నాడు పోస్టు చేయడమైనది:
30 OCT 2026 11:05AM by PIB Hyderabad
దేశంలో సింథెటిక్ డ్రగ్స్ తయారీకి వ్యతిరేకంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) చేపట్టిన ఒక ప్రధాన చర్యలో భాగంగా ఉత్తరప్రదేశ్ జాలౌన్ జిల్లా లోని ఓ మారుమూల గ్రామంలో పెద్ద ఎత్తున గప్‌చిప్‌గా సాగుతున్న మాదక పదార్థాల తయారీ ప్రయోగశాల గుట్టును రట్టు చేశారు. ఈ క్రమంలో, సుమారు 1,100 కిలోల మత్తు పదార్థాలు, తయారీ కోసం వాడటానికి ఉంచిన పూర్వ-రసాయనిక పదార్థాలతో (ప్రికర్సర్ కెమికల్స్) పాటు తయారీ సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.

రహస్య సమాచారం అందడంతో డీఆర్ఐ అధికారులతో కూడిన ఒక పెద్ద బృందం ఉత్తరప్రదేశ్ తీవ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) సహకారంతో నిన్న, అంటే 2026 అక్టోబర్ 29న ఉదయం అనుమానిత స్థలానికి వెళ్లి సమన్వయపూర్వక దాడిని నిర్వహించింది. ఆ స్థలాన్ని సోదా చేసిన మీదట ఓ ప్రయోగశాల పూర్తి స్థాయిలో పనిచేస్తూ కృత్రిమ మందులను ఉత్పత్తి చేస్తున్నారని తేలింది. అక్కడి నుంచి 184 కేజీల సగం తయారైన మందులతో పాటు, దాదాపు 582 కేజీల రసాయనాలను, తయారీ ప్రక్రియలో ఉపయోగించిన సంబంధిత ఉపకరణాలను జప్తు చేశారు.

నిందితుల నివాస ప్రాంగణాలను తనిఖీ చేసి 15.4 కేజీల తయారైన మెథక్వాలోన్‌ను, దాదాపు 153 కేజీల రసాయనాలను, తయారీకి ఉపయోగిస్తున్న ఒక యంత్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరొక నిందితుని నివాసాన్ని సోదా చేసి 168 కేజీల పూర్వ-రసాయనిక పదార్థాలను జప్తు చేశారు. ఈ గోప్య తయారీ కేంద్రంతో సంబంధం కల ఇద్దరు వ్యక్తులను ఎన్‌డీపీఎస్ చట్టం-1985 నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు.
పెద్ద ఎత్తున తయారు చేసిన మందులను, సగం తయారు చేసిన సామగ్రిని, పూర్వ-నిర్మిత రసాయనాలను, తయారీకి ఉపయోగిస్తున్న పరికరాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అక్కడ చట్టవిరుద్ధంగా మత్తు మందులను తయారు చేస్తున్న సంఘటిత నెట్‌వర్క్ చురుకుగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు బయటపడింది. ఈ దాడితో, అక్రమ మాదక ద్రవ్యాల తయారీ వ్యవస్థను చెప్పుకోదగిన రీతిలో దెబ్బ తీసినట్లయింది. పెద్ద ఎత్తున మందులను, వాటి తయారీకి వాడదలచిన పూర్వ నిర్మిత రసాయనాలను ధ్వంసం చేశారు. నకిలీ మందులను మరిన్నింటిని ఇకపై తయారు చేయకుండా అడ్డుకోవడంలో అధికారులు విజయం సాధించారు.
మత్తుమందులను, మానసిక రోగాన్ని తెచ్చిపెట్టి మనుషులను వ్యసనపరులుగా మార్చివేసే పదార్థాలను అక్రమంగా చేరవేసే వర్గాల పని పట్టడానికి డీఆర్ఐ కట్టుబడి ఉంది. ఈ మందులను గుట్టుగా తయారు చేస్తున్న నెట్‌వర్కులను దెబ్బతీయడంతో పాటు, చట్టానికి వ్యతిరేకంగా ఈ మందులను సరఫరా చేస్తున్న వ్యవస్థలను భగ్నం చేయాలనే కృత నిశ్చయంతో డీఆర్ఐ పనిచేస్తోంది.
***