నాడు పోస్టు చేయడమైనది:
26 OCT 2026 3:24PM by PIB Hyderabad
భారత పార్లమెంటు ప్రాంగణంలోని చరిత్రాత్మక సంవిధాన్ సదన్‌లో నేడు జరిగిన 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్-2026ను లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్రారంభించారు. ప్రజలే కేంద్రంగా అభివృద్ధి, ప్రపంచ శాంతి, సుస్థిరత, అంతర్జాతీయ సహకారం పట్ల ఉమ్మడి సంకల్పాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల పార్లమెంట్లకు పిలుపునిచ్చారు. మార్పును తీసుకురావటంలో పార్లమెంటరీ భాగస్వామ్యానికున్న సామర్థ్యాన్ని స్పష్టం చేశారు. ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనేందుకు, పరస్పర అవగాహనను పెంపొందించేందుకు, పౌరుల జీవితాల్లో అర్థవంతమైన, సానుకూల మార్పును తీసుకువచ్చేందుకు దేశాల ఉమ్మడి విజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన అవసరాన్ని తెలియజేశారు.
భారత్‌కు విచ్చేసిన బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల పార్లమెంటరీ ప్రతినిధుల బృందాలకు శ్రీ ఓం బిర్లా స్వాగతం పలికారు. ఈ దేశాల రాకతో పరస్పర చర్చలు, పార్లమెంటరీ సహకారం, పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువల పట్ల భాగస్వామ్య దేశాల నిబద్ధత తెలుస్తుందని అన్నారు. భౌగోళిక, సాంస్కృతిక, భాషా, సామాజిక వైవిధ్యాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య ఆదర్శాలపై విశ్వాసం, మానవాళి పట్ల ఉమ్మడి బాధ్యత అన్ని దేశాలను ఏకం చేస్తున్నాయని అన్నారు. వైవిధ్యాన్ని శక్తిగా, ఉమ్మడి లక్ష్యంగా, సమష్టి ప్రగతికి మూలంగా మార్చటంలోనే బ్రిక్స్ అసలైన బలం దాగి ఉందన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ దేశాల ప్రభుత్వాధినేతల శిఖరాగ్ర సదస్సులో ఉమ్మడి ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించటం కీలకమైన ఘట్టంగా శ్రీ ఓం బిర్లా అభివర్ణించారు. సభ్య దేశాలకు అభినందనలు తెలిపారు. ఈ ఉమ్మడి ప్రకటనలోని అంశాలను స్పష్టమైన, శాశ్వత ఫలితాలుగా మార్చటమే ప్రస్తుత సవాలని స్పష్టం చేశారు. శాసన అధికారాలు, బడ్జెట్ ప్రక్రియలు, చర్చలు, పర్యవేక్షణ ద్వారా పార్లమెంట్లు ఈ అంశాలను ఆచరణాత్మక చర్యలుగా మలచటంలో, పౌరులకు స్పష్టమైన ప్రయోజనాలను అందించటంలో కీలక పాత్ర పోషించగలవని స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న సందర్భంగా.. ప్రాంతీయ సంఘర్షణలు, యుద్ధాలు, ఆర్థిక అస్థిరత, వాణిజ్య ఉద్రిక్తతలు, ఉగ్రవాదం, వాతావరణ మార్పుల వల్ల ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని శ్రీ ఓం బిర్లా అన్నారు. ఈ సవాళ్ల పర్యవసానాలు కేవలం ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నాయని, కాబట్టి సమష్టి బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. సవాలుతో కూడిన ప్రపంచ పరిస్థితుల్లో చర్చలు, దౌత్యనీతి, పరస్పర సహకారాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపాలైన పార్లమెంట్లు.. అవగాహనకు వారధులుగా నిలుస్తూ, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించేందుకు, అంతర్జాతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు, ప్రపంచ సవాళ్లకు శాంతియుత, నిర్మాణాత్మక పరిష్కారాలను అందించేందుకు తోడ్పడతాయని తెలిపారు. పార్లమెంటరీ దౌత్యం ద్వారా ప్రజాప్రతినిధుల దృక్పథాలను పరస్పరం మార్చుకోవచ్చని, అనుభవాలను పంచుకుంటూ సమాన ప్రయోజనాలను గుర్తించి, అర్థవంతమైన అంతర్జాతీయ సహకారానికి నూతన మార్గాలను సుగమం చేయవచ్చని చెప్పారు.
గ్లోబల్ సౌత్ స్వరాన్ని మరింత బలపరచంలో, వారి ఆకాంక్షలను ప్రపంచ వేదికపై ముందుకు తీసుకెళ్లటంలో బ్రిక్స్ కూటమికి కీలక బాధ్యత ఉందని శ్రీ ఓం బిర్లా వ్యాఖ్యానించారు. ఈ ఆకాంక్షలు కేవలం చర్చలు, ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాలను మెరుగుపరిచే విధానాలు, ఆచరణాత్మక సహకారం, ఉమ్మడి కార్యక్రమాల ద్వారా కార్యరూపం దాల్చాలని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలు, ప్రాధాన్యతలకు అంతర్జాతీయ నిర్ణయాల్లో తగిన ప్రాతినిధ్యం లభించేలా చూడటంలోనూ, అందరి ఉమ్మడి లక్ష్యాలను క్రియాశీలక కార్యక్రమాలుగా మార్చటంలోనూ ఈ కూటమి అసలైన బలం ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
‘ప్రజలే కేంద్రంగా అభివృద్ధి కోసం పార్లమెంట్ల బలోపేతం’ ఇతివృత్తంతో నిర్వహిస్తున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్-2026 ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ప్రాధాన్యతను సంతరించుకుందని శ్రీ ఓం బిర్లా చెప్పారు. రెండు రోజుల పాటు సాగే ఈ ఫోరమ్.. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత వంటి నాలుగు పరస్పర అనుసంధాన అంశాలపై సమగ్ర చర్చలకు కీలక వేదికను అందిస్తుందని తెలిపారు. మరింతగా అనుసంధానమవుతున్న నేటి ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు, సమగ్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నాలుగు అంశాలు అత్యవసరమని వెల్లడించారు.
అనిశ్చితి, అవాంతరాలు ఎదురయ్యే సమయాల్లో నిరంతరం కొనసాగే, జవాబుదారీతనం, ప్రభావవంతమైన ప్రజాస్వామ్య పర్యవేక్షణకు బ్రిక్స్ దేశాల శాసన నిర్మాణ వ్యవస్థలను, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలని లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుస్థిర పార్లమెంటరీ వ్యవస్థల ఆవశ్యకతను తెలియజేశారు. మారుతున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పురోగమించాల్సిన సజీవ వ్యవస్థలు పార్లమెంట్లని అభిప్రాయపడ్డారు. కేవలం రాజ్యాంగబద్ధమైన అధికారంలోనే కాక నిర్మాణాత్మకమైన చర్చలు జరపటం, ఏకాభిప్రాయాన్ని సాధించటం, పారదర్శకతను కాపాడటం, తాము ప్రాతినిధ్యం వహించే పౌరులకు జవాబుదారీగా ఉండటంలోనే పార్లమెంట్ల బలం దాగి ఉందన్నారు.
పార్లమెంటరీ నిర్వహణలో ఆవిష్కరణల పరివర్తనాత్మక పాత్రను స్పీకర్ స్పష్టం చేశారు. ఆవిష్కరణ అంటే కేవలం కొత్త సాంకేతికతలను స్వీకరించటం మాత్రమే కాదని.. ప్రజాస్వామ్య వ్యవస్థలను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా, భాగస్వామ్యయుతంగా, స్పందించేవిగా తీర్చిదిద్దే నూతన ఆలోచనలు, పురోగతి సాధించే పద్ధతులు, సంస్థాగత సంస్కరణలు కూడా భాగమేనని తెలిపారు. నిర్మాణాత్మక మార్పులను అంగీకరించటం, సంస్థాగత సామర్థ్యాలను పెంపొందించుకోవటం ద్వారా పార్లమెంట్లు చర్చల నాణ్యతను పెంచగలవని, ప్రజల భాగస్వామ్యాన్ని మెరుగుపరచగలవని, పౌరుల మారుతున్న అంచనాలకు మరింత అర్థవంతంగా స్పందించగలవని పేర్కొన్నారు.
