నాడు పోస్టు చేయడమైనది:
05 NOV 2026 3:25PM by PIB Hyderabad
అంతరిక్ష వ్యర్థాల తొలగింపులో ప్రపంచవ్యాప్తంగా ముందడుగు వేస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఎదుగుతోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంతరిక్షాన్ని మరింత సురక్షితంగా, సుస్థిరంగా మార్చేందుకు భారతీయ అంకుర సంస్థ ఒకటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
2030 నాటికి వ్యర్థరహిత అంతరిక్షాన్ని సాధించాలనే లక్ష్యాన్ని వివరిస్తూ.. క్రియాశీల అంతరిక్ష వ్యర్థాల తొలగింపులో భారత్ సాధిస్తున్న సామర్థ్యాలు అంతరిక్ష సాంకేతికతలో దేశం పెరుగుతున్న ప్రపంచ నాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. యావత్ మానవాళికి సురక్షితమైన అంతరిక్ష వాతావరణాన్ని అందించాలన్న భారత నిబద్ధతకు ఇవి నిదర్శనమని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని కాస్మోసర్వ్ స్పేస్ సంస్థ ఏర్పాటు చేసిన ‘బేస్–1’ కేంద్రం ప్రారంభోత్సవంలో భాగంగా న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న వీఎస్‌డీ టెక్ పార్క్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాస్మోసర్వ్ స్పేస్ వ్యవస్థాపకుడు, సీఈఓ డాక్టర్ చిరంజీవి ఫణీంద్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ జితేంద్ర సింగ్ వర్చువల్‌గా ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాస్మోసర్వ్ స్పేస్ సంస్థకు డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందనలు తెలిపారు. ‘బేస్–1’ కేంద్రం సుమారు 14,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సమగ్రమైన, అత్యాధునిక సదుపాయమని పేర్కొన్నారు. ఇక్కడ అంతరిక్ష రోబోలను రూపొందించడం, తయారు చేయడం, అంతరిక్ష పరిస్థితుల్లో పరీక్షించడం, మిషన్ కంట్రోల్ ద్వారా వాటిని నిర్వహించడం వంటి కార్యకలాపాలు చేపడతారని వివరించారు. కక్ష్యలో సమీపించడం (ఆర్బిటల్ రెండెజౌస్), క్యాప్చర్ ల్యాబ్‌లు, అంతరిక్ష రోబోటిక్స్ ఆవిష్కరణ ప్రయోగశాలలు, సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల అనుకరణ వేదికలు, ఉపగ్రహాల అనుసంధానానికి అవసరమైన క్లీన్ రూమ్‌లు వంటి ప్రత్యేక సదుపాయాలు ఈ కేంద్రంలో ఉన్నాయని తెలిపారు. ఇవి భారత ప్రైవేటు అంతరిక్ష రంగ సామర్థ్యాల్లో కీలకమైన పురోగతిని సూచిస్తున్నాయని అన్నారు.
క్రియాశీల అంతరిక్ష వ్యర్థాల తొలగింపు (ఏడీఆర్), కక్ష్యలోనే ఉపగ్రహ సేవల రంగాల్లో మార్గదర్శక కృషి చేస్తున్న డాక్టర్ చిరంజీవి ఫణీంద్ర, ఆయన బృందాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. సంస్థ ఏర్పాటైన ఏడాదిలోపే, 2026 జూలైలో ‘మిషన్ ఎంబ్రేస్’ ద్వారా అంతరిక్షంలో సాఫ్ట్ రోబోటిక్ పెటల్స్‌పై పరీక్ష నిర్వహించడం భారత ప్రైవేటు అంతరిక్ష అంకుర సంస్థల వేగవంతమైన పురోగతికి, పెరుగుతున్న సాంకేతిక పరిణతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇస్రో, గగన్‌యాన్ కార్యక్రమంలో బృంద సభ్యులు సంపాదించిన అనుభవాన్ని ప్రైవేటు రంగంలో పరస్పర సహకారంతో కూడిన నమూనాగా మలచడాన్ని ఆయన ప్రశంసించారు.
