నాడు పోస్టు చేయడమైనది:
03 NOV 2026 4:42PM by PIB Hyderabad
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ప్రభుత్వ వ్యవసాయ, ప్రాసెస్‌డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) సహకారంతో హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లా నుంచి 1.3 మెట్రిక్ టన్నుల సింధూరి రకం దానిమ్మలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్‌కు ఎగుమతి చేశారు.
రెండు కిలోల చొప్పున ప్యాక్ చేసిన 650 పెట్టెలతో కూడిన ఈ ఎగుమతి సరుకును ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమామా ఎక్స్‌పోర్ట్స్ సంస్థ విదేశాలకు పంపించింది. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీఓ), ఎగుమతిదారు మధ్య అనుసంధానం ఏర్పడింది. తద్వారా హిమాచల్‌ప్రదేశ్ ఉద్యానవన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు లభిస్తున్నాయి. స్థానిక రైతులు, సుమారు 600 మందితో అనుబంధం కలిగిన భుంటార్ ఎఫ్‌పీఓ నుంచి నేరుగా దానిమ్మలను సేకరించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన సేకరణ, సమన్వయ ప్రక్రియల్లో కులు జిల్లా ఉద్యానవన శాఖ యంత్రాంగం సహకారం అందించింది.
హిమాచల్‌ప్రదేశ్‌లో సాగు చేస్తున్న దానిమ్మ రకాల్లో సింధూరితో పాటు భగ్వా, కంధారి రకాలు కూడా ఉన్నాయి. ఆకర్షణీయమైన ఎరుపు రంగు తొక్క, రసభరితమైన గింజలు, తీపి - పులుపు కలగలిసిన రుచితో సింధూరి దానిమ్మలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. తాజా పండుగా వినియోగించేందుకు అనువైన ఈ రకానికి ఎగుమతి మార్కెట్లలోనూ మంచి అవకాశాలు ఉన్నాయి.
రైతులకు మార్కెట్ అవకాశాలను విస్తరించి, వారిని మార్కెట్లతో మరింత బలోపేతంగా అనుసంధానించడంలో ప్రత్యక్ష సేకరణ, రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్‌పీఓలు) సమష్టి భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తాయని ఈ కార్యక్రమం చాటిచెబుతోంది. ఈ ఎగుమతిలో పాల్గొన్న రైతులకు దేశీయ మార్కెట్‌లో అప్పటివరకు అమలులో ఉన్న ధరతో పోలిస్తే 50 శాతం అధిక ధర లభించింది. ఇలాంటి ఎగుమతి ఆధారిత మార్కెట్ అనుసంధానాలు రైతులకు అదనపు విక్రయ అవకాశాలను కల్పించడంతో పాటు నాణ్యతకు ప్రాధాన్యమిచ్చే ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఎఫ్‌పీఓల భాగస్వామ్యం మరింత పెరగడానికి కూడా దోహదపడతాయి.
2025 - 26 ఆర్థిక సంవత్సరంలో ఏపీఈడీఏ పరిధిలోని వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులు అత్యంత సానుకూల ఫలితాలను సాధించాయి. యూఏఈకి సుమారు 2.59 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వ్యవసాయ, ప్రాసెస్‌డ్ ఆహార ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేసింది. ఈ ఎగుమతుల మొత్తం పరిమాణం సుమారు 38.1 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైంది. కొనుగోలుదారుల డిమాండ్, నాణ్యతా ప్రమాణాలు, అమల్లో ఉన్న దిగుమతి నిబంధనలకు అనుగుణంగా హిమాచల్‌ప్రదేశ్ ఉద్యానవన ఉత్పత్తులకు ఈ మార్కెట్‌లో మరిన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఎగుమతి సరుకును ఏపీఈడీఏ ఛైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్ అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఈడీఏ అధికారులు, ఉద్యానవన శాఖ ప్రతినిధులు, ఎగుమతిదారులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులు, భాగస్వామ్య రైతులు పాల్గొన్నారు. ప్రాంతీయ ఉద్యానవన ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలను అభివృద్ధి చేయడంలో రైతులు, ఉత్పత్తిదారుల సంస్థలు, ఎగుమతిదారులు, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.
కులు దానిమ్మలను దుబాయ్‌కు ఎగుమతి చేయడం ద్వారా యాపిల్ ఎగుమతుల్లో ఇప్పటికే గుర్తింపు పొందిన హిమాచల్‌ప్రదేశ్ వ్యవసాయ ఎగుమతుల పరిధిని మరింత విస్తరించే ప్రయత్నాలకు ఊతం లభించింది. దానిమ్మలు, పెర్సిమన్ పండ్లు, రాతి గుజ్జు పండ్లు (స్టోన్ ఫ్రూట్స్), పండ్ల రసాలు, తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉండే ఆహార ఉత్పత్తులు వంటి ఇతర ఉత్పత్తులకు కూడా విదేశీ మార్కెట్లను అన్వేషించే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది..నాణ్యతా నిర్వహణ, మార్కెట్ అనుసంధానాలు, ఎగుమతి నిబంధనల పాటింపుపై నిరంతర దృష్టి సారించడం ద్వారా స్థానిక రైతులకు మరిన్ని అవకాశాలు లభించడంతో పాటు అంతర్జాతీయ వ్యవసాయ వాణిజ్యంలో రాష్ట్ర భాగస్వామ్యం మరింత బలోపేతం కావచ్చు.
ఏపీఈడీఏ తన ఎగుమతుల ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా భారతీయ ఎగుమతిదారులు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు) అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేందుకు నిరంతరం సహకరిస్తోంది. తద్వారా భారత వ్యవసాయ, ప్రాసెస్‌డ్ ఆహార ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృత మార్కెట్ అవకాశాలను కల్పిస్తోంది.
***