పార్లమెంటరీ సహకారంలోని అపారమైన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తూ... బ్రిక్స్ దేశాల వైవిధ్యం పరిమితి కాదని, ఉమ్మడి ప్రయోజనాల కోసం వినియోగించుకోగల విలువైన ఆస్తి అని శ్రీ బిర్లా అభిప్రాయపడ్డారు. అనుభవాలను పంచుకోవటం, ఉత్తమ విధానాలను పరస్పరం మార్చుకోవటం, ఒకరి సంస్థాగత బలాల నుంచి మరొకరు నేర్చుకోవటం ద్వారా ఉమ్మడి సవాళ్లకు ఆవిష్కరణలతో కూడిన పరిష్కారాలను పార్లమెంట్లు సమష్టిగా రూపొందించగలవని అన్నారు. ఇటువంటి నిరంతర భాగస్వామ్యం మరింత సమానమైన, సమ్మిళిత, శాంతియుతమైన ప్రపంచానికి పునాదులు వేసేందుకు తోడ్పడుతుందని ఆయన తెలిపారు.
పరస్పర సహకార సంస్కృతిని పెంపొందించుకోవటమే పార్లమెంటరీ దౌత్య ప్రాథమిక సూత్రమని శ్రీ ఓం బిర్లా అన్నారు. ప్రతి దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రత్యేక దృక్పథాలను పూర్తిస్థాయిలో గౌరవించాలని స్పష్టం చేశారు. దేశాల మధ్య వైవిధ్యమైన పరిస్థితులు సంయుక్త లక్ష్యాల సాధనకు అడ్డుకాకూడదని అన్నారు. నిర్మాణాత్మక భాగస్వామ్యం ద్వారా విభిన్న దృక్పథాలను పరస్పర అభ్యాసానికి, ఉమ్మడి పురోగతికి అవకాశాలుగా మలచుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అనుభవాలను సంయుక్త కార్యాచరణగా, పరస్పర అవగాహనను శాశ్వత విశ్వాసంగా, చర్చలను అర్థవంతమైన సహకారంగా మార్చాలని, నిబద్ధతను పునరుద్ధరించుకోవాలని బ్రిక్స్ సభ్య దేశాలకు శ్రీ ఓం బిర్లా విజ్ఞప్తి చేశారు.
సుస్థిరాభివృద్ధి ఆవశ్యకతను ప్రస్తావిస్తూ... అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఒకదానికొకటి పరస్పరం దోహదపడే అంశాలని భారత తత్వశాస్త్రం భావిస్తుందని శ్రీ బిర్లా పేర్కొన్నారు. ఈ సమగ్ర దృక్పథం బ్రిక్స్ దేశాల పార్లమెంట్లకు కీలక మార్గదర్శక సూత్రంగా నిలుస్తుందని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే విధంగా అభివృద్ధి ఉండకూడదని, పర్యావరణ బాధ్యత, సుదీర్ఘ సుస్థిరత, భావితరాల ప్రయోజనాలను కాపాడే ధ్యేయంతో ఆర్థిక-సామాజిక పురోగతి విధానాలు రూపొందాలని అన్నారు. సమృద్ధిగా గల, సమ్మిళిత, పర్యావరణ భద్రత గల ప్రపంచ నిర్మాణానికి ఈ దిశగా ఉమ్మడి కార్యాచరణ అత్యావశ్యకమని స్పష్టం చేశారు.
