పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్మేనియా.. యెరెవన్‌లో సీబీడీ సీఓపీ-17లో జీవవైవిధ్య సంరక్షణ, గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేంవర్క్‌ల ప్రభావవంత కార్యాచరణల పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించిన భారత్

విజ్ఞానశాస్త్ర ఆధారిత బయోడైవర్సిటీ గవర్నెన్సులో జాతీయ పరిస్థితులు, అమలులో
తగినన్ని వనరుల లభ్యతకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని స్పష్టం చేసిన శ్రీ భూపేందర్ యాదవ్

నాడు పోస్టు చేయడమైనది: 27 OCT 2026 2:13PM by PIB Hyderabad

ఆర్మేనియాలోని యెరెవన్‌లో పదిహేడో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు ది కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ (సీబీడీ సీఓపీ-17)కు సంబంధించిన ఉన్నత స్థాయి సెగ్మెంటులో భారతదేశం తరఫున కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ రోజు పాల్గొని, భారత్ ప్రకటనను చదివారు. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంతో పాటు, ప్రకృతితో సామరస్యం ఏర్పరుచుకుంటూ ముందుకు పోయే దిశగా జరుగుతున్న ఉమ్మడి కృషిని బలోపేతం చేసేందుకు భారత్ నిబద్ధతతో పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రి పునరుద్ఘాటించారు.
 కున్‌మింగ్-మాంట్రియల్ అంతర్జాతీయ జీవ వైవిధ్య ప్రాథమిక ప్రణాళిక (గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేంవర్క్) సంబంధిత కార్యాచరణలో ఆయా దేశాల ప్రాధాన్యాలు, పరిస్థితులు, చట్టాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగవలసి ఉంటుందని శ్రీ యాదవ్ అన్నారు. అంతేకాకుండా అభివృద్ధి చెందిన దేశాలు చాలినంత స్థాయిలో, మార్పులకు తావు ఉండని రీతిలో ఆర్థిక సహాయాన్ని అందుబాటులో ఉంచాలని, సామర్థ్యాల పెంపుదలకు చర్యలు తీసుకోవాలని, సాంకేతికత బదలాయింపులు కూడా చోటు చేసుకోవాలని ఆయన అన్నారు. కాలీ ఫండ్ సహా ఓ బహుళపక్ష వ్యవస్థ ద్వారా జెనెటిక్ వనరులకు సంబంధించిన డిజిటల్ సీక్వెన్స్ సమాచారాన్ని అందజేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను పరస్పరం సమానంగా పంచుకొనే పద్దతిని భారత్ సమర్ధిస్తోందని మంత్రి అన్నారు. కృత్రిమ జీవవిజ్ఞానశాస్త్రం (సింథెటిక్ బయాలజీ), బయోసేఫ్టీ విషయాలలో విజ్ఞాన ఆధారితమైన, నష్టభయాన్ని దామాషా పద్ధతిలో ఎదుర్కొనే, ముందుజాగ్రత్తలతో కూడిన విధానాల్ని అవలంబించడం ఎంతైనా అవసరమని మంత్రి సూచించారు. భారత్ ఆధునిక జాతీయ జీవవైవిధ్య వ్యూహం, కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్న క్రమంలో గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేంవర్కును అమలు చేయడానికి 23 జాతీయ బయోడైవర్సిటీ టార్గెట్లను, 142 సూచికలను నిర్దేశించుకుందని ఆయన తెలిపారు.

జీవవైవిధ్య సంరక్షణ రంగంలో భారత్ సాధించిన పురోగతిని శ్రీ యాదవ్ ప్రస్తావిస్తూ, దేశంలో 1,134 సంరక్షిత ప్రాంతాలు, 103 రామ్‌సర్ స్థలాలు, 57 జీవవైవిధ్య వారసత్వ స్థలాలకు తోడు 18 జీవావరణ (బయోస్ఫియర్) రిజర్వులు ఉన్నాయని తెలిపారు. వాటిలో 13 యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ నెట్‌వర్క్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ఆరంభించిన ‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్’ ప్రపంచంలో ఏడు బిగ్ క్యాట్ ప్రజాతులు, వాటి సహజ స్థలాల సంరక్షణార్థం అంతర్జాతీయ సహకారాన్ని ముందుకు తీసుకుపోతోందని మంత్రి వివరించారు.  ‘మిషన్ లైఫ్’, ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పర్యావరణం పట్ల బాధ్యతతో నడుచుకోవాలన్న భావనను మరింత బలోపేతం చేస్తున్నాయని, జీవ వైవిధ్య సంరక్షణను సమాజ సామూహిక కృషిగా ప్రచారం చేస్తున్నాయని కూడా ఆయన వెల్లడించారు.
జీవవైవిధ్య సంరక్షణనే కాకుండా పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణను కూడా ముందుకు తీసుకుపోతోందని మంత్రి వివరించారు.  మడ అడవుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మ్యాన్‌గ్రోవ్ ఇనీషియేటివ్ ఫర్ షోర్‌లైన్ హ్యాబిటాట్స్ అండ్ ట్యాంజిబుల్ ఇన్‌కమ్స్ (ఎమ్ఐఎస్‌హెచ్‌టీఐ), మాగాణినేలల సంరక్షణకు ‘అమృత్ ధరోహర్’, సుస్థిర ప్రాతిపదికన భూ నిర్వహణ, భూ సార పరిరక్షణ లక్ష్యాలతో ‘సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్’ సహా వివిధ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. బయో డైవర్సిటీ కన్వెన్షన్ లక్ష్యాలకు అనుగుణంగా భారత్ తన చట్టాలలో కొన్ని సానుకూల మార్పులను తీసుకువచ్చిందని, క్షేత్ర స్థాయిలో వికేంద్రీకృత వ్యవస్థ ద్వారా వనరుల చెంతకు చేరడం, ప్రయోజనాలను ఉమ్మడిగా పొందడానికి గ్రామస్థాయి సంఘాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ సంఘాలలో స్థానికులు పాలుపంచుకునేటట్లు వారిని ప్రోత్సహిస్తున్నామని, దీంతో బయోలాజికల్ వనరులను సుస్థిర ప్రాతిపదికన ఉపయోగించుకోవడం వల్ల కలిగే లాభాలు వారికి అందేందుకు మార్గం సుగమం అవుతుందని శ్రీ యాదవ్ వివరించారు.
బహుళ పక్ష సహకారం అంశంలో భారత్ నిబద్ధతను శ్రీ యాదవ్ పునరుద్ఘటిస్తూ, ‘కున్‌మింగ్-మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేంవర్క్’ను అమలు చేసేటప్పుడు ‘‘ఈ భూగ్రహం అన్ని దేశాలదీ, మానవాళి అంతా ఒకే కుటుంబం, మన అందరికీ ఉమ్మడి భవిత’’ అన్న సదాశయాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నామన్నారు. అన్ని పక్షాలతో కలసి పనిచేయడాన్ని భారత్ ఇక మీదటా కొనసాగిస్తుందన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2329007) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam