వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్టార్టప్ మద్దతు, నియంత్రణ సంస్కరణలు, డిజిటల్ సింగిల్-విండో క్లియరెన్స్‌ల ద్వారా విశ్వాసంతో కూడిన పాలనను ముందుకు తీసుకెళ్తున్న డీపీఐఐటీ


2.5 లక్షలకు పైగా అంకుర సంస్థలకు మద్దతుగా నిలుస్తూ, 770కి పైగా జిల్లాల్లో 25.42 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించిన స్టార్టప్ ఇండియా

రూ.1,662 కోట్లకు చేరిన స్టార్టప్ క్రెడిట్ గ్యారెంటీలు... అంకుర వ్యవస్థను బలోపేతం చేసే 63 నియంత్రణ సంస్కరణలు

భారతదేశ వ్యాప్తంగా సులభతర వ్యాపార నిర్వహణకు 47,957 నిబంధనల కుదింపు, నేరరహితంగా 900 చట్టపరమైన నిబంధనలు

నిబంధనలను సులభతరం చేసే కార్మిక చట్టాల ఏకీకరణ, లైసెన్సింగ్ సంస్కరణలు, వ్యాపారాలపై నియంత్రణ భారం తగ్గింపు

17 రంగాల్లో ఆటోమేటిక్ రూట్‌ విస్తరణ పెట్టుబడి సంస్కరణలతో 12 ఏళ్లలో 843 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను నమోదు చేసిన భారత్

డిజిటల్ ఇంటిగ్రేషన్, ఆటోమేషన్, 22 భాషల సౌలభ్యం ద్వారా అనుమతులను సరళీకరించిన నేషనల్ సింగిల్ విండో సిస్టమ్

నాడు పోస్టు చేయడమైనది: 27 OCT 2026 12:24PM by PIB Hyderabad

అనుమతి ఆధారిత నియంత్రణ విధానం నుంచి విశ్వాసంతో కూడిన నియంత్రణ విధానం వైపు సాగే ప్రయాణానికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య శాఖ (డీపీఐఐటీ) చర్యలు చేపట్టింది. అంకుర వ్యవస్థ, నిబంధనల సడలింపు, రంగాలవారీగా నియంత్రణలు, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు, సింగిల్-విండో క్లియరెన్స్‌ల పరంగా చేపట్టిన సంస్కరణలు వ్యాపారాలపై నిబంధనల భారాన్ని తగ్గించాయి. వ్యాపారాల ప్రారంభం, ఉద్యోగ కల్పన, పెట్టుబడులు, డిజిటల్ సేవలందించటంలో సత్ఫలితాలను సాధించాయి.

ఇప్పటివరకు 2,50,046 అంకుర సంస్థలను డీపీఐఐటీ గుర్తించింది. ఇవి 770కి పైగా జిల్లాల్లో 56 పరిశ్రమల పరిధిలో 25.42 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించాయి. వీటిలో 52 శాతం అంకుర సంస్థలు నాన్-మెట్రో నగరాల్లోనివి కాగా, 48 శాతం అంకుర సంస్థల్లో కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 34,200గా ఉన్న వార్షిక గుర్తింపులు 2024-25 నాటికి 36,440కి పెరిగాయి.

స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ద్వారా 244 ఇంక్యుబేటర్ల ద్వారా 32 రాష్ట్రాలు, యూటీల్లోని 4,194  అంకుర సంస్థలకు రూ. 775.67 కోట్ల నిధులను అందించారు. ఇందులో 2,147 మహిళల నేతృత్వంలోని అంకుర సంస్థలు, టైర్-II, టైర్-III నగరాలకు చెందిన 2,356 అంకుర సంస్థలున్నాయి. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ పథకం ద్వారా ఎస్ఐడీబీఐ సంస్థ 166 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్‌కు (ఏఐఎఫ్) రూ. 12,623 కోట్లను కేటాయించింది. ఇవి 1,475 అంకుర సంస్థల్లో రూ. 28,254 కోట్లను పెట్టుబడిగా పెట్టాయి.