నేటి యువత ఆకాంక్షలను ప్రస్తావిస్తూ... ఆధునిక కాలంలో యువతకు నాణ్యమైన విద్య, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నాయని, నూతనత్వాన్ని ఆవిష్కరించాలనే తపన, నిరూపించుకోవాలనే పట్టుదల వారిలో అధికంగా ఉన్నట్లు పరిశీలించానని శ్రీ ఓం బిర్లా తెలిపారు. వారి ఆకాంక్షలకు తగిన అవకాశాలు, గౌరవం, నైపుణ్యాలు వికసించే అనుకూల వాతావరణం కల్పించాలని పిలుపునిచ్చారు. యువత సమస్యలను వినటం, వారి ఆశలు, ఆందోళనలను అర్థం చేసుకోవటం, శక్తి, సృజనాత్మకతలను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసే మార్గాలను సుగమం చేయటం పార్లమెంట్ల ప్రాథమిక బాధ్యతని అన్నారు. యువతను సాధికారులను చేయటం కేవలం వ్యక్తిగత భవిష్యత్తుపై చేసే పెట్టుబడి మాత్రమే కాదని, ఆయా దేశాల ఉమ్మడి భవిష్యత్తు పట్ల నిబద్ధత చూపటమేనని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా బ్రిక్స్ కూటమిని 'పరిష్కారాల వ్యవస్థ'గా తీర్చిదిద్దాల్సిన అవసరముందని లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా స్పష్టం చేశారు.
ఈ వేదిక విజయం కేవలం చర్చల విస్తృతిపై మాత్రమే కాకుండా, సాధించే ఫలితాలు, ప్రజల జీవితాల్లో తీసుకువచ్చే సానుకూల మార్పులపైనే ఆధారపడి ఉంటుందని లోక్‌సభ స్పీకర్ అన్నారు. చర్చలు కార్యాచరణగా మారాలని, సహకారం ద్వారా కొలవగల స్పష్టమైన ఫలితాలు రావాలని చెబుతూ... ఉమ్మడి భవిష్యత్తు కోసం భవిష్యత్-సన్నాహక ప్రణాళికతో ముందడుగు వేయాలని సభ్యదేశాల పార్లమెంట్లకు పిలుపునిచ్చారు.
బ్రిక్స్ దేశాల జాతీయ పరిస్థితులు, అభివృద్ధి ప్రాధాన్యతలు, దృక్పథాల్లో వైవిధ్యాలు ఉన్నప్పటికీ.. శాంతి, భద్రత, పరస్పర గౌరవం, సమాన అవకాశాలు, పౌరులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనే ప్రాథమిక ఆకాంక్షలు అందరినీ ఒక్కటి చేస్తున్నాయని శ్రీ ఓం బిర్లా వ్యాఖ్యానించారు. ఈ ఉమ్మడి ఆకాంక్షలే పరస్పర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, అర్థవంతమైన సహకారానికి బలమైన పునాదిని వేస్తున్నాయని అన్నారు. ఈ ఉమ్మడి లక్ష్యాల సాధనలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు, పరస్పర అవగాహనను పెంచేందుకు, సమష్టి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లేందుకు బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ క్రియాశీల వేదికగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ చర్చల ఫలితాల గురించి ప్రస్తావిస్తూ... సభ్యదేశాల మధ్య భాగస్వామ్య బంధాలను 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ మరింత పటిష్టం చేస్తుందని శ్రీ ఓం బిర్లా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది మరింత సమ్మిళిత, శాంతియుత, సుస్థిర ప్రపంచ ఆవిర్భావానికి గణనీయంగా దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ చర్చలు పరస్పర విశ్వాసానికి, అంతర్జాతీయ సహకారానికి నూతనోత్తేజాన్ని ఇస్తాయని, ప్రజలే కేంద్రంగా సాగే అభివృద్ధి పట్ల సమష్టి నిబద్ధతను బలోపేతం చేస్తాయని, ఉమ్మడి ఆకాంక్షలను శాశ్వత విజయాలుగా మార్చటంలో బ్రిక్స్ దేశాల పట్టుదలను పునరుద్ధరిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ శ్రీ హరివంశ్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్వాగతోపన్యాసం చేశారు.
***