నాడు పోస్టు చేయడమైనది:
27 OCT 2026 4:34PM by PIB Hyderabad
లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నిన్న ప్రారంభించిన 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం నేడు సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) చార్టర్ సూత్రాలు, సార్వభౌమ సమానత్వం, పరస్పర గౌరవం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం వంటి అంశాల పట్ల సభ్య దేశాల నిబద్ధతను ఈ ప్రకటన స్పష్టం చేసింది. ప్రస్తుతం బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న భారత్ అంతర్జాతీయ దౌత్య రంగంలో తన ప్రాధాన్యాన్ని మరింత పెంచుకుంటున్న నేపథ్యంలో.. సంయుక్త ప్రకటన దేశ ప్రధాన వ్యూహాత్మక ప్రాధాన్యాలకు అనుగుణంగా రూపొందింది. న్యూఢిల్లీ ప్రకటన (ఎన్డీడీ)లోని ఏకాభిప్రాయానికి అనుగుణంగా, ప్రపంచ పాలనలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని సభ్య దేశాల పార్లమెంటులు స్పష్టంగా మద్దతు తెలిపాయి. ఈ మేరకు న్యూఢిల్లీ ప్రకటనలోని 13వ పేరాను ప్రస్తావించాయి.
జాతీయ భద్రత విషయంలో భారత్ అనుసరిస్తున్న దృఢమైన వైఖరికి ఈ ప్రకటనలో ఉగ్రవాద వ్యతిరేక అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యం మరింత బలాన్ని చేకూర్చింది. న్యూఢిల్లీ ప్రకటనలోని 40వ పేరా ఆధారంగా సరిహద్దుల అవతలి నుంచి జరిగే ఉగ్రవాదం, ఉగ్రవాదానికి ఆర్థిక సహకారం అందించడం, ఉగ్రవాదులకు సురక్షిత ఆశ్రయాలు కల్పించడాన్ని సంయుక్త ప్రకటన ఖండించింది. ఉగ్రవాదంపై ఏమాత్రం ఉపేక్షించని వైఖరి అవలంబించాలని, ద్వంద్వ ప్రమాణాలకు ముగింపు పలకాలని డిమాండ్ చేసింది. తుది ముసాయిదాలో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు (డీపీఐ) రిపోజిటరీల విస్తరణ, కృత్రిమ మేధ వినియోగంలో నైతిక ప్రమాణాల అమలు, ఉమ్మడి అయినప్పటికీ విభిన్న బాధ్యతలు, సంబంధిత సామర్థ్యాలు (సీబీడీఆర్-ఆర్సీ) సూత్రానికి కట్టుబడి ఉండటం వంటి అంశాలకు చోటు కల్పించారు. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వహించడానికీ సభ్య దేశాలు ఏకగ్రీవ మద్దతు తెలిపాయి. భారత్ నేతృత్వంలో ముందుకు సాగుతున్న అభివృద్ధి, వాతావరణ మార్పుల అజెండాలకు కూడా తుది ప్రకటనలో ప్రాధాన్యం కల్పించారు.
ముగింపు కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్రసంగిస్తూ.. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను సంఘర్షణల ద్వారా కాకుండా నిరంతర చర్చలు, పరస్పర శాంతి, సమష్టి కార్యాచరణ ద్వారానే పరిష్కరించగలమని స్పష్టం చేశారు.
బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రముఖ ప్రతినిధులు, అంతర్జాతీయ పార్లమెంటేరియన్లను ఉద్దేశించి లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్రసంగించారు. రెండు రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ఆయన ప్రస్తావించారు. పాల్గొన్న దేశాల నేపథ్యాలు, పరిస్థితులు, సవాళ్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ, మానవ సంక్షేమం, శాంతి, సౌభాగ్యం పట్ల వాటికి ఉన్న ఉమ్మడి నిబద్ధతే బ్రిక్స్ కూటమికి ప్రధాన బలమని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత, ఆర్థిక అనిశ్చితి, ప్రాంతీయ సంఘర్షణల పరిస్థితులను ప్రస్తావిస్తూ.. భారత్ అనుసరిస్తున్న ప్రాథమిక సిద్ధాంతాన్ని శ్రీ బిర్లా వివరించారు. యుద్ధంలో కాకుండా సంభాషణలో, సంఘర్షణలో కాకుండా శాంతిలో, పోటీలో కాకుండా సహకారంలోనే శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని స్పష్టం చేశారు. దేశాల సార్వభౌమత్వాన్ని సంపూర్ణంగా గౌరవించడం, అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, అందరికీ సమానమైన అభివృద్ధి అవకాశాలు కల్పించడం ఆధారంగా ప్రపంచ వ్యవస్థను నిర్మించాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచ శాంతి అంటే భద్రత, గౌరవం, న్యాయం, ప్రతి ఒక్కరికీ మెరుగైన భవిష్యత్తుపై భరోసా కల్పించడం. ముఖ్యంగా యువతరానికి ఈ భరోసా అవసరం’’ అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలు తమకు వారసత్వంగా అందించిన ప్రపంచం ఎంత సురక్షితంగా, సుభిక్షంగా ఉందనే అంశం ఆధారంగా ప్రస్తుత నాయకుల పనితీరును అంచనా వేస్తాయని తెలిపారు.
ప్రజాస్వామ్య సంస్థల బాధ్యతలు మారుతున్న తీరును వివరిస్తూ.. పార్లమెంట్లు కేవలం చట్టాలు రూపొందించే సంస్థలు మాత్రమే కాదని, చర్చలు, ఏకాభిప్రాయ సాధన, జవాబుదారీతనం, ప్రజల విశ్వాసానికి కీలక కేంద్రాలని లోక్సభ స్పీకర్ పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచ దేశాల చట్టసభలు మరింత సమర్థంగా, పారదర్శకంగా, పౌరుల అవసరాలకు ప్రాధాన్యమిచ్చేలా మారాలని సూచించారు. ఆధునిక సాంకేతిక సాధనాల వినియోగంపై మాట్లాడుతూ.. కృత్రిమ మేధ, డిజిటల్ సాంకేతికతలు పార్లమెంటరీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు దోహదపడతాయని శ్రీ బిర్లా తెలిపారు. అయితే వీటి అభివృద్ధి మానవీయ విలువలు, నైతికత, పారదర్శకత, జవాబుదారీతనానికి కచ్చితంగా అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు.
బ్రిక్స్ విజయాలు కేవలం సభ్య దేశాల వ్యక్తిగత అభివృద్ధికే పరిమితం కాకుండా, విస్తృత అంతర్జాతీయ సమాజానికి కూడా ప్రయోజనం చేకూర్చాలని శ్రీ ఓం బిర్లా స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి నిర్ణయాల ప్రక్రియలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొన్నారు.
12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం విజయవంతంగా ముగిసిన సందర్భంగా 2027 సంవత్సరానికి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న చైనాకు శ్రీ బిర్లా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. చైనా నాయకత్వంలో సభ్య దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుందనే పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంటులు శాంతి, సహకారం, సమష్టి శ్రేయస్సుకు బలమైన గొంతుకలుగా నిలవాలని పిలుపునిస్తూ 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం ముగిసింది.
సంయుక్త ప్రకటన ప్రతిని ఇక్కడ చూడవచ్చు.