క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా 41,637 మందికి ఉపాధి కల్పిస్తున్న అంకుర సంస్థలకు రూ. 1,662.71 కోట్ల విలువైన 532 రకాల రుణాలకు పూచీకత్తును అందించారు. ఒక్కో రుణగ్రహీతకు గ్యారంటీ పరిమితిని రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెంచారు. అలాగే 27 కీలక రంగాలకు సంబంధించిన వార్షిక రుసుమును ఒక శాతానికి తగ్గించారు.

ఏంజెల్ ట్యాక్స్ రద్దు, లిస్టెడ్, అన్-లిస్టెడ్ షేర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను హేతుబద్ధీకరణ, బీమా కంపెనీలు, ఈపీఎఫ్ఓ, సూపర్‌యాన్యుయేషన్ ఫండ్లు, గ్రాట్యుటీ ఫండ్లు ఏఐఎఫ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించటం వంటి అంశాలతో మొత్తం 63 నియంత్రణ సంస్కరణలు అమలయ్యాయి. అదనంగా 4,467 అంకుర సంస్థలు సెక్షన్ 80-ఐఏసీ అర్హతా సర్టిఫికెట్‌ను పొందాయి.

మునుపటి అనుభవం, టర్నోవర్, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) నిబంధనలను సడలించటంతో గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్ (జెమ్)లో నమోదైన అంకుర సంస్థల సంఖ్య జనవరి 2021 నాటికి 7,929 ఉండగా, ఇప్పుడు 43,260కి పెరిగింది. ఈ అంకుర సంస్థలు ప్రభుత్వ కొనుగోలుదారులకు రూ. 68,105 కోట్ల విలువైన 6.23 లక్షల ఆర్డర్లను అందించాయి. 2016లో కేవలం నాలుగు రాష్ట్రాలు, యూటీలకే పరిమితమైన ప్రత్యేక స్టార్టప్ విధానాలు ఇప్పుడు 32కి విస్తరించాయి. అదనంగా 17 రాష్ట్రాలు, యూటీల్లో 104 కొత్త ఇంక్యుబేటర్లు ఏర్పాటయ్యాయి. ఇక తేజస్ కార్యక్రమం 27 రాష్ట్రాలు, యూటీల్లోని 132 జిల్లాలకు విస్తరించింది.

కేంద్ర మంత్రిత్వశాఖలు, రాష్ట్రాలు, యూటీల పరిధిలో మొత్తం 47,957 నిబంధనల భారం తగ్గింది. వీటిలో 22,290 డిజిటలీకరణ చేశారు. 16,141 సరళీకరించారు. 5,255 నేరపూరిత జాబితా నుంచి తొలగించారు. 4,271 పూర్తిగా ఎత్తివేశారు. కేంద్ర చట్టాలకు చెందిన 900 నిబంధనలను జన్ విశ్వాస్ చట్టాలు నేర రహితంగా మార్చాయి. 2023లో 42 చట్టాల్లోని 183 నిబంధనలు, 2026లో 79 చట్టాల్లోని 717 నిబంధనలను నేరరహితంగా మార్చారు.

వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బీఆర్ఏపీ)కు సంబంధించిన ఏడు ఏడిషన్ల ద్వారా రాష్ట్రాలు, యూటీలు 9,700కి పైగా సంస్కరణలను అమలు చేశాయి. జిల్లా బీఆర్ఏపీ ద్వారా జిల్లా కలెక్టరేట్లు, డెవలప్‌మెంట్ అథారిటీలు, పట్టణ స్థానిక సంస్థలకు 222 సంస్కరణలు వర్తిస్తాయి.

