దేశంలో బలమైన, సమగ్రమైన, సరికొత్త ఆవిష్కరణలతో కూడిన పారిశ్రామిక రంగాన్ని నిర్మించేందుకు 2016 జనవరి నెలలో ప్రారంభమైన ప్రతిష్టాత్మక 'స్టార్టప్ ఇండియా' కార్యక్రమం... 2026 నాటికి విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా 2019లో ప్రారంభమైన 'జాతీయ అంకురసంస్థల పురస్కారాలు' ఇప్పుడు స్టార్టప్ ఇండియా కార్యక్రమానికి కీలకంగా మారాయి. పారిశ్రామిక నైపుణ్యాలను గుర్తించడంతో పాటు, వివిధ రంగాల్లో ఎదురవుతున్న కీలక సవాళ్లకు సరికొత్త పరిష్కారాలను చూపే ఆవిష్కరణలను దేశవ్యాప్తంగా ప్రదర్శించడానికి ఈ పురస్కారాలు ఒక అద్భుతమైన వేదికను అందిస్తున్నాయి.
విశిష్టమైన ఆవిష్కరణలు, వేగంగా వృద్ధి చెందే సామర్థ్యం, సుస్థిరత, సామాజిక-ఆర్థిక రంగాలపై సానుకూల ప్రభావం చూపే అంకురసంస్థలను గుర్తించి, సత్కరించడమే జాతీయ అంకురసంస్థల పురస్కారాల ప్రధాన లక్ష్యం. గత అయిదు ఎడిషన్లు సాధించిన అద్భుత విజయాలు స్ఫూర్తిగా... ప్రస్తుత 'ఎన్ఎస్ఏ-6.0' సరికొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. నవకల్పనలతో కూడిన పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడే స్థాయికి భారతీయ అంకురసంస్థలను ఎదిగేలా చేయడం ద్వారా దేశీయ అంకురసంస్థల వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇది కృషి చేస్తుంది.
దేశంలో వేగంగా విస్తరిస్తున్న అంకురసంస్థల రంగం, సరికొత్త సాంకేతికతలు, దేశ ప్రగతి ప్రాధాన్యాలకు అద్దం పడుతూ... ఈ ఏడాది మొత్తం 20 ప్రధాన రంగాలు, మూడు ప్రత్యేక విభాగాల్లో అత్యుత్తమ ఆవిష్కరణలు, పారిశ్రామిక ప్రతిభను గుర్తించేందుకు 'ఎన్ఎస్ఏ-6.0' పురస్కారాలను రూపొందించారు. దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆరో ఎడిషన్‌లో కొత్తగా బయో మాన్యుఫ్యాక్చరింగ్... కన్స్యూమర్ ఇండస్ట్రీస్... రక్షణ-భద్రత... గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సాంప్రదాయిక పరిశ్రమలు, జీవనోపాధి... విద్య-నైపుణ్యాభివృద్ధి... ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ... క్రీడలు, ఫిట్నెస్, స్పోర్ట్స్-టెక్... ఫ్యూచర్ మొబిలిటీ, ఆటోమోటివ్... సముద్ర, నీలి ఆర్థిక వ్యవస్థ... అంతరిక్ష సాంకేతికత, డ్రోన్స్, ఏరోస్పేస్... టెలికాం, కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్... ప్రయాణం, పర్యాటకం, ఆతిథ్యం అనే 12 రంగాలను ప్రవేశపెట్టారు.
జాతీయ అంకురసంస్థల పురస్కారాలు-6.0లోని మూడు ప్రత్యేక పురస్కార విభాగాల్లో... ఈ సంవత్సరం మహిళల నేతృత్వంలోని అత్యుత్తమ అంకురసంస్థ, ఈశాన్య రాష్ట్రాల్లోని అత్యుత్తమ అంకురసంస్థ పురస్కారాలతో పాటు ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన 'స్టూడెంట్ ఇన్నోవేటర్ / ఔత్సాహిక పారిశ్రామికవేత్త' పురస్కారం అందిస్తున్నారు. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాల విద్యార్థుల్లో ఆవిష్కరణలు, వ్యాపార దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో తొలిసారిగా ఈ విద్యార్థి పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో తదుపరి తరం ఆవిష్కర్తలను, పారిశ్రామికవేత్తలను తయారు చేయడం... జాతీయ అంకురసంస్థల పురస్కారాల పరిధిని మరింత విస్తరించడం దిశగా ఇది కీలక ముందడుగు.
మొత్తం 20 ప్రధాన రంగాలకు చెందిన కేటగిరీల్లోనూ... అంకురసంస్థలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన రెండు ప్రత్యేక విభాగాల్లోనూ... వర్తించే పురస్కార మార్గదర్శకాలకు లోబడి ఒక్కో కేటగిరీలో గెలుపొందిన విజేతలకు రూ. 25 లక్షల చొప్పున నగదు బహుమతి లభిస్తుంది. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన 'స్టూడెంట్ ఇన్నోవేటర్ / ఔత్సాహిక పారిశ్రామికవేత్త' పురస్కారం కింద నాలుగు సబ్-కేటగిరీల విజేతలకు బహుమతి కోసం మొత్తం రూ. 25 లక్షలు కేటాయించారు.
