ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పూణే మెట్రోకు చెందిన సుమారు రూ. 21,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభం, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

మెరుగైన రవాణా అనుసంధానం ఉన్న పుణే వేగంగా అభివృద్ధి చెందుతుంది. కొత్త మెట్రో ప్రాజెక్టులు నగర అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి: ప్రధాని

దేశ యువత కలలు, ఆకాంక్షలకు పుణే కేంద్రంగా ఉంది. మెట్రో అనుసంధానం మరింత బలోపేతం కావడం నగర అభివృద్ధికి కొత్త ఊపునిస్తుంది: ప్రధాని

నగరాలు కేవలం నివాస ప్రాంతాలు మాత్రమే కాదు.. దేశ ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలు. దేశవ్యాప్తంగా వందలాది చిన్న నగరాలను చురుకైన అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దాలి: ప్రధాని

నేడు భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా, పేదరికాన్ని అత్యంత వేగంగా తగ్గిస్తున్న దేశంగానూ నిలుస్తోంది: ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 03 NOV 2026 2:43PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సుమారు రూ.21,800 కోట్ల విలువైన పూణే మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. పూణే ప్రజలకు, మహారాష్ట్ర వాసులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రోజువారీ జీవితంలో కొత్త ప్రజా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినప్పుడు పండుగ ఆనందం మరింత రెట్టింపవుతుందని అన్నారు. పదేళ్ల క్రితం పూణే మెట్రో తొలి దశకు తాను శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. హింజేవాడి నుంచి శివాజీనగర్‌ వరకు మెట్రో మార్గాన్ని ప్రారంభించడం ద్వారా ప్రధాన ఐటీ కేంద్రానికి మెరుగైన రవాణా అనుసంధానం లభిస్తుందని, నేడు ప్రారంభించిన కొత్త మార్గం నగరంలోని పాత, కొత్త ప్రాంతాలను మరింతగా అనుసంధానిస్తుందని పేర్కొన్నారు.

 

పూణేను దేశానికి, సమాజానికి నిరంతరం దిశానిర్దేశం చేసిన ఆలోచనల చారిత్రక కేంద్రంగా అభివర్ణించిన ప్రధానమంత్రి.. ప్రస్తుతం ఈ నగరం యువత ఆకాంక్షలకు కేంద్రంగా ఎదుగుతోందని అన్నారు. ఐటీ, ఆటోమొబైల్‌, ఔషధాలు, అంకుర సంస్థలు, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో వికసిత్‌ భారత్‌ దిశగా సరికొత్త శక్తిని చాటుతోందని పేర్కొన్నారు. “ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో అనుసంధానం మరింత బలోపేతం కావడం పూణే నగర అభివృద్ధికి కొత్త ఊపునిస్తుంది” అని ప్రధాని శ్రీ మోదీ అన్నారు. 

 

పూణే మెట్రో విస్తరణ వికసిత్‌ భారత్‌ కోసం ఆధునిక నగరాలను ఎలా తీర్చిదిద్దుతున్నామో తెలియజేస్తోందని ప్రధానమంత్రి వివరించారు. గతంలో పరిశ్రమలు, ఆహార సంస్కృతి, స్థానిక ఉత్పత్తులు వంటి అంశాల ఆధారంగా నగరాల ప్రత్యేకతను గుర్తించేవారని, ప్రస్తుతం వాటి పోటీతత్వం, జీవన సౌలభ్యం ఆధారంగా కూడా అంచనా వేస్తున్నారని అన్నారు. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు, ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందించే మెట్రో రైలు వ్యవస్థలు ఈ రెండు అంశాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. నగరంలో ప్రయాణ సమయం ఆదా కావడం పట్టణ ఉత్పాదకతను పెంచుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. “ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడు పేదలు, మధ్యతరగతి ప్రజలు కూడా దాని ప్రయోజనాలు పొందుతారు” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

ప్రజానుకూల, చురుకైన పాలనకు ఈ కార్యక్రమం ఒక ప్రధాన ఉదాహరణగా నిలుస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో దేశంలోని మెట్రో రైలు వ్యవస్థ 26 నగరాల్లో దాదాపు 1,200 కిలోమీటర్లకు విస్తరించిందని తెలిపారు. రోజూ కోటి మందికి పైగా ప్రయాణికులకు సేవలందిస్తోందని చెప్పారు. “ప్రస్తుతం భారత మెట్రో నెట్‌వర్క్‌ ప్రపంచంలోని మూడు అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది” అని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు

 

2014లో మహారాష్ట్రలో కేవలం 10 నుంచి 11 కిలోమీటర్ల మేర మాత్రమే మెట్రో మార్గాలు అందుబాటులో ఉండేవని, అప్పటి నుంచి దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న మార్పులకు మహారాష్ట్ర కూడా ప్రతిబింబంగా నిలిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 175 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలు సేవలందిస్తున్నాయని, మరో 680 కిలోమీటర్లకు పైగా మార్గాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందుకోసం రూ.2.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. “ఈ నిధులు కార్మికుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇంజినీర్లకు ఉపాధి కల్పిస్తున్నాయి. దుకాణాలు, కర్మాగారాల్లోనూ ఉద్యోగావకాశాలను సృష్టిస్తున్నాయి” అని శ్రీ మోదీ అన్నారు.

