మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
30 OCT 2026 7:55AM by PIB Hyderabad
భారతదేశ మత్స్యపాలన రంగం కేవలం ఉత్పత్తిపైనే శ్రద్ధ వహించడానికి మించి పెను మార్పులపైన దృష్టిని సారిస్తోంది. ఈ రంగం జాతీయ ఆర్థిక వ్యవస్థలో చైతన్యవంతమైన, సాంకేతిక ఆధారిత, విలువ జోడింపునకు ప్రాధాన్యాన్నిస్తున్న రంగంగా పురోగమిస్తోంది. దేశానికి ఆహార భద్రతను, పోషణ భద్రతను బలపరచడంలో, ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో, గ్రామీణ జీవనోపాధి మార్గాలకు దన్నుగా నిలవడంలో, ఎగుమతుల రూపేణా ఆదాయార్జనలో తన వంతుగా కీలక తోడ్పాటును అందిస్తోంది.
అదనపు విలువ జోడింపు, శీతల గిడ్డంగుల అభివృద్ధి, ఆధునిక ప్రాసెసింగ్ పద్ధతులు, మొబైల్ మత్స్య విక్రయాలు, అంకుర సంస్థలు నాయకత్వ పాత్రను పోషిస్తుండగా నూతన ఆవిష్కరణలు జోరు అందుకొంటున్న తీరు.. వీటి నేపథ్యంలో మత్స్య విస్తారిత అనుబంధ వ్యవస్థలో ప్రధాన పరివర్తన చోటు చేసుకొంది. ఈ రంగంలోని వాణిజ్య సంస్థలు గుర్తింపు సామర్థ్యాన్ని (ట్రేసబులిటీ), ఉత్పాదకతను, నాణ్యం విషయంలో హామీని, కోతల అనంతర నిర్వహణను మెరుగుపరుచుకోవడానికి కృత్రిమ మేధను (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను, బ్లాక్ చైన్, డ్రోన్ సాంకేతికత, స్మార్ట్ కోల్డ్-చైన్ వ్యవస్థలు, చేపలు/రొయ్యల పెంపకంలో కచ్చితమైన పద్ధతుల అనుసరణను రోజు రోజుకు అధిక స్థాయులకు విస్తరించుకొంటున్నాయి. ఈ చర్యలు నష్టాలను గణనీయంగా తగ్గిస్తున్నాయి. లాభదాయకత పెరుగుతోంది. మత్స్య పాలన రంగ విలువ మరింత బలోపేతం అవుతోంది.
విలువ జోడింపు ప్రక్రియ భారతదేశ మత్స్యపాలన రంగాన్ని ప్రాథమికంగా ఉత్పత్తి కార్యకలాపాలకు పరిమితం చేయడానికి బదులు వివిధీకృత, మార్కెట్ ప్రధాన వాణిజ్య వ్యవస్థగా రూపాంతరం చెందడంలో ఓ ముఖ్య కారకంగా ఎదుగుతోంది. ఈ ప్రక్రియ.. చేపలు, మత్స్య సంబంధిత ఉత్పాదనలను ప్రాసెస్ చేసి, ప్యాక్ చేసి, బ్రాండు విలువను సంతరించి, ఉపయోగానికి సంసిద్ధపరిచినవిగా అందుబాటులోకి తీసుకు వచ్చి దేశీయ మార్కెట్లతో పాటు ఎగుమతి మార్కెట్లలో మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యాలకు అనుగుణంగా మెరుగైన ధరలను రాబట్టుకోవడానికి అనుకూలంగా తగినవిగా తీర్చిదిద్దుతోంది. అంతేకాకుండా, పంట కోత అనంతరం ఎదురయ్యే నష్టాలను తగ్గిచడంలో, నిల్వ కాలాన్ని పొడిగించడంలో, సరఫరా వ్యవస్థలోని వివిధ దశలలో నాణ్యతా ప్రమాణాలను పెంచడంలో కూడా ఈ ప్రక్రియ సాయపడుతోంది. ఇది మరీ ముఖ్యంగా మత్స్యకారులు, మహిళా సంఘాలు, యువత, సహకార సంఘాలు, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, కోల్డ్-చైన్ లాజిస్టిక్స్, మార్కెటింగ్, రిటైల్ కార్యకలాపాలలో నిమగ్నమైన చిన్న వాణిజ్య సంస్థలకు ఉద్యోగాల కల్పనలోనూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడంలోనూ కొత్త కొత్త అవకాశాలను ప్రసాదిస్తోంది. ఇలా చేస్తూ, మార్కెట్ సంబంధాలను విలువ జోడింపు ప్రక్రియ బలోపేతం చేస్తోంది. ఆదాయాలను పెంపొందిస్తోంది. అలాగే మత్స్య రంగాన్ని సురక్షితమైన, సౌకర్యవంతమైన, అధిక నాణ్యతతో కూడిన సముద్ర ఆహారానికి (సీఫూడ్) అంతకంతకూ పెరుగుతున్న మార్కెట్టులో ఇదివరకటితో పోలిస్తే అధిక ప్రభావవంత పద్ధతిలో పోటీ పడటానికి విలువ జోడింపు ప్రక్రియ దన్నుగా నిలుస్తోంది.