జాతీయ అంకురసంస్థల పురస్కారాల విజేతలకు నగదు బహుమతితో పాటుగా... దేశీయ అంకురసంస్థల రంగంలో గుర్తింపునిచ్చే మరిన్ని అద్భుత ప్రయోజనాలూ లభించనున్నాయి. ఇందులో భాగంగా నిపుణుల మార్గదర్శనం, ప్రముఖ పెట్టుబడిదారులతో అనుసంధానం, మార్కెట్ ప్రవేశం, ప్రముఖ పరిశ్రమలతో భాగస్వామ్యాలు సహా దేశవ్యాప్త అంకురసంస్థల వ్యవస్థలో తమ బ్రాండ్ ప్రతిష్ఠను మరింత పెంచుకునేందుకు వీలుగా విస్తృత ప్రచారం వంటి సదుపాయాలనూ కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది.
'ఎన్ఎస్ఏ-6.0' పురస్కారాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా... దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వేగంగా ఎదుగుతున్న పారిశ్రామిక వ్యవస్థలతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అంకురసంస్థలను దీనిలో పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాయి. ఈ పురస్కారాల ప్రచారం, భాగస్వామ్యం, మూల్యాంకన ప్రక్రియ విజయవంతం కోసం కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల ప్రోత్సాహక-అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఈ విభాగం... కేంద్ర మంత్రిత్వ శాఖలు-విభాగాలు, రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, ఇంక్యుబేటర్లు, విద్యా సంస్థలు, బ్యాంకులు-ఆర్థిక సంస్థలు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, ఇండస్ట్రీ అసోసియేషన్లతో పాటు అంకురసంస్థల రంగానికి చెందిన ఇతర కీలక భాగస్వాములందరినీ సమన్వయం చేస్తుంది.
'ఎన్ఎస్ఏ-6.0' పురస్కారాల కోసం దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 27 నుంచి అధికారికంగా ప్రారంభమైంది. అర్హత గల అంకురసంస్థలు, ఆవిష్కర్తలైన విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలతో నవంబర్ 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వారు తమ వినూత్న ఆవిష్కరణలను జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ఇది అద్భుతమైన వేదికగా నిలుస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు స్టార్టప్ ఇండియా అధికారిక పోర్టల్ www.startupindia.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జాతీయ అంకురసంస్థల పురస్కారాల ఆరో ఎడిషన్ ద్వారా దేశంలో పారిశ్రామిక ప్రతిభను గుర్తించడంతో పాటు, తదుపరి తరం ఆవిష్కర్తలను ప్రోత్సహించడం పట్ల భారత ప్రభుత్వ నిబద్ధతను కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల ప్రోత్సాహక-అంతర్గత వాణిజ్య విభాగం పునరుద్ఘాటించింది. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, సరికొత్త ఆవిష్కరణలతో దేశీయ అంకురసంస్థల వ్యవస్థను ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడే స్థాయికి ఎదిగేలా చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
ఎన్ఎస్ఏ-6.0 పరిధిలోని 20 రంగాల్లో పురస్కార కేటగిరీలు:
1. వ్యవసాయం, అగ్రిటెక్ & ఆహార వ్యవస్థలు
2. బయోమానుఫ్యాక్చరింగ్
3. డీప్‌టెక్ & ఫ్రాంటియర్ టెక్నాలజీలు
4. క్లైమేట్-టెక్, హరిత ఇంధనం, సుస్థిరత
5. వినియోగదారుల పరిశ్రమలు
6. సృజనాత్మక పరిశ్రమలు, మీడియా & డిజిటల్ కంటెంట్ (సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ)
7. రక్షణ & భద్రత
8. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సాంప్రదాయిక పరిశ్రమలు & జీవనోపాధులు
9. విద్య & నైపుణ్యాభివృద్ధి
10. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు & అధునాతన తయారీ
11. ఫిన్‌టెక్, ఆర్థిక సేవలు & సమ్మిళితం
12. ఫుడ్-టెక్, బయోటెక్నాలజీ & పోషణ
13. హెల్త్‌కేర్, మెడ్‌టెక్ & లైఫ్ సైన్సెస్
14. సప్లయి చెయిన్ & లాజిస్టిక్స్
15. క్రీడలు, ఫిట్నెస్ & స్పోర్ట్స్-టెక్
16. ఫ్యూచర్ మొబిలిటీ & ఆటోమోటివ్
17. సముద్ర & నీలి ఆర్థిక వ్యవస్థ
18. అంతరిక్ష సాంకేతికత, డ్రోన్‌లు & ఏరోస్పేస్
19. టెలికాం, కనెక్టివిటీ & డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
20. ప్రయాణం, పర్యాటకం & ఆతిథ్యం
మూడు ప్రత్యేక పురస్కార కేటగిరీలు:
1. మహిళల నేతృత్వంలోని అంకురసంస్థలు
2. ఈశాన్య ప్రాంత అంకురసంస్థలు
3. స్టూడెంట్ ఇన్నోవేటర్/ఔత్సాహిక పారిశ్రామికవేత్త
***