రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సమష్టి ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిర్మూలనకు భారత్‌ కట్టుబడి ఉంది.. ఉమ్మడి సామర్థ్యాల బలోపేతానికి ఏడీఎంఎం-ప్లస్‌ భాగస్వాములతో యుద్ధరంగంలో పరీక్షించిన అనుభవాన్ని పంచుకునేందుకు సిద్ధం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

‘‘సరిహద్దుల బయట నుంచి ఎదురయ్యే సంక్లిష్ట భద్రత సవాళ్లను దశాబ్దాలుగా ప్రత్యక్షంగా ఎదుర్కొంటూ భారత్‌ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో విస్తృత అనుభవాన్ని సంపాదించింది.. ఇది తరగతి గదుల్లో నేర్చుకున్న సిద్ధాంతపరమైన జ్ఞానం కాదు’’

ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ చురుకైన, యుద్ధరంగంలో పరీక్షించిన రక్షణ విధానాన్ని స్పష్టంగా చాటిచెప్పింది: రాజ్‌నాథ్‌ సింగ్‌

‘‘చట్టబద్ధ పాలన, నౌకాయాన స్వేచ్ఛ, గగనతలంపై నుంచి ప్రయాణించే స్వేచ్ఛకు భారత్‌ ఇస్తున్న ప్రాధాన్యం ఏ దేశానికీ వ్యతిరేకం కాదు.. ప్రాంతీయ భాగస్వాముల ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసమే’’

భారత్‌-ఆసియాన్‌ అనుసంధానం, డిజిటల్‌ ఆవిష్కరణలు, సామర్థ్యాల అభివృద్ధికి రక్షణ రంగంలో ‘యూత్‌ బ్రిడ్జ్‌’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన రక్షణ మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 OCT 2026 11:25AM by PIB Hyderabad

ప్రాంతీయ భద్రతను సమష్టిగా పరిరక్షించడం, అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించడం పట్ల భారత్‌ తన నిబద్ధతను చాటుకుందని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్‌కు ఉన్న విస్తృత అనుభవం తరగతి గదుల్లో నేర్చుకున్న సిద్ధాంతపరమైన జ్ఞానం కాదని, సరిహద్దుల ఆవల నుంచి ఎదురయ్యే సంక్లిష్ట భద్రతా సవాళ్లను దశాబ్దాలుగా ప్రత్యక్షంగా ఎదుర్కొంటూ క్షేత్రస్థాయిలో సంపాదించిన అనుభవమని ఆయన పేర్కొన్నారు. 2026 అక్టోబర్‌ 29న ఫిలిప్పీన్స్‌లోని సెబూలో జరిగిన 13వ ఆసియాన్‌ రక్షణ మంత్రుల సమావేశం (ఏడీఎంఎం-ప్లస్)లో ఆయన ప్రసంగించారు. భారత్‌ అనుసరించే ప్రతి వ్యూహం వాస్తవ కార్యాచరణలో పరీక్షించి, మెరుగుపరిచి, నిరూపితమైందని స్పష్టం చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం, ప్రభుత్వ మద్దతుగల ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమనే స్పష్టమైన వైఖరిని అమలు చేయడం ద్వారా భారత్‌ అనుసరించిన చురుకైన, యుద్ధరంగంలో పరీక్షించిన రక్షణ విధానం స్పష్టంగా వెల్లడైందని తెలిపారు. 

ఉగ్రవాదానికి సరిహద్దులు ఉండవని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి సైనిక విన్యాసాలు, సామర్థ్యాల పెంపు కార్యక్రమాలు, పటిష్టమైన నిఘా సమాచార భాగస్వామ్యం ద్వారా తనకు క్షేత్రస్థాయిలో లభించిన అనుభవాన్ని ఏడీఎంఎం-ప్లస్‌ భాగస్వామ్య దేశాలతో పంచుకునేందుకు భారత్‌ పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. తద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే ఉమ్మడి సామర్థ్యాలను బలోపేతం చేయవచ్చని చెప్పారు. ఏడీఎంఎం-ప్లస్‌ వ్యవస్థలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటం కీలక సహకార రంగంగా కొనసాగుతోందని ఆయన వివరించారు. 2024 నుంచి 2027 వరకు ఉగ్రవాద వ్యతిరేక నిపుణుల కార్యాచరణ బృందానికి భారత్‌, మలేషియా సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నాయని తెలిపారు. 

