నాడు పోస్టు చేయడమైనది:
04 NOV 2026 6:05PM by PIB Vijayawada
ఢిల్లీ-ఎన్సీఆర్ వెలుపల మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో, భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి జాతీయ సరస్ మేళా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పున్నమి ఘాట్‌లో ముగిసింది. ఇది 30కి పైగా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి స్వయం సహాయక సంఘాలు మరియు లఖ్‌పతి దీదీ లకు చెందిన దాదాపు 1,500 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఒకచోట చేర్చింది. వీరు 600 స్టాల్స్ ను ఏర్పాటు చేయగా.. రోజుకు సగటున 45,000 నుండి 50,000 మంది ప్రజలు సందర్శించారు.
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మూ 2026 అక్టోబర్ 15న మొదటి జాతీయ సరస్ మేళాను ప్రారంభించి, తిలకించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి 'సరస్' స్టాల్స్‌ను సందర్శించి 'లఖ్‌పతి దీదీ'లతో ముచ్చటించారు. మహిళా పారిశ్రామికతలో ప్రోత్సాహకరమైన వృద్ధిని గమనించడంతో పాటు, ఆర్థిక నిర్ణయాలలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం కూడా పెరిగిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

ఎన్‌ఐఆర్‌డీపీఆర్ మరియు కుడుంబశ్రీ మద్దతుతో నిర్వహించిన ఈ మేళాకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, శ్రీ కె. రామ్మోహన్ నాయుడు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు విచ్చేసారు.

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన "వోకల్ ఫర్ లోకల్" నినాదానికి అనుగుణంగా చేనేత, హస్తకళలు, సహజసిద్ధమైన ఆహార ఉత్పత్తులు మరియు ప్రాంతీయ వంటకాలను ప్రదర్శించడానికి మొదటి జాతీయ 'సరస్' మేళా గ్రామీణ మహిళలకు ఒక జాతీయ వేదికను అందించింది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డే-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) కింద 2029 నాటికి ఆరు కోట్ల మంది లఖ్‌పతి దీదీ లను తయారు చేయాలనే ప్రధాన మంత్రి స్వప్నం దిశగా ఇది ఒక ముందడుగు. స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సహాయం, మార్కెట్ అవకాశాలు మరియు పారిశ్రామిక అవకాశాలను కల్పించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పును తీసుకురావడానికి ఈ మిషన్ దృష్టి పెట్టింది.

ఈ మేళా గురించి కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. సాంకేతికత మరియు మెరుగైన మార్కెటింగ్ ద్వారా మహిళల ఆర్థిక స్వయంప్రతిపత్తిని బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని తెలిపారు. 'షీ మార్ట్స్', 'స్వయం ఆంధ్ర' బ్రాండ్ వంటి స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న నమూనాను దేశవ్యాప్తంగా విస్తరించి మరింత విస్తృతంగా స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మహిళలు ఉపాధి కోసం వెతకడం మాని ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమం కేవలం కొన్ని వారాల ప్రదర్శనగా పరిమితం కాకుండా, గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ఏడాది పొడవునా మార్కెట్ అవకాశాలు లభించేలా మార్గం సుగమం చేయాలని ఆయన సూచించారు.
మేళా జరిగే సమయంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, భారతదేశంలో చైనా రాయబారి హెచ్.ఇ. శ్రీ జు ఫేయిహాంగ్ మరియు వారి ప్రతినిధి బృందం కూడా స్టాల్స్‌ను సందర్శించి, పారిశ్రామికవేత్తలతో మాట్లాడి గ్రామీణ హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేశారు.