ఉపగ్రహ వ్యవస్థల కోసం పిక్సెల్, ప్రొపల్షన్ వ్యవస్థల కోసం నెదర్లాండ్స్‌కు చెందిన ధ్రువ్ ఏరోస్పేస్, ప్రయోగ సేవల కోసం స్కైరూట్ ఏరోస్పేస్‌తో కాస్మోసర్వ్ స్పేస్ కుదుర్చుకున్న భాగస్వామ్యాలు అంతరిక్ష సాంకేతికతలో సమగ్ర సహకార సంస్కృతి ఆవిర్భవిస్తున్నట్లు తెలియజేస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. స్వదేశీ పేలోడ్‌లు, బ్యాటరీ సాంకేతికతలు, ఉపగ్రహ వ్యవస్థలు, ప్రైవేటు ప్రయోగ సామర్థ్యాలను సమన్వయం చేసుకుని సమీకృత అంతరిక్ష మిషన్లను రూపొందించడంతో పాటు ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పేందుకు భారత అంకురాలు చేస్తున్న కృషికి ఈ కార్యక్రమం నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన విప్లవాత్మక అంతరిక్ష రంగ సంస్కరణలు భారత్‌లో అపారమైన సామర్థ్యాన్ని వెలికితీశాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. సుమారు అ యిదు నుంచి ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం, ఆ తర్వాత న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్), ఇన్-స్పేస్ సంస్థల ఏర్పాటు దేశ అంతరిక్ష రంగ వ్యవస్థను సమూలంగా మార్చివేశాయని తెలిపారు. భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 9 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరిందని, వచ్చే దశాబ్దంలో ఇది 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. అంతరిక్ష అంకుర సంస్థల సంఖ్య కూడా ఒక అంకె స్థాయి నుంచి దాదాపు 450 సంస్థలకు పెరిగిందని వివరించారు.
భారత్‌లో శాస్త్రీయ ప్రతిభకు, సాంకేతిక సామర్థ్యాలకూ ఎప్పుడూ కొరత లేదని మంత్రి అన్నారు. యువతలోని అపారమైన సామర్థ్యాన్ని వెలికితీసేందుకు అనువైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం మాత్రమే ఉందని పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు అంతరిక్ష రంగంలో మరింత చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆవిష్కరణలను వేగవంతం చేయడం, సహకారాలను బలోపేతం చేయడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు మద్దతు అందించడం కోసం శాస్త్ర, పరిశోధనా రంగాల్లో దాతృత్వ సహకారం కూడా పెరగాలని కోరారు.
అంతర్జాతీయ భాగస్వామ్యాలతో పాటు సాంకేతిక స్వావలంబన, సార్వభౌమ సామర్థ్యాలను సాధించడమే భారత్ అంతిమ లక్ష్యమని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. చంద్రయాన్, గగన్‌యాన్ కార్యక్రమాల్లో భారత్ సాధించిన విజయాలు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన సంక్లిష్ట అంతరిక్ష ప్రయోగాలను గణనీయంగా తక్కువ వ్యయంతో చేపట్టగల సామర్థ్యాన్ని నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు. గతి శక్తి, స్మార్ట్ సిటీలు, విపత్తుల సంసిద్ధత తదితర రంగాల్లో అంతరిక్ష సాంకేతికత వినియోగం ద్వారా భూమిపై ప్రజల జీవితాల్లోనూ మార్పులు వస్తున్నాయని, అనేక విధాలుగా పౌరులకు ప్రయోజనం చేకూరుతోందని ఆయన వివరించారు.
కాస్మోసర్వ్ స్పేస్ చేపట్టిన ఈ కార్యక్రమం ‘విశ్వ బంధు భారత్’ స్ఫూర్తికి నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అంతరిక్ష సుస్థిరత పట్ల భారత్ నిబద్ధతను జాతీయ సరిహద్దులు దాటి యావత్ మానవాళి ప్రయోజనాలకు విస్తరించేలా ఈ కార్యక్రమం ఉందని తెలిపారు. మరింత పరిశుభ్రమైన, సురక్షితమైన అంతరిక్ష వాతావరణం కోసం కృషి చేస్తున్న బృందాన్ని ఆయన అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు అంతరిక్ష సాంకేతికతలో భారత్ ప్రపంచ నాయకత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో దేశ ప్రాధాన్యతను మరింత పెంచుతాయని అన్నారు.
వీలైనంత త్వరగా ఈ కేంద్రాన్ని స్వయంగా సందర్శించి, కాస్మోసర్వ్ స్పేస్ బృందంతో మాట్లాడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
****