రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రక్షణ దళాల కోసం రూ. 2.12 లక్షల కోట్ల విలువైన మూలధన కొనుగోలు ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 26 OCT 2026 4:21PM by PIB Hyderabad

రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన 2026 అక్టోబర్‌ 26న జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశంలో రక్షణ దళాల కోసం వివిధ ఆయుధాలు, సైనిక పరికరాల ( మూలధన సేకరణ) కొనుగోలు ప్రతిపాదనలకు పాలనాపరమైన ఆమోదం (ఏఓఎన్‌) లభించింది. ఈ కొనుగోళ్లకు సుమారు రూ.2,12,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇందులో భాగంగా భారత సైన్యం కోసం అధిక చలనశీలత కలిగిన వాహనాలు (హెచ్‌ఎంవీలు), స్వయంచాలకంగా కదులుతూ కాల్పులు జరిపే ట్రాక్‌డ్‌ గన్‌ వ్యవస్థ, గన్‌ షాట్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ (జీఎస్‌ఆర్‌ఎస్‌), తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్లు (ఎల్‌ఎంఆర్‌హెచ్‌), అత్యంత స్వల్పశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థ (వీషోరాడ్స్‌), వేదిక ఆధారిత మానవరహిత వైమానిక వ్యవస్థల వ్యతిరేక వ్యవస్థ (సీ-యూఏఎస్‌), దీర్ఘశ్రేణి మానవరహిత వైమానిక వ్యవస్థ, నిఘా డ్రోన్లు, సమీకృత నిఘా, దాడి వ్యవస్థ, దీర్ఘశ్రేణి కామికాజే డ్రోన్‌ వ్యవస్థల కొనుగోలుకు ఆమోదం లభించింది.

అధిక చలనశీలత కలిగిన వాహనాలు క్లిష్టమైన భూభాగాల్లో ఆర్మీ కార్యకలాపాల సామర్థ్యాన్ని, రవాణా సహకారాన్ని, కదలికలను మెరుగుపరుస్తాయి. స్వయంచాలక ట్రాక్‌డ్‌ గన్‌ వ్యవస్థ యాంత్రిక సైనిక దళాలకు తగిన చలనశీలతతో పాటు కాల్పుల సామర్థ్యాన్ని అందిస్తుంది. గన్‌ షాట్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ (జీఎస్‌ఆర్‌ఎస్‌) సైనిక బలగాల పరిసర పరిస్థితులపై తక్షణ సమాచారాన్ని అందిస్తూ వాటి సామర్థ్యాన్ని పెంచుతుంది. తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్లను భారత సైన్యం, భారత వైమానిక దళం రెండూ ఉపయోగించనున్నాయి. నిఘా, పరిశీలన, యుద్ధ కార్యకలాపాలు, సైనికుల శోధన, రక్షణ చర్యలు, మానవతా సహాయం, విపత్తుల సమయంలో సహాయక చర్యలకు ఇవి ఉపయోగపడతాయి. అత్యంత స్వల్పశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థ (వీషోరాడ్స్‌) కొత్త తరానికి చెందిన చిన్న పరిమాణంలోని వైమానిక ముప్పులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుంది. ఇక సీ-యూఏఎస్‌ వ్యవస్థ ఆధునిక యుద్ధభూమిలో ట్యాంకుల మనుగడ సామర్థ్యాన్ని పెంచుతుంది. నిఘా, డ్రోన్‌ వ్యవస్థలు భారత సైన్యం పరిశీలనా సామర్థ్యాలను, లక్ష్యాలను గుర్తించి దాడి చేసే సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తాయి.

భారత నౌకాదళం కోసం యాక్టివ్‌ ఆఫ్‌బోర్డ్‌ డెకాయ్‌ వ్యవస్థ (ఏఓడీఎస్‌)తో పాటు ఇతర ప్రధాన నౌకాదళ వేదికల కొనుగోలుకు ఆమోదం లభించింది. ఏఓడీఎస్‌ వ్యవస్థ శత్రువుల ఆధునిక నౌకా విధ్వంసక క్షిపణుల నుంచి రక్షణ కల్పించడంలో క్షిపణి నిరోధక వ్యవస్థల సామర్థ్యంపై విశ్వసనీయతను పెంచుతుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, నిర్మించే ప్రధాన నౌకాదళ వేదికలు ఆధునిక యుద్ధ సామర్థ్యాలను కలిగి ఉండటంతో పాటు నౌకాదళ పోరాట సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.

భారత వైమానిక దళం కోసం గగనతల రక్షణ, యుద్ధ సామర్థ్యాలను పెంచేందుకు హెలికాప్టర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధాలు, మొబైల్‌ ఎక్స్‌-బ్యాండ్‌ డాప్లర్‌ వాతావరణ రాడార్‌ వ్యవస్థ కొనుగోలుకు ఆమోదం లభించింది. ప్రత్యేక ప్రయోజన హెలికాప్టర్ల కొనుగోలు ద్వారా వైమానిక దళానికి అవసరమైన కీలక వైమానిక రవాణా అవసరాలను తీర్చడంలో సహయపడుతుంది. ఎక్స్‌-బ్యాండ్‌ డాప్లర్‌ వాతావరణ రాడార్‌ వ్యవస్థ ముందస్తు ప్రాంతాల్లో స్థానిక వాతావరణ పరిస్థితులను అధిక స్పష్టతతో పర్యవేక్షించేందుకు ఉపయోగపడుతుంది.

రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదించిన మొత్తం ప్రతిపాదనల్లో సుమారు 82 శాతం కొనుగోళ్లను భారతీయ పరిశ్రమల నుంచే చేపట్టనున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2328823) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Tamil