ఈ మేళా రూ. 12.8 కోట్లకు పైగా సంచిత అమ్మకాలను సాధించింది. ఇందులో 50 స్టాల్స్‌తో కూడిన 'సరస్ శక్తి' ఫుడ్ కోర్ట్ రూ. 1.9 కోట్లకు పైగా విక్రయాలను నమోదు చేసింది. చేనేత మరియు హస్తకళలు రెండూ కలిసి మొత్తం అమ్మకాలలో 75 శాతం వాటాను పొందాయి. మొత్తం అమ్మకాల పరంగా అత్యధిక సంపాదన సాధించిన స్టాల్ రూ. 15.6 లక్షల గరిష్ట స్థాయిని తాకింది. మేళా చివరి రోజులలో తుఫాను ప్రభావం వల్ల విజయవాడలో అక్టోబర్ 28, 29 తేదీలలో తాత్కాలికంగా మూసివేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రవాణా అంతరాయం ఏర్పడినప్పటికీ, రాష్ట్ర యంత్రాంగం మరియు నిర్వాహకులు భద్రతాపరంగా, నిర్వహణపరంగా సమర్థవంతంగా నిర్వహించారు. ఫలితంగా, ఈ మేళాముగిసే వరకు మొదటి జాతీయ సరస్ మేళా అందరినీ ఆకట్టుకోవడంతో… మొత్తం 12 లక్షలకు పైగా ప్రజలు ఈ మేళాను సందర్శించారు.
ఎన్‌ఐఆర్‌డీపీఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ చిరంజీలాల్ స్వాగతోపన్యాసంతో ముగింపు వేడుక ప్రారంభమైంది. ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ & డీఎం డాక్టర్ జి. లక్ష్మీశ, గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఎన్‌ఐఆర్‌డీపీఆర్ సంస్థలకు చెందిన ప్రముఖులు.. చేనేత, హస్తకళలు, సహజ ఆహార ఉత్పత్తులు మరియు లైవ్ ఫుడ్ కేటగిరీలలోని ఎస్‌హెచ్‌జీ లకు అవార్డులను అందజేశారు. అలాగే ఉత్పత్తుల నాణ్యత, ప్యాకేజింగ్, స్టాల్ డిజైన్, బ్రాండింగ్, కస్టమర్ ఎంగేజ్‌మెంట్, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ప్రదర్శన మరియు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం వంటి అంశాలలో కూడా పురస్కారాలు అందించారు. మేళాకు మద్దతు అందించిన రాష్ట్ర నోడల్ అధికారులు, జిల్లా సమన్వయకర్తలు, జిల్లా యంత్రాంగం మరియు సెర్ప్, ఎన్‌ఐఆర్‌డీపీఆర్, 'కుడుంబశ్రీ' బృందాలు కూడా అవార్డులను అందుకున్నాయి.
ఈ స్టాల్స్ పారిశ్రామికవేత్తలకు ధరలను నిర్ణయించడం, నాణ్యతా ప్రమాణాలు, ప్యాకేజింగ్ మరియు వినియోగదారుల ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి అవకాశాలను కల్పించాయి. ఈ మేళాలో 10 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (FPO - ఎఫ్‌పీఓలు) మరియు 15 క్లస్టర్-స్థాయి ఫెడరేషన్‌లు కూడా పాల్గొన్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'లఖ్‌పతి దీదీ' పెవిలియన్ 21 మంది గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలను, వారి వ్యాపార ప్రయాణాలను ప్రదర్శించింది. వీరిలో వార్షిక టర్నోవర్ రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి మధ్య ఉన్న 11 మంది దీదీలు కూడా ఉన్నారు. 'లఖ్‌పతి దీదీ'లు అంటే కనీసం రూ. 1 లక్ష స్థిరమైన వార్షిక ఆదాయాన్ని సంపాదించే మహిళా ఎస్‌హెచ్‌జీ (SHG) సభ్యులు.
ఈ మేళా దేశవ్యాప్తంగా ఉన్న 'లఖ్‌పతి దీదీ'ల విజయగాథలకు సాక్ష్యంగా నిలిచింది. తిరుపతికి చెందిన 'లోటస్' ఎస్‌హెచ్‌జీ (SHG) కి చెందిన శ్రీమతి చంద్రకళ తన భర్త మరణం తర్వాత 2007లో కుటుంబానికి చెందిన చెక్క శిల్పాల వ్యాపార బాధ్యతలను స్వీకరించారు. ఇప్పుడు ఆమె సంస్థ వార్షిక టర్నోవర్ రూ. 1 కోటికి పైగా ఉంది. అలాగే, నార్త్ గోవాకు చెందిన 'మహామాయ' ఎస్‌హెచ్‌జీ కి చెందిన శ్రీమతి సిద్ధి తన వ్యాపారాన్ని విస్తరించి, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎత్నిక్ వేర్ కోసం విదేశీ ఆర్డర్‌లను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వార్షిక టర్నోవర్ రూ. 60 లక్షలకు పైగా ఉంది.