ఇరవై తొమ్మిది కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేశారు. లేఆఫ్, మూసివేతకు ముందస్తు అనుమతి కోరే కార్మికుల పరిమితిని 100 నుంచి 300కి పెంచారు. విద్యుత్‌ను ఉపయోగించే కర్మాగారాలకు 10 నుంచి 20 మందికి, విద్యుత్ వినియోగించని వాటికి 20 నుంచి 40 మంది కార్మికులకు ఈ నిబంధన వర్తింపు పరిమితిని పెంచారు. కాంట్రాక్ట్ లేబర్ లైసెన్సింగ్ పరిమితిని 20 నుంచి 50 మంది కార్మికులకు పెంచారు. చట్టపరమైన చర్యలు తీసుకోటానికి ముందుగా 30 రోజుల నోటీసు ఇవ్వటం తప్పనిసరి చేశారు.

పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) జారీ చేసే లైసెన్సుల చెల్లుబాటు కాలాన్ని అయిదేళ్ల నుంచి పదేళ్లకు పొడిగించటం వల్ల తరచూ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం తప్పింది. డిజిటలీకరణ వల్ల పెసో మాడ్యూళ్లన్నీ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ఎస్‌డబ్ల్యూఎస్)తో అనుసంధానమయ్యాయి. జిల్లా అధికారుల ద్వారా ఆన్‌లైన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (ఎన్ఓసీలు) జారీ చేస్తుండగా... మహిళలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) వారికి ఫీజుల విషయంలో సడలింపు ఇచ్చారు. వలస పాలన కాలం నాటి బాయిలర్ల చట్టం-1923 స్థానంలో బాయిలర్ల చట్టం-2025 అమల్లోకి వచ్చింది.

ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విషయంలో 17 రంగాలను ఆటోమేటిక్ రూట్‌లోకి మార్చారు. రక్షణ రంగంలో కొత్త పారిశ్రామిక లైసెన్సుల కోసం ఆటోమేటిక్ రూట్ ద్వారా ఎఫ్‌డీఐ పరిమితిని 49 నుంచి 74 శాతానికి పెంచారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 2021లో 49 శాతం నుంచి 74 శాతానికి పెంచగా, 2026 నాటికి ప్రీమియం మొత్తాన్ని పూర్తిగా భారతదేశంలోనే పెట్టుబడి పెట్టే బీమా సంస్థలకు 100 శాతానికి పెంచారు. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఈ రంగం దాదాపు 8.79 బిలియన్ అమెరికన్ డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించింది.

టెలికమ్యూనికేషన్స్, నాన్-షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్, పౌర విమానయానంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్, శాటిలైట్ కాంపోనెంట్ తయారీ, బ్రాడ్‌కాస్టింగ్ డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో ఆటోమేటిక్ రూట్ ద్వారా 100 శాతం వరకు ఎఫ్‌డీఐని అనుమతిస్తారు.

2014-15 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్య భారత్ 843 బిలియన్ అమెరికన్ డాలర్ల ఎఫ్‌డీఐలను స్వీకరించింది. అంతకుముందు పన్నెండేళ్లలో వచ్చిన 313 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 169 శాతం అధికం. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐ ప్రవాహం రికార్డు గరిష్ట స్థాయికి 94.53 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ఎస్‌డబ్ల్యూఎస్) 15,49,850 దరఖాస్తులను స్వీకరించింది. 5,76,778 వ్యాపారాలను నమోదు చేసుకుంది. 8.5 లక్షలకుపైగా ఆమోదాలను తెలిపింది. సెప్టెంబర్ 2021లో దీని ప్రారంభ సమయంలో 142 కేంద్ర అనుమతులు, 14 రాష్ట్రాలు, యూటీలు మాత్రమే ఉండగా... ప్రస్తుతం ఈ వేదికలో 327 కేంద్ర, 3,452 రాష్ట్ర సేవలతో కలిపి మొత్తం 3,779 సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యవస్థలో 34 రాష్ట్రాలు, యూటీలు, 32 కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాలు భాగస్వాములవగా... 18 కేంద్ర మంత్రిత్వశాఖలు ఎన్ఎస్‌డబ్ల్యూఎస్‌ను ఉపయోగిస్తున్నాయి.

