నాడు పోస్టు చేయడమైనది:
28 OCT 2026 10:38AM by PIB Hyderabad
ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం (పీటీఏ)పై చర్చలకు సంబంధించిన నిబంధనలపై సంతకం చేయడం ద్వారా ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకొనే దిశగా మెక్సికో, భారత్ ముందడుగు వేశాయి. రెండు దేశాలకు కొత్త ఆర్థిక అవకాశాలను అందించడమే లక్ష్యంగా సాగే ఈ చర్చలకు అవసరమైన విధివిధానాలు, పరిధి, కార్యాచరణ ప్రణాళికను ఈ నిబంధనలు నిర్దేశిస్తాయి.
ఈ సంతకాల కార్యక్రమంతో పరస్పరం ప్రయోజనం కలిగించే, సమతౌల్యమైన పీటీఏను రూపొందించే చర్చలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడం, వ్యాపార అవకాశాలను సృష్టించడం, పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, పటిష్ఠమైన, వైవిధ్యభరితమైన సరఫరా వ్యవస్థలకు ఈ పీటీఏ దోహదపడుతుంది.
2025 జూన్‌లో కెనడాలో జరిగిన జీ7 సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షురాలు డాక్టర్ క్లాడియా షీన్బామ్ మధ్య జరిగిన సమావేశంలో కుదిరిన అవగాహన మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భారత్-మెక్సికో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆ భేటీలో నాయకులిద్దరూ అంగీకరించారు.
వాణిజ్య కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ పర్యటన సందర్భంగా... ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించే అవకాశాలపై రెండు దేశాల ప్రతినిధి బృందాలు చర్చించాయి. మెక్సికో ఆర్థిక కార్యదర్శి మార్సెలో ఎబ్రార్డ్ కాసాబన్ తరఫున మెక్సికో విదేశీ వాణిజ్య అండర్ సెక్రటరీ లూయిస్ రోసెండో గుటియెరెజ్ రొమానోతో ఈ చర్చలు జరిగాయి.
వస్తువులకు మార్కెట్ అవకాశాలు, రూల్స్ ఆఫ్ ఆరిజన్, కస్టమ్స్ విధానాలు, వాణిజ్య సౌలభ్యం, వివాదాల పరిష్కారం, పారిశుద్ధ్యం, ఫైటోశానిటరీ చర్యలు, వాణిజ్యానికి సాంకేతిక అవరోధాలు, వాణిజ్య రక్షణ చర్యలతో సహా కీలకమైన రంగాలు ఈ నిబంధనల పరిధిలోకి వస్తాయి.
ఈ రెండు ఆర్థిక వ్యవస్థల్లో ఉన్న పరస్పరం ప్రయోజనం చేకూర్చే అంశాలను ఉపయోగించుకోవడం, భారత మార్కెట్లో మెక్సికన్ ఉత్పత్తులు, వ్యాపారాలకు అవకాశాలను విస్తరించడమే ఈ ప్రతిపాదిత ఒప్పందం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అంతర్జాతీయ విలువ ఆధారిత వ్యవస్థలతో బలమైన సంబంధాలను కలిగి ఉన్న మెక్సికో… భారత ఎగుమతిదారులు, పెట్టుబడిదారులకు ముఖ్యమైన మార్కెట్‌గా ఉంది. ఆటోమోటివ్, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వ్యవసాయ-ఆహారోత్పత్తులు, ఇంధనం, కీలకమైన ఖనిజాలు, వైద్య పరికరాలు, ఆధునిక తయారీ రంగాలతో పాటు ఇతర రంగాల్లో పరస్పర సహకారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి.
ద్వైపాక్షిక ఆర్థిక అజెండాలోని వివిధ అంశాలపై కూడా ఇరు దేశాల ప్రతినిధి బృందాలు చర్చించాయి. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి, పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి, రెండు దేశాల ఉత్పాదక రంగాల మధ్య మరింత సన్నిహిత సంబంధాలను పెంపొందించడానికి గల అవకాశాలను గుర్తించాయి.
2027 మొదటి త్రైమాసికంలో భారత్‌లో మెక్సికన్ వ్యాపార ప్రతినిధి బృందం పర్యటనను ఏర్పాటు చేసే అంశంపై కూడా ఉభయపక్షాలు చర్చించాయి. ఈ ప్రతిపాదిత పర్యటన వ్యాపారాల మధ్య ప్రత్యక్ష చర్చలను సులభతరం చేస్తుంది. వాణిజ్య అవకాశాలను గుర్తించడానికి, రెండు దేశాల ఉత్పాదక రంగాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి దోహదపడుతుంది.
***