 

కొత్తగా ప్రారంభించిన మెట్రో మార్గంలోని మరో ప్రత్యేకతను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ఉమ్మడి భాగస్వామ్యంతో పబ్లిక్‌-ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో ఈ మార్గాన్ని నిర్మించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. “ఈ అభివృద్ధి నమూనా విజయవంతమైతే దేశ ప్రగతికి మరింత ఊతం లభిస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

 

మనమంతా సాధించగలం’ అనే దేశవ్యాప్త స్ఫూర్తితో వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి భారతదేశంలోని ప్రతి పౌరుడు, యువత కృషి చేస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. గత 12 ఏళ్లలో గ్రామీణ రహదారులు, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, కొత్త రైల్వే మార్గాలు, విద్యుదీకరించిన రైల్వే లైన్లు, పొడవైన సొరంగ మార్గాలు, ఎత్తైన వంతెనల నిర్మాణంపై దేశం దృష్టి సారించిందని గుర్తుచేశారు. “రాబోయే సంవత్సరాల్లో వీటితో పాటు, మన నగరాలను ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలుగా తీర్చిదిద్దేందుకు కూడా దేశం తన శక్తిసామర్థ్యాలను వినియోగించనుంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

నగరాలు కేవలం నివాస ప్రాంతాలు మాత్రమే కాకుండా, ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన చోదక శక్తులని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వందలాది చిన్న పట్టణాలను అభివృద్ధి కేంద్రాలుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పట్టణ సవాళ్ల నిధి (అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌)కి ఆమోదం తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. పట్టణాభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనుందని వివరించారు. ఈ ప్రయత్నంలో స్థానిక సంస్థలు, ప్రైవేటు రంగ భాగస్వాములు మిషన్‌ తరహాలో కలిసిరావాలని పిలుపునిచ్చారు. “ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర తన పాత్రను మరింత విస్తరిస్తుందని నాకు నమ్మకం ఉంది” అని ప్రధాని శ్రీ మోదీ అన్నారు. 

 

భారత్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న రెండు ప్రధాన విజయాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. స్పష్టమైన అంతర్జాతీయ పరిస్థితుల మధ్య కూడా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ తన స్థానాన్ని నిలబెట్టుకుందని పేర్కొన్నారు. తాజా ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, కేవలం 10 నుంచి 12 ఏళ్లలోనే దేశంలో 50 కోట్ల మంది ప్రజలను తీవ్ర పేదరికం నుంచి బయటపడేసిందని తెలిపారు. తరతరాలుగా కేవలం నినాదాలకే పరిమితమైన పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని భారత్‌ ఇప్పుడు ఆచరణలో సాధిస్తోందని అన్నారు. “గతంలో పేదరికంపై పోరాటం కేవలం నినాదాలకే పరిమితమైంది. నేడు భారత్‌ క్షేత్రస్థాయిలో పేదరికాన్ని ఓడిస్తోంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలవడం, పేదరికాన్ని అత్యంత వేగంగా తగ్గిస్తున్న దేశంగా గుర్తింపు పొందడం అనే రెండు విజయాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని ప్రధానమంత్రి వివరించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం, బడ్జెట్‌ కేటాయింపులు పెరగడం వల్ల ప్రజా పెట్టుబడులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గతంలో కుంభకోణాలు, నిధుల దుర్వినియోగం కారణంగా ప్రజలకు చేరకుండా పోయిన సొమ్ము ఇప్పుడు నేరుగా లబ్ధిదారులకు చేరుతోందని పేర్కొన్నారు. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, మెట్రో రైళ్లు, విద్యుత్‌, నీరు, గ్యాస్‌ పైప్‌లైన్ల వంటి మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నాయని తెలిపారు. “ఈ రెండు విజయాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి” అని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

పేదలకు ఇళ్లు, మరుగుదొడ్లు, ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీటి సరఫరా, వంట గ్యాస్‌ కనెక్షన్లు వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రస్తావిస్తూ.. ఈ కనీస సౌకర్యాలు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని ప్రధానమంత్రి అన్నారు. రోజువారీ జీవితంలో విలువైన సమయాన్ని ఆదా చేస్తున్నాయని పేర్కొన్నారు. “ఆదా అయిన ఈ సమయాన్ని కుటుంబాల కోసం అదనపు ఆదాయం సంపాదించేందుకు వినియోగిస్తున్నారు” అని ప్రధానమంత్రి తెలిపారు.