ఈ రంగాన్ని ఉత్పాదన మొదలు మార్కెటింగ్ వరకు సుదృఢంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో విలువ జోడింపునకు అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చే విధానాన్ని అనుసరించడమే కాక, మత్స్య పాలన రంగంలో దశ వారీ సార్వజనిక పెట్టుబడులను పెంచుకుంటూ పోవడంతో పాటు లక్షిత విధానాలను ప్రవేశపెడుతున్నారు. మత్స్య పాలన రంగంలో సార్వజనిక పెట్టుబడిని 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్పుకోదగిన రీతిన పెంచుతోంది. బ్లూ రివల్యూషన్ స్కీము, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (ఎఫ్ఐడీఎఫ్), ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ (పీఎమ్ఎమ్ఎస్వై), ‘ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ్-యోజన’ (పీఎమ్-ఎమ్‌కేఎస్ఎస్‌వై), కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) వంటి ప్రధాన పథకాలు, కార్యక్రమాలను తీసుకువచ్చి రూ.39,272 కోట్లు అందించారు. మౌలిక సదుపాయాలను విస్తరించడం, ఉత్పత్తి, పంట కోత అనంతర నిర్వహణ వ్యవస్థలను పటిష్టపరచడం, దేశవ్యాప్తంగా 74.66 లక్షల మంది మత్స్యకారులు, చేపల రైతులకు ఉద్యోగ కల్పన, జీవనోపాధి అవకాశాలను అందించడం ఈ చర్యల లక్ష్యం.
దీనితో పాటు రవాణా, లాజిస్టిక్స్ నెట్వర్కులపైన కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా రూ.3,393.85 కోట్ల పెట్టుబడితో 46,500 కేంద్రాలను జతపరిచారు. వీటిలో చేపల రవాణా వ్యవస్థ, చిల్లర, టోకు చేపల మార్కెట్లు, చిన్న విక్రయ కేంద్రాలు, దాణా మిల్లులు, ఐస్ ప్లాంటులు, శీతల గిడ్డంగులు, విలువను జోడించే వాణిజ్య విభాగాలు ఉన్నాయి. దీనికి అదనంగా అయిదు ఆధునిక, స్మార్ట్ ఫిష్ మార్కెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఆధునిక సమాచార సాంకేతిక వ్యవస్థలను, పర్యావరణ అనుకూల సాంకేతికతను, రవాణా సరఫరా వ్యవస్థలను ఒకే చోట నెలకొల్పుతున్నారు. ఈ మార్కెట్ల వల్ల 15,900 ఉద్యోగ అవకాశాలు లభించగలవని భావిస్తున్నారు.
మౌలిక సదుపాయాల కల్పనను, లాజిస్టిక్స్‌ను పటిష్టపరచడంతో పాటు అధిక నాణ్యత కలిగిన చేపల వేల్యూ చైనును పరిరక్షించడానికి వాసి గల ముడిపదార్థాల లభ్యత కూడా అంతే ప్రధానం. భారతదేశంలో అధిక విలువ కలిగిన మత్స్య ఉత్పాదనల విలువలను విస్తరించాలంటే నాణ్యమైన ముడిసరకును నిరంతరం అందుబాటులో ఉంచడం కూడా ఎంతో కీలకంగా మారింది. ఈ దిశగా, వేగంగా వృద్ధి చెందే, మెరుగైన రోగనిరోధక శక్తి కలిగిన, ప్రతికూల పరిస్థితులకు తట్టుకొని నిలవగల, అధిక ఉత్పాదకత కలిగిన చేపల రకాలను అభివృద్ధిపరచడానికి జన్యుపరమైన మెరుగుదల కార్యక్రమాలను విభాగం ఆరంభించింది. ఈ ప్రయత్నంతో దేశంలో వినియోగానికి, ప్రాసెస్ చేసి ఎగుమతి చేయడానికి ట్రావుట్, రొయ్య, కత్లా, రోహూ, తిలాపియా, పంగాసియస్, సీబాస్, స్కాంపీ వంటి అధిక విలువను కలిగివుండే చేపల రకాలను అందుబాటు లోకి తీసుకురావడంలో సాయం లభించగలదని ఆశిస్తున్నారు. ఆయా చేపల రకాల ఉత్పాదన రాశిని (ప్రొడక్షన్ బేస్) బలోపేతం చేస్తే, జన్యుపరమైన మెరుగుదలపై శ్రద్ధ తీసుకొంటే విలువ జోడించిన వాణిజ్య సంస్థలు బలపడడానికి ఆస్కారం ఉంటుంది. ఇది చేపల రైతులకు లాభదాయకతను పెంపొందింపచేస్తుంది. భారతదేశ మత్స్యపాలన విలువను మరింత ముందుకు తీసుకుపోవడంలోనూ తోడ్పడుతుంది.
