యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మై భారత్‌ చేపట్టిన ‘వికసిత్ భారత్ యువ సంవాద్: నో యువర్ వోట్’ ప్రచారం ద్వారా 20 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో 60 కార్యక్రమాల నిర్వహణ


11,800 మందికి పైగా యువత భాగస్వామ్యం

నాడు పోస్టు చేయడమైనది: 02 NOV 2026 8:16PM by PIB Hyderabad

మేరా యువ భారత్‌ (మై భారత్‌) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నేడు నిర్వహించిన ‘వికసిత్‌ భారత్‌ యువ సంవాద్‌: నో యువర్‌ వోట్‌’ (మీ ఓటు గురించి తెలుసుకోండి) కార్యక్రమాల్లో 11,800 మందికి పైగా యువత పాల్గొన్నారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని యువజన వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. తాజా విడత కార్యక్రమాలతో కలిపి ఇప్పటివరకు 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 220 యువ సంవాద్‌ కార్యక్రమాలు జరిగాయి. వీటి ద్వారా 43,995 మంది యువత, 220 మంది యువ ప్రతినిధులు (యూత్‌ ఐకాన్లు) భాగస్వాములయ్యారు.

 

ఈ దేశవ్యాప్త ప్రచారం 2026 అక్టోబర్‌ 26 నుంచి నవంబర్‌ 5 వరకు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 500 విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న యువతతో పాటు యువతలో ఎన్నికలపై అవగాహన పెంపొందించడం, ప్రజాస్వామ్య ప్రక్రియలో వారు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకుని చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ ప్రచారం ప్రధాన ఉద్దేశం. ఓటు హక్కులు, ఎన్నికల విధానాలు, పౌర బాధ్యతలపై యువతకు అవగాహన కల్పించడంతో పాటు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, యువ ప్రతినిధులు, ఇతర ప్రముఖులతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని ఈ కార్యక్రమం కల్పిస్తోంది. 

 

న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాలు, రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష్‌ మల్హోత్రా హాజరయ్యారు. ఓటు హక్కులు, ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం ప్రాధాన్యం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో బాధ్యతాయుత పౌరులుగా యువత పోషించాల్సిన పాత్రపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

 

పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో జరిగిన కార్యక్రమానికి రణఘాట్‌ (ఎస్సీ) లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ శ్రీ జగన్నాథ్‌ సర్కార్‌ హాజరై విద్యార్థులతో మాట్లాడారు. అసోంలో నాగావ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ శ్రీ దేవాశిష్‌ శర్మ యువతతో ముచ్చటించారు. 

 

బిహార్‌లోని పూర్వీ చంపారన్‌ (మోతిహారి), సివాన్‌ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో సామూహికంగా ‘లోక్‌తాంత్రిక్‌ ప్రతిజ్ఞ’ (సామూహిక ప్రజాస్వామ్య) చేశారు. బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యంలో చురుకుగా పాల్గొంటామని ఈ సందర్భంగా పాల్గొన్నవారు పేర్కొన్నారు. కతిహార్‌ సదర్‌ ఎమ్మెల్యే, బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తార్కిశోర్‌ ప్రసాద్‌ కతిహార్‌లో జరిగిన యువ సంవాద్‌ కార్యక్రమంలో యువతతో మాట్లాడారు. ఓటు ప్రాధాన్యతను అర్థం చేసుకుని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చురుకుగా భాగస్వాములు కావాలని వారిని ప్రోత్సహించారు.

 

హర్యానాలోని పానిపట్‌లో వుషు క్రీడాకారుడు, యువ ప్రతినిధి ఆర్యన్‌ సూద్‌ యువతతో మాట్లాడారు. రాజకీయాల్లో యువత పాత్ర, ఓటుపై అవగాహన, క్రీడారంగంలో కెరీర్‌ అవకాశాలపై వారితో చర్చించారు. పంజాబ్‌లోని మాన్సాలో నిర్వహించిన కార్యక్రమంలో యూత్‌ ఐకాన్‌, పాల్గొన్న యువత మధ్య ముఖాముఖి చర్చ జరిగింది. అనంతరం సామూహికంగా ‘లోక్‌తాంత్రిక్‌ ప్రతిజ్ఞ’ చేశారు.

 

మధ్యప్రదేశ్‌లోని బర్వానీ, బాలాఘాట్‌, భింద్‌, ఛింద్వారా, దిండోరి, గుణ, పన్నా, రత్లాం, సాగర్‌ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో యూత్‌ ఐకాన్‌లు, క్రీడారంగ ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో యువత ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ కార్యక్రమాల్లో ‘లోక్‌తాంత్రిక్‌ ప్రతిజ్ఞ’ కూడా నిర్వహించారు. మై భారత్‌ ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలు, దాని డిజిటల్‌ వేదికల గురించి కూడా యువతకు పరిచయం చేశారు.

 

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ (సుల్తాన్‌పూర్‌)లో జరిగిన కార్యక్రమంలో యువ ప్రతినిధి ప్రసంగం ఇచ్చారు. అనంతరం ప్రశ్నోత్తరాల రూపంలో చర్చ నిర్వహించారు. “సామాజిక మాధ్యమ ప్రముఖుడు (ఇన్‌ఫ్లుయెన్సర్)‌ రిషభ్‌ మిశ్రా యువతను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు కవితలు వినిపించారు. డాక్టర్‌ ధనంజయ్‌ సింగ్‌, విషువ్‌ మిశ్రా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసి, యువతతో మాట్లాడారు.

 

ఈ కార్యక్రమాల ద్వారా మై భారత్‌ యువతకు ప్రజాప్రతినిధులు, యువ ప్రతినిధులతో నేరుగా మాట్లాడే అవకాశాలను కల్పిస్తోంది. ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం, పౌర బాధ్యతలపై చర్చల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2332004) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Odia , English , Urdu , हिन्दी , Assamese , Gujarati