రోజువారీ అమ్మకాలు, కొనుగోలుదారుల పరస్పర చర్యలతో పాటు, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ పెవిలియన్‌లో సంస్థలు మరియు కార్పొరేట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరు ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్‌పై ఇంటరాక్టివ్ శిక్షణా సెషన్లను నిర్వహించారు. దీదీల కోసం 50కి పైగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సెషన్లు ప్రొడక్ట్ ప్రెజెంటేషన్, ఫైనాన్స్ మరియు ఎస్‌హెచ్‌జీ వ్యాపారాల కోసం డిజిటల్ టూల్స్‌పై మార్గదర్శకత్వాన్ని అందించాయి. ఎన్‌ఐఆర్‌డీపీఆర్ సంస్థ ఎస్‌హెచ్‌జీ ఎంటర్‌ప్రైజెస్‌కు సంబంధించి బ్రాండింగ్, ప్రొడక్ట్ డిజైన్, ప్యాకేజింగ్‌తో పాటు ఎగుమతి మార్కెటింగ్‌పై మార్గదర్శకత్వం అందించింది. నాబార్డ్ ఫైనాన్స్ ద్వారా ఎస్‌హెచ్‌జీ ఎంటర్‌ప్రైజెస్‌ను స్కేలింగ్ చేయడంపై దృష్టి పెట్టింది. యూనిసెఫ్ చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి కృత్రిమ మేధస్సు ను ఉపయోగించడంపై డిజిటల్ కోర్సులను ప్రవేశపెట్టింది. అదనంగా ఆర్థిక అక్షరాస్యతపై కూడా శిక్షణ ఇచ్చింది. 'కంప్యూటర్ దీదీ', 'దీదీ కి దుకాన్' ఎంటర్‌ప్రైజెస్‌ల ఉదాహరణల ద్వారా ఈ టూల్స్ చిన్న వ్యాపారాలకు ఎలా మద్దతు ఇస్తాయో చూపించారు.
మీట్ అండ్ గ్రీట్ పెవిలియన్‌లో పది నిర్మాణాత్మక కొనుగోలుదారు-విక్రేత సమావేశాలు మహిళా పారిశ్రామికవేత్తలను కార్పొరేట్ ప్రొక్యూర్మెంట్, రిటైల్ ఛానెల్‌లతో అనుసంధానించాయి. ఇందులో ఫ్యాబ్ ఇండియా, హెచ్‌సీఎల్ ఫౌండేషన్‌కు చెందిన 'మై ఇ-హాట్' ప్రతినిధి బృందాలు పాల్గొన్నాయి. దీనిద్వారా ప్రదర్శన వెలుపల కూడా వ్యాపార సంబంధాలు ఏర్పడే అవకాశాలు సృష్టించబడ్డాయి.
కన్వర్జెన్స్ పెవిలియన్ ఎంఎస్‌ఎంఈ (MSME - మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెసెస్), జౌళి, వ్యవసాయం మరియు గిరిజన వ్యవహారాలతో సహా 20 కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ శాఖలను ఒకచోట చేర్చింది. దీని ద్వారా అధికారిక క్రెడిట్, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ మరియు చట్టపరమైన ధృవీకరణ పత్రాలను సులభంగా పొందవచ్చు. డిజిటల్ ఫెసిలిటేషన్ డెస్క్‌లు 100 శాతం యూపీఐ స్వీకరణతో డిజిటల్ లావాదేవీలను ప్రారంభించాయి. అలాగే గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్, ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ మరియు మీషో లలో ఆన్‌బోర్డింగ్ కల్పించి, గ్రామీణ సంస్థలు అదనపు మార్కెట్‌లను యాక్సెస్ చేయడానికి సహాయపడ్డాయి.
