నాడు పోస్టు చేయడమైనది:
31 OCT 2026 2:38PM by PIB Hyderabad
దేశీయ జౌళి పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు లభ్యతను దృష్టిలో ఉంచుకుని, పత్తి దిగుమతులపై ప్రస్తుతం అమల్లో ఉన్న కస్టమ్స్ సుంకం మినహాయింపును 2026 డిసెంబర్ 31 వరకు భారత ప్రభుత్వం పొడిగించింది.
ఈ పొడిగింపునకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం 2026 అక్టోబర్ 30న నోటిఫికేషన్ నంబర్ 35/2026-కస్టమ్స్ జారీ చేసింది. ఈ సవరణ ద్వారా 2026 అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉన్న సుంకం మినహాయింపును మరో రెండు నెలలు, అంటే డిసెంబర్ 31 వరకు పొడిగించారు.
దేశీయ వస్త్ర రంగానికి పత్తి లభ్యతను పెంచడం, ప్రత్యేక అవసరాలకు అనుగుణమైన పత్తి సరఫరాను అందుబాటులో ఉంచడం, జౌళీ, దుస్తుల తయారీ ప్రక్రియలో వివిధ దశల్లో అదనపు విలువను పెంచేందుకు తోడ్పడటం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.
ఈ చర్య వల్ల వస్త్రాలు, దుస్తుల తయారీదారులు తమ ముడిసరుకు అవసరాలను తీర్చుకోవడంలో మరింత వెసులుబాటు లభిస్తుందని, ఉత్పత్తి వ్యయంపై ఒత్తిడి తగ్గుతుందని అంచనా. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) మద్దతు లభించడంతో పాటు, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారత జౌళి పరిశ్రమ పోటీతత్వం బలోపేతం కానుంది.
ఈ పొడిగింపు ద్వారా ముడిసరుకు సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడటానికి, వస్త్ర పరిశ్రమ కార్యకలాపాల్లో సౌలభ్యాన్ని పెంచడానికి, పత్తి ఆధారిత వస్త్రాలు, దుస్తుల రంగంలో మరింత అదనపు విలువను సృష్టించడానికి వీలవుతుందని భావిస్తున్నారు.
పోటీతత్వం కలిగిన, ఒడిదొడుకులను తట్టుకోగలిగే, ప్రపంచ మార్కెట్లతో అనుసంధానమైన వస్త్ర రంగాన్ని ప్రోత్సహించడం, అదనపు విలువ సృష్టి, ఉపాధి కల్పనను పెంపొందించడం, మొత్తం వస్త్ర తయారీ విలువ గొలుసు దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడటానికి వస్త్ర మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
***