ఈ లాభాలను చిన్న ఉత్పాదక సంస్థలకు అందించాలంటే ఉత్పాదనను బలోపేతం చేయడం, మార్కెట్ల చెంతకు చేర్చడంలో మెరుగుదలను తీసుకురావడంలో సహాయక సంస్థాగత యంత్రాంగాలు మరింత ప్రధానమైన పాత్రను పోషించవలసి ఉంటుంది. మత్స్య పాలన రంగంలో విలువ జోడింపునకు పెద్దపీట వేసే ప్రయత్నాన్ని సామూహిక వాణిజ్య నమూనాల ద్వారా ముందుకు తీసుకుపోతున్నారు. ఇలా చేసినందువల్ల చిన్న స్థాయిలో చేపలను పట్టే వారికి, చేపల రైతులకు ఎదురవుతున్న పరిమిత ఉత్పాదన, పెట్టుబడి కొరత, మార్కెట్ అందుబాటు తదితర సమస్యలను పరిష్కరించడానికి వీలవుతుంది. 2,195 షిఫరీస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఎఫ్పీఓస్)ను ఏర్పాటు చేయడంలో కూడా విభాగం సహకారాన్ని అందించింది. దీంతో ఉత్పాదకులకు తమ ఉత్పాదనను బలపరుచుకొనే, వనరులను ఏకీకరించుకొనే, ప్రత్యేక గుర్తింపుతో కూడిన ప్రాసెసింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యకలాపాల్లో మరింత ఎక్కువ ప్రభావవంతమైన విధంగా పాలుపంచుకొనే సామర్థ్యాన్ని సమకూరుస్తున్నారు. వీటిలో అనేక సంస్థలను ‘ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’ (ఓఎన్డీసీ)తో జతపరిచారు. ఫలితంగా డిజిటల్ మార్కెట్లు ఆయా సంస్థలకు మరింత ఎక్కువ స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఉత్పాదనలకు సరి అయిన ధరను రాబట్టుకోవడానికి మెరుగైన అవకాశాలు లభించాయి. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ్-యోజన (పీఎమ్-ఎమ్‌కేఎస్ఎస్‌వై)లో భాగంగా 5,500 మత్స్య సహకార సంఘాలను- ఎన్సీడీసీ, ఎన్ఏఎఫ్ఈడీ, ఎస్‌ఎఫ్‌ఏసీ, ఎన్ఈఆర్ఏఎమ్ఏసీ వంటి మధ్యవర్తి సహాయక సంస్థల సహకారంతో- షిఫరీస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఎఫ్పీఓస్) మాదిరిగా పనిచేసేటట్లు పటిష్ఠపరుస్తున్నారు. ఉమ్మడిగా బేరమాడే శక్తిని పెంపొందించి, ఉత్పాదక సమూహాలను ఆధునిక వేల్యూ చైన్లతో సంధానిస్తూ, విలువను జోడించే మత్స్య పాలన సంబంధిత వాణిజ్య నిర్వహణ దిశగా మరిన్ని వాణిజ్య సంస్థలు పురోగమించడానికి ఈ సంస్థలు తోడ్పడగలుగుతాయని ఆశిస్తున్నారు.
