార్యక్రమాలు, అనేక ఖేలో ఇండియా కేంద్రాలు, టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్స్) పథకం కింద ఒలింపిక్స్ ప్రమాణాలకు అనుగుణమైన శిక్షణ ద్వారా ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి వివరించారు. ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా ప్రతిభాన్వేషణ కార్యక్రమంలో యువత పాల్గొనాలని ఇటీవల ఎర్రకోట నుంచి తాను ఇచ్చిన పిలుపును ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘‘ఈ దార్శనికతతోనే మనం దేశంలో ఒక ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మిస్తున్నాం’’ అని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.
ప్రధాన జాతీయ కార్యక్రమాల్లో పారా క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని, తద్వారా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో క్రీడాకారులు రాణించేందుకు అవకాశం కల్పిస్తున్నామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ‘‘ఇటీవల జరిగిన పోటీల్లో టాప్స్ పథకం ద్వారా సహాయం పొందిన క్రీడాకారులు 41 పతకాలు సాధించగా, ఖేలో ఇండియా క్రీడాకారులు 19 పతకాలు గెలుచుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సరైన దిశలో ముందుకు సాగుతున్నాయనడానికి ఈ విజయాలే నిదర్శనం’’ అని శ్రీ మోదీ అన్నారు.
భారత్‌లో ఆధునిక క్రీడా విధానాలు మైదానాలకే పరిమితం కాకుండా యువతకు విస్తృత అవకాశాలను కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. క్రీడా మౌలిక సదుపాయాల నిర్మాణం, క్రీడా పరికరాల తయారీ, క్రీడా ప్రసార రంగం వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. ‘‘నేడు దేశంలో అమలవుతున్న ఆధునిక క్రీడా విధానాలు మైదానం వెలుపల కూడా క్రీడారంగంలో యువతకు అనేక కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి’’ అని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.
రూ.1,800 కోట్లకు పైగా విలువైన ఖేలో ఇండియా క్రీడా వస్తువుల తయారీ పథకానికి ఇటీవల ఆమోదం లభించిందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు వారు ఉపయోగించే క్రీడా పరికరాలు, దుస్తులు, పాదరక్షలు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులై ఉండేలా దేశీయ క్రీడా వస్తువుల తయారీ పరిశ్రమ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీని వల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) బలోపేతం కావడంతో పాటు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ‘‘ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారు చేయడంతో పాటు ప్రపంచస్థాయి క్రీడా పరికరాలను కూడా భారత్‌లోనే ఉత్పత్తి చేయాలన్నదే తమ లక్ష్యం’’ అని శ్రీ మోదీ అన్నారు.
క్రీడాకారులు రాబోయే రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలను సందర్శించినప్పుడు యువతకు మైదానంలో విజయాలు సాధించడమే కాకుండా, క్రీడారంగంలో మైదానం వెలుపల ఉన్న కెరీర్ అవకాశాలపై కూడా మార్గనిర్దేశం చేయాలని ప్రధానమంత్రి సూచించారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వారికి వివరించాలని కోరారు. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. దివ్యాంగుల పింఛన్లను పెంచడంతో పాటు అర్హత కోసం నిర్దేశించిన వైకల్య శాతాన్ని 80 నుంచి 40 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. అలాగే, పింఛను పొందేందుకు వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి పుట్టుకతోనే వర్తించేలా మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. 10 వేల పదాలతో భారతీయ సంకేత భాష నిఘంటువు రూపొందించడం, సంకేత భాషలో పాఠశాల పుస్తకాలు అందించడం, సుగమ్య భారత్ అభియాన్ కింద బహిరంగ ప్రదేశాలను దివ్యాంగులకు అనుకూలంగా మార్చడం వంటి చర్యలను వివరించారు. ‘‘దేశంలోని ప్రతి దివ్యాంగ సోదరుడు, సోదరి గౌరవం, సమాన అవకాశాలు పొందుతూ తమ సామర్థ్యంతో జీవితంలో ముందుకు సాగాలన్నదే ప్రభుత్వ ప్రయత్నం’’ అని శ్రీ ప్రధాని మోదీ అన్నారు.
భారత్ లక్ష్యంగా పెట్టుకున్న లాస్ ఏంజిల్స్ 2028 క్రీడలకు ఐచి-నగోయా వేదికపై సాధించిన విజయాలు ముగింపు కాదని.. తదుపరి లక్ష్యానికి నాంది మాత్రమేనని ప్రధాని పేర్కొన్నారు. 2028 క్రీడల కోసం అవని, మనీష్ ఇప్పటికే కోటా స్థానాలు సాధించారని గుర్తుచేశారు. ప్రస్తుత విజయాలను ఆస్వాదిస్తూనే, 2028లో రికార్డు స్థాయిలో క్రీడాకారులు పాల్గొని, అత్యధిక పతకాలు సాధించేలా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని అథ్లెట్లకు పిలుపునిచ్చారు. చివరగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘‘దేశం మీకు అండగా ఉంది, మీ తదుపరి విజయం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
***