నాడు పోస్టు చేయడమైనది:
31 OCT 2026 10:48AM by PIB Hyderabad
గుజరాత్‌లోని ఏక్తానగర్ కేవడియాలో జరుగుతున్న భారత్ పర్వ్-2026లో జౌళి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐసీ) పాల్గొంటోంది. అక్టోబర్ 30, 2026న గౌరవ ప్రధానమంత్రి ఏక్తానగర్‌లోని సీసీఐసీ పెవిలియన్‌ను సందర్శించటం సీసీఐసీకి ఎంతో గర్వకారణమైన, చిరస్మరణీయ క్షణంగా నిలిచింది. ఈ సందర్శన ద్వారా సీసీఐసీ గొప్ప వారసత్వాన్ని, చేనేత-చేతివృత్తుల వారితో సుదీర్ఘ అనుబంధాన్ని, భారతదేశ సంప్రదాయ చేనేత, హస్తకళల వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు చేస్తున్న నిరంతర కృషిని ప్రదర్శించేందుకు అవకాశం లభించింది.
చేనేత కార్మికులు, హస్తకళాకారులకు మెరుగైన మార్కెట్ అవకాశాలను, స్థిరమైన ఉపాధి మార్గాలను కల్పించటం ద్వారా ఆర్థికంగా శక్తిమంతులను చేయటంలో సీసీఐసీ ప్రయాణాన్ని ఈ పెవిలియన్ తెలియజేస్తుంది. భారతదేశ సంప్రదాయ హస్తకళలను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించటం ద్వారా 'వోకల్ ఫర్ లోకల్' నినాదానికి, 'లోకల్ టు గ్లోబల్' దార్శనికతకు సీసీఐసీ సహకారాన్ని అందిస్తోంది.
ఈ పెవిలియన్‌లో సీసీఐసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బిమల్ గోపాలాచారి, కార్పొరేషన్ అధికారులు, హస్తకళాకారులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఈ పెవిలియన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల అద్భుతమైన నైపుణ్యాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గుజరాత్ కళాకారులు అగేట్ రాళ్లు, రత్నాలతో చేసే సంప్రదాయ కళను, అందమైన అప్లిక్ పనితనాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నారు.
భారత చేనేత, హస్తకళల గొప్ప, వైవిధ్యభరితమైన వారసత్వాన్ని సీసీఐసీ ఘనంగా చాటుతోంది. దేశం నలుమూలల నుంచి అసాధారణమైన కళాత్మకత, సృజనాత్మకత, నైపుణ్యాన్ని ఒకే వేదికపైకి తెస్తున్న ఈ ప్రదర్శన... భారతదేశ సజీవ సాంస్కృతిక వారసత్వాన్ని, స్వదేశీ కళారూపాల కాలాతీత అందాలను ప్రతిబింబించే పలు సంప్రదాయ, చేతివృత్తుల ఉత్పత్తులను ప్రదర్శిస్తోంది.
గుజరాత్‌లోని కేవడియా ఏక్తానగర్‌లో నవంబర్ 15, 2026 వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుంది.
***