 

పేదలకు సాధికారత కల్పిస్తే పేదరికాన్ని అధిగమించే ధైర్యం వారిలో పెరుగుతుందనే నినాదంతో పాలనాపరమైన బాధ్యతలు చేపట్టి గత నెలతో 25 ఏళ్లు పూర్తయిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ‘గరీబ్‌ కల్యాణ్‌ మేళా’లను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో లబ్ధిదారులను వేదికపైకి ఆహ్వానించి, పేదరికాన్ని ఓడిస్తామని ప్రతిజ్ఞ చేయించేవారని వివరించారు. “వారు పేదరికాన్ని ఓడించాలని సంకల్పం తీసుకుని, ఆత్మవిశ్వాసంతో కార్యక్రమం నుంచి తిరిగి వెళ్లేవారు” అని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

అప్పట్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ‘సాధికారత కల్పించే శక్తి’ అనే సుపరిపాలనా సూత్రంతో నిరంతరాయంగా కొనసాగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ మార్పు ఒక్కసారిగా చోటుచేసుకున్నది కాదని, ఎన్నో ఏళ్లుగా ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా చేసిన కృషి ఫలితమని స్పష్టం చేశారు. “అందుకే 50 కోట్ల మంది భారతీయులు పేదరికాన్ని ఓడించగలిగారు” అని ప్రధాని అన్నారు.

 

పేదరికం నుంచి బయటపడిన కుటుంబాలకే కాకుండా, దేశమంతటికీ పేదరికం తగ్గడం వల్ల ప్రయోజనం కలుగుతుందని ప్రధానమంత్రి వివరించారు. ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తుందని, కొనుగోలు శక్తి పెరిగిన కొత్త మధ్యతరగతిని సృష్టిస్తుందని చెప్పారు. ఈ కొనుగోలు శక్తి మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచి, దుకాణాల నుంచి కర్మాగారాల వరకు కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు. “అంటే, భారత్‌లో పేదరికం తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్తోంది” అని ప్రధాని శ్రీ మోదీ అన్నారు. 

 

వికసిత్‌ భారత్‌ ప్రయాణంలో రైతుల కీలక పాత్రను, వారికి సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి తెలియజేశారు. ఇటీవలి సంవత్సరాల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆధ్వర్యంలో విస్తృతంగా నీటి సంరక్షణ పనులు చేపట్టినప్పటికీ.. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా మహారాష్ట్రలోని రైతు కుటుంబాలు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గుర్తించారు. కరువు పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు సహాయం అందించడంతో పాటు, పీఎం కిసాన్‌ నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేసిందని పేర్కొంటూ, రైతులకు ప్రభుత్వం తరఫున పూర్తి సంఘీభావం తెలిపారు. “రైతులు ఏమాత్రం ఆందోళన చెందవద్దు. మేమంతా రైతులకు అండగా ఉన్నాం” అని శ్రీ మోదీ భరోసా ఇచ్చారు. 

 

ఈ పండుగల సమయంలో సామాజిక బాధ్యతను గుర్తుంచుకోవాలని ప్రధానమంత్రి ప్రజలకు సూచించారు. కరువు ప్రభావిత ప్రజలు, రైతు కుటుంబాలు, ఇతర ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తుంచుకోవాలని, వారి ఇళ్లలోనూ దీపావళి ఆనందం వెల్లివిరిసేలా చూడాలని కోరారు. ఈ విపత్తును అధిగమించేందుకు దేశమంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. “మనమంతా కలిసికట్టుగా మాత్రమే ఈ విపత్తును ఎదుర్కోగలం” అని ప్రధాని స్పష్టం చేశారు.

 

వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి సమష్టి కృషి, ‘సబ్‌కా ప్రయాస్‌’ అత్యంత కీలకమని పేర్కొన్నారు. “ఇదే స్ఫూర్తితో దేశాభివృద్ధి కోసం మనమంతా నిరంతరం కృషి చేయాలి” అని మోదీ పిలుపునిచ్చారు.  మెట్రో ప్రాజెక్టులు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. 

***


(రిలీజ్ ఐడి: 2332108) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Nepali , Bengali , Assamese , Gujarati , Odia , Tamil , Kannada