ఆసియాన్‌ కూటమికి భారత్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. శాంతి, స్థిరత్వం కేవలం ఆకాంక్షలుగా మిగలకుండా, దేశాల ఉమ్మడి నిబద్ధతతో సాధ్యమయ్యేలా సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన, సమ్మిళిత, సంక్షోభాలను తట్టుకోగల, నిబంధనల ఆధారిత ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆసియాన్‌తో భారత్‌ వ్యూహాత్మక సంబంధాలు దీర్ఘకాలిక దృక్పథంతో కొనసాగుతున్నాయని, ఉమ్మడి ప్రయోజనాలు, పరస్పర గౌరవం, ఆచరణాత్మక సహకారంపై అవి ఆధారపడి ఉన్నాయని తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో కౌలాలంపూర్‌లో జరిగిన రెండో భారత్‌-ఆసియాన్‌ రక్షణ మంత్రుల అనధికారిక సమావేశాన్ని ఆయన గుర్తుచేశారు. భారత్‌-ఆసియాన్‌ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో రక్షణ, భద్రత అంశాలను మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు, 2026–2030 కాలానికి సంబంధించిన భారత్‌-ఆసియాన్‌ కార్యాచరణ ప్రణాళిక అమలుపై నిబద్ధతను ఆ సమావేశం చాటుకుందని వివరించారు. 

13వ ఏడీఎంఎం-ప్లస్ సమావేశం ఇతివృత్తమైన ‘‘కలిసికట్టుగా మన భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం’’ను ప్రస్తావిస్తూ... భారత్‌ విదేశాంగ, రక్షణ విధానాలతో పాటు, ‘సర్వే భవంతు సుఖినః’ (సకల ప్రాణులు సుఖంగా ఉండాలి) అనే భారతీయ నాగరికతా స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సంతోషంగా, సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షను ఈ భావన తెలియజేస్తుందని పేర్కొన్నారు. “మనందరినీ కలిపి ఉంచే ఐక్యత, భౌగోళిక, ఆర్థిక, వ్యూహాత్మక వైవిధ్యాలను ఉమ్మడిగా సద్వినియోగం చేసుకునే సామర్థ్యమే మనకు గొప్ప బలం. పరస్పర విశ్వాసం, సహకారం, సమష్టి బాధ్యతపై ఆధారపడిన అంతర్జాతీయ వ్యవస్థను భారత్‌ విశ్వసిస్తుంది. శాంతి, క్రమబద్ధతకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఈ సహకార స్ఫూర్తే మనకు శక్తినిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. 

2026లో భారత్‌-ఆసియాన్‌ సంబంధాల్లో నౌకా వాణిజ్య సహకారం అత్యంత కీలకమని శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. 2026ను ‘భారత్‌-ఆసియాన్‌ సముద్ర సహకార సంవత్సరంగా’ న్యూఢిల్లీ ప్రకటించడం, రెండో భారత్‌-ఆసియాన్‌ సముద్ర విన్యాసాన్ని నిర్వహించడం ఈ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయ సముద్ర చట్టంలోని సూత్రాలను భారత్‌ కేవలం ప్రచారం చేయడమే కాకుండా, సముద్ర భద్రతకు సంబంధించిన అంతర్జాతీయ చట్టాలను నిబద్ధతతో అమలు చేస్తోందని స్పష్టం చేశారు. “నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించడం, అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గాలను పరిరక్షించడం పట్ల భారత్‌ నిబద్ధతకు దశాబ్దాలుగా కొనసాగుతున్న కార్యాచరణ అనుభవం ఆధారంగా ఉంది. 2008 నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌ వంటి అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సముద్ర మార్గాల్లో భారత నౌకాదళం నిరంతరంగా చురుకైన ఉనికిని కొనసాగిస్తోంది. ఇతర దేశాల హక్కులకు భంగం కలిగించే బలవంతపు చర్యలకు లేదా ఏకపక్ష చర్యలకు భారత్‌ పాల్పడటం లేదు” అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. 

