గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీ ఎన్‌సీఆర్‌కు వెలుపల.. విజయవాడలో ఘనంగా ముగిసిన మొదటి ‘జాతీయ సరస్ మేళా-2026’.. 12 లక్షల కన్నా ఎక్కువ మంది సందర్శకులు.. రూ.12.8 కోట్లను మించిన వస్తు విక్రయాలు

30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన
1,500 మందికి పైగా గ్రామీణ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఉత్పాదనల ప్రదర్శన

పాలుపంచుకున్న వారిలో 50 శాతానికి పైగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు..
తొలి సారి దేశవ్యాప్త వినియోగదారుల చెంతకు చేరేందుకు దక్కిన అవకాశం

మొత్తం అమ్మకాలలో 75 శాతం వాటా చేనేత, హస్తకళా ఉత్పాదనలదే..
‘సరస్ శక్తి ఫూడ్ కోర్టు’ లో రూ.1.9 కోట్లను మించి విక్రయాలు

నాడు పోస్టు చేయడమైనది: 04 NOV 2026 6:05PM by PIB Hyderabad

‘జాతీయ సరస్ మేళా’ను తొలి సారి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు వెలుపల ఆంధ్రప్రదేశ్  విజయవాడ లోని పున్నమి ఘాట్‌ వద్ద ఏర్పాటు చేయగా, ఇటీవలే విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కలసి నిర్వహించింది. దీనిలో 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ‘లఖ్‌పతి దీదీల’తో పాటు, స్వయంసహాయ బృందాల (ఎస్‌హెచ్‌జీస్)కు చెందిన దాదాపు 1,500 మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా పాలుపంచుకున్నారు. వారు 600 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేళాను రోజూ సగటున 45,000 మంది మొదలు 50,000 మంది దాకా సందర్శించారు.

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 2026 అక్టోబర్ 15న ఈ ఒకటో జాతీయ సరస్ మేళాకు విచ్చేసి, దీనిని ప్రారంభించారు. సరస్ స్టాళ్లను రాష్ట్రపతి చూసి, ‘లఖ్‌పతి దీదీల’తో మాట్లాడారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరింత మంది ఎదుగుతుండటమే కాకుండా ఆర్థిక నిర్ణయాలను తీసుకొనే ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాల మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతోందని తెలిసి తాను సంతోషిస్తున్నానని రాష్ట్రపతి అన్నారు.


మేళాను జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థ (ఎన్ఐఆర్‌డీపీఆర్), ‘కుడుంబశ్రీ’ల సహకారంతో ఏర్పాటు చేశారు.  కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నరు శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్, శ్రీ కె. రామ్‌మోహన్ నాయుడులతో పాటు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ పాల్గొన్నారు.


పల్లె ప్రాంతాల మహిళలకు చేనేత, హస్తకళలు, ప్రాకృతిక ఆహారోత్పాదనలు, ప్రాంతీయ వంటకాలను ప్రదర్శించడానికి ఒకటో జాతీయ సరస్ మేళా వారికి జాతీయ స్థాయి వేదికను సమకూర్చింది. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెబుతున్న ‘‘వోకల్ ఫర్ లోకల్’’ (స్థానిక ఉత్పాదనలనే విరివిగా కొనుగోలు చేద్దాం) మాటలను అనేక మంది ఆచరణలో పెట్టేందుకు ఈ కార్యక్రమం తోడ్పడింది. అంతేకాదు, ఇది ‘దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన - నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్’ (డీఏవై - ఎన్ఆర్ఎల్ఎమ్) ద్వారా 2029 కల్లా ఆరు కోట్ల మంది ‘లఖ్‌పతి దీదీలు’ (లక్షాధికారి అక్కలు, చెల్లెమ్మలు)గా జీవితంలో వృద్ధి లోకి వచ్చే దిశగా కృషి చేయలని సూచించిన గౌరవనీయ ప్రధానమంత్రి మాటలను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు సహకరించిన కార్యక్రమంగా నిలిచింది. స్వయంసహాయ బృందాలలో సభ్యత్వం ఉన్న మహిళలకు నైపుణ్యాలను పెంపొందింపచేసుకోవడానికి, ఆర్థిక సహాయాన్ని అందుకొనే అవకాశాలను కల్పించడానికి, కొత్త కొత్త మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడానికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారడానికి మార్గాన్ని సుగమం చేస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఓ ప్రధాన మార్పును తీసుకురావడంపైన ఈ ప్రచార ఉద్యమం తన దృష్టిని కేంద్రీకరిస్తున్నది.