నో యువర్ అప్రూవల్స్ (కేవైసీ) మాడ్యూల్ ద్వారా వ్యాపారాలకు వర్తించే కేంద్ర, రాష్ట్ర అనుమతులను ముందుగానే తెలుసుకోవచ్చు. ఇది 8,000కి పైగా అనుమతులకు సంబంధించిన సమాచారాన్నిస్తుంది. వీటిలో 592 కేంద్ర, 2,233 రాష్ట్ర అనుమతులతో కలిపి మొత్తం 2,825 అనుమతులు కేవైసీ ద్వారా అనుసంధానమయ్యాయి. ఒకే సమాచారాన్ని పదే పదే నమోదు చేసే విధానానికి స్వస్తి పలికేందుకు, 89 సాధారణ డేటా ఫీల్డ్‌లు 285 అనుమతుల్లో ఆటోమేటిక్‌గా సమాచారాన్ని నింపే వెసులుబాటును కల్పించారు. పారిశ్రామికవేత్తలు సులభంగా అర్థం చేసుకునేందుకు 22 భారతీయ భాషల్లో ఈ పోర్టల్ అందుబాటులో ఉంది.

అనుమతుల ప్రక్రియను పూర్తిగా తొలగించేందుకు కూడా ఎన్ఎస్‌డబ్ల్యూఎస్‌ ఉపయోగపడుతుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంసీఏ), వస్తు, సేవల పన్ను వ్యవస్థ (జీఎస్‌టీఎన్) తదితర డేటాబేస్‌ల నుంచి సమాచారాన్ని సేకరించి ఇండస్ట్రియల్ ఎంటర్‌ప్రెన్యూర్ మెమొరాండం (ఐఈఎం)ను ఎలాంటి శాఖాపరమైన అనుమతి లేకుండానే ఆటో-జనరేట్ చేస్తున్నారు. ఎన్ఎస్‌డబ్ల్యూఎస్‌, వీసా పోర్టల్ మధ్య ఏపీఐ అనుసంధానం ద్వారా సంబంధిత మంత్రిత్వశాఖ అనుమతి లేకుండానే విదేశీ నిపుణుల కోసం ఈ-బీ4 ప్రొడక్షన్ వీసా స్పాన్సర్‌షిప్ లెటర్లు జెనరేట్ అవుతున్నాయి.

వ్యాపారాలకు నియంత్రణపరమైన అనుమతులు, నిబంధనల కోసం ఒకే వేదికను అందించే సమగ్ర డిజిటల్ వేదికలుగా సింగిల్ విండో సిస్టమ్స్‌ను (ఎస్‌డబ్ల్యూఎస్) ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని రాష్ట్రాలు, యూటీలను ప్రోత్సహించారు. ఈ విధానం సింగిల్ సైన్-ఆన్, సింగిల్ బిజినెస్ ఐడీ, నో యువర్ అప్రూవల్స్, కామన్ అప్లికేషన్ ఫారమ్‌లు, ఆన్‌లైన్ చెల్లింపులు, తనిఖీ నిర్వహణ, దరఖాస్తుదారులకు మార్గదర్శకత్వం, ఫిర్యాదుల పరిష్కారం, రియల్ టైమ్ డాష్‌బోర్డుల వంటి అధునాతన సౌకర్యాలను కల్పిస్తుంది. ఇవన్నీ శాఖల మధ్య సమన్వయం, సమర్థవంతమైన డిజిటల్ ప్రాసెసింగ్ ద్వారా సజావుగా అమలవుతున్నాయి.

విధానపరమైన సంక్లిష్టతలను తగ్గించటం, భౌతిక పరస్పర సంబంధాలను తగ్గించటం, పారదర్శకతను పెంచటం, సకాలంలో సేవలను అందించటమే ఈ కార్యక్రమాల ఉద్దేశం. ఈ సంస్కరణలన్నీ సరళమైన, డిజిటల్, సులభతరమైన నియంత్రణ వ్యవస్థ దిశగా మార్పును సూచిస్తాయి. దీనివల్ల వ్యాపారాలను సులువుగా ప్రారంభించేందుకు, వృద్ధి చేసేందుకు, పెట్టుబడులు పెట్టటానికి వీలవుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2329299) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Assamese , Tamil