'సరస్ శక్తి' ఫుడ్ కోర్ట్‌లో 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 200 మందికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలు నిర్వహించిన 50 స్టాల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ప్రాంతీయ ఆహార సంప్రదాయాలతో పాటు, ఏఐ-పవర్డ్ కస్టమర్ అసిస్టెంట్ సందర్శకులకు మెనూలను స్కాన్ చేయడానికి మరియు యాక్సెస్ చేయడానికి వీలు కల్పించింది. వారి ప్రాధాన్యతల ఆధారంగా డిష్ సిఫార్సులను స్వీకరించడానికి మరియు కస్టమర్ సమీక్షలను వీక్షించడానికి ఇది ఉపయోగపడింది. లడఖ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గోవా, ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్‌లతో సహా 10కి పైగా పాల్గొనే రాష్ట్రాల నుండి వచ్చిన రోజువారీ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ అనుభవాన్ని మరింత పెంచాయి. ఇది భారతదేశం నలుమూలల నుండి కళ, వంటకాలు మరియు ప్రదర్శన సంప్రదాయాలను ఒకచోట చేర్చింది.
సహకార భాగస్వామి అయిన గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక కీలకమైన ముందడుగు ‘ఉద్యమ అభివృద్ధి మరియు వేగవంతమైన వృద్ధి కార్యక్రమం (ఈడాప్)’. ఇది ఇండియా ఎస్‌ఎంఈ ఫోరమ్ ప్రధాన సంస్థగా మేళా వేదిక వద్ద నిర్వహించబడింది. ఈ కార్యక్రమం నిపుణుల అభ్యాసం, ఉత్పత్తి సిద్ధత, డిజిటల్ అనుసంధానం, ప్రదర్శన, ఉద్యమ్ నమోదు మరియు కొనుగోలుదారుల భాగస్వామ్యాన్ని కవర్ చేసే వ్యాపార మార్గాన్ని అనుసరించింది. నిపుణుల సమావేశాలలో 3,489 హాజరీలు నమోదయ్యాయి. 138 ప్రత్యక్ష ఉత్పత్తి ప్రదర్శనలు జరిగాయి. 288 మంది పారిశ్రామికవేత్తలు ఫోటోగ్రఫీ మరియు ప్యాకేజింగ్ మద్దతును పొందారు. 452 మంది విక్రేతలు మీషో అనుసంధాన మద్దతును పొందారు. ఉత్పత్తి వివరాల జాబితాలతో కూడిన 3,383 కొత్త వాట్సాప్ వ్యాపార ఖాతాలు అందుబాటులోకి వచ్చాయి. స్వయం సహాయక కేంద్రం ద్వారా మొత్తం 15,231 ఉద్యమ్ నమోదులు సాధించబడ్డాయి.
ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్‌ను తగ్గించడానికి, స్థిరమైన కార్యక్రమ పద్ధతులను ప్రోత్సహించడానికి మేళాలో ఆచరణాత్మక చర్యలు చేర్చబడ్డాయి. 600కి పైగా స్టాల్స్‌లో మొత్తం 2 లక్షల గుడ్డ సంచులు అందుబాటులో ఉంచబడ్డాయి. ప్లాస్టిక్ సీసాల వినియోగాన్ని తగ్గించడానికి పాల్గొనే కళాకారులకు 2,000 పునర్వినియోగ గాజు లేదా మట్టి సీసాలు సరఫరా చేశారు. స్టాల్స్ అంతటా 800 పర్యావరణ అనుకూల వెదురు/వాటర్-హైసింత్ చెత్తబుట్టలు కూడా అందించారు.
మొత్తంమీద, మొదటి జాతీయ 'సరస్' మేళా మార్కెట్ విస్తృత, ఎంటర్‌ప్రైజ్ లెర్నింగ్, సంస్థాగత మద్దతు మరియు డిజిటల్ యాక్సెస్‌ను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఇది గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు కస్టమర్ సంబంధాలను ఏర్పరచుకోవడంలో, కార్యక్రమానికి మించి అవకాశాలను అన్వేషించడంలో మద్దతు ఇచ్చింది.
***