 


కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ మేళాను గురించి మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వాతంత్య్రాన్ని బలోపేతం చేయడానికి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నాయని, దీని కోసం సాంకేతికతను, మెరుగైన మార్కెటింగును ఉపయోగించుకొంటున్నామన్నారు. ‘ఎస్‌హెచ్‌ఈ మార్టులు’, ‘స్వయం ఆంధ్రా బ్రాండ్’ వంటి కార్యక్రమాల దన్నుతో, స్వయంసహాయ బృందాల ఉత్పాదనలను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ నమూనాను దేశం నలుమూలలకు విస్తరించే ఆలోచన ఉందని మంత్రి తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మహిళలు ఉపాధి కోసం ఎదురుచూడడాని కన్నా తాము ఇతరులకు కూడా ఉద్యోగాలను ఇచ్చే స్థాయికి చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం కొన్ని వారాలకు పరిమితమయ్యే ప్రదర్శనగానే మిగిలిపోకూడదని, గ్రామసీమల్లో మహిళలు తయారు చేసిన ఉత్పాదనల అమ్మకం ఏడాది పొడవునా సాగేటట్లు అవకాశాలను కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.
మేళాలోని స్టాళ్లను ఇతర ప్రముఖులు చూసి, గ్రామీణ హస్తకళా ఉత్పాదనలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఔత్సాహిక పారిశ్రమికవేత్తలతో వారు మాట్లాడారు. ప్రముఖులలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, భారత్‌లో చైనా రాయబారి శ్రీ జూ ఫిహోంగ్ కూడా ఉన్నారు.
మేళాలో రూ.12.8 కోట్లకు మించి అమ్మకాలు జరిగాయి. వాటిలో ‘సరస్ శక్తి ఫూడ్ కోర్ట్’ నెలకొల్పిన స్టాళ్లలో రూ.1.9 కోట్ల కన్న ఎక్కువ అమ్మకాలు నమోదయ్యాయి. మొత్తం 75 శాతం విక్రయాలు చేనేత, హస్తకళా ఉత్పాదనలే. అత్యధిక అమ్మకాలు జరిగిన స్టాల్‌ సంపాదన రూ.15.6 లక్షలుగా నమోదైంది. మేళా చివరి వారంలో అర్నబ్ తుపాను ప్రభావం విజయవాడ మీద కూడా ప్రసరించిన కారణంగా అక్టోబర్ 28వ, 29వ తేదీల్లో మేళాను తాత్కాలికంగా మూసివేయవలసివచ్చింది. అననుకూల వాతావరణ పరిస్థితులు, రవాణాకు అంతరాయం ఏర్పడినప్పటికీ రాష్ట్ర పాలన యంత్రాంగం, నిర్వాహకులు భద్రతకు, కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఫలితంగా, ఒకటో జాతీయ సరస్ మేళా ముగింపు రోజు దాకా వివిధ వర్గాల దృష్టిని ఆకట్టుకొంది. 12 లక్షల మందికి పైగా మేళాకు తరలివచ్చారు.
ఎన్ఐఆర్‌డీపీఆర్ అసిస్టెంట్ డైరెక్టరు శ్రీ చిరంజీ లాల్ స్వాగతోపన్యాసంతో ముగింపు కార్యక్రమాన్ని ఆరంభించారు. యన్‌టీఆర్ జిల్లా కలెక్టరు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ డాక్టర్ జి. లక్ష్మీషాతో పాటు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ’ (ఎస్ఈఆర్‌పీ), ఎన్ఐఆర్‌డీపీఆర్ ‌లకు చెందిన ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొని చేనేత, హస్తకళలు, ప్రాకృతిక ఆహార ఉత్పాదనలు, లైవ్ ఫూడ్ కేటగిరీలలో స్వయంసహాయ బృందాలకు పురస్కారాలను ప్రదానం చేశారు. ఉత్పాదనల నాణ్యత, ప్యాకేజింగ్, స్టాల్ రూపకల్పన, బ్రాండింగ్, వినియోగదారులను