ముందుండి పనిచేసే యుద్ధనౌకలను మోహరించడం ద్వారా భారత్‌ వేలాది వాణిజ్య నౌకలకు సురక్షితంగా ప్రయాణించేందుకు సహకరించిందని, సముద్రంలో నౌకలను అపహరించే డజన్ల కొద్దీ యత్నాలను అడ్డుకుందని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. నౌక ఏ దేశానికి చెందినదనే బేధం లేకుండా వాణిజ్య నౌకాయానానికి రక్షణ కల్పించినట్లు వివరించారు. వాణిజ్య నౌకాయాన భద్రతను భారత్‌ తన బాధ్యతగా భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. “ప్రపంచ వాణిజ్య మార్గాలు సంక్లిష్టమైన అంతర్జాతీయ ముప్పులను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణకు సిద్ధంగా ఉంది. సమర్థవంతమైన చర్యలు, సముద్ర ప్రాంతాల్లో నిరంతర కార్యాచరణ ఉనికి, అంతర్జాతీయ సహకారం అవసరం. హిందూ మహాసముద్ర ప్రాంతంతో పాటు విస్తృత ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో విశ్వసనీయమైన భద్రతా భాగస్వామిగా భారత్‌ తన పాత్రను కొనసాగిస్తుంది” అని శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. 

నౌకా వాణిజ్య భద్రత అనేది విస్తృత ప్రాంతంలోని భద్రత, శ్రేయస్సుతో సన్నిహితంగా ముడిపడి ఉందని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. చట్టబద్ధ పాలనకు, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందానికి భారత్‌ అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. నౌకాయాన స్వేచ్ఛ, గగనతలం మీదుగా ప్రయాణించే స్వేచ్ఛకు భారత్‌ ఇస్తున్న మద్దతు ఏ దేశానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత సముద్ర మార్గాలు, స్థిరమైన సముద్ర పాలనపై ఆధారపడే ప్రాంతీయ భాగస్వాములందరి ఉమ్మడి ప్రయోజనాలను పరిరక్షించడమే దీని లక్ష్యమని వివరించారు. సముద్ర భద్రత, శోధన, రక్షణ చర్యలు, మానవతా సహాయం, వృత్తిపరమైన పరస్పర సంబంధాలు, సామర్థ్యాల పెంపు, అంతర్జాతీయ చట్టాలకు భారత్‌ తగిన గౌరవం ఇస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆసియాన్‌ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్‌ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 

భారత్‌-ఆసియాన్‌ రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంలో యువత భాగస్వామ్యం కీలకమని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇరు పక్షాల్లో యువ జనాభా ఎక్కువగా ఉండటం, వారి ఆకాంక్షలు ఒకే విధంగా ఉండటం ప్రాంతీయ భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించేందుకు బలమైన పునాదిని అందిస్తాయని తెలిపారు. సంస్థాగతంగా ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, డిజిటల్‌ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఏడీఎంఎం-ప్లస్‌ కార్యక్రమాలకు అనుగుణంగా సామర్థ్యాల పెంపునకు దోహదపడటం లక్ష్యంగా ప్రత్యేక రక్షణ రంగ ‘యూత్‌ బ్రిడ్జ్‌’ ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. యువతకు సాధికారత కల్పించడం, ప్రాంతీయ శాంతి, భద్రతకు వారు మరింతగా తోడ్పడే అవకాశాలు కల్పించడం ‘యువత, శాంతి, భద్రత’ అనే నినాదానికి అనుగుణంగా ఉంటుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. శాంతియుతమైన, పటిష్టమైన, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్‌ ప్రాంత నిర్మాణానికి ఇది ఎంతో అవసరమని ఆయన తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2330089) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Gujarati , Tamil