విలువ జోడింపునకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తుండటంతో కోత అనంతర కార్యకలాపాలతో పాటు మత్స్య పాలనపై ఆధారపడిన వాణిజ్య సంస్థల్లో మహిళలు భాగస్వామ్యాన్ని పంచుకొనేందుకు ఒక బలమైన పునాదిని వేయడానికి మార్గం సుగమం అవుతోంది. భారతదేశ మత్స్యపాలన రంగంలో మరీముఖ్యంగా కోత అనంతరం చేపట్టాల్సిన కార్యకలాపాల్లో, చిన్న తరహా వాణిజ్య సంస్థల్లో మహిళలు కీలక శక్తిగా మారుతున్నారు. వీటిలో విలువ జోడింపు ప్రక్రియ ఆదాయార్జనకే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికత్వానికి కూడా కొత్త అవకాశాలను కల్పిస్తోంది. మహిళలకు సాధికారత కల్పన ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ (పీఎమ్ఎమ్ఎస్వై)లో ఓ కీలక ప్రాధాన్యంగా ఉంది. దీనిలో భాగంగా, గత అయిదు సంవత్సరాల్లో 1.28 లక్షల కన్న ఎక్కువ మంది మహిళా లబ్ధిదారులకు రూ.1,572 కోట్ల కేంద్ర ప్రభుత్వ వాటాతో, రూ.4,155 కోట్లకు పైగా ప్రాజెక్టులను మంజూరు చేశారు. ఈ సాయాన్ని అందించడంతో.. చేపలను ఎండబెట్టడం, చేపలను ఉపయోగించి పచ్చళ్లు, అప్పడాలు తయారు చేయడం, చేపలతో తయారు చేసిన ఉత్పాదనలను పొగబెట్టి సంరక్షించడం, ఫిష్ పౌడర్ తయారీతో పాటు, వాటి ప్యాకేజింగు, చిల్లర అమ్మకం వంటి వివిధ కార్యకలాపాల్లో పాలుపంచుకొనే అవకాశాలు మహిళలకు అందుబాటులోకి వచ్చాయి. సజీవంగా ఉన్న చేపలను విక్రయించే యూనిట్లు, సూక్ష్మ ప్రాసెసింగ్ వాణిజ్య సంస్థలు కోస్తా, అంతర్దేశీయ, పూర్వోత్తర ప్రాంతాల్లో మహిళలకు స్థిర ప్రాతిపదికన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. అంతేకాక తక్కువ ధరలకు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాల లభ్యతను పెంచి పోషణపరమైన భద్రతను పెంపొందించడానికి కూడా వీలవుతోంది.
భారత మత్స్యపాలన రంగం ఉత్పాదన ఆధారిత రంగం స్థాయి నుంచి వేల్యూ చైన్ చోదకశక్తిగా పనిచేస్తున్న, సాంకేతికతను వినియోగించుకుంటున్న విస్తారిత అనుబంధ వ్యవస్థ దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, శీతల గిడ్డంగుల వ్యవస్థ, డిజిటల్ వేదికలు, ఔత్సాహిక పారిశ్రామికత్వం పరంగా పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. పీఎమ్ఎమ్ఎస్వై, పీఎమ్-ఎమ్‌కేఎస్ఎస్‌వై, ఎఫ్ఐడీఎఫ్, కేసీసీల ఏకీకరణతో ఈ రంగం పంట కోత అనంతరం ఎదురయ్యే నష్టాల్ని తగ్గించుకుంటూ, విలువ జోడించిన సీఫూడ్ ఎగుమతులను పెంచుకుంటూ, చేపల పెంపకందారుల ఆదాయాన్ని మెరుగుపరుస్తూ, మహిళల నాయకత్వంలో పనిచేస్తున్న వాణిజ్యసంస్థలను ప్రోత్సహిస్తూ, గ్రామాలలో జీవనోపాధి అవకాశాలను కల్పించడానికి మునుపటి కన్న మెరుగైన స్థితికి చేరుకొంది. చేపలను విరివిగా సాగు చేయడంపైన మాత్రమే భారతదేశ మత్స్య పాలన రంగ భవిత ఆధారపడి ఉండబోదు. అది.. నూతన ఆవిష్కరణలు, మొబిలిటీ, ప్రాసెసింగ్, మార్కెట్లను సుస్థిర ప్రాతిపదికన అభివృద్ధి పరుచుకుంటూ ఉండటం వంటి మార్గాల్లో చేపలు పట్టే వారితో పాటు చేపల రైతులను వినియోగదారులతో సంధానించి సవాళ్లకు ఎదురొడ్డి నిలవగల, మార్కెట్ అవకాశాలను రాబట్టుకోగల వేల్యూ చైన్లను నిర్మించుకోవడంపైన కూడా ఆధారపడనుంది.
***