ఆకర్షించడం, కొత్త రకాలైన ఉత్పాదనలను పరిచయం చేయడం, ఉత్పాదనల విశిష్టతలను వివరించిన తీరు, సామాజిక మాధ్యమాలలో ఉనికిని చాటుకోవడం వంటి కేటగిరీలలో కూడా మరికొన్ని పురస్కారాలను బహూకరించారు. మేళా నిర్వహణకు తోడ్పాటును అందించిన రాష్ట్ర నోడల్ అధికారులు, జిల్లా సమన్వయకర్తలు, జిల్లా పాలనయంత్రాంగం, ఎస్ఈఆర్‌పీ, ఎన్ఐఆర్‌డీపీఆర్, కుడుంబశ్రీ జట్లకు కూడా అవార్డులను ఇచ్చారు.
ధరలను ఖరారు చేసే విధానం, నాణ్యత విషయంలో వినియోగదారులకు ఉండే అంచనాలు, ప్యాకేజింగ్, వినియోగదారుల ఇష్టాలను గురించిన అవగాహనను మేళాలో పాల్గొన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏర్పరుచుకోగలిగారు.  పది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లతో పాటు 15 క్లస్టర్-స్థాయి సమాఖ్యలు మేళాలో పాలుపంచుకున్నాయి. ‘లఖ్‌పతి దీదీల’ కోసమే ప్రత్యేకంగా నెలకొల్పిన మండపం 21 మంది గ్రామీణ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వారి ప్రస్థానం వివరాలను కళ్లకు కట్టింది. వారిలో 11 మంది వార్షిక టర్నోవరు రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ఉంది. ఏడాదిలో కనీసం రూ.1 లక్ష ఆదాయాన్ని ఆర్జిస్తున్న కుటుంబాల నుంచి ఒక్కొక్క స్వయంసహాయ బృంద సభ్యురాలిని లఖ్‌పతి దీదీగా వ్యవహరిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న లఖ్‌పతి దీదీల విజయ గాథలను మేళా సందర్శకులు తెలుసుకున్నారు. అలాంటి ఒక స్ఫూర్తి దాయక కథే తిరుపతికి చెందిన లోటస్ స్వయంసహాయ బృందానికి చెందిన చంద్రలేఖది. ఈమె.. కలపను చిత్రిక పట్టి వివిధ రకాల వస్తువులను తయారు చేసే కుటుంబ వ్యాపార బాధ్యతల్ని.. భర్త మరణించడంతో.. 2007లో స్వీకరించారు. ఈమె సారథ్యంలోని వాణిజ్య సంస్థ వార్షిక టర్నోవర్  ప్రస్తుతం రూ.1 కోటికి మించింది. ఇదే మాదిరిగా, ఉత్తర గోవాకు చెందిన మహామాయ స్వయంసహాయ బృందంలోని సిద్ధి కూడా తన వ్యాపార స్థాయిని పెంపొందింపచేశారు. ఈమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సాంప్రదాయిక దుస్తులకు విదేశీ ఆర్డర్లను అందుకుంటున్నారు.  ఇప్పుడు ఈ స్వయంసహాయ బృందం టర్నోవర్ ఏటా రూ.60 లక్షలకు పైబడింది.    
లెర్నింగ్, నాలెడ్జ్ పెవిలియన్లో రోజువారీ విక్రయాలు, కొనుగోలుదారులతో మాటామంతీ జరపడమే కాకుండా సంస్థలు, కార్పొరేట్ ప్రపంచం ప్రతినిధులతో వాణిజ్యం స్థాయిని పెంపొందించడమెలాగో వివరించే శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. దీదీల కోసం 50కి పైగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా ఉత్పాదనను వినియోగదారుల చెంతకు ఎలా చేర్చాలి, ఆర్థిక సహాయాన్ని ఎలా పొందాలన్న అంశాలతో పాటు డిజిటల్ పరికరాలకు సంబంధించిన మార్గదర్శకత్వాన్ని కూడా అందించారు. బ్రాండింగ్, ఉత్పాదన రూపకల్పన, స్వయంసహాయ బృందాల ఆధ్వర్యంలోని వాణిజ్య సంస్థలకు ఎగుమతి మార్కెటింగ్ అవకాశాలపై సమాచారాన్ని ఎన్ఐఆర్‌డీపీఆర్ అందించింది. ఆర్థిక