నాడు పోస్టు చేయడమైనది:
04 NOV 2026 7:02PM by PIB Hyderabad
నక్సల్ రహిత భారత్ నిర్మాణంలో భద్రత కార్యకలాపాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పునరావాసం కీలకమైనవి: నాగపూర్ రేంజ్ స్పెషల్ ఇనిస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సందీప్ పాటిల్
నాగపూర్/గడ్చిరోలి, 2026 నవంబర్ 4
‘‘నక్సల్ ముక్త భారత్’’ అంశంపై ఒక రోజు వార్తాలాప్ మీడియా వర్కుషాపును గడ్చిరోలి పోలీసుల భాగస్వామ్యంతో నాగపూర్ పత్రికా, సమాచార కార్యాలయం (పీఐబీ) నిర్వహించింది. 2026 నవంబర్ 4న గడ్చిరోలి పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఏకలవ్య హాలులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రాంతంలో మారుతున్న భద్రత, అభివృద్ధి పరిస్థితులు, వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దేశం చేపట్టిన ప్రయత్నాల గురించి పోలీసు ఉన్నతాధికారులు, ఈ అంశంలో నిపుణులు, మీడియా నిపుణులు చర్చించారు. ఈ కార్యక్రమంలో గడ్చిరోలి జిల్లాకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు.
విశిష్ట అతిథులకు స్వాగతం పలకడంతో ఈ కార్యక్రమం మొదలైంది. అనంతరం పీఐబీ నాగపూర్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అధికారి శ్రీ సౌరభ్ ఖేకడే ప్రారంభోపన్యాసం చేశారు. ప్రభుత్వానికి, మీడియాకు మధ్య అనుసంధాన వేదికగా వార్తాలాప్కు ఉన్న ప్రాముఖ్యాన్ని ఆయన వివరించారు. అలాగే ఈ ప్రాంతంలో చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధ పనుల గురించి కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించడంలో ప్రాంతీయంగా ఉన్న జర్నలిస్టులు పోషిస్తున్న పాత్ర గురించి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నాగపూర్ రేంజ్ యాంటీ నక్సల్ ఆపరేషన్స్ ఏఎన్‌వో, స్పెషల్ ఇనిస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు శ్రీ సందీప్ పాటిల్ వర్చువల్‌గా పాల్గొన్నారు. అర్బన్ మావోయిజం, దాని విస్తృత పరిణామాల గురించి ఆయన మాట్లాడారు. నిరంతర ప్రయత్నాలు, నిబద్ధతతో కూడిన భద్రతా బలగాల కార్యకలాపాలు, జాతీయ ప్రాధాన్యమున్న అనేక కార్యక్రమాల ద్వారా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నుంచి నక్సల్ రహిత జిల్లాగా గడ్చిరోలి మారిందని ఆయన వివరించారు. భద్రతా దళాలు, సమర్థమైన పోలీసింగ్, అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన సమన్వయ విధానం ద్వారా శాశ్వతమైన మార్పును ఎలా తీసుకురావచ్చో గడ్చిరోలి ప్రయాణం నిరూపిస్తోందని ఆయన అన్నారు. నక్సల్ ముక్త భారత్ దిశగా సాగుతున్న దేశ ప్రయాణంలో గడ్చిరోలి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.
సంఘటిత మావోయిస్టు నెట్‌వర్క్‌లు రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి విసురుతున్న సవాళ్ల గురించి, మారుమూల ప్రాంతాల్లో సాయుధ కార్యకలాపాలకు అతీతంగా మావోయిస్టు ఉద్యమం విస్తరించిన విధానం గురించి ఆయన చర్చించారు.
మావోయిస్టుల సవాలుకు సంబంధించిన సంస్థాగత వ్యవస్థలు, సైద్ధాంతిక ప్రభావం, సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలకు ఆవల పనిచేస్తున్న నెట్‌వర్క్‌లతో సహా దాని విస్తృత కోణాల గురించి ఆయన వివరించారు. భద్రతా చర్యలతో పాటు అభివృద్ధి, ప్రజా చైతన్యాన్ని కూడా మేళవించే సమగ్ర విధానం ద్వారా ఈ సవాలును ఎదుర్కోవాల్సిన ప్రాధాన్యం గురించి తెలియజేశారు.
వామపక్ష తీవ్రవాదానికి ప్రతిస్పందన కేవలం భద్రతా చర్యలకే పరిమితం కాకూడదని శ్రీ పాటిల్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయడం లాంటి ప్రయత్నాలు కూడా అందులో భాగంగా ఉండాలని శ్రీ పాటిల్ అన్నారు. భారత రాజ్యాంగం ద్వారానే నిజమైన విప్లవం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనను భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
మావోయిస్టు ఆర్థిక కార్యకలాపాల గురించి విధాన విశ్లేషకులు శ్రీ పీవై రమణ చర్చించారు. వామపక్ష తీవ్రవాద ఆర్థిక కోణాలు, స్థానిక వనరులు, ఆర్థిక కార్యకలాపాలతో దానికున్న సంబంధాల గురించి అవగాహన కల్పించారు. ఈ చర్చలో ఖనిజ సంపద, స్థానిక ఆర్థిక నిర్మాణాలు, మావోయిస్టు కార్యకలాపాలతో ముడిపడి ఉన్న ఆర్థిక నెట్‌వర్క్‌ల ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా వివరించారు..
స్థానిక సమాజాలు, అభివృద్ధిపై ఇలాంటి కార్యక్రమాల ప్రభావాన్ని పరిశీలించడంతో పాటు, ఈ సంఘర్షణకు సంబంధించిన ఆర్థిక కోణాలను అర్ధం చేసుకోవడం కూడా ముఖ్యమన్నారు. వామపక్ష తీవ్రవాద ఆర్థిక పరిణామాలపై మీడియా సమగ్రమైన అవగాహనతో, సమతుల్య దృక్పథంతో వార్తలు అందించాల్సిన అవసరాన్ని ఈ సమావేశం స్పష్టం చేసింది.
వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో గడ్చిరోలి ప్రయాణం
కార్యకలాపాల తీరుతెన్నుల గురించి, వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో జిల్లా సాగించిన ప్రయాణం, ఏళ్లుగా మారుతున్న భద్రతా పరిస్థితుల గురించి గడ్చిరోలి పోలీసు సూరింటెండెంట్ శ్రీ ఎం రమేష్ వివరించారు.
స్థిరమైన భద్రతా కార్యకలాపాలు, మెరుగైన నిఘా సమాచార సేకరణ, సమన్వయ చర్చల ద్వారా మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడంలో సాధించిన పురోగతి గురించి వివరించారు. ఇటీవలి సంవత్సరాల్లో మావోయిస్టు క్యాడర్‌పై నిర్వహించిన ప్రధాన ఆపరేషన్లు, లొంగిపోతున్న వారి సంఖ్య పెరగడం తదితర ముఖ్యమైన పరిణామాల గురించి తెలియజేశారు.
జిల్లాలో మారుతున్న భద్రతా పరిస్థితులకు, భద్రతా దళాలు చేపడుతున్న స్థిరమైన ప్రయత్నాల ద్వారా సాధించిన పురోగతికి ఉన్న ప్రాధాన్యం గురించి కూడా ఆయన మాట్లాడారు. మావోయిస్టు సంస్థల్లో కొత్త నియామకాలను అడ్డుకోవడం, లొంగిపోయేలా క్యాడర్‌ను ప్రోత్సహించి ప్రధాన జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చేలా ప్రోత్సహించడంపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తిరుగుబాటు నిరోధక సామర్థ్యాలు, అంతర్రాష్ట్ర సమన్వయం, భద్రతా మౌలిక వసతులను బలోపేతం చేయడం, నిఘా, పర్యవేక్షణ వ్యవస్థలను మెరుగుపరచడం తదితర అంశాల ప్రాధాన్యం గురించి కార్యాచరణ చర్చలో వివరించారు. మావోయిస్టు కార్యకలాపాలను ఎదుర్కోవడంలో సీ–60 లాంటి ప్రత్యేక దళాలు పోషిస్తున్న పాత్ర గురించి కూడా వివరించారు.
మావోయిజం అనంతర పరిస్థితులపై సీనియర్ జర్నలిస్టు శ్రీ కార్తీక్ లోఖండే మాట్లాడారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితుల గురించి చర్చించారు. ఆ ప్రాంతాల్లో వస్తున్న మార్పులను డాక్యుమెంట్ చేయడం, అభివృద్ధికి సంబంధించిన మార్పులను, క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఈ చర్చ తెలియజేసింది.
నాగపూర్ రేంజ్ డిప్యూటీ ఇనిస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ యోగేశ్ కుమార్ ఐపీఎస్ వందన సమర్పణ చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నుంచి నక్సల్ రహిత జిల్లాగా గడ్చిరోలి రూపాంతరం చెందడంలో తన దశాబ్ద అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. ప్రభుత్వంపై, ప్రధాన స్రవంతిపై స్థానిక ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే ఈ ప్రయాణంలో సాధించిన అతిపెద్ద విజయమని ఆయన అన్నారు. గడ్చిరోలిని నక్సల్ రహితంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బంది, కమాండోల అంకితభావం, శౌర్యం, త్యాగాలను ప్రశంసించారు. వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడమే తమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.
గడ్చిరోలి అదనపు ఎస్పీ (కార్యకలాపాలు) శ్రీ కార్తీక్ మధిర, అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ గోకుల్ రాజ్ జీ తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు, భద్రతా చర్యల ప్రభావం, ప్రభావిత వర్గాల పునరావాసంపై వార్తలు అందించడంలో ప్రాంతీయ మీడియా బాధ్యతను వార్తాలాప్ తెలియజేసింది. అదేవిధంగా ఆ ప్రాంతంలోని సవాళ్లను, సాధిస్తున్న పురోగతిని రెండింటినీ తెలియజేసే సమతుల్యమైన, వాస్తవ ఆధారిత వార్తా సేకరణ ఆవశ్యకతను కూడా వివరించింది.
నక్సల్ ముక్త భారత్ కార్యక్రమంలో భద్రతాపరమైన, ఆర్థికపరమైన, అభివృద్ధి పరమైన కోణాల గురించి సీనియర్ పోలీసు అధికారులు, ఈ అంశంలో నిపుణులతో చర్చించే వేదికను ఈ వార్తాలాప్ వర్కుషాప్ పాత్రికేయులకు అందించింది. శాంతిని పరిరక్షించడంలో భద్రత, పరిపాలన, మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల పంపిణీ, పునరావాసం, సామాజిక భాగస్వామ్యంతో కూడిన సమగ్ర విధానానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఈ కార్యక్రమం తెలియజేసింది. ప్రభుత్వ విధానాలు, పథకాలు, విజయాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రసారం చేయడంలో పీఐబీ పోషిస్తున్న పాత్ర గురించి మీడియా ప్రతినిధులకు ఈ కార్యక్రమం వివరించింది. అలాగే సమాచారంతో కూడిన, కచ్చితమైన, బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ ప్రాధాన్యాన్ని తెలియజేసింది. జర్నలిస్టుల ఫీడ్‌బ్యాక్ తీసుకోవడంతో ఈ కార్యక్రమం ముగిసింది.
***