పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తుపాకీ నుంచి పేల్చిన చిన్న లోహపు గుండు గాయాలతో మధ్యప్రదేశ్‌లో ఓ చిరుతపులి మృత్యువాత.. ఘటనపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి బృందాన్ని నియమించిన కేంద్ర ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 28 OCT 2026 7:52AM by PIB Hyderabad

తుపాకీ నుంచి పేల్చిన చిన్న లోహపు గుండ్లు తగిలి గాయపడి మధ్యప్రదేశ్‌.. కూనో నేషనల్ పార్కులో 19 నెలల మగ చిరుతపులి (కేఎన్‌జీ22) చనిపోయిన ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. ‘ప్రాజెక్ట్ చీతా’కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని, స్థలం మార్పునకు లోనైన చిరుతపులుల పరిరక్షణకు అత్యున్నత ప్రమాణాలను పాటించాల్సిన ఆవశ్యకతను కేంద్రం పరిగణనలోకి తీసుకొని, ఘటనపై దర్యాప్తును జరపాల్సిందిగా ఓ ఉన్నత స్థాయి బృందాన్ని పంపించింది.
కేంద్ర బృందంలో జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్‌సీటీఏ)కు చెందిన అడవుల ఇన్స్‌పెక్టర్ జనరల్ , వన్యప్రాణులపై నేరాలను నియంత్రించే బ్యూరో (డబ్ల్యూసీసీబీ) అదనపు డైరెక్టరులతో పాటు, డబ్ల్యూసీసీబీ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టరు కూడా ఉన్నారు. చిరుతపులి మృత్యువాత పడిన కారణాలను క్షుణ్నంగా దర్యాప్తు చేయడానికి, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించడానికి, ఈ వ్యవహారంలో తీసుకోవాల్సిన కఠిన, సత్వర చర్యలను నిర్ధారించడానికి మధ్యప్రదేశ్ అటవీ విభాగంతో కలసి పనిచేయాల్సిందిగా బృంద సభ్యులకు సూచించారు.
కూనో నేషనల్ పార్కు రక్షిత ప్రాంతానికి వెలుపల మొరెనా ప్రాదేశిక అడవులలో ఈ నెల 25న ఓ చిరుతపులి గాయపడటాన్ని గమనించారు. అది నిజానికి పిల్ల చిరుతపులి.  మధ్యప్రదేశ్ అటవీ విభాగం చెప్పిన దానిని బట్టి, దానిని అదే రోజున శివపూర్ ప్రాదేశిక అటవీ డివిజన్ నుంచి కాపాడి జబల్‌పూర్‌లోని ఓ పశుచికిత్సాకేంద్రంలో చేర్చి, అత్యవసర శస్త్రచికిత్సను పూర్తి చేశారు. చిన్న లోహపు గుండ్లు తగిలినందువల్ల దాని శరీరంలో అయిదు చోట్ల అయిన గాయాలను శస్త్రచికిత్స చేసిన వేళ గుర్తించారు. వైద్యోపచారాలను చేపట్టినప్పటికీ, ఈ నెల 27న ఆ పిల్ల చిరుతపులి చచ్చిపోయింది. చిన్న లోహపు గుండు గాయాల కారణంగా దాని శరీరం లో పలు అంతర్గత గాయాలైనట్టు వైద్య పరీక్షల్లో తేలింది.
ఈ సంఘటనపై పరిశోధన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్)ను ఏర్పాటు చేసింది. దీనిలో అటవీ అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (ఎమ్ఓఈఎఫ్‌సీసీ) పంపించిన కేంద్ర బృందం.. రాష్ట్ర అధికార యంత్రాంగంతో సమన్వయాన్ని ఏర్పరుచుకుని దర్యాప్తు జరపనుంది. ఈ బృందం భద్రతా ప్రోటోకాల్స్‌ను అమలు చేయడంతో పాటే భవిష్యత్తులో ఇలాంటి మరేవైనా ఘటనలు చోటుచేసుకోకుండా అరికట్టడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న పర్యవేక్షణ, సురక్షాత్మక చర్యలను పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, క్షేత్ర అధికారులకు తదుపరి ఆదేశాలను జారీ చేయడానికి వీలుగా కేంద్ర బృందం తన నివేదికను, సిఫారసులను మంత్రిత్వ శాఖకు సమర్పిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2329356) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Gujarati , Kannada