సహాయాన్ని అందుకోవడం ద్వారా స్వయంసహాయ బృందాలు వాణిజ్యాన్ని ఎలా విస్తరించుకోవచ్చో ‘నాబార్డ్’ ప్రతినిధులు వివరించారు. యూనిసెఫ్ తన వంతుగా ఆర్థిక పరిజ్ఞ‌ానంతో పాటు చిన్న వాణిజ్య సంస్థలను ప్రారంభించడం, వానిని నిర్వహించడంలో కృత్రిమ మేధను ఉపయోగిచడం అంశాలపై డిజిటల్ పాఠ్యక్రమాలను పరిచయం చేసింది. ఇందులో భాగంగా ‘కంప్యూటర్ దీదీ’, ‘దీదీ కీ దుకాన్’ వంటి వాణిజ్య సంస్థల ఉదాహరణలను గురించి తెలిపారు. ఇవి చిన్న వానిజ్య సంస్థలకు ఎలా సహకరిస్తాయో వివరించారు.  
మీట్ అండ్ గ్రీట్ పెవిలియన్లో కొనుగోలుదారు-అమ్మకందారు సమావేశాలను పదింటిని నిర్వహించారు. వీటిలో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కార్పొరేట్ స్థాయిలో కొనుగోలు విధానం, చిల్లర విక్రేతల వ్యవస్థల పట్ల అవగాహనను పెంచుకొనేటట్లు ప్రోత్సహించారు. ఈ సమావేశాలలో ఫ్యాబ్‌ఇండియా, హెచ్‌సీఎల్ ఆధ్వర్యంలోని ‘మై ఈ-హాట్’ల ప్రతినిధి వర్గాలు పాలుపంచుకున్నాయి. ప్రదర్శన ముగిసిన తరువాతా వాణిజ్య సంబంధాలను నెలకొల్పుకొనే అవకాశాలను ఈ సమావేశాలు అందించాయి.
కన్వర్జెన్స్ పెవిలియన్లో 20 కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలను కొలువుదీర్చారు. వీటిలో ఎమ్ఎస్ఎమ్ఈ, జౌళి, వ్యవసాయం, గిరిజన వ్యవహారాల విభాగం వంటివి కలిసి ఉన్నాయి. రుణ సదుపాయానికి నోచుకోవడం ఎలా, ‘ఉద్యమ్’లో నమోదు చేసుకోవడమెలా, చట్టప్రకారం చెల్లుబాటయ్యే ధ్రువపత్రాలను అందుకోవడం ఎలా అనే విషయాలను బోధించారు. డిజిటల్ ఫెసిలిటేషన్ డెస్కులు నెలకొల్పి డిజిటల్ లావాదేవీల వైపు మొగ్గు చూపడాన్ని ప్రోత్సహించారు. ఈ డెస్కులలో యూపీఐని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై మార్గదర్శనం చేశారు. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్ (జీఈఎమ్), ఫ్లిప్‌కార్డ్ సమర్థ్, మీషో వేదికలలో నమోదు చేసుకోవడాన్ని పరిచయం చేశారు. దీంతో గ్రామ ప్రాంతాల వాణిజ్య సంస్థలకు కొత్త మార్కెట్ల చెంతకు చేరుకోవడం ఇక సులభతరం కానుంది.
సరస్ శక్తి ఫూడ్ కోర్టులో 50 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిని 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన 200 మందికి పైగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నడిపారు. ప్రాంతీయ రుచులతో పాటు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కస్టమర్ అసిస్టెంటును  అందుబాటులోకి తీసుకు వచ్చారు. దీని సహాయంతో సందర్శకులు స్కాన్ చేసి, ఆహార పదార్థాల పట్టికను పరిశీలించగలిగారు. తమ ఇష్టాలకు అనుగుణంగా ఏ విధమైన ఆహారాన్ని స్వీకరించాలో సూచనలు, సలహాలు అందుకున్నారు. తోటి వినియోగదారులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను గమనించగలిగారు. లద్దాఖ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గోవా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సహా 10కి పైగా రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు నిత్యం మేళాకు వచ్చిన వారికి విశిష్టమైన అనుభూతిని కలిగించాయి. దేశంలో విభిన్న ప్రాంతాల హస్తకళలు, ఆహార పానీయాలు, ప్రదర్శన కళారూప సంప్రదాయాల కలబోతను ఈ కార్యక్రమాలకు హాజరైన సందర్శకులు ఆస్వాదించారు.
మేళాతో పాటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన సహకార భాగస్వామి ‘సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ’ (ఎస్ఈఆర్‌పీ) ఆధ్వర్యంలో ‘ఆంత్రప్రన్యోర్‌షిప్ డెవలప్‌మెంట్ అండ్ యాక్సిలరేషన్ ప్రోగ్రాము’ను (ఈడీఏపీ) ఏర్పాటు చేశారు. దీనికి నోడల్ ఏజెన్సీగా ఇండియా ఎస్ఎమ్ఈ ఫోరమ్ వ్యవహరించింది. వాణిజ్య సంస్థ అభివృద్ధితో ముడిపడిన వివిధ దశలపై ఈ కార్యక్రమంలో అవగాహనను కలిగించారు. నిపుణుల వద్ద నుంచి విషయాల్ని నేర్చుకోవడం, ఉత్పాదనలను మార్కెట్టులో విక్రయించడానికి సిద్ధం చేయడం, డిజిటల్ మాధ్యమాల ద్వారా నమోదు, ఉత్పాదనను కళ్లకు కట్టడం, ‘ఉద్యమ్’లో నమోదు ప్రక్రియ, కొనుగోలుదారులతో అనుబంధాన్ని ఏర్పరుచుకోవడం ఎలాగన్నవి తెలియజేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలలో నిపుణుల నుంచి నేర్చుకొనే కార్యక్రమానికి 3,489 మంది హాజరయ్యారు. ఉత్పాదనలను గురించి 138 లైవ్ డెమాన్‌స్ట్రేషన్లను చేపట్టారు. 288 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఫోటోగ్రఫీలో, ప్యాకేజింగులో మార్గదర్శనం చేశారు. 452 మంది విక్రేతలకు మీషో పై నమోదుకు సంబంధించిన సహాయాన్ని అందించారు. ఉత్పాదన సూచీతో 3,383 కొత్త వాట్సాప్ బిజినెస్ ఖాతాలను ఆరంభించారు. ‘స్వయమ్’ హెల్ప్‌డెస్క్ ద్వారా మొత్తం 15,231 ‘ఉద్యమ్’ రిజిస్ట్రేషన్లను పూర్తి చేశారు.
ఒకసారి వాడే ప్లాస్టిక్‌ను తగ్గించే, సుస్థిర ప్రాతిపదికన నిర్వహించుకొనే పద్ధతులను ప్రోత్సహించడానికి గాను ఆచరణాత్మక చర్యలను మేళాలో చేపట్టారు. వస్త్రంతో రూపొందించిన 2 లక్షల సంచులను 600 కు పైగా స్టాళ్లలో అందుబాటులో ఉంచారు. ప్లాస్టిక్ సీసాల వాడకాన్ని తగ్గించడానికి మళ్లీ మళ్లీ వాడుకోదగ్గ 2,000 గాజు సీసాలు లేదా మట్టితో తయారు చేసిన సీసాలను మేళాలో పాల్గొన్న చేతివృత్తి కళాకారులకు అందజేశారు. వెదురును, గుర్రపుడెక్కను ఉపయోగించి రూపొందించిన 800 పర్యావరణానుకూల చెత్తబుట్టలను కూడా స్టాళ్ల దగ్గర ఉంచారు.
మొత్తంమీద తొలి జాతీయ సరస్ మేళా మార్కెట్టు లభ్యత, వాణిజ్య సంస్థ స్థాపన- నిర్వహణతో ముడిపడిన విషయాలను నేర్చుకోవడం, సంస్థాగత సహాయాన్ని పొందడం, డిజిటల్ మాధ్యమ వినియోగానికి సంబంధించిన మార్గదర్శనాన్ని ఒకే చోట అందజేసింది. దీంతో గ్రామీణ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వినియోగదారులతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుచుకోవడంతో పాటు మేళా నుంచి కొత్త కొత్త అవకాశాలను గుర్తించేందుకు తోడ్పాటు లభించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2333144) